20, ఆగస్టు 2018, సోమవారం

ఉబ్బసము ( Bronchial Asthma )

డా. గన్నవరపు నరసింహమూర్తి
శరీర కణజాలపు జీవప్రక్రియలో ప్రాణవాయువు ( Oxygen) గ్రహించబడి బొగ్గుపులుసు వాయువు ( Carbon dioxide ) విడుదల అవుతుంది. వివిధ అవయవముల కణజాలమునకు రక్తము ద్వారా ప్రాణవాయువు అందించబడుతుంది. ఆయా కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువు రక్తములోనికి చేరుతుంది. ఊపిరితిత్తులు ప్రాణవాయవుని రక్తమున కందించి రక్తమునుంచి బొగ్గుపొలుసువాయువుని గ్రహించి బయటకు విసర్జిస్తాయి. నిరంతరము ప్రాణవాయవుని రక్తమునకు చేర్చుటకు బొగ్గుపులుసు వాయువుని విసర్జించుటకు ఉచ్ఛ్వాస నిశ్వాసాల శ్వాసక్రియ అవసరము.
వాతావరణములో నున్న గాలి ముక్కు , గొంతుక , స్వరపేటిక ల ద్వారా శ్వాసనాళము( Trachea) నకు చేరుతుంది. శ్వాసనాళము రెండు పుపుసనాళములుగా ( Bronchi ) చీలి రెండు ఊపిరితిత్తుల వాయుప్రసరణకు సహాయపడుతుంది. ప్రతి ఊపిరితిత్తులో పుపుసనాళము ప్రథమ, ద్వితీయ, తృతీయ , అంతిమ పుపుసనాళికలుగా ( Primary, secondary tertiary and terminal bronchioles ) శాఖలై పిదప శ్వాసనాళికలు ( Respiratory bronchioles) , వాయుగోళనాళికలుగా
( Alveolar ducts ) చీలి చిట్టచివర వాయుగోళములను ( Alveoli ) ధరిస్తాయి. ఈ వాయుగోళములు ,వాని దరిని ఉండు సూక్ష్మరక్తనాళికల ( Capillaries ) మధ్య వాయువుల మార్పిడి జరుగుతుంది.
శ్వాసనాళము , పుపుసనాళముల గోడలలో ఉన్న మృదులాస్థి ( Cartilage ), శ్వాసనాళికల గోడలలో నుండు అనిచ్ఛా మృదుకండరములు ( Smooth muscles ) ఆ నాళములు, నాళికలను నిత్యము తెఱిచి ఉంచుతాయి. వాయుగోళముల బయట నుండు సాగుకణజాలము
( Elastic tissue ) వాయుగోళములు పూర్తిగా ముడుచుకొనుటను అరికడతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలన శ్వాసవృక్షములో ( Bronchial tree ) వాయు చలనము జరుగుతుంది. ఈ గాలి చలనానికి అవరోధ మేర్పడినప్పుడు రక్తమునకు ప్రాణవాయువు అందించుటకు , రక్తమునుంచి బొగ్గుపులుసు వాయువు తొలగించుటకు అంతరాయము ఏర్పడుతుంది. శ్వాసవృక్షములో వాయు చలనమునకు అవరోధము కలిగించే రుగ్మతలలో ఉబ్బసవ్యాధి ( Bronchial Asthma) ఒకటి.
ఉబ్బసవ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధివలన శ్వాసపథములో దీర్ఘకాలిక తాపప్రక్రియ
(inflammation ) కలిగి మధ్య మధ్యలో వ్యాధి ప్రకోపిస్తుంటుంది. సూక్ష్మాంగజీవులు( bacteria ), విషజీవాంశములు ( Viruses ) ఊపిరితిత్తులపై దాడి జరిపినపుడు , పడని వికటపదార్థములు
( allergens), వృత్తులలోను యితరత్రా తాపజనకముల ( irritants) బారికి దేహము పడినప్పుడు ఊపిరితిత్తుల విపరీత స్పందన వలన ఉబ్బసవ్యాధి లక్షణములు ప్రకోపిస్తాయి.
