వైద్యాలయం

29, అక్టోబర్ 2018, సోమవారం

వ్యాపకజ్వరము ( Influenza )

డా. గన్నవరపు నరసింహమూర్తి .
( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో )
ఫ్లూ ( వ్యాపక ) జ్వరాలు ప్రతి సంవత్సరము చాలా దేశాలలో పొడచూపుతాయి. ఫ్లూ బహుళవ్యాపక వ్యాధిగా ( epidemic ) చాలామందికి కలుగవచ్చును . చాలా మందిలో దానంతట అది తగ్గిపోయినా , ఈ జ్వరాలు ప్రపంచ మంతటా వ్యాపకమయి చాలా మృత్యువులకు కారణమయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ ఫ్లూ పూర్తిపేరు ఆంగ్లములో Influenza . దీని ప్రాభవము అనేక జనులపై ఉండుట వలన దానికా పేరు కలిగింది.
సాధారణముగా ఈ వ్యాపకజ్వరాలు పశ్చిమ దేశాలలో ఆకురాల్చు కాలములోను , శీతాకాలములోను పొడచూపుతాయి.
వ్యాపక జ్వరములు ఇన్ఫ్లుయెంజా A , B, C, D అనే విషజీవాంశువులు ( Viruses ) వలన కలుగుతాయి.
విషజీవాంశువులు ( viruses ) అతిసూక్ష్మమైనవి. వీటికి కణనిర్మాణముండదు. వాటంతట అవి మనజాలవు. వాటంతట అవి ప్రత్యుత్పత్తి చెందజాలవు. వీటిలో జీవరాశులలో వలె జీవవ్యాపారక్రియలు జరగవు. ఈ విషజీవాంశువులు యితర జీవకణాలలో ప్రత్యుత్పత్తి అవుతాయి. ఇవి న్యూక్లియకామ్లములతో ( Nucleic acids ) నిర్మితమవుతాయి. వీనిలో పొందుపఱచబడిన న్యూక్లియకామ్లము బట్టి డీఆక్సీరైబోజ్ న్యూక్లియకామ్ల విషజీవాంశువులు ( DNA Viruses ) , రైబోజ్ న్యూక్లియకామ్ల విషజీవాంశువులు ( RNA Viruses) గాను వీనిని విభజించవచ్చు.
వ్యాపక జ్వరాలు ( Influenza ) కలిగించే విషజీవాంశువులు రైబోజ్ న్యూక్లియకామ్ల విషజీవాంశువులు RNA Viruses) . ఇవి Orthomyxoviridae సముదాయమునకు చెందుతాయి.
Influenza - A మనుజులకే కాక యితర క్షీరదములకు , పక్షులకు కూడా వ్యాధిని కలిగించగలవు. వీటి వలనే విశ్వవ్యాపక వ్యాధులు ( Pandemics ) , తీవ్రవ్యాధులు కలుగుతాయి. ఈ జీవాంశువుల ఉపరితలముపై హీమెగ్లూటినిన్ hemagglutinin ( HA ) న్యూరెమినిడేజ్ neuramidinase (NA) అనే ప్రతిరక్షకజనకము ( antigens ) లుంటాయి. ఆ ప్రతిరక్షకజనకములలో విభాగముల బట్టి ఈ విషజీవాంశువులను విభజిస్తారు. వీనిలో జన్యుపదార్థము ఎనిమిది ఒంటి పోగుల RNA తునుకలుగా ఉంటుంది. అందువలన కొత్త విషాంశువుల ప్రత్యుత్పత్తి జరిగినపుడు జన్యుపదార్థపు మార్పులు
( mutations ) కలిగే అవకాశములు మెండు.
Influenza -B మనుజులలోనే చూస్తాము . సీలుచేపలకు, ఫెరెట్ పిల్లులకు ఈ వ్యాధి కలుగవచ్చు.
ఈ విషజీవాంశువులలో మార్పులు ( mutations) తఱచు జరగవు. అందువలన చాలా మందికి ఒకసారి సోకగానే వ్యాధినెదుర్కొనే శక్తి కలుగుతుంది. విశ్వవ్యాపకవ్యాధులు దీని వలన కలగవు.
Influenza - C మనుజులకే కాక పందులకు , కుక్కలుకు కూడా సోకగలదు. ఈ వ్యాధి అసాధారణమైనా తీవ్రముగా ఒక్కొక్క ప్రాంతములో వ్యాప్తి జెందగలదు.
Influenza - D వ్యాధి పశువులకు పందులకు సోకుతుంది. మనుజులకు సోకగలిగినా యింతవఱకు మనుజులలో యీ వ్యాధి కలిగిన సూచనలు లేవు.
వ్యాపకజ్వరాలు వ్యాప్తి :
వ్యాపకజ్వరము సోకిన వారు దగ్గు తుమ్ముల ద్వారా విషజీవాంశు రేణువులను గాలిలోనికి వెదజల్లుతారు. దగ్గఱలో ఉన్నవారు ఆ నలుసులను పీల్చినా , లేక ఆ నలుసులు పడిన వస్తువులను తాకి ఆ చేతితో ముక్కు , నోరు , కళ్ళను తాకినా, ఆ విషజీవాంశువులు శరీరములోనికి ప్రవేశిస్తాయి. వ్యాధి గలవారిని స్పర్శించుట వలన , వారితో కరచాలనములు చేయుట వలన ఆ విషాంశువులను అంటించుకొనే అవకాశము ఉన్నది.
ఈ విషాంశువులు వస్తువుల ఉపరితలములపైన 24 నుంచి 48 గంటల వఱకు మనగలవు. తుమ్ములు , దగ్గుల వలన గాలిలో వెదజల్లబడినా అవి త్వరగానే బరువు వలన క్రిందకు చేరుకుంటాయి. గాలిలో ఎక్కువ కాలము ఉండవు. తేమ ఎక్కువగా ఉన్నా , సూర్యకాంతిలో అతినీలలోహిత కిరణాల వలన ( ultraviolet rays ) ఈ విషాంశువులు త్వరగా ధ్వంసమవుతాయి , సబ్బు , బట్టలసోడా , ఆల్కహాలు ఈ విషాంశువులను నశింప చేస్తాయి.
విషాంశువులు ముక్కు , గొంతుక , ఊపిరితిత్తుల కణముల పొరలకు హీమెగ్లూటినిన్ ల ద్వారా అంటుకొని పిదప కణముల లోనికి చొచ్చుకుంటాయి. ఆ కణములలో వాటి ప్రత్యుత్పత్తి జరిగి అనేక విషజీవాంశువులు కణముల నుంచి విడుదలవుతాయి. ఆక్రమించబడిన కణములు విధ్వంసము పొందుతాయి.
వ్యాపకజ్వర లక్షణములు :
స్వల్ప తీవ్రత గల వారిలో ఏ లక్షణములు కనిపించకపోవచ్చును. వ్యాధి సోకిన వారిలో ఒంటినొప్పులు కండరముల పీకు, శరీరమంతా నలత , గొంతునొప్పి , ముక్కుకారుట, జ్వరము , వణుకు , తలనొప్పి , దగ్గు , కలుగుతాయి. ఈ లక్షణములు రెండు దినముల నుంచి వారము వఱకు ఉండి క్రమేణ రోగులు కోలుకుంటారు. పిల్లలలో వాంతులు , విరేచనములు కలుగవచ్చు. ముక్కు కారుట కొంత ఉన్నా సాధారణ జలుబులో వలె ఎక్కువగా ఉండదు. సాధారణ జలుబు చేసిన వారిలో జ్వరము ఎక్కువగా ఉండదు. ఫ్లూ కలిగిన వారిలో ఒంటినొప్పులు , జ్వరము ఎక్కువగా ఉంటాయి.
వ్యాధినిరోధకశక్తి తక్కువయిన వారిలోను , వ్యాధితీవ్రముగా నున్నవారిలోను వ్యాపకజ్వరములో ఊపిరితిత్తుల తాపము ( Pneumonitis ) విషజీవాంశువుల వలన కాని , ఆ పిమ్మట దాడి సలిపే సూక్ష్మాంగజీవుల ( bacteria ) వలన , లేక రెండిటి వలన కాని కలుగ వచ్చును. విషజీవాంశువుల వలన కలిగే ప్రాథమిక పుపుసతాపములో ( Primary pneumonia) రోగులు త్వరగా కోలుకోక జ్వరము కొనసాగి, పొడి దగ్గు , లేక తక్కువ కఫముతో దగ్గు , ఆయాసము కలుగుతాయి.
సూక్ష్మజీవుల వలన ఊపిరితిత్తుల తాపము కలిగిన వారిలో ( Secondary bacterial pneumonia ) ముందు జ్వరము తగ్గినా మళ్ళీ జ్వరము , దగ్గు పుంజుకుంటాయి. వీరిలో కఫము ఎక్కువగా ఉంటుంది. ఆయాసము కూడా కలుగవచ్చును. స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా ( Streptococcus Pneumoniae ), స్టాఫిలోకోకస్ ఆరియస్ ( Staphylococcus Aureus ) , హీమోఫిలస్ ఇన్ ఫ్లుయెంజా ( Haemophilus Influenzae ) సూక్షాంగజీవుల వలన తఱచు ఈ ఊపిరితిత్తుల తాపము ఉపద్రవముగా సంక్రమిస్తుంది . ఊపిరితిత్తుల తాపము ఎక్స్ రే చిత్రములలో ప్రస్ఫుటముగా కనిపిస్తుంది.
ఊపిరితిత్తుల తాపము తీవ్రతరమయితే శ్వాసవైఫల్యము ( respiratory failure) కూడా కలిగే ప్రమాదము గలదు.
వ్యాధిగ్రస్థులలో క్రొత్త విషజీవంశువుల ప్రత్యుత్పత్తి కలిగినపుడు వాటి జన్యుపదార్థము
( genome ) లో మార్పులు ( mutations) స్వల్పముగానో ( viral drift ) , ఎక్కువగానో జరిగినపుడు
( viral shift ) వ్యాపకజ్వరముల తీవ్రత అధికము కావచ్చును, వాటి ఉగ్రత అధికమయి వ్యాధి అధికసంఖ్యాకులకు సోకి త్వరగా వ్యాపించవచ్చును.
వ్యాధి నిర్ణయము :
వ్యాపకజ్వరములు ప్రబలముగా నున్నపుడు వ్యాధి లక్షణముల బట్టి వ్యాధిని నిర్ణయించవచ్చును. జ్వరము , దగ్గు ఎక్కువగా ఉండి ముక్కు కారుట తక్కువగా ఉంటే వ్యాపకజ్వరము ( influenza ) అయే అవకాశములు హెచ్చు. ముక్కు , గొంతుకల నుంచి పత్తిపుల్లతో సేకరించిన శ్లేష్మమును ప్రతిరక్షకజనకములకు ( antigens ) పరీక్షించి వ్యాధిని నిర్ణయించవచ్చును. polymerase Chain Reaction తో ప్రతిరక్షకజనకము లుత్పత్తి చేసి జన్యుపదార్థములను కనుగొనవచ్చును. ప్రతిరక్షకములను direct fluorescent antibody test తో కనుగొనవచ్చును. శ్లేష్మములోని విషజీవాంశువులను వృద్ధిచేసి
( culture ) వ్యాధిని నిర్ణయించ వచ్చును.
వ్యాధి చికిత్స :
వ్యాపక జ్వరాలు ఉన్నవారిలో చాలామందికి ఉపశమన చికిత్సలు సరిపోవచ్చును. ఎసిటెమైనోఫిన్ , పారాసిటమాల్ జ్వరమునకు తలనొప్పికి వాడవచ్చును. పిల్లలలో ఏస్పిరిన్ రేయీస్సిండ్రోమ్ ( Reye’s Syndrome) కలిగించవచ్చు, కాబట్టి ఏస్పిరిన్ వాడరాదు. తగినంతగా ద్రవపదార్థములు , ఆహారము విశ్రాంతి సమకూర్చాలి. వీరు మద్యము సేవించరాదు. పొగత్రాగుట మంచిది కాదు. వ్యాధి తీవ్రత వీటి వలన పెరుగుతుంది.
మందులు :
న్యూరమిడినేజ్ నిరోధకములు ( Neuramidinase inhibitors ) : ఇవి విషజీవాంశువుల పొరపై గల న్యురమిడినేజ్ అనే జీవోత్ప్రేరకమునకు ( enzyme ) అవరోధము కలగించి విషజీవాంశువుల విడుదలను నిరోధిస్తాయి. ఓసెల్టమివీర్ ( Oseltamivir -( Tamiflu ) వయోజనులలో 75 మి.గ్రాలు దినమునకు రెండు పర్యాయములు , జెనమివీర్ ( Zanamivir ( Relenza ) వయోజనులలో 10 మి.గ్రా లు పీల్పువుగా దినమునకు రెండు సారులు 5 దినములు వ్యాధి చికిత్సకు , నివారణకు కూడా వాడవచ్చు.
ఎమాంటడిన్ ( Amantadine ) ఇన్ ఫ్లుయెంజా ఏ కి వాడవచ్చు. ఈ ఔషధములను వ్యాధి కలిగిన 24 - 48 గంటలలో మొదలుపెడితే ప్రయోజనము ఎక్కువ.
సూక్ష్మాంగజీవుల విపక్షక ఔషధములు ( antibiotics) ఫ్లూ జ్వరము తర్వాత సూక్షాంగజీవులు ( bacteria) వలన కలిగే ఊపిరితిత్తుల తాపము ( Pneumonia) నకు , శ్వాసనాళిక పుపుసనాళికల తాపమునకు ( Bronchitis) ఉపయోగిస్తారు. విషాంశువులపై వాటి ప్రభావము శూన్యము.
వ్యాధితీవ్రముగా నున్నవారికి వైద్యాలయములలో చికిత్స లందించాలి.
వ్యాపక జ్వరముల నివారణ :
ఇన్ఫ్లుయెంజా నివారణకు టీకాలు లభ్యము. 6 మాసములు నుంచి 18 సంవత్సరముల వారు , 50 సంవత్సరములు నిండిన వారు, ఫ్లూ కాలములో గర్భిణీస్త్రీలు , ఫ్లూ కాలములో గర్భము దాల్చబోయే స్త్రీలు , ఉబ్బస , మధుమేహము , శ్వాసకోశపు వ్యాధులు , హృద్రోగములు వంటి ఇతర వ్యాధులున్న వారు , ఆరోగ్యవిధులలో పనిచేసేవారు టీకాలు వేసుకొనుట మేలు.
వ్యాపక జ్వరాలున్నవారికి దూరముగా ఉండుట , స్పర్శ , కరచాలనాదులను వీలయినంతగా పాటించక పోవుట వలన , నోరు ముక్కులపై కప్పులను ( masks ) ధరించుట వలన , చేతులను తఱచు కడుక్కొనుట వలన, శుభ్రము చేసుకొనుట వలన , నోరు , ముక్కు ,కనులు , ముఖములపై చేతులను చేర్చకపోవుట వలన వ్యాపక జ్వరములను కొంతవఱకు నివారించ గలుగుతాము.
దగ్గు , తుమ్ములున్న వారు మోచేతిని గాని జేబురుమాలుని కాని నోటికి , ముక్కుకి అడ్డుపెట్టుకొని దగ్గుట, తుమ్ముట చేస్తే తుంపరలను వ్యాప్తి చేయరు.
( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును )
వద్ద అక్టోబర్ 29, 2018 కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

25, సెప్టెంబర్ 2018, మంగళవారం

దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ( Chronic Obstructive Pulmonary Disease )

                                    దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ( Chronic Obstructive Pulmonary Disease )



( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ).                               డా. గన్నవరపు నరసింహమూర్తి 

                                                     
                                                           ఇంటికి సెగనుం  బెట్టరు
                                                       కంటికిఁ బొగబెట్టిరేని కారును జలముల్
                                                       పెంటా యూపిరితిత్తులు ? ?
                                                       మంటలఁ దెగఁ బాలుసేయ , మానక పొగలన్ ! !


శరీర కణజాలపు జీవ ప్రక్రియలో ప్రాణవాయువు ( Oxygen) గ్రహించబడి బొగ్గుపులుసు వాయువు ( Carbon dioxide ) విడుదల అవుతుంది. వివిధ అవయవముల కణజాలమునకు రక్తము ద్వారా ప్రాణవాయువు అందించబడుతుంది. ఆయా కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువు రక్తములోనికి చేరుతుంది. ఊపిరితిత్తులు ప్రాణవాయువుని రక్తమున కందించి రక్తమునుంచి బొగ్గుపొలుసు వాయువుని గ్రహించి బయటకు విసర్జిస్తాయి. నిరంతరము ప్రాణవాయవుని రక్తమునకు చేర్చుటకు , బొగ్గుపులుసు వాయువుని విసర్జించుటకు ఊపిరితిత్తులలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో గాలి ప్రసరణ , ఊపిరితిత్తులకు రక్తప్రసరణ అవసరము.
వాతావరణములో నున్న గాలి ముక్కు , గొంతుక , స్వరపేటిక ల ద్వారా శ్వాసనాళము( Trachea) నకు చేరుతుంది. శ్వాసనాళము రెండు పుపుసనాళములుగా ( Bronchi ) చీలి రెండు ఊపిరితిత్తుల వాయుప్రసరణకు సహాయపడుతుంది. ప్రతి ఊపిరితిత్తిలో పుపుసనాళము ప్రథమ, ద్వితీయ, తృతీయ , అంతిమ పుపుసనాళికలుగా ( Primary, secondary tertiary and terminal bronchioles ) శాఖలై పిదప శ్వాసనాళికలు ( Respiratory bronchioles) , వాయుగోళనాళికలుగా
( Alveolar ducts ) చీలి చిట్టచివర వాయుగోళములను ( Alveoli ) ధరిస్తాయి. ఈ వాయుగోళములు , వాని దరిని ఉండు సూక్ష్మరక్తనాళికల ( Capillaries ) మధ్య వాయువుల మార్పిడి జరుగుతుంది. ఊపిరితిత్తులకు పుపుసధమని ( Pulmonary Artery ) ద్వారా రక్తము చేరి పువుససిరల
( Pulmonary veins) ద్వారా రక్తము హృదయమునకు తిరిగి చేరుకుంటుంది.
ఊపిరితిత్తులలో దీర్ఘకాలము పదేపదే తాపప్రక్రియ ( irritation and inflammation ) జరుగుట వలన కలిగే విధ్వంసముచే వాయుప్రసరణకు ( ముఖ్యముగా నిశ్వాసమునకు ) అవరోధము కలిగి దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ( Chronic Obstructive Pulmonary Disease - COPD ) కలుగుతుంది. దీని వలన దగ్గు , కఫము, ఆయాసము కలుగుతాయి.
ఈ వ్యాధిలో ఊపిరితిత్తుల ఉబ్బుదల ( Emphysema) , దీర్ఘకాలిక పుపుస, శ్వాసనాళికల తాపము ( Chronic Bronchitis) రెండు ప్రక్రియలను గమనిస్తాము. తాపప్రక్రియ వలన వాయుగోళముల , సాగుకణజాలపు విధ్వంసము జరిగి శ్వాసవృక్షపు చివరలో గాలి ఎక్కువై ఉబ్బుదల కనిపిస్తుంది. కఫముతో కూడిన దగ్గు సంవత్సరములో మూడు నెలలు చాలా దినములు , వరుసగా రెండు సంవత్సరాలుంటే దానిని దీర్ఘకాలిక పుపుస శ్వాసనాళికల తాపము ( Chronic Bronchitis) గా నిర్ణయించవచ్చును. ఈ వ్యాధి క్రమ క్రమముగా తీవ్రమవుతుంది. ఊపిరతిత్తులలో వాయుగోళములు పుపుస శ్వాసనాళికల విధ్వంసము, నష్టము శాశ్వతమవుట వలన ఊపిరితిత్తుల వ్యాపారము సామన్య స్థితికి తిరిగి రాదు. ఉబ్బసకు దీనికి అదే తేడా.
వ్యాధికి కారణములు :
పుపుస నాళికలలో పరంపరలుగా తాపప్రక్రియ జరుగుటకు ప్రధాన కారణము ధూమపానము. ధూమపానము సలిపే వారిలో 20 నుంచి 50 శాతమపు మందిలో దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి జీవిత కాలములో పొడచూపుతుంది. వయస్సు పెరిగిన కొలది వ్యాధిలక్షణములు హెచ్చవుతాయి.
హానికరమైన యితర గాలులు , గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్ళలో వంట పొయ్యిల నుంచి వచ్చే పొగ వలన , బొగ్గుగనులు , బంగారు గనులలో ధూళి, పొగలు , రసాయినకములు , హానికర యితర వాయువులు పీల్చుట వలన పనిచేసే కార్మికులకీ వ్యాధి కలుగ వచ్చును. పట్టణాలలో వాతావరణ కాలుష్యము ఈ వ్యాధికి దోహదకారి అవుతుంది.
జన్యు పరముగా వచ్చే ఆల్ఫా- 1 ఏంటిట్రిప్సిన్ లోపము ( alpha-1 Antitripsin deficiency ) వలన దీర్ఘకాలిక శ్వాసావరోధక వ్యాధి పిన్నవయస్సులో రావచ్చును. ఈ వ్యాధి ఉన్నవారిలో ఆల్ఫా -1 ఏంటిట్రిప్సిన్ లోపమున్నవారు 2 శాతము వఱకు ఉండవచ్చును. ఇతర కుటుంబసభ్యుల కీ వ్యాధి ఉన్నా ,45 సంవత్సరముల వయస్సు లోపల ఈ వ్యాధి కనిపించినా, ఊపిరితిత్తుల క్రింద భాగములలో ఉబ్బుదల ఎక్కువగా ఉన్నా ఆల్ఫా- 1 ఏంటిట్రిప్సిన్ కు తప్పకుండా పరీక్ష చెయ్యాలి.
వ్యాధిగతి ;
దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ఊపిరితిత్తులలో పరంపరలుగా కలిగే తాపము ( Inflammation) , మాంసకృత్తు విచ్ఛేదనములు ( Proteinases ),మాంసకృత్తుల అవిచ్ఛేదనముల (Antiproteinases ) మధ్య తారతమ్యములు , ఆమ్లజనీకరణము ( Oxidation) , కణజాలపు సహజమృతి ( Apoptosis ) వలన పురోగమిస్తుంది.
పుపుసనాళికలు వాయుగోళములలో తాపము వలన వాపు , అధికముగా శ్లేష్మపు ఉత్పత్తి , వాయుగోళముల విధ్వంసము , తంతీకరణము ( fibrosis) , సాగుకణజాలపు ( elastic tissue) విధ్వంసము జరిగి ఊపిరితిత్తుల ఉబ్బుదల ( emphysema) కలుగ జేస్తాయి. పుపుసరక్తనాళములపై కూడా ఈ తాప ప్రభావము ఉంటుంది.
పై మార్పులు ఊపిరిపైన ఫలితము చూపిస్తాయి. నిశ్వాసము మందగిస్తుంది. ఊపిరి వదలడము శ్రమభరితమవుతుంది. నిశ్వాస వాయుప్రసరణము తగ్గుతుంది. వాయుగోళములలో గాలి ఎక్కువగా చేరుకొని ఊపిరితిత్తులు ఉబ్బుతాయి. వాయు ప్రసరణ తగ్గుట వలన , తాపము వలన , వాయుగోళముల విధ్వంసము వలన వాయుగోళములు సూక్ష్మరక్తనాళముల మధ్య ప్రాణవాయువు బొగ్గుపులుసు వాయువుల మార్పిడి మందగిస్తుంది. పుపుసధమనులలో రక్తపుపోటు కూడా హెచ్చవుతుంది ( Pulmonary hypertension ). అందువలన వ్యాధి బాగా ముదిరిన వారిలో హృదయపు కుడి జఠరికపై ( Right ventricle) పనిభార మధికమై హదయవైఫల్యమునకు ( congestive heart failure ) దారితీస్తుంది.
వ్యాధి ప్రకోపించి చివరి దశలలో రక్తములో ప్రాణవాయువు పరిమాణము తగ్గి, బొగ్గుపులుసు వాయువు పరిమాణము పెరిగి , శ్వాసవైఫల్యము ( Respiratory failure) , రక్తపు ఆమ్లీకరణలకు
( Respiratory acidosis) దారితీస్తాయి
శ్వాసావరోధవ్యాధి కలవారిలో గుండెజబ్బులు, ఎముకల బలము తగ్గుట ( Osteoporosis ) కండరముల నీరసము ఎక్కువగా కలుగుతాయి.
వ్యాధి లక్షణములు :
ఊపిరితిత్తుల వ్యాపారము బాగా దెబ్బతినే వఱకు ( FEV1 50 శాతమునకు మించి క్షీణించే వఱకు ) ఏ లక్షణములు పొడచూపవు.
దీర్ఘకాలిక శ్వాసావరోధవ్యాధి తీవ్రమయిన వారికి తఱచు దగ్గు, కఫము, ఆయాసము, ఊపిరి వదిలేటప్పుడు పిల్లికూతలు కలుగుతాయి. ప్రారంభ దశలో ఆయాసము పనిచేస్తున్నపుడు , శారీరక శ్రమ సమయములలో కలిగినా వ్యాధి ముదిరాక విశ్రాంతసమయములలో కూడా కలుగవచ్చును. సూక్ష్మజీవులు, విషజీవాంశువులు( viruses ) , హానికర వాయువులు , వలన ఊపితిత్తులలో తాపము కలిగినపుడు , వ్యాధి లక్షణములు హెచ్చుగా కన్పిస్తాయి. ఆయాసము పెరిగినపుడు ఆందోళన కూడా కలుగుతుంది. కఫమునకు సాధారణస్థితులలో రంగు ఉండదు. సూక్ష్మజీవుల వలన తాపము కలిగినప్పుడు కఫము చీము రంగులోను, పచ్చరంగులోను ఉంటుంది. రక్తములో బొగ్గుపులుసుగాలి పెరిగితే అతినిద్ర , అపస్మారక స్థితి కలుగవచ్చును.
వీరిలో ఊపితిత్తుల ఉబ్బుదల వలన ఛాతి పీపా ఆకారములో ఉంటుంది. ఛాతి ముందు నుంచి వెనుక ప్రమాణము ఎక్కువవుతుంది. ఆయాసము ఉన్నవారిలో ఊపిరి కొఱకు కంఠకండరముల వంటి అదనపు కండరములు కూడా శ్రమించుట గమనిస్తాము. వినికిడి గొట్టముతో విన్నపుడు ఛాతిలో ఊపిరి శబ్దములు మందకొడిగా ఉంటాయి. నిశ్వాస శబ్దముల నిడివి పెరుగుతుంది. పిల్లికూతలు ( Wheezing) వినిపిస్తాయి. ఛాతిపై వేళ్ళుపెట్టి వానిని రెండవచేతి మధ్యవేలుతో కొడితే ప్రతిధ్వని మోత ఎక్కువగా ( hyper resonance ) ఉంటుంది.
వ్యాధి నిర్ణయము :
దీర్ఘకాలము పొగ త్రాగిన వారిలోను , వృత్తిపరముగా హానికర వాయువులను, దుమ్ములను పీల్చే వారిలోను, గనులలో పనిచేసేవారిలోను దగ్గు, కఫము, ఆయాసము కలుగుతే శ్వాసవ్యాపార పరీక్షలు
( Pulmonary function tests ) , ఛాతికి ఎక్స్ - రేలు చేయుట వలన వ్యాధిని నిర్ణయించవచ్చును. చాలా సంవత్సరాలు పొగ త్రాగిన వారిలోను , తాపజనక వాయువులను పీల్చిన వారిలోను వ్యాధి పొడచూపక మునుపే శ్వాస వ్యాపారపరీక్షలు చేసి వ్యాధిని త్వరగా కనిపెట్టుట మంచిది.
శ్వాసవ్యాపార పరీక్షలు :
శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary function tests ) శ్వాసకు అవరోధమును కనుగొనుటకు సహాయపడతాయి. శ్వాసమాపకము ( Spirometer ) అనే పరికరమును శ్వాసవ్యాపార పరీక్షలకై ఉపయోగిస్తారు.
సుదీర్ఘ సంపూర్ణ ఉచ్ఛ్వాసము ( forced inspiration ) , తదుపరి సత్వర సుదీర్ఘ నిశ్వాసములను
( forced expiration) ఈ పరికరముతో కొలుస్తారు. బలమైన దీర్ఘ ఉచ్ఛ్వాసము తర్వాత బలమైన దీర్ఘ నిశ్వాసముతో వదిలే గాలి ఘనపరిమాణమును సంపూర్ణశ్వాస ప్రమాణము (Forced Vital Capacity FVC ) గా పరిగణిస్తారు.
బల ఉచ్ఛ్వాసముతో గాలి పీల్చిన పిదప బల నిశ్వాసముతో మొదటి సెకండులో వదిలే గాలి పరిమాణము ( Forced Expiratory Volume/ first second FEV1 ) ను , మొదటి సెకండులో నిశ్వాసముతో వదల గలిగే గాలి / సంపూర్ణశ్వాస ప్రమాణము FEV1 / FVC ) నిష్పత్తిని ఉపయోగించి అవరోధక పుపుస వ్యాధులను ( Obstructive lung diseases ), నిర్బంధ పుపుస వ్యాధులను
( Restrictive lung diseases ) వేఱుపఱచ వచ్చును.
అవరోధక శ్వాసవ్యాధులు ( ఉబ్బసము, దీర్ఖకాలిక శ్వాసావరోధము, ఊపిరితిత్తుల ఉబ్బుదల ) ఉన్న వారిలో సంపూర్ణశ్వాస ప్రమాణము ( FVC ) తగ్గినా , బలనిశ్వాస వాయుపరిమాణము -1 ( మొదటి సెకండులో బలముగా వదల గలిగే గాలి పరిమాణము FEV1 ) విశేషముగా ( 70 శాతము కంటె
తక్కువగా ) తగ్గుతుంది .
శ్వాసనాళిక వ్యాకోచ చికిత్సానంతరము ( Post bronchodilator treatment ) దీర్ఘకాలిక శ్వాసావరోధము గల వారిలో శ్వాస వ్యాపార పరీక్షలు కొద్దిగా మాత్రము మెఱుగవుతాయి. ఉబ్బసవ్యాధిగ్రస్థులలో శ్వాసనాళ వ్యాకోచ చికిత్సతో శ్వాసవ్యాపారము చాలా మెఱుగవుతుంది. మొదటి సెకండు నిశ్వాస వాయు పరిమాణము విశేషముగా వృద్ధి చెందుతుంది.