ఉబ్బస పొడచూపినపుడు పరంపరలగా దగ్గు , ఆయాసము , ఛాతిబిగింపు , ఊపిరి వదిలేటప్పుడు పిల్లికూతలు ( wheezings ) కలుగుతాయి. వ్యాధి విపరీతమయితే శ్వాస వైఫల్యము కలిగి, తీవ్రత హెచ్చయి మరణమునకు కూడా దారితీయ వచ్చును. వ్యాధి తనంతట కాని, చికిత్స వలన గాని కొన్ని నిముషముల నంచి కొన్ని గంటలలో ఉపశమించవచ్చును.
ఉబ్బసకు కారణములు :
ఉబ్బస వ్యాధి ప్రంపంచమంతటా ఉన్నా అభివృద్ధి చెందిన దేశాలలో అధికముగా కనిపిస్తుంది. కొన్ని జాతులలో ఉబ్బసవ్యాధి అధికముగా కనిపించినా ఆర్ధిక, సామాజిక, పరిసరముల ప్రభావము దానికి కారణము కావచ్చును. జన్యువులు , క్రోమోజోములు యీ వ్యాధి కలుగుటకు కారణమయినా వాతావరణ, పరిసర ప్రభావములు యీ వ్యాధిపై హెచ్చుగా కలిగి ఉంటాయి . రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ( Respiratory Syncytial Virus RSV ), రైనోవైరస్ ( Rhinovirus ) వంటి విషజీవాంశువులు (viruses ) , పొగాకు పొగ , యితర పొగలు, స్వచ్ఛత కొఱకు వాడే సబ్బులు వంటి రసాయినకములు, యితర రసాయినకములు, తాపకారులు( Irritants ) , పుప్పొడి, ధూళిక్రిములు, బొద్దింకల విసర్జనములు, పెంపకపు జంతువుల బొచ్చు, సుగంధపరిమళములు , బూజులు వంటి వికట పదార్థములు ( Allergens ), శీతలవాయువులు శ్వాసపథములో తాపము కలుగజేసి వ్యాధి పొడచూపుటకు కారణమవుతాయి.
వ్యాయామము , ఆటలు , మానసికాందోళనలు కూడా ఉబ్బసవ్యాధి ఉద్రేకించుటకు కారణము కాగలవు.
బీటా 2-ఎడ్రినలిన్ గ్రాహక అవరోధకములు ( Beta 2- adrenergic receptor blockers ),
ఏస్పిరిన్ , స్టీరాయిడులు కాని - తాపక నివారుణులు ( non steroid anti inflammatory agents ) ఉబ్బసవ్యాధిని ప్రకోపించవచ్చును.
ఉబ్బసవ్యాధి కలిగిన వారిలో శ్వాసపథములో గాలి చలనమునకు అవరోధము కలుగుతుంది.
ఈ అవరోధము ముఖ్యముగా నిశ్వాసమునకు ఏర్పడుతుంది. అందువలన ఊపిరితిత్తులు గాలితో ఉబ్బి ఉంటాయి.
శ్వాసనాళములు , పుపుస నాళములు , పుపుస నాళికలు , వాని కుడ్యములలోను, శ్లేష్మపు పొరలోను ( mucosa ) , యూసినోఫిల్స్ ( Eosinophils - ఇవి శ్వేతకణములలో ఒక రకము . ఇవి ఎఱుపు వర్ణకమును గ్రహించు చుక్కలు కలిగి ఉంటాయి.), మాస్ట్ కణములు ( mast cells) , భక్షక కణములు ( macrophages), రసిక కణములు ( T- lymphocytes ) చేరి తాపక్రియ కలుగజేస్తాయి. తాపక కణముల నుంచి , నాళముల లోపొర ( అంతస్త్వక్కు mucosa ) నుంచి, వెలువడు జీవరసాయినక పదార్థములు , నాడీ వాహకముల ( Neuro transmitters ) ప్రభావము వలన శ్వాస పుపుస నాళికలలోనున్న మృదుకండరములు సంకోచిస్తాయి. అందువలన ఆ నాళ, నాళికల ప్రమాణములు తగ్గిపోతాయి. ఈ మృదుకండరముల పరిమాణము కూడా పెరుగుతుంది.
శ్వాసనాళికల లోపొర భాగములు తాపప్రక్రియచే విచ్ఛేదమయి నాళములలో బిరడాలుగా ఏర్పడి గాలి ప్రసరించుటకు అవరోధము కలిగిస్తాయి.
శ్వాసవృక్షపు శ్లేష్మపుపొర క్రింద శ్లేష్మగ్రంథులు సంఖ్యాపరముగాను , పరిమాణములోను వృద్ధి చెంది శ్లేష్మము నధికముగా ఉత్పత్తి చేస్తాయి. అధిక శ్లేష్మము వాయుచలనమునకు అడ్డుపడుతుంది.
శ్వాసనాళికల తాపప్రక్రియలో భాగముగా కొత్త సూక్ష్మరక్తనాళికలు జనితమవుతాయి.
మాన్చు ప్రక్రియలో లోపొర ( అంతస్వక్కు ) క్రింద , నాళములలో తంతుకణములు
( fibroblasts) పీచువంటి కొల్లజెన్ ( Collagen )తంతువులను ఉత్పత్తి చేయడము వలన
తంతీకరణ ( fibrosis ) జరిగి నాళములు కుచించుకు పోతాయి.
పై కారణము లన్నిటి వలన శ్వాసవృక్షములో ఊపిరి బంధించబడుతుంది. రక్తములో ప్రాణవాయువు చేరుటకు, బొగ్గుపులుసువాయువు విసర్జనకు భంగమేర్పడుతుంది.
ఉబ్బస లక్షణములు :
ఉబ్బస కలిగినప్పుడు పరంపరలుగా దగ్గు , ఆయాసము, ఛాతిలో బిగింపు , శ్రమభరిత నిశ్వాసములు, పిల్లికూతలు ( wheezing) కలుగుతాయి. గుండెదడ , అధికస్వేదము పొడచూపవచ్చును. వ్యాధి తగ్గి , అప్పుడప్పుడు ప్రకోపించుట వలన, చర్మతాపము ( Atopic Dermatitis ) , వివిధ పదార్థములకు వికటలక్షణములు కలుగియుండుట, కుటుంబములో యితరులకీ వ్యాధి ఉండుట వంటి లక్షణముల వలన , ప్రత్యక్షముగా వ్యాధిగ్రస్థులను పరీక్షించుట వలన వైద్యులు రోగనిర్ణయము చేయగలుగుతారు. వైద్యులు వినికిడిగొట్టముతో ఛాతిపై విన్నపుడు నిశ్వాస సమయము హెచ్చుగా ఉండుట గమనిస్తారు. నిశ్వాసములో పిల్లికూతలు కూడా వినవచ్చు. కొందఱిలో పిల్లికూతలు వినిపించక పోవచ్చును.
ఆయాసము ఊపిరితిత్తుల తాపము ( Pneumonitis ) , వాయుపూరిత పుపుస వేష్టనము ,
( ఊపిరితిత్తిని ఆవరించు ఉండు ఆచ్ఛాదన పుపుస వేష్టనము. దీనికి రెండుపొరలు ఉండును. రెండు పొరల మధ్య గాలి చేరుట Pneumothorax . ) యితర ఊపిరితిత్తుల వ్యాధుల వలన , హృదయవైఫల్యము ( Congestive heart failure) వంటి గుండెజబ్బుల వలన , పుపుసధమనిలో రక్తపుగడ్డలు వలన ( Pulmonary embolism), రక్తహీనత, అనేక యితర కారణముల వలన కలుగవచ్చును.
వ్యాధి నిర్ణయము ;
వ్యాధి లక్షణముల వలన వైద్యులు వ్యాధిని నిర్ణయించగలుగుతారు. వాయుపూరిత పుపుసవేష్టనము ( Pneumothorax), హృదయవైఫల్యము వలన ఊపిరితిత్తులలో నీరుపట్టుట
( Congestive heart failure) , పుపుస తాపము ( Pneumonitis ) ల సంశయము ఉంటే ఛాతికి ఎక్స్ రే లు అవసరము.
ఆ సంశయము లేక పోతే ఎక్స్ రేల అవసరములేదు.