నిర్బంధవ్యాధులు : ఊపిరితిత్తులలో తంతీకరణము ( Pulmonary Fibrosis ), పుపుసపరివేష్టనపు వ్యాధులు ( Diseases of Pleura ) వలన ఉచ్ఛ్వాసమునకు అడ్డంకి కలిగిన వారిలో సంపూర్ణ శ్వాసప్రమాణము ( FVC ) , మొదటి సెకండులో నిశ్వాసప్రమాణము ( FEV1 ) సమాంతరముగా తగ్గుతాయి.
ఈ వ్యాధులు లేనివారలలో శ్వాసవ్యాపార పరీక్షలు సాధారణ పరిమితిలో ఉంటాయి.
బలనిశ్వాస వాయు ప్రమాణము-1 ( FEV1 ) వయస్సు, ఎత్తు , బరువు , లింగముల బట్టి ఉండవలసిన విలువను అంచనా వేసి ఆ విలువ కంటె తగ్గుదల బట్టి దీర్ఘకాలిక శ్వాసావరోధపు తీవ్రతను నిర్ణయిస్తారు.
FEV -1 అంచనాలో 80 % కంటె ఎక్కువగా ఉంటే మితము
FEV -1. అంచనాలో 50 - 79 % లో ఉంటె తీవ్రము
FEV-1 అంచనాలో 30- 49 % లో ఉంటే తీవ్రతరము
FEV-1 అంచనాలో 30 % కంటె తక్కువయితే తీవ్రతమము అని వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తారు.
ఊపిరితిత్తులలో కార్బన్ మోనాక్సైడు ప్రసరణ సామర్థ్యత ( Diffusing capacity of the Lungs for carbon monoxide DLCO ఈ వ్యాధి ఉన్నవారిలో తగ్గుతుంది. ఈ పరీక్ష రక్తపు ప్రాణవాయువు సంగ్రహణ శక్తిని సూచిస్తుంది.
వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో రక్తములో బైకార్బొనేట్ ( bicarbonate) విలువ పెరుగుతుంది. ఊపిరితిత్తులచే తగినంతగా విసర్జింపబడని బొగ్గపులుసు వాయువు ( carbon dioxide) రక్తములో బైకార్బొనేట్ గా నిలువవుతుంది. మూత్రపిండములు యీ బైకార్బొనేట్ ను విసర్జించుటకు కృషి చేసినా ఆ కృషి చాలకపోవచ్చును.
శ్వాసావరోధ వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో ధమని రక్తవాయువుల ( Arterial Blood Gases ) పరీక్ష అవసరము. ధమనిరక్తములో ప్రాణవాయువు పీడనమును ( PaO2 ), బొగ్గుపులుసు వాయువు పీడనము ( PaCO2 ) రక్తపు ph లను కొలిచి శ్వాసవైఫల్యమును ( Respiratory failure ) పసిగట్టవచ్చును.
ఈ వ్యాధి ఉన్నవారిలో ఎఱ్ఱ రక్తకణముల సంఖ్య పెరగవచ్చును. రక్తములో దీర్ఘకాలము ప్రాణవాయువు ప్రమాణము తగ్గుట వలన శరీరము ఎఱ్ఱకణముల ఉత్పత్తిని పెంచుట దీనికి కారణము.
ఛాతి ఎక్స్ రే చిత్రములలో ఊపిరితిత్తుల ఉబ్బుదల వలన ఉదరవితానపు వంకలు తగ్గి సమతలత కలుగవచ్చును . ఛాతి ముందు , వెనుకల పరిమాణము పెరుగుతుంది. ఊపిరితిత్తులలో గాలిఎక్కువగుట వలన పారదర్శకత పెరిగి , రక్కనాళముల గుర్తులు తగ్గుతాయి. గాలి బుడగలు
( bullae ) కనిపించవచ్చును. ఊపిరితిత్తుల తాపము ( Pneumonitis ), పుసవేష్టనములో వాయువు
( Pneumothorax ) , హృదయవైఫల్యము వలన ఊపిరితిత్తులలో నీరు పట్టుట ( Pulmonary edema ) కర్కటవ్రణములు ( Cancers ) వంటి ఇతర వ్యాధులను కనుగొనుటకు ఎక్స్ రేలు ఉపయోగపడుతాయి.
ఛాతి కేట్ స్కానులు ఊపిరితిత్తులలో విపరీతముగా ఉబ్బిన భాగము తొలగించే శస్త్రచికిత్సలకు ( Lung Volume Reduction Surgery ) ముందు , ఊపిరితిత్తుల మార్పు శస్త్రచికిత్సలకు ( Lung Transplantation ) ముందు , కర్కటవ్రణములను ( Cancers )కనుగొనుటకు వాడుతారు.
వ్యాధి చికిత్స :
దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధిలో ఊపిరితిత్తులలో కణజాల విధ్వంసము, నష్టము కలుగుట వలన వ్యాధికి ఉపశమనము చేకూర్చుట తప్ప వ్యాధిని సంపూర్ణముగా నయము చేయుట కుదరదు.
పొగత్రాగడము మానివేయుట , హానికర వాయువులు , దుమ్ము , ధూళిలకు దూరముగా ఉండుట, ఊపిరితిత్తులను విషజీవాంశువులు , సూక్ష్మజీవుల బారి నుంచి కాపాడుట వలన వ్యాధి పురోగమనమును మందగింప చేయవచ్చును. మధ్య మధ్యలో కలిగే వ్యాధి ఉద్రేకతలను అరికట్టవచ్చును.
శ్వాసవ్యాధులు కలవారు ప్రతి ఐదు సంవత్సరములకు ఒకసారి ఊపిరితిత్తుల తాపము అరికట్టు టీకాను ( Pneumonia vaccine ) ప్రతిసంవత్సరము ఫ్లూ రాకుండా ఇన్ఫ్లుయెంజా టీకాను
( Influenza vaccine ) వేసుకోవాలి.
ఔషధములు ;
ఈ వ్యాధిలో శ్వాసకు అవరోధమును తగ్గించుటకై పుపుస శ్వాసనాళికలలో ఉన్న మృదుకండరముల బిగుతును తగ్గించి ఆ నాళికలను వ్యాకోచింపజేసే మందులను పీల్పువుల ( Inhalers ) ద్వారా గాని, తుంపరులుగా శీకరయంత్రములతో ( nebulizers ) గాని వాడుకోవాలి.
వ్యాధి ఉద్రేకించినపుడు తక్షణ ఉపశమనమునకు సత్వరముగ పనిచేసే బీటా 2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములను ( Short acting Beta2- adrenergic agonists SABA s ) పీల్పువుల ( Inhaler ) ద్వారా వాడాలి.
ఎక్కువ వాడకములో ఉండే ఓషధము ఆల్బుటెరాల్ ( Albuterol ) పీల్పువు . దీనిని రెండు పీల్పులు ప్రతి 4 - 6 గంటలకు లేక శీకరయంత్రము ద్వారా 2.5 మి. గ్రా.లు ప్రతి 6-8 గంటలకు తుంపరులుగా వాడ వచ్చును.
లీవాల్బుటెరాల్ ( Levalbuterol ) మరో మందు. దీనిని రెండు పీల్పులు ప్రతి 4-6 గంటలకు లేక శీకరయంత్రము ద్వారా 0.63 - 1.25 మి. గ్రా.లు ప్రతి 6-8 గంటలకు వాడవచ్చు . ఇవి పుపుస,శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తాయి. అందు వలన గాలి బాగా ప్రసరిస్తుంది.
పిర్ బ్యుటెరాల్ ( Pirbuterol ) మరో మందు , రెండు పీల్పులు ప్రతి 4-6 గంటలకు వాడుకొనవచ్చును.
ఎసిటైల్ ఖొలీన్ అవరోధకములు( Anticholenergics - Muscarine Antagonists ) :
ఇప్రట్రోపియమ్ బ్రోమైడు ( Ipratropium bromide ) ను పీల్పువు ద్వారా గాని, శీకరయంత్రము ద్వారా గాని ఆల్బుటరాల్ తోను, లేక లీవాల్బుటరాల్ తోను కలిపి, లేక ఒంటరిగాను అందించవచ్చును. ఇది పుపుస, శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తుంది. ఇప్రట్రోపియమ్ మోతాదులు కొద్ది గంటలే పనిచేస్తాయి ( Short acting Muscarine Antagonist SAMA ) కాబట్టి దీనిని దినమునకు 2 పీల్పులు ప్రతి 4-6 గంటలకు లేక 0.5 మి.గ్రా.లు ప్రతి 6-8 గంటలకు శీకరయంత్రము ద్వారా గాని వాడాలి.
సాల్మెటరాల్ ( Salmeterol ), ఫార్మెటరాల్ ( Formoterol ) , దీర్ఘకాలిక బీటా ఉత్తేజకములను
( Long Acting Beta Agonists LABAs ) విడిగాగాని , కార్టీకోస్టీరాయిడులతో ( Fluticasone or Mometasone ) కలిపి గాని పీల్పువులుగా ఉపయోగించ వచ్చును.
ఒలొడటెరాల్ ( Olodaterol ) రోజుకు రెండు పీల్పులుగా వాడాలి.
టియోట్రోపియమ్ ( Tiotropium ) దీర్ఘకాలిక ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము ( Long acting Muscarine Antagonist LAMA ) . దీనిని దినమునకు రెండు పీల్పులగా వాడాలి. దీర్ఘకాలిక బీటా ఉత్తేజకము ఓలొడటెరాల్ ( Olodaterol ) తో కలిపి పీల్పువుగా కూడా టియోట్రోపియమ్ లభ్యము.
యుమిక్లిడినియమ్ ( Umeclidinium ) దీర్ఘకాలము పనిచేసే ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము ( Long Acting Muscarine Antagonist LAMA ). దినమునకు ఒక మోతాదుని పీల్పువు ద్వారా వాడుకోవాలి.
కార్టికోస్టీరాయిడ్ పీల్పువులు ( Inhaled corticosteroids. ) పుపుస శ్వాసనాళికలలో తాపమును తగ్గించి ఊపిరికి అడ్డంకిని తగ్గిస్తాయి. వ్యాధి తీవ్రతమమయినపుడు , వ్యాధి ఉద్రేకించినపుడు వీని ప్రయోజనము కలదు . కాని ఇవి వ్యాధినిరోధకశక్తిని తగ్గించడము వలన ఊపితిత్తులు సూక్ష్మజీవుల బారికి గురిఅయే అవకాశములు పెరుగుతాయి. ఈ పీల్పువులను వాడిన పిమ్మట నోటిపూతలు కలుగకుండా ఉండుటకు నోటిని నీళ్ళతో పుక్కిలించాలి.
థియాఫిలిన్ ( Theophylline) కు పుపుస శ్వాసనాళికలను వ్యాకోచింపజేసే గుణము కలదు. వ్యాధి లక్షణములు మిగిలిన మందులతో లొంగని వారికి థియోఫిలిన్ ను నెమ్మదిగా విడుదలయే బిళ్ళల రూపములో వాడవచ్చును. ఆందోళన , వణకు , గుండెదడ , కడుపులో వికారము, వాంతులు, మూర్ఛ దీని వలన కలిగే అవాంఛిత ఫలితములు. థియాఫిలిన్ వాడే వారిలో మధ్యమధ్యలో రక్తప్రమాణములను పరీక్షించాలి.
నోటి ద్వారా గాని సిరల ద్వారా గాని కార్టికోస్టీరాయిడులను వ్యాధి ఉద్రేకించినపుడు , తీవ్రతమమయినపుడు తాత్కాలికముగాను వీలయినంత తక్కువ మోతాదులలోను వాడుతారు.
Alpha - 1 Antitrypsin లోపించిన వారిలో దానిని వారమునకు ఒకసారి సిరల ద్వారా యిస్తే ప్రయోజనము చేకూరుతుంది.
ధమని రక్తపు ప్రాణవాయువు సంపృక్తత ( oxygen saturation ) 88 శాతము కంటె తక్కువయిన వారికి ప్రాణవాయువును ముక్కు గొట్టము ద్వారా అందించాలి.
రక్తములో బొగ్గుపులుసు వాయువు ప్రమాణము పెరిగిన వారికి , శ్వాసవైఫల్యము ప్రారంభదశలో ఉన్నవారికి నిరంతర పీడనముతో ( Continual Positive airway pressure CPAP ) గాని ఉచ్ఛ్వాస నిశ్వాసములలో పీడనము మార్చి ( Bilevel positive airway pressure BiPAP ) గాని ముక్కుపై మూతతో ( mask ) ప్రాణవాయువును నిద్రలో ఉన్నపుడు , అవసరమయితే పగలు కొన్ని గంటలు అందించవచ్చును.
ఊపిరితిత్తుల పరిమాణము తగ్గించే శస్త్రచికిత్స Lung Volume Reduction Surgery :
వాయువుల మార్పిడికి దోహదపడకుండా పనిచేసే భాగముల మీద పీడనము పెట్టి ఊపిరికి అంతరాయము కలిగించే ఉబ్బుదల భాగములను తొలగించే శస్త్రచికిత్స కొందఱికి ఉపయోగపడవచ్చును.
ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స ( Lung Transplantation surgery ) FEV1 20 శాతము కంటె తక్కువగా ఉండి వ్యాధి తీవ్రతమమయినపుడు కొందఱికి అనుకూలము కావచ్చును.
వ్యాధి ఉద్రేకత ( Acute exacerbations of COPD ) :
దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి లక్షణములు అధికమయి ఆయాసము , దగ్గు అధికమయినపుడు వైద్యాలయములలో చేరిక అవసరమవవచ్చును. సూక్ష్మాంగజీవులు( bacteria ), విషజీవాంశువులు
( viruses ), తాపకజనకములు , వాతావరణ కల్మషముల వలన వ్యాధి ఉద్రేకించవచ్చును. అట్టి పరిస్థితులలో తఱచు పుపుస శ్వాసనాళిక వ్యాకోచకములను ( bronchodilators ) అందించుటతో పాటు , Antibiotics, కార్టికోస్టీరాయిడులు , ప్రాణవాయువులతో కూడా చికిత్స చేస్తారు.
వ్యాధి తీవ్రతరమయితే ధమని రక్తమును వాయువులకు పరీక్షించి శ్వాసవైఫల్యము నిర్ధారణయితే కృత్రిమశ్వాసను అందించాలి.
వ్యాధి నివారణ :
పొగత్రాగుట దీర్ఘకాలిక శ్వాసావరోధము అధిక శాతములో కలుగుటకు ప్రధాన కారణము. కావున వ్యాధిని నివారించాలన్నా అదుపులో ఉంచాలన్నా పొగత్రాగడము మానివేయుట చాలా ముఖ్యము. ఒక యత్నములో చాలా మంది పొగత్రాగుట మానలేరు. అందువలన పదే పదే పొగత్రాగడము మానుటకు యత్నించాలి. సలహా సహాయములను తీసుకోవాలి. అవసరమనుకుంటే పొగమానుటకు మందులను ఉపయోగించవచ్చును.
బొగ్గుగనులు , యితరగనులలో గాలి ప్రసరణ పెంచుట వలన , గాలిలో కల్మషములను ధూళిని తొలగించుట వలన , కార్మికులకు పరిశుభ్రమైన గాలిని ముక్కు , నోటిపై అమరు మూతల ( masks ) ద్వారా అందించుట వలన నల్ల ఊపిరితిత్తుల వ్యాధిని ( Black lung disease ) అరికట్టే ప్రయత్నాలు చెయ్యాలి.
( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )
వద్ద సెప్టెంబర్ 25, 2018 1 కామెంట్‌:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

20, ఆగస్టు 2018, సోమవారం

ఉబ్బసము ( Bronchial Asthma )

డా. గన్నవరపు నరసింహమూర్తి
శరీర కణజాలపు జీవప్రక్రియలో ప్రాణవాయువు ( Oxygen) గ్రహించబడి బొగ్గుపులుసు వాయువు ( Carbon dioxide ) విడుదల అవుతుంది. వివిధ అవయవముల కణజాలమునకు రక్తము ద్వారా ప్రాణవాయువు అందించబడుతుంది. ఆయా కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువు రక్తములోనికి చేరుతుంది. ఊపిరితిత్తులు ప్రాణవాయవుని రక్తమున కందించి రక్తమునుంచి బొగ్గుపొలుసువాయువుని గ్రహించి బయటకు విసర్జిస్తాయి. నిరంతరము ప్రాణవాయవుని రక్తమునకు చేర్చుటకు బొగ్గుపులుసు వాయువుని విసర్జించుటకు ఉచ్ఛ్వాస నిశ్వాసాల శ్వాసక్రియ అవసరము.
వాతావరణములో నున్న గాలి ముక్కు , గొంతుక , స్వరపేటిక ల ద్వారా శ్వాసనాళము( Trachea) నకు చేరుతుంది. శ్వాసనాళము రెండు పుపుసనాళములుగా ( Bronchi ) చీలి రెండు ఊపిరితిత్తుల వాయుప్రసరణకు సహాయపడుతుంది. ప్రతి ఊపిరితిత్తులో పుపుసనాళము ప్రథమ, ద్వితీయ, తృతీయ , అంతిమ పుపుసనాళికలుగా ( Primary, secondary tertiary and terminal bronchioles ) శాఖలై పిదప శ్వాసనాళికలు ( Respiratory bronchioles) , వాయుగోళనాళికలుగా
( Alveolar ducts ) చీలి చిట్టచివర వాయుగోళములను ( Alveoli ) ధరిస్తాయి. ఈ వాయుగోళములు ,వాని దరిని ఉండు సూక్ష్మరక్తనాళికల ( Capillaries ) మధ్య వాయువుల మార్పిడి జరుగుతుంది.
శ్వాసనాళము , పుపుసనాళముల గోడలలో ఉన్న మృదులాస్థి ( Cartilage ), శ్వాసనాళికల గోడలలో నుండు అనిచ్ఛా మృదుకండరములు ( Smooth muscles ) ఆ నాళములు, నాళికలను నిత్యము తెఱిచి ఉంచుతాయి. వాయుగోళముల బయట నుండు సాగుకణజాలము
( Elastic tissue ) వాయుగోళములు పూర్తిగా ముడుచుకొనుటను అరికడతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలన శ్వాసవృక్షములో ( Bronchial tree ) వాయు చలనము జరుగుతుంది. ఈ గాలి చలనానికి అవరోధ మేర్పడినప్పుడు రక్తమునకు ప్రాణవాయువు అందించుటకు , రక్తమునుంచి బొగ్గుపులుసు వాయువు తొలగించుటకు అంతరాయము ఏర్పడుతుంది. శ్వాసవృక్షములో వాయు చలనమునకు అవరోధము కలిగించే రుగ్మతలలో ఉబ్బసవ్యాధి ( Bronchial Asthma) ఒకటి.
ఉబ్బసవ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధివలన శ్వాసపథములో దీర్ఘకాలిక తాపప్రక్రియ
(inflammation ) కలిగి మధ్య మధ్యలో వ్యాధి ప్రకోపిస్తుంటుంది. సూక్ష్మాంగజీవులు( bacteria ), విషజీవాంశములు ( Viruses ) ఊపిరితిత్తులపై దాడి జరిపినపుడు , పడని వికటపదార్థములు
( allergens), వృత్తులలోను యితరత్రా తాపజనకముల ( irritants) బారికి దేహము పడినప్పుడు ఊపిరితిత్తుల విపరీత స్పందన వలన ఉబ్బసవ్యాధి లక్షణములు ప్రకోపిస్తాయి.
ఉబ్బస పొడచూపినపుడు పరంపరలగా దగ్గు , ఆయాసము , ఛాతిబిగింపు , ఊపిరి వదిలేటప్పుడు పిల్లికూతలు ( wheezings ) కలుగుతాయి. వ్యాధి విపరీతమయితే శ్వాస వైఫల్యము కలిగి, తీవ్రత హెచ్చయి మరణమునకు కూడా దారితీయ వచ్చును. వ్యాధి తనంతట కాని, చికిత్స వలన గాని కొన్ని నిముషముల నంచి కొన్ని గంటలలో ఉపశమించవచ్చును.
ఉబ్బసకు కారణములు :
ఉబ్బస వ్యాధి ప్రంపంచమంతటా ఉన్నా అభివృద్ధి చెందిన దేశాలలో అధికముగా కనిపిస్తుంది. కొన్ని జాతులలో ఉబ్బసవ్యాధి అధికముగా కనిపించినా ఆర్ధిక, సామాజిక, పరిసరముల ప్రభావము దానికి కారణము కావచ్చును. జన్యువులు , క్రోమోజోములు యీ వ్యాధి కలుగుటకు కారణమయినా వాతావరణ, పరిసర ప్రభావములు యీ వ్యాధిపై హెచ్చుగా కలిగి ఉంటాయి . రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ( Respiratory Syncytial Virus RSV ), రైనోవైరస్ ( Rhinovirus ) వంటి విషజీవాంశువులు (viruses ) , పొగాకు పొగ , యితర పొగలు, స్వచ్ఛత కొఱకు వాడే సబ్బులు వంటి రసాయినకములు, యితర రసాయినకములు, తాపకారులు( Irritants ) , పుప్పొడి, ధూళిక్రిములు, బొద్దింకల విసర్జనములు, పెంపకపు జంతువుల బొచ్చు, సుగంధపరిమళములు , బూజులు వంటి వికట పదార్థములు ( Allergens ), శీతలవాయువులు శ్వాసపథములో తాపము కలుగజేసి వ్యాధి పొడచూపుటకు కారణమవుతాయి.
వ్యాయామము , ఆటలు , మానసికాందోళనలు కూడా ఉబ్బసవ్యాధి ఉద్రేకించుటకు కారణము కాగలవు.
బీటా 2-ఎడ్రినలిన్ గ్రాహక అవరోధకములు ( Beta 2- adrenergic receptor blockers ),
ఏస్పిరిన్ , స్టీరాయిడులు కాని - తాపక నివారుణులు ( non steroid anti inflammatory agents ) ఉబ్బసవ్యాధిని ప్రకోపించవచ్చును.
ఉబ్బసవ్యాధి కలిగిన వారిలో శ్వాసపథములో గాలి చలనమునకు అవరోధము కలుగుతుంది.
ఈ అవరోధము ముఖ్యముగా నిశ్వాసమునకు ఏర్పడుతుంది. అందువలన ఊపిరితిత్తులు గాలితో ఉబ్బి ఉంటాయి.
శ్వాసనాళములు , పుపుస నాళములు , పుపుస నాళికలు , వాని కుడ్యములలోను, శ్లేష్మపు పొరలోను ( mucosa ) , యూసినోఫిల్స్ ( Eosinophils - ఇవి శ్వేతకణములలో ఒక రకము . ఇవి ఎఱుపు వర్ణకమును గ్రహించు చుక్కలు కలిగి ఉంటాయి.), మాస్ట్ కణములు ( mast cells) , భక్షక కణములు ( macrophages), రసిక కణములు ( T- lymphocytes ) చేరి తాపక్రియ కలుగజేస్తాయి. తాపక కణముల నుంచి , నాళముల లోపొర ( అంతస్త్వక్కు mucosa ) నుంచి, వెలువడు జీవరసాయినక పదార్థములు , నాడీ వాహకముల ( Neuro transmitters ) ప్రభావము వలన శ్వాస పుపుస నాళికలలోనున్న మృదుకండరములు సంకోచిస్తాయి. అందువలన ఆ నాళ, నాళికల ప్రమాణములు తగ్గిపోతాయి. ఈ మృదుకండరముల పరిమాణము కూడా పెరుగుతుంది.
శ్వాసనాళికల లోపొర భాగములు తాపప్రక్రియచే విచ్ఛేదమయి నాళములలో బిరడాలుగా ఏర్పడి గాలి ప్రసరించుటకు అవరోధము కలిగిస్తాయి.
శ్వాసవృక్షపు శ్లేష్మపుపొర క్రింద శ్లేష్మగ్రంథులు సంఖ్యాపరముగాను , పరిమాణములోను వృద్ధి చెంది శ్లేష్మము నధికముగా ఉత్పత్తి చేస్తాయి. అధిక శ్లేష్మము వాయుచలనమునకు అడ్డుపడుతుంది.
శ్వాసనాళికల తాపప్రక్రియలో భాగముగా కొత్త సూక్ష్మరక్తనాళికలు జనితమవుతాయి.
మాన్చు ప్రక్రియలో లోపొర ( అంతస్వక్కు ) క్రింద , నాళములలో తంతుకణములు
( fibroblasts) పీచువంటి కొల్లజెన్ ( Collagen )తంతువులను ఉత్పత్తి చేయడము వలన
తంతీకరణ ( fibrosis ) జరిగి నాళములు కుచించుకు పోతాయి.
పై కారణము లన్నిటి వలన శ్వాసవృక్షములో ఊపిరి బంధించబడుతుంది. రక్తములో ప్రాణవాయువు చేరుటకు, బొగ్గుపులుసువాయువు విసర్జనకు భంగమేర్పడుతుంది.
ఉబ్బస లక్షణములు :
ఉబ్బస కలిగినప్పుడు పరంపరలుగా దగ్గు , ఆయాసము, ఛాతిలో బిగింపు , శ్రమభరిత నిశ్వాసములు, పిల్లికూతలు ( wheezing) కలుగుతాయి. గుండెదడ , అధికస్వేదము పొడచూపవచ్చును. వ్యాధి తగ్గి , అప్పుడప్పుడు ప్రకోపించుట వలన, చర్మతాపము ( Atopic Dermatitis ) , వివిధ పదార్థములకు వికటలక్షణములు కలుగియుండుట, కుటుంబములో యితరులకీ వ్యాధి ఉండుట వంటి లక్షణముల వలన , ప్రత్యక్షముగా వ్యాధిగ్రస్థులను పరీక్షించుట వలన వైద్యులు రోగనిర్ణయము చేయగలుగుతారు. వైద్యులు వినికిడిగొట్టముతో ఛాతిపై విన్నపుడు నిశ్వాస సమయము హెచ్చుగా ఉండుట గమనిస్తారు. నిశ్వాసములో పిల్లికూతలు కూడా వినవచ్చు. కొందఱిలో పిల్లికూతలు వినిపించక పోవచ్చును.
ఆయాసము ఊపిరితిత్తుల తాపము ( Pneumonitis ) , వాయుపూరిత పుపుస వేష్టనము ,
( ఊపిరితిత్తిని ఆవరించు ఉండు ఆచ్ఛాదన పుపుస వేష్టనము. దీనికి రెండుపొరలు ఉండును. రెండు పొరల మధ్య గాలి చేరుట Pneumothorax . ) యితర ఊపిరితిత్తుల వ్యాధుల వలన , హృదయవైఫల్యము ( Congestive heart failure) వంటి గుండెజబ్బుల వలన , పుపుసధమనిలో రక్తపుగడ్డలు వలన ( Pulmonary embolism), రక్తహీనత, అనేక యితర కారణముల వలన కలుగవచ్చును.
వ్యాధి నిర్ణయము ;
వ్యాధి లక్షణముల వలన వైద్యులు వ్యాధిని నిర్ణయించగలుగుతారు. వాయుపూరిత పుపుసవేష్టనము ( Pneumothorax), హృదయవైఫల్యము వలన ఊపిరితిత్తులలో నీరుపట్టుట
( Congestive heart failure) , పుపుస తాపము ( Pneumonitis ) ల సంశయము ఉంటే ఛాతికి ఎక్స్ రే లు అవసరము.
ఆ సంశయము లేక పోతే ఎక్స్ రేల అవసరములేదు.
చికిత్సతో ఉపశమనము చేకూరనప్పుడు ఆయాసము ఎక్కువగా ఉన్నపుడు , ఎక్స్ రే వ్యత్యాస పదార్థములతో ఛాతి కేటే్ స్కాన్ పుపుసధమనులలో రక్తపుగడ్డలను ( Pulmonary embolism ) కనిపెట్టుటకు లేక , లేవని నిర్ధారించుటకు ఉపయోగపడుతుంది.
ఆయాసము తీవ్రముగా ఉండి శ్వాసవైఫల్యమునకు అవకాశముంటే ఉబ్బసకు తక్షణ చికిత్సతో బాటు కృత్రిమశ్వాస అందించుటకు కూడా వైద్యులు సన్నద్ధులు కావాలి. గరిష్ఠ వాయు ప్రవాహము ( Peak flow ) 25 శాతమునకు తగ్గినపుడు , రక్తములో ప్రాణవాయువు బాగా తగ్గినపుడు , బొగ్గుపులుసు వాయువు బాగా పెరిగినపుడు, ఊపిరి మందగించి నపుడు వైద్యులు కృత్రిమశ్వాసల నందజేయాలి.
ఉబ్బసవ్యాధిని ధ్రువపఱచుటకు శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary function tests ) సహాయపడుతాయి. శ్వాసమాపకము ( Spirometer ) అనే పరికరము అందుల కుపయోగిస్తారు. సుదీర్ఘ సంపూర్ణ ఉచ్ఛ్వాసమును ( forced inspiration ) , తదుపరి సత్వర సుదీర్ఘ నిశ్వాసముల
( forced expiration) నీ పరికరముతో కొలుస్తారు. బలమైన దీర్ఘ ఉచ్ఛ్వాసము తర్వాత బలమైన దీర్ఘ నిశ్వాసముతో వదిలే గాలి ఘనపరిమాణమును సంపూర్ణశ్వాస ప్రమాణము (Total Vital Capacity TVC ) గా పరిగణిస్తారు. బల నిశ్వాసముతో మొదటి సెకండులో వదిలే గాలి పరిమాణము ( Forced Expiratory Volume/ first second FEV 1 ) ను , FEV 1 / TVC నిష్పత్తులను ఉపయోగించి అవరోధక పుపుస వ్యాధులను ( Obstructive lung diseases ), నిర్బంధ పుపుస వ్యాధులను
( Restrictive lung diseases ) వేఱుపఱచ వచ్చును. ఉబ్బస అవరోధక శ్వాసవ్యాధి. ఉబ్బస ఉన్నపుడు వారిలో బలనిశ్వాస వాయుపరిమాణము -1 ( FEV 1 మొదటి సెకండులో బలముగా వదల గలిగే గాలి పరిమాణము ) విశేషముగా తగ్గుతుంది . శ్వాసనాళిక వ్యాకోచ చికిత్సానంతరము
( Post bronchodilator treatment ) ఉబ్బసవ్యాధిగ్రస్థులలో శ్వాసవ్యాపారము చాలా మెఱుగవుతుంది. మొదటి సెకండు నిశ్వాస వాయు పరిమాణము విశేషముగా వృద్ధి చెందుతుంది. ఉబ్బస లేనపుడు శ్వాసవ్యాపార పరీక్షలు సాధారణముగా నుండవచ్చును.
గరిష్ఠ ( శ్వాస ) ప్రవాహ మానికతో ( Peak flow meter ) సంపూర్ణ ఉచ్ఛ్వాసానంతరము సత్వర దీర్ఘనిశ్వాసము చేయించి గరిష్ఠ ప్రవాహము ( Peak flow ) కొలిచి ఉబ్బసవ్యాధిని నిర్ధారించి , దాని తీవ్రతను అంచనా చేయవచ్చును. ఈ పరికరములు చౌకగా లభిస్తాయి. ఇవి సులభ పరికరములు.
శ్వాసవ్యాపార పరీక్ష ఫలితములు సామాన్య పరిధులలో ఉంటే మెథాఖొలిన్ యిచ్చి శ్వాసనాళికల స్పందనను శ్వాసవ్యాపార పరీక్షలతో పరిశీలించి ఉబ్బస నిర్ధారణ చేయవచ్చును.
ఉబ్బస వ్యాధి ఉన్నవారికి పడని వికటించే పదార్థములకు ( Allergens) పరీక్షలు సలుపవచ్చును.
చికిత్స :
ఉబ్బస ప్రకోపించి నపుడు ఉబ్బస తీవ్రతను గరిష్ఠ ప్రవాహ పరిమాణము బట్టి అంచనా కట్టాలి. వ్యాధి ఉపశమన చికిత్సలు తక్షణము మొదలుపెట్టాలి.
వ్యాధి లక్షణములు పొడచూపే తఱచుదనము తీవ్రత బట్టి అంతరిత ( Intermittent ), నిరంతర ( Persistent ) అల్ప , మధ్యమ , అధిక తీవ్ర వ్యాధులుగా పరిగణిస్తారు.
తక్షణ ఉపశమనమునకు సత్వరముగ పనిచేసే బీటా 2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములను
( Short acting Beta2- adrenergic agonists SABA s ) పీల్పువుల ( Inhaler ) ద్వారా వాడాలి.
ఎక్కువ వాడకములో ఉండే ఓషధము ఆల్బుటరాల్ పీల్పువు . దీనిని ఉబ్బస పొడచూపి నపుడు రెండు నుంచి ఆరు పీల్పులు వఱకు ప్రతి ఇరవై నిమిషములు ఉబ్బస తగ్గే వఱకు వాడాలి . లీవాల్బుటెరాలు ( Levalbuterol ) మరో మందు. దీనిని రెండు నుంచి ఎనిమిది పీల్పులు వఱకు వాడవచ్చు. ఈ మందులను గాలి, లవణజలములతో మిశ్రీకరించి తుంపరులుగా శీకరయంత్ర
( Nebulizer ) సహాయముతో కూడా వాడవచ్చును. ఇవి పుపుస,శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తాయి
ఇదివఱలో బీటా2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు ( Beta2-Receptor agonist s) ఎపినెఫ్రిన్ , టెర్బుటలిన్ లను చర్మము క్రిందకు సూదిమందులుగా వాడే వారు. పీల్పువులు, శీకరయంత్రములతో ఔషధములను యివ్వ గలిగినప్పుడు అట్టి అవసరము లేదు. గుండె వ్యాధులున్న వారికి ఆ సూదిమందులు యివ్వరాదు.
ఎసిటైల్ ఖొలీన్ అవరోధకములు( Anticholenergics - Muscarine Antagonists ) :
ఇప్రట్రోపియమ్ బ్రోమైడు ( Ipratropium bromide ) ను పీల్పువు ద్వారా గాని, శీకరయంత్రము ద్వారా గాని ఆల్బుటరాల్ తోను, లేక లీవాల్బుటరాల్ తోను కలిపి, లేక ఒంటరిగాను అందించవచ్చును. ఇది పుపుస, శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తుంది. ఇప్రట్రోపియమ్ మోతాదులు కొద్ది గంటలే పనిచేస్తాయి ( Short acting Muscarine Antagonist SAMA ) కాబట్టి దీనిని దినమునకు పలు పర్యాయములు వాడుకోవాలి