చికిత్సతో ఉపశమనము చేకూరనప్పుడు ఆయాసము ఎక్కువగా ఉన్నపుడు , ఎక్స్ రే వ్యత్యాస పదార్థములతో ఛాతి కేటే్ స్కాన్ పుపుసధమనులలో రక్తపుగడ్డలను ( Pulmonary embolism ) కనిపెట్టుటకు లేక , లేవని నిర్ధారించుటకు ఉపయోగపడుతుంది.
ఆయాసము తీవ్రముగా ఉండి శ్వాసవైఫల్యమునకు అవకాశముంటే ఉబ్బసకు తక్షణ చికిత్సతో బాటు కృత్రిమశ్వాస అందించుటకు కూడా వైద్యులు సన్నద్ధులు కావాలి. గరిష్ఠ వాయు ప్రవాహము ( Peak flow ) 25 శాతమునకు తగ్గినపుడు , రక్తములో ప్రాణవాయువు బాగా తగ్గినపుడు , బొగ్గుపులుసు వాయువు బాగా పెరిగినపుడు, ఊపిరి మందగించి నపుడు వైద్యులు కృత్రిమశ్వాసల నందజేయాలి.
ఉబ్బసవ్యాధిని ధ్రువపఱచుటకు శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary function tests ) సహాయపడుతాయి. శ్వాసమాపకము ( Spirometer ) అనే పరికరము అందుల కుపయోగిస్తారు. సుదీర్ఘ సంపూర్ణ ఉచ్ఛ్వాసమును ( forced inspiration ) , తదుపరి సత్వర సుదీర్ఘ నిశ్వాసముల
( forced expiration) నీ పరికరముతో కొలుస్తారు. బలమైన దీర్ఘ ఉచ్ఛ్వాసము తర్వాత బలమైన దీర్ఘ నిశ్వాసముతో వదిలే గాలి ఘనపరిమాణమును సంపూర్ణశ్వాస ప్రమాణము (Total Vital Capacity TVC ) గా పరిగణిస్తారు. బల నిశ్వాసముతో మొదటి సెకండులో వదిలే గాలి పరిమాణము ( Forced Expiratory Volume/ first second FEV 1 ) ను , FEV 1 / TVC నిష్పత్తులను ఉపయోగించి అవరోధక పుపుస వ్యాధులను ( Obstructive lung diseases ), నిర్బంధ పుపుస వ్యాధులను
( Restrictive lung diseases ) వేఱుపఱచ వచ్చును. ఉబ్బస అవరోధక శ్వాసవ్యాధి. ఉబ్బస ఉన్నపుడు వారిలో బలనిశ్వాస వాయుపరిమాణము -1 ( FEV 1 మొదటి సెకండులో బలముగా వదల గలిగే గాలి పరిమాణము ) విశేషముగా తగ్గుతుంది . శ్వాసనాళిక వ్యాకోచ చికిత్సానంతరము
( Post bronchodilator treatment ) ఉబ్బసవ్యాధిగ్రస్థులలో శ్వాసవ్యాపారము చాలా మెఱుగవుతుంది. మొదటి సెకండు నిశ్వాస వాయు పరిమాణము విశేషముగా వృద్ధి చెందుతుంది. ఉబ్బస లేనపుడు శ్వాసవ్యాపార పరీక్షలు సాధారణముగా నుండవచ్చును.
గరిష్ఠ ( శ్వాస ) ప్రవాహ మానికతో ( Peak flow meter ) సంపూర్ణ ఉచ్ఛ్వాసానంతరము సత్వర దీర్ఘనిశ్వాసము చేయించి గరిష్ఠ ప్రవాహము ( Peak flow ) కొలిచి ఉబ్బసవ్యాధిని నిర్ధారించి , దాని తీవ్రతను అంచనా చేయవచ్చును. ఈ పరికరములు చౌకగా లభిస్తాయి. ఇవి సులభ పరికరములు.
శ్వాసవ్యాపార పరీక్ష ఫలితములు సామాన్య పరిధులలో ఉంటే మెథాఖొలిన్ యిచ్చి శ్వాసనాళికల స్పందనను శ్వాసవ్యాపార పరీక్షలతో పరిశీలించి ఉబ్బస నిర్ధారణ చేయవచ్చును.
ఉబ్బస వ్యాధి ఉన్నవారికి పడని వికటించే పదార్థములకు ( Allergens) పరీక్షలు సలుపవచ్చును.