కార్టికోస్టీరాయిడ్ పీల్పువులు ;
ట్రయామ్సినలోన్ ( Triamcinolone ), బెక్లోమిథసోన్( Beclomethasone ), బ్యుడినొసైడ్
( Budenoside ) , , ఫ్లునిసొలైడ్( Flunisolide ) , ఫ్లుటికసోన్( Futicasone ), మొమెటసోన్
( Mometasone ) వంటి కార్టికోస్టీరాయిడ్ ఔషధములు పీల్పువులుగా లభ్యమవుతున్నాయి. ఈ మందులు శ్వాసవృక్షములో తాపప్రక్రియను ( Inflammation ) తగ్గించుటకు ఉపయోగపడుతాయి. అందువలన వాపు తగ్గి గాలి చలించుటకు తోడ్పడుతాయి. తక్కువ మోతాదులలో వాడినప్పుడు వాని ప్రభావము శ్వాసవృక్షమునకే పరిమితమైనా ఎక్కువ మోతాదులలో వాడినప్పుడు వాని ప్రభావము దేహములో పొడచూపవచ్చును. అందు వలన ఉబ్బస అదుపులోనికి వచ్చిన పిమ్మట క్రమేణ వాని మోతాదులను తగ్గించే ప్రయత్నము చెయ్యాలి. దీర్ఘకాలము నిరంతరపు ఉబ్బసను ( Persistent Asthma ) అదుపులో నుంచుటకు కార్టికోస్టీరాయిడ్ పీల్పుసాధనములు చాలా ప్రయోజనకరము.
కార్టికోస్టీరాయిడులను పీల్చిన పిదప నోటిని మంచినీళ్ళతో పుక్కిలించుకోవాలి. లేకపోతే నోటిపూత కలిగే అవకాశమున్నది.
దీర్ఘకాలపు ఉబ్బస నదుపులో ఉంచుటకు సాల్మెటరాల్ ( Salmeterol ), ఫార్మెటరాల్
( Formeterol ) దీర్ఘకాలిక బీటా ఉత్తేజకములను ( Long Acting Beta Agonists LABAs ), కార్టీకోస్టీరాయిడులతో కలిపి పీల్పువులుగా ఉపయోగించ వచ్చును.
యుమిక్లిడినియమ్ ( Umeclidinium ) దీర్ఘకాలము పనిచేసే ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము ( Long Acting Muscarine Antagonist LAMA ). దినమునకు ఒక మోతాదుని పీల్పువు ద్వారా వాడుకోవాలి.
ఉబ్బస తీవ్రముగా నున్నప్పుడు కార్టికోస్టీరాయిడులను నోటిద్వారా గాని, సిరలద్వారా గాని వైద్యులు వాడుతారు.
ఉబ్బస తీవ్రముగా నున్నప్పుడు సిర ద్వారా మెగ్నీషియమ్ సల్ఫేట్ ను శ్వాసనాళికలను వ్యాకోచింపజేయుట కుపయోగిస్తారు.
తాపప్రక్రియ తగ్గించే మాంటెలుకాస్ట్ ( Montelukast ), జఫిర్లుకాస్ట్ ( Zafirlukast ), మాస్ట్ కణములను సుస్థిరపఱచు క్రొమొలిన్ సోడియమ్ ( Cromolyn sodium ), IGE ప్రతిరక్షకము ఒమలిజుమాబ్ ( Omalizumab ) లను , నెమ్మదిగా విడుదలయే థియాఫిలిన్ మందుబిళ్ళలను కూడా దీర్ఘకాలపు ఉబ్బస నదుపులో నుంచుటకు వాడుతారు.
ఉబ్బస ఉన్నవారు వారు వికటించే పదార్థములను ( allergens), నివారించుకొనుటకు ప్రయత్నించాలి. ధూమపానము చేయరాదు. వ్యాయామములకు ఆటలకు ముందుగా శ్వాసనాళిక వ్యాకోచ ఔషధములను ( Bronchodilators ) పీల్చుకొని ఉబ్బస నరికట్టుకోవాలి.
ఉబ్బస పొడచూపునప్పుడు , ప్రాణవాయువు సంపృక్తత ( Oxygen saturation ) 92 శాతము కంటె తగ్గినపుడు ప్రాణవాయువు నందించాలి.
శ్వాసవైఫల్యము ( Respiratory failure) కలుగుతే కృత్రిమశ్వాస ( Mechanical ventilation) నందించుట అవసరము.
ఉబ్బస ఉన్నవారికి నాసికాకుహర వ్యాధులు ( Rhinosinusitis , nasal polyps ) ఉంటే వాటిని నివారించాలి.
జఠరాన్ననాళ తిరోగమన ( Gastro esophageal reflux disease ) వ్యాధి ఉంటే హిష్టమిన్ 2 గ్రాహకావరోధకములు ( H-2 Receptor blockers) గాని , ప్రోటాన్ యంత్రనిరోధములను ( Proton pump inhibitors) గాని వాడి జఠరామ్లమును తగ్గించాలి.
స్థూలకాయమున్న వారు బరువు తగ్గించుకోవాలి.
నిద్రలో అవరోధక శ్వాసభంగము ( Obstructive sleep apnea ) ఉన్నవారికి తగిన చికిత్స అవసరము.
( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )
వద్ద ఆగస్టు 20, 2018 కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

18, జులై 2018, బుధవారం

ఆటాలమ్మ ( Chicken pox ) : అగ్గిచప్పి , మేఖలిక విసర్పిణి , ( Shingles , Herpes Zoster )

డా. గన్నవరపునరసింహమూర్తి .
ఆటాలమ్మ ( Chicken pox, Varicella ) ; మేఖలిక విసర్పిణి (Shingles , Herpesక Zoster ) వ్యాధులు ఆటాలమ్మ విషజీవాంశము ( Varicella Zoster Virus - VZV ) వలన కలుగుతాయి. VZV హెర్పీస్ కుటుంబపు వైరసులలో ఒకటి.
హెర్పీస్ వైరసులు DNA వైరసులు. ఈ వైరసులు రెండు పోగుల డీ ఆక్సీరైబోన్యూక్లియక్ ఏసిడ్ జన్యుసముదాయమును కలిగి ఉంటాయి. ఆ జన్యుసముదాయము వింశతి ( ఇరువది ) ఫలకాకారములో నున్న మాంసకృత్త్తు పెంకులో ( Icosahedral capsid ) యిమిడి ఉంటుంది. ఇవి కణములకు సోకి ఆ కణములలోనికి చొచ్చుకొన్నపుడు ఆ కణముల న్యూక్లియస్ లలోవిషాంశ డి ఎన్ ఎ లు ఉత్పత్తయి కణద్రవ్యము లోనికి విడుదలయి ఆ విషజీవాంశములు ( Viruses ) సంఖ్యాపరముగా వృద్ధి
చెందుతాయి.
ఆటాలమ్మ ( Varicella , or Chickenpox ) :
చాలా మందికి చిన్నతనములోనే ఆటాలమ్మ సోకి ఉంటుంది. నవతరములో వారికి ఆటాలమ్మ టీకాలు వేయుట వలన సుమారు డెబ్బది శాతపు పిల్లలకు వ్యాధినిరోధక శక్తి పెరిగి ఆటాలమ్మ సోకదు. అందు వలన వ్యాధి అరుదయే అవకాశ మున్నది.
ఆటాలమ్మను కలిగించే వి.జి. ( VZV ) వైరసులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. వ్యాధి ఉన్నవారు తుమ్ములు , దగ్గులతో లాలాజల తుంపరులతో విషజీవాంశములను వెదజల్లుతారు. వైరసులున్న గాలిని పీల్చుట వలన గాని, లేక చర్మ విస్ఫోటపు పొక్కులను తాకుట వలన గాని వైరసు సోకుతుంది. అగ్గిచప్పి
( మేఖలిక విసర్పిణి , Herpes Zoster , Shingles ) పొక్కులను తాకుట వలన కూడా వ్యాధినిరోధక శక్తి లేని వారికి ఆటాలమ్మ సోకవచ్చును.
ఆటాలమ్మ వైరసు శరీరములో ప్రవేశించాక 10 నుంచి 21 దినముల వఱకు వ్యాధి లక్షణములు పొడచూపవు. ఈ అంతర్గతస్థితి కాలములో ( Incubation Period ) వైరసులు వృద్ధి చెందుతుంటాయి. ప్రారంభదశలో చిన్న పిల్లలలో ఏ లక్షణాలు కనిపించక పోవచ్చును. తరుణవయస్కులలోను , పెద్దవారిలోను , నలత ( malaise ) , వికారము ( Nausea ) , ఒళ్ళు నొప్పులు , తలనొప్పి , జ్వరము , ముక్కు కారుట వంటి లక్షణములు కనిపించవచ్చును.
ఆపై విస్ఫోటము ( Rash ) పొడచూపుతుంది. తొలుత చిన్న చిన్న ఎఱ్ఱటి మచ్చలు అచ్చటచ్చట కనిపిస్తాయి. ఈ మచ్చలు విరివయి , పొక్కులుగాను తరువాత దినములలో నీటి పొక్కులు గాను , ఆపై చీముపొక్కులుగాను పరిణామము చెందుతాయి. తరువాత దినములలో పొక్కులు మాడి, పెచ్చులు కట్టి
ఆ పెచ్చులు రాలిపోతాయి. ఈ పొక్కులు పరంపరలుగా వచ్చుట వలన ఒకే సమయములో వివిధ దశల స్ఫోటకములు కనిపిస్తాయి. ఈ విస్ఫోటము వలన దుఱద కలుగ వచ్చును. నొప్పి కలుగదు.
చిత్రంలోని అంశాలు: ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు మరియు క్లోజప్
కొందఱిలో దౌడలలోను అంగుడిలోను చిన్న పొక్కులు గాని, పుళ్ళు గాని పొడచూపుతాయి. నొప్పి, దురద యీ పొక్కుల వలన కలుగవచ్చును.
ఆటాలమ్మలో విస్ఫోటములు ఛాతిపైన, వీపు పైన , ఉదరము పైనా, తల, చేతులు, ముంజేతులు, తొడలు , కాళ్ళ పైనా కనిపిస్తుంది.
విస్ఫోటము కనిపించుటకు రెండు దినములు ముందు నుంచి వ్యాధిగ్రస్థులు వైరసులను తుమ్ము దగ్గుల ద్వారా వ్యాపింప జేస్తారు. పొక్కులు పూర్తిగా మాడి పెచ్చులు కట్టే వఱకు ( సుమారు నాలుగైదు దినములు ) వీరు ఆటాలమ్మను వ్యాపించగలరు.
సాధారణముగా ఆటాలమ్మ రెండు వారములలో తగ్గిపోతుంది. వయోజనులలో జ్వరము , విరివిగా విస్ఫోటము కలిగి వ్యాధి ఎక్కువ దినాలుండవచ్చును. వయోజనులలోను, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారిలోను ఊపిరితిత్తుల తాపము ( Pneumonitis ) కలుగ వచ్చును.
గర్భిణీ స్త్రీలలో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉండవచ్చును. గర్భిణీ స్త్రీలకు వ్యాధి కలిగి పిండమునకు వ్యాధి సోకిన గర్భస్థశిశువు పెరుగుదలకు, అవయవ పరిణామమునకు అవరోధము కలిగి పుట్టుకతో
కొన్ని వ్యాధులు ( Congenital diseases) కలుగవచ్చును.
సాధారణముగా ఆటాలమ్మ ప్రమాదకరము కాదు గాని , వ్యాధినిరోధక శక్తి తగ్గిన వారిలో , వ్యాధి తీవ్రతరమయి చాలా అరుదుగా ( 50 వేల మంది వ్యాధిగ్రస్థులలో ఒకఱికి ) మరణము సంభవిస్తుంది.
పరీక్షలు :
వ్యాధిలక్షణములు, విస్ఫోటపు లక్షణములు, సమాజములో వ్యాధి ప్రాబల్యము బట్టి వైద్యులు
వ్యాధి నిర్ణయమును చేయగలరు. రక్తములో VZV కి ప్రతిరక్షకముల పరీక్ష చేసి సత్వర IgM ప్రతిరక్షకములను కనిపెట్టిన వ్యాధి నిర్ణయమైనట్లే . IgG ప్రతిరక్షకములు దీర్ఘకాలమునవి . అవి వ్యాధినిరోధకశక్తిని సూచిస్తాయి. పొక్కుల నుంచి సేకరించిన రసిని గాజుపలకపై పొరగా నెరిపి Tzanck వర్ణకముతో సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి వ్యాధిని నిర్ణయించవచ్చును. పొక్కుల రసినుంచి డి ఏన్ ఎ గుణకార చర్యతో ( DNA Polymerase chain reaction ) వైరస్ లను గుర్తించవచ్చును.
చికిత్స :
చాలా మందికి జ్వరము , వంట్లో నలత తగ్గించుటకు పారసిటమాల్, లేక ఎసిటెమైనోఫెన్లను వాడ వచ్చు. దురద ఎక్కువగా ఉంటే డైఫెన్ హైడ్రొమెన్ వంటి హిష్టమిన్ అవరోధకములను వాడవచ్చు.
పొక్కులను ప్రతిదినము గోరువెచ్చని నీటితో శుభ్రపరచి జింక్ ఆక్సైడు గల లేపనములను పూయవచ్చును.
పిల్లలలో ఎసైక్లొవీర్ ( Acyclovir ) వంటి విషజీవాంశ పత్యౌషధములు ( Antiviral medicines ) వ్యాధిపై ఫలితములను చూపవు. అందువలన ఒక మాసముపైన , 12 సంవత్సరములలోన వయస్సున్న వారికి వైరసు నదుపులో పెట్టు మందులను వాడరు.
వయోజనులలో వ్యాధి పొడచూపిన 48 గంటలలోపల వాడే ఎసైక్లొవీర్, వాల్ సైక్లొవీర్ వంటి మందులు వ్యాధి త్వరితముగా తగ్గుట కుపయోగపడుతాయి. గర్భిణీ స్త్రీలు, వ్యాధినిరోధక శక్తి కొఱవడినవారికి యీ మందులను త్వరగా మొదలుపెట్టుట మంచిది. వ్యాధి తీవ్రముగా నున్నవారికి , యితర చిక్కులు, సమస్యలు కలిగినవారికి ప్రతిరక్షకముల గ్లాబ్యులిన్ ( Varicella Zoster Immune Globulin - VZIG ను వాడుతారు.
వ్యాధినిరోధము : పిల్లలకు ఆటాలమ్మ టీకాలు వేయుట వలన అధిక సంఖ్యలో ( 80 శాతము మందిలో ) వ్యాధిని నిరోధించగలము. వ్యాధిగ్రస్థులను మిగిలిన వారికి దూరముగా నుంచుట వలన వ్యాధి వ్యాప్తిని అరికట్టగలము.
అగ్గిచప్పి , మేఖలిక విసర్పిణి ( Shingles, Herpes Zoster ) :
మేఖలిక విసర్పిణి, అగ్గిచప్పి సాధారణముగా పెద్దవారిలోను, వ్యాధి నిరోధకశక్తి కొఱవడినవారిలోను కనిపిస్తుంది. పిల్లలలోను తరుణవయస్కులలోను అరుదుగా కనిపిస్తుంది. అదివఱకు ఆటాలమ్మ కలిగిన వారిలో ఆ విషజీవాంశములు ( Viruses) శరీర రక్షకయంత్రాంగముచే తొలగించబడినా , కొన్ని