చికిత్స :
ఉబ్బస ప్రకోపించి నపుడు ఉబ్బస తీవ్రతను గరిష్ఠ ప్రవాహ పరిమాణము బట్టి అంచనా కట్టాలి. వ్యాధి ఉపశమన చికిత్సలు తక్షణము మొదలుపెట్టాలి.
వ్యాధి లక్షణములు పొడచూపే తఱచుదనము తీవ్రత బట్టి అంతరిత ( Intermittent ), నిరంతర ( Persistent ) అల్ప , మధ్యమ , అధిక తీవ్ర వ్యాధులుగా పరిగణిస్తారు.
తక్షణ ఉపశమనమునకు సత్వరముగ పనిచేసే బీటా 2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములను
( Short acting Beta2- adrenergic agonists SABA s ) పీల్పువుల ( Inhaler ) ద్వారా వాడాలి.
ఎక్కువ వాడకములో ఉండే ఓషధము ఆల్బుటరాల్ పీల్పువు . దీనిని ఉబ్బస పొడచూపి నపుడు రెండు నుంచి ఆరు పీల్పులు వఱకు ప్రతి ఇరవై నిమిషములు ఉబ్బస తగ్గే వఱకు వాడాలి . లీవాల్బుటెరాలు ( Levalbuterol ) మరో మందు. దీనిని రెండు నుంచి ఎనిమిది పీల్పులు వఱకు వాడవచ్చు. ఈ మందులను గాలి, లవణజలములతో మిశ్రీకరించి తుంపరులుగా శీకరయంత్ర
( Nebulizer ) సహాయముతో కూడా వాడవచ్చును. ఇవి పుపుస,శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తాయి
ఇదివఱలో బీటా2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు ( Beta2-Receptor agonist s) ఎపినెఫ్రిన్ , టెర్బుటలిన్ లను చర్మము క్రిందకు సూదిమందులుగా వాడే వారు. పీల్పువులు, శీకరయంత్రములతో ఔషధములను యివ్వ గలిగినప్పుడు అట్టి అవసరము లేదు. గుండె వ్యాధులున్న వారికి ఆ సూదిమందులు యివ్వరాదు.
ఎసిటైల్ ఖొలీన్ అవరోధకములు( Anticholenergics - Muscarine Antagonists ) :
ఇప్రట్రోపియమ్ బ్రోమైడు ( Ipratropium bromide ) ను పీల్పువు ద్వారా గాని, శీకరయంత్రము ద్వారా గాని ఆల్బుటరాల్ తోను, లేక లీవాల్బుటరాల్ తోను కలిపి, లేక ఒంటరిగాను అందించవచ్చును. ఇది పుపుస, శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తుంది. ఇప్రట్రోపియమ్ మోతాదులు కొద్ది గంటలే పనిచేస్తాయి ( Short acting Muscarine Antagonist SAMA ) కాబట్టి దీనిని దినమునకు పలు పర్యాయములు వాడుకోవాలి

కార్టికోస్టీరాయిడ్ పీల్పువులు ;
ట్రయామ్సినలోన్ ( Triamcinolone ), బెక్లోమిథసోన్( Beclomethasone ), బ్యుడినొసైడ్
( Budenoside ) , , ఫ్లునిసొలైడ్( Flunisolide ) , ఫ్లుటికసోన్( Futicasone ), మొమెటసోన్
( Mometasone ) వంటి కార్టికోస్టీరాయిడ్ ఔషధములు పీల్పువులుగా లభ్యమవుతున్నాయి. ఈ మందులు శ్వాసవృక్షములో తాపప్రక్రియను ( Inflammation ) తగ్గించుటకు ఉపయోగపడుతాయి. అందువలన వాపు తగ్గి గాలి చలించుటకు తోడ్పడుతాయి. తక్కువ మోతాదులలో వాడినప్పుడు వాని ప్రభావము శ్వాసవృక్షమునకే పరిమితమైనా ఎక్కువ మోతాదులలో వాడినప్పుడు వాని ప్రభావము దేహములో పొడచూపవచ్చును. అందు వలన ఉబ్బస అదుపులోనికి వచ్చిన పిమ్మట క్రమేణ వాని మోతాదులను తగ్గించే ప్రయత్నము చెయ్యాలి. దీర్ఘకాలము నిరంతరపు ఉబ్బసను ( Persistent Asthma ) అదుపులో నుంచుటకు కార్టికోస్టీరాయిడ్ పీల్పుసాధనములు చాలా ప్రయోజనకరము.