చర్మము నుంచి జ్ఞాననాడుల ద్వారా నాడీకణముల లోనికి ప్రవేశించి వానిలో నిద్రాణమై మసలవచ్చు.
వెన్నుపాము నుంచి వెలువడు నాడులకు పూర్వమూలము ( ముందఱ ఉండు anterior nerve root) , పరమూలము ( వెనుక నుండు posterior nerve root ) లుంటాయి. పూర్వమూలములో చలన నాడుల పోగు లుంటాయి. పరమూలముములలో జ్ఞాననాడుల పోగు లుంటాయి. పరమూలములలో నాడీకణములతో నాడీగ్రంథులు ( nerve root ganglions ) ఉంటాయి. ఆటాలమ్మ మేఖలిక విసర్పిణి విషజీవాంశములు ( Varicella Zoster Viruses ) యీ నాడీగ్రంథుల నాడీకణములలోను , ముఖ చర్మమునుంచి స్పర్శాది జ్ఞానములను సేకరించు త్రిశాఖనాడీ గ్రంథి ( Trigeminal nerve ganglion ) లోను నిక్షిప్తమై ఉండగలవు. శరీర వ్యాధి నిరోధకశక్తి వయస్సువలన , యితర వ్యాధుల వలన , ఔషధముల వలన, కర్కటవ్రణముల వలన తగ్గినపుడు , యీ విషాంశములు చైతన్యవంతమయి నాడీ కణములలో వృద్ధిచెందినచో అవి నాడీతంతువుల ద్వారా చర్మమునకు చేరి చర్మములో తాపమును కలిగించి మేఖలిక విసర్పిణిని ( అగ్గిచప్పి , Shingles , Herpes Zoster ) కలుగ జేస్తాయి.
మేఖలిక విసర్పిణి లక్షణములు :
మేఖలిక విసర్పిణి పొడచూపే ముందు శరీరములో నలత , జ్వరము , తలనొప్పి కలుగవచ్చు. కొద్ది దినములకు ముందు ప్రభావిత భాగములో తిమ్మిరి, మంట, సలుపు, పీకుట, నొప్పి కలుగ వచ్చును.
ఛాతి ప్రభావితమైనపుడు ఛాతినొప్పి , ఉదరభాగము ప్రభావితమయితే కడుపునొప్పి కలుగవచ్చును.
ఈ బాధ కలిగిన రెండు మూడు దినములు లేక కొద్ది వారముల పిదప ప్రభావిత ప్రాంతములో
విస్ఫోటము ( rash ) కనిపిస్తుంది. ఈ విస్ఫోటము ఆరంభదశలో గులాబిరంగు లేక ఎఱుపు వర్ణములలో
దద్దుర్లు వలె కనిపిస్తుంది. ఈ విస్ఫోటము సర్వసాధారణముగా శరీరములో ఒక ప్రక్క ప్రభావిత నాడి పాలిత చర్మవిభాగమునకు ( Dermatome ) పరిమితమై ఉంటుంది. ఈ విస్ఫోటము శరీరపు మధ్యరేఖను అతిక్రమించదు. శరీరపు వ్యాధినిరోధక శక్తి విశేషముగా క్షీణించిన వారిలో ఈ వ్యాధి తీవ్రమయి విశేషవ్యాప్తి చెందవచ్చును.
తొలుత దద్దుర్లుగా ఉండి తర్వాత నీటిపొక్కులు ఏర్పడి, ఆ పిమ్మట నల్లబడి , పెచ్చులు కట్టి, తర్వాత పెచ్చులు రాలిపోతాయి. అరుదుగా పుళ్ళు కలిగి , మచ్చలు కూడా కట్ట వచ్చును. రెండు , నాలుగు వారములలో విస్ఫోటము మానిపోతుంది. కొంతమందిలో నెలలు లేక కొద్ది సంవత్సరముల పాటు
నరాల సలుపు ( Post herpetic neuralgia ) బాధించవచ్చును.
ముఖములో మేఖలీ విసర్పిణి :
త్రిశాఖనాడి ( Trigeminal nerve ) లో నేత్రనాడి ( Opthalmic nerve ), హనువునాడి ( Maxillary nerve ), అధోహనువు నాడి ( Mandibular nerve ) అని మూడు శాఖలు ఉంటాయి. ఈ మూడు శాఖలలో నేత్రనాడి అగ్గిచప్పికి తఱచుగా లోనవుతుంది.
నేత్రప్రాంతములో మేఖలిక విసర్పిణి కలుగుతే నుదుటి ప్రాంతములోను, కనరెప్పలపైనా ఎఱ్ఱదనము, వాపు, విస్ఫోటము పొడచూపుతాయి . కంటి పైపొర తాపము వలన కండ్లకలక ( Conjunctivitis ) ; స్వచ్ఛపటల తాపము ( Keratitis ) , కృష్ణపటల తాపము ( Uveitis ), చక్షునాడి వాతములు ( Optic nerve palsies) వలన కంటిలో సలుపు , నీరు కారుట, నుదుటి ప్రాంతములో ఒకపక్క తలనొప్పి, దృష్టిలోపములు, అంధత్వము కూడా కలుగవచ్చును.
హనువునాడి( maxillary nerve ) ప్రభావితమైతే నోటిలో పైదవుడ, అంగుడు, పైదంతపు టిగుళ్ళలో చిన్న పొక్కులు, పుళ్ళు , పైదవుడ చర్మముపై విస్ఫోటము పొడచూపుతాయి.
అధోహనువు నాడి ( mandibular nerve ) ప్రభావితమైతే నోటిలో క్రింది దవుడ, నాలుక, క్రింది దవుడ యిగుళ్ళలో పొక్కులు , పుళ్ళు కలుగుతాయి. క్రింది దవుడ చర్మముపై విస్ఫోటము పొడచూపవచ్చును.
నోటిలో అగ్గిచప్పి వలన పొక్కులు పుళ్ళు ఏర్పడితే అవి ఒక ప్రక్కనే ఉండుట వలన వ్యాధిని వైద్యులు పసిగడుతారు. నోటిలో మేఖలిక విసర్పిణి కలుగుతే నాడులతో బాటు రక్తనాళములు తాపప్రభావమునకు లోనయితే దంతపు వ్యాధులు, యిగుళ్ళవ్యాధులు , దంతనష్టము, దౌడ యెముకలలో నిర్జీవత
( osteonecrosis ) , ఎముకల విచ్ఛిన్నము సంభవించవచ్చును.
వ్యాధినిర్ణయము ;
విస్ఫోటము దేహములో ఒక ప్రక్కకు ఒక నాడీపాలిత చర్మభాగమునకు ( Dermatome ) ఒక పట్టీ వలె పరిమితమయి మేఖలిక విస్ఫోటమును సూచిస్తాయి. ఈ వ్యాధిలో సలుపు , మంట , నొప్పి ఎక్కువగా ఉండి దురద పాలు తక్కువయి అగ్గిచప్పిని సూచిస్తాయి. పొక్కుల రసితో డి.ఎన్.ఎ గుణకార చర్య
( Polymerase Chain Reaction ) తో విషజీవాంశములను కనుగొనవచ్చును. రసిని గాజుపలకపై నెరపి Tzanck వర్ణపు పరీక్ష తో వ్యాధి ధృవీకరణ చేయవచ్చును. రక్తపరీక్షలలో VZV కి IgM ప్రతిరక్షకములను కనుగొని వ్యాధిని నిర్ణయించవచ్చును.
చికిత్స :
విస్ఫోటమునకు జింక్ ఆక్సైడు పూతలు కొంత ఉపశమనము కలిగిస్తాయి. నొప్పికి ఎసిటెమైనోఫెన్ , పారసిటమాల్ లు వాడవచ్చును. కొందఱికి కొడీన్ , హైడ్రోకొడీన్ , నల్లమందు ( Opium ) వంటి మత్తునిచ్చే నొప్పిమందు లవసరము పడవచ్చును. లైడొకేన్ వంటి మందులతో తాత్కాలికముగా స్పర్శను, వ్యధను ఆయా ప్రాంతములలో అరికట్టవచ్చును.
విషజీవాంశ ప్రత్యౌషధములు ( Antiviral medicines ) :
VZV పై పనిచేసే ఎసైక్లొవీర్ ( Acyclovir) ,వాలసైక్లొవీర్ ( Valacyclovir ), ఫామ్ సైక్లొవీర్ ( famciclovir ) లలో ఏ మందైనా వ్యాధి లక్షణములు పొడచూపిన 48- 72 గంటలలో మొదలుపెడితే వ్యాధి తీవ్రతను, వ్యాధి కాలపరిమితిని తగ్గించగలుగుతాము. ఎసైక్లొవీర్ దినమునకు ఐదు పర్యాయములు వాడాలి. వాల సైక్లొవీర్, ఫామ్ సైక్లొవీర్ లను దినమునకు మూడు పర్యాయములు వాడాలి. వ్యాధి తీవ్రత హెచ్చుగా నున్నవారిలోను , యితర సమస్యలు కలిగినపుడు సిరల ద్వారా వాడుటకు ఎసైక్లొవీర్ లభ్యము.
అగ్గిచప్పి తరువాత కలిగే నాడీవ్యథకు ( Post herpetic neuralgia ) గాబాపెంటిన్ ( Gabapentin ) ,
ప్రీ గాబలిన్ ( Pregabalin ) లను , నొప్పి మందులను వాడవచ్చు.
వ్యాధినివారణ : అగ్గిచప్పికి టీకాలు లభ్యము. ఇవి వ్యాధిని చాలా శాతపు మందిలో నివారిస్తాయి. టీకాలు తీసుకొన్న వారిలో వ్యాధి పొడచూపినా వ్యాధి తీవ్రత పరిమితముగా ఉంటుంది.
( ఉపయుక్తమనుకుంటే యథేచ్ఛగా పంచుకొనండి )
వద్ద జులై 18, 2018 కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: వైద్యం, general knowledge, Info, Medical, Telugu. ఆరోగ్యం