కార్టికోస్టీరాయిడులను పీల్చిన పిదప నోటిని మంచినీళ్ళతో పుక్కిలించుకోవాలి. లేకపోతే నోటిపూత కలిగే అవకాశమున్నది.
దీర్ఘకాలపు ఉబ్బస నదుపులో ఉంచుటకు సాల్మెటరాల్ ( Salmeterol ), ఫార్మెటరాల్
( Formeterol ) దీర్ఘకాలిక బీటా ఉత్తేజకములను ( Long Acting Beta Agonists LABAs ), కార్టీకోస్టీరాయిడులతో కలిపి పీల్పువులుగా ఉపయోగించ వచ్చును.
యుమిక్లిడినియమ్ ( Umeclidinium ) దీర్ఘకాలము పనిచేసే ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము ( Long Acting Muscarine Antagonist LAMA ). దినమునకు ఒక మోతాదుని పీల్పువు ద్వారా వాడుకోవాలి.
ఉబ్బస తీవ్రముగా నున్నప్పుడు కార్టికోస్టీరాయిడులను నోటిద్వారా గాని, సిరలద్వారా గాని వైద్యులు వాడుతారు.
ఉబ్బస తీవ్రముగా నున్నప్పుడు సిర ద్వారా మెగ్నీషియమ్ సల్ఫేట్ ను శ్వాసనాళికలను వ్యాకోచింపజేయుట కుపయోగిస్తారు.
తాపప్రక్రియ తగ్గించే మాంటెలుకాస్ట్ ( Montelukast ), జఫిర్లుకాస్ట్ ( Zafirlukast ), మాస్ట్ కణములను సుస్థిరపఱచు క్రొమొలిన్ సోడియమ్ ( Cromolyn sodium ), IGE ప్రతిరక్షకము ఒమలిజుమాబ్ ( Omalizumab ) లను , నెమ్మదిగా విడుదలయే థియాఫిలిన్ మందుబిళ్ళలను కూడా దీర్ఘకాలపు ఉబ్బస నదుపులో నుంచుటకు వాడుతారు.
ఉబ్బస ఉన్నవారు వారు వికటించే పదార్థములను ( allergens), నివారించుకొనుటకు ప్రయత్నించాలి. ధూమపానము చేయరాదు. వ్యాయామములకు ఆటలకు ముందుగా శ్వాసనాళిక వ్యాకోచ ఔషధములను ( Bronchodilators ) పీల్చుకొని ఉబ్బస నరికట్టుకోవాలి.
ఉబ్బస పొడచూపునప్పుడు , ప్రాణవాయువు సంపృక్తత ( Oxygen saturation ) 92 శాతము కంటె తగ్గినపుడు ప్రాణవాయువు నందించాలి.
శ్వాసవైఫల్యము ( Respiratory failure) కలుగుతే కృత్రిమశ్వాస ( Mechanical ventilation) నందించుట అవసరము.
ఉబ్బస ఉన్నవారికి నాసికాకుహర వ్యాధులు ( Rhinosinusitis , nasal polyps ) ఉంటే వాటిని నివారించాలి.
జఠరాన్ననాళ తిరోగమన ( Gastro esophageal reflux disease ) వ్యాధి ఉంటే హిష్టమిన్ 2 గ్రాహకావరోధకములు ( H-2 Receptor blockers) గాని , ప్రోటాన్ యంత్రనిరోధములను ( Proton pump inhibitors) గాని వాడి జఠరామ్లమును తగ్గించాలి.
స్థూలకాయమున్న వారు బరువు తగ్గించుకోవాలి.
నిద్రలో అవరోధక శ్వాసభంగము ( Obstructive sleep apnea ) ఉన్నవారికి తగిన చికిత్స అవసరము.
( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro Vascular Accidents )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) డా. గన్నవరపు నరసింహమూర్తి మెదడు నిర్మాణము ( Anatomy of Brain ) : మన శరీరములో వివిధావయవాలు న...