18, జూన్ 2018, సోమవారం

గళగ్రంథి ఆధిక్యత ( Hyperthyroidism)

డా. గన్నవరపు నరసింహమూర్తి .

      గళగ్రంథి  ( Thyroid ) కంఠము ముందర స్వరపేటిక శ్వాసనాళముల నానుకొని సీతాకోకచిలుక ఆకారములో ఉంటుంది. ఈ గ్రంథికి కర్ణికలు ( lobes ) రెండుప్రక్కలా ఉండి ఆ రెండు కర్ణికలను కలుపుతూ నడిమిన సంధానము. (Isthmus ) ఉంటుంది. వయోజనులలో యీ గళగ్రంథికర్ణిక పరిమాణము 5 సె.మీ ఎత్తు, 3 సె.మీ ,వెడల్పు 2 సె.మీ మందము గలిగి ఉంటుంది. గళగ్రంథి స్రావకములు , థైరాక్సిన్ ( Thyroxine , T-4), ట్రై అయిడో థైరొనిన్ ( Triidothyronine , T-3 ) , కణజాలములలో జీవవ్యాపార క్రియకు ( metabolism ) దోహదకారిగా ఉంటాయి. శిశువుల వృద్ధికి, మనోవికాసమునకు కూడా థైరాక్సిన్ తోడ్పడుతుంది. జంతుజాలములో విశ్రాంత జీవవ్యాపార 
ప్రమాణము ( Basal metabolic rate ) గళగ్రంథి స్రావకములపై ఆధారపడి ఉంటుంది.

గళగ్రంథి స్రావకముల ఉత్పత్తి పెరుగుతే గళగ్రంథి ఆధిక్యత ( Hyperthyroidism ) కలిగి ఆ అతిశయ లక్షణాలు పొడచూపుతాయి.

గళగ్రంథి స్రావకాధిక్యత లక్షణాలు :

      గళగ్రంధి స్రావకములు అధికమయినప్పుడు జీవవ్యాపార ప్రక్రియ పెరుగుటయే కాక, వాటి ప్రభావము వలన సహవేదన నాడీమండలము  ( Sympathetic nervous system ) ప్రేరేపించబడి ఆ లక్షణములు కూడా అధికమవుతాయి.    నీరసము, శరీరపు బరువు తగ్గుట, ఆకలి పెరుగుట,  గుండెదడ, గుండె వేగము పెరుగుట,  మానసిక ఆందోళన, గాభరా, చిరాకు, హస్త కంపనములు
( tremors ), ఎక్కువ చెమట పట్టుట,  కండరముల సత్తువ తగ్గుట , విరేచనములు, నిద్ర పట్టకపోవుట, ఉష్ణమును తట్టుకోలేకపోవుట, స్రీలలో ఋతుస్రావము మందగించుట
( Oligomenorrhea ) పొడచూపుతాయి. వృద్ధులలో హృదయ కర్ణిక కంపనము( Atrial fibrillation), హృదయవైఫల్యము వలన శరీరము నీరుపట్టుట ( Congestive heart failure) కలుగ వచ్చును. చర్మము సన్నబడుట, పెళసరి వెండ్రుకలు , కేశనష్టము , కనుబొమలు సన్నబడుట , జ్ఞాపకశక్తి తగ్గుట, ఎముకలు బలహీనమగుట ( Osteoporosis ) మరికొన్ని లక్షణములు. మతిభ్రమణము అరుదుగా కొందఱిలో కలుగుతుంది. చేతుల వణకుతో బాటు కొందఱిలో అనిచ్ఛా చలనములు ( Chorea ) కూడా పొడచూపవచ్చును.

  నేత్రగోళ కండరముల నీరసము కలిగి  నేత్రములలో సహకార చలనము లోపించుట వలన ఒక వస్తువు రెండుగా ( Diplopia ) కనిపించవచ్చును. పై కనురెప్పలు వెనుకకెక్కువగా సంకోచమయి ( Lid retraction ) కళ్ళ మీది తెలుపు ( శ్వేతపటలము Sclera )  గోచరమవుతుంది. క్రింది వస్తువులపై దృష్టి సారించినపుడు కనుగుడ్లుతో సమముగా కనురెప్పలు క్రిందకు కదలక ( Lid lag ) కళ్ళమీది శ్వేతభాగము తాత్కాలికముగా ఎక్కువగా కనిపించవచ్చును . 

గళగ్రంథి ఆధిక్యత పరిమితముగా ఉన్నపుడు కొందఱిలో ఏ లక్షణములు కనిపించక పోవచ్చును. 

   అరుదుగా శరీరము సూక్ష్మాంగజీవుల ముట్టడికి గురైనపుడు  గళగ్రంథిసంక్షోభము ( Thyroid storm) కలిగి, అధికోష్ణోగ్రత, మానసిక సంభ్రమము , గందరగోళము, సన్నిపాతము ( Delirium) కలిగి మృత్యువునకు దారితీయవచ్చును.

           గ్రేవ్స్ సదృశగళగండ స్రావకోద్రేకత ( Diffuse toxic goiter from Grave’s disease ) కలిగిన వారిలో గళగండస్రావకాధిక్యత ( Hyperthyroidism) తో బాటు వెలిగుడ్లు (Exopthalmos  ) నేత్ర కండరముల నీరసము ( extraocular muscle weakness , జంఘికాస్థుల ముందు ఉబ్బుదల 
( pretibial myxedema ) కూడా కలుగుతాయి.

        గళగ్రంథి ఆధిక్యత కలిగిన వారిలో Myasthenia gravis అనే కండరముల నీరసవ్యాధి అధికశాతములో కలిగే అవకాశములున్నాయి. 

గళగ్రంథి స్రావకాధిక్యతకు కారణములు : 

    గళగ్రంథి ప్రమాణము వివిధ కారణముల వలన పెరిగి కంఠము ముందు గళగండముగా ( Goiter ) పొడచూపవచ్చును. గళగ్రంథి సమతులితముగా పెరుగుతే దానిని  సమగళగండము లేక సదృశగళగండముగా   ( Diffuse goiter) పరిగణించవచ్చును. 
  అసమానముగా కణుతులు పెరిగి  బహుళ కిణ గళగండములు( Multinodular goiters ) కొందఱిలో పొడచూపుతాయి. నిరపాయపు పెరుగుదలలు ( Adenomas )కొందఱిలో కలిగి ఒక కర్ణిక లోనే గళగండము పొడచూప వచ్చును.

 వీరిలో ప్రమాణపు పెరుగుదలతో పాటు స్రావకముల ఉత్పత్తి పెరిగినపుడు గళగ్రంథిస్రావకాధిక్యత లక్షణములు కలుగుతాయి.

               గళగ్రంథి తాపముల ( Thyroiditis ) వలన తాత్కాలికముగా గళగ్రంథి స్రావకముల ఉత్పత్తి పెరుగవచ్చును. అయొడిన్ వినియోగము ఎక్కువైనా, గళగ్రంథి స్రావకముల వినియోగ మెక్కువయినా 
 ( Iatrogenic) గళగ్రంధి స్రావకాధిక్యత కలుగ గలదు. ఎమయోడరోన్ ( Amiodarone ) , అయొడిన్ వ్యత్యాస పదార్థాల ( Iodine radiocontrast materials ) వాడుక వలన గళగ్రంథి ఆధిక్యత కలుగ వచ్చును.
          ప్రసవానంతరము కొందఱిలో ( 6 లేక 7 శాతపు స్త్రీలలో ) గళగ్రంథి ఆధిక్యత కలిగి (Postpartum hyperthyroidism ) కొద్ది వారములలో సామాన్యస్థితి చేకూరుతుంది. అండకోశములలో గాని యితరత్రా గాని గళగ్రంథి కణజాలముతో పెరుగుదలలు  ( Struma ovarii ) ఏర్పడి అవి స్రావకముల నుత్పత్తి చేయుట వలన కూడా గళగ్రంథి ఆధిక్యత సంభవించ వచ్చును.
    పీనసగ్రంథి పెరుగుదలలతో ( Pituitary adenomas ), గళగ్రంథి ప్రేరేపక  ( TSH ) ప్రమాణము హెచ్చయి గళగ్రంథి ఆధిక్యత అరుదుగా  కలుగవచ్చు. 

  గ్రేవ్స్ సమగళగండ స్రావకోద్రేకత ( Grave’s disease ) :

  ఇది స్వయంప్రహరణ వ్యాధి( Autoimmune disease ). ఈ వ్యాధికి గురైన వారిలో థైరాయిడ్ ప్రేరేపక ఇమ్యునోగ్లాబ్యులిన్  ప్రతిరక్షకములు (Thyroid Stimulating immunoglobulin antibodies  ఉత్పత్తి అవుతాయి . ఈ ప్రతిరక్షకములు ( Antibodies ) గళగ్రంథి ప్రేరేపక గ్రాహకముల ( TSH receptors ) తో సంధానమయి ఆ గ్రాహకములను ప్రేరేపించుట వలన  గళగ్రంథి ప్రమాణము సమతులితముగా పెరుగుతుంది . గళగ్రంథి స్రావకముల ఉత్పత్తి కూడా పెరుగుతుంది.   రక్తములో గళగ్రంథి స్రావకముల ప్రమాణము పెరుగుటచే పీనసగ్రంథి ( Pituitary gland) నుంచి గళగ్రంథి ప్రేరేపక  స్రావము  ( Thyroid Stimulating Hormone) ఉత్పత్తి, హైపోథలమస్ నుంచి గళగ్రంథి ప్రేరేపక విమోచిని ( Thyrotropin Releasing Hormone ) విడుదల తగ్గుతాయి. 

Grave’s disease కలుగుటకు కారణాలు స్పష్టముగా తెలియవు.జన్యు కారణములు, పరిసరముల ప్రభావము యీ వ్యాధికి దారితీయవచ్చును. ఈ వ్యాధి కొన్ని కుటుంబాలలో ఎక్కువగా కనిపిస్తుంది. కవలపిల్లలలో ఒకరికి యీ వ్యాధి కలుగుతే రెండవ వారిలో కలుగుటకు ముప్పది శాతపు అవకాశా లుంటాయి. ఇతర స్వయంప్రహరణ వ్యాధులు (  మొదటి తరగతి మధుమేహ వ్యాధి ( Type 1- Diabetes ), రుమటాయిడ్ కీళ్ళనొప్పులు ( Rheumatoid arthritis )  వంటివి ) ఉన్నవారిలో సమగళగండము ( Diffuse goiter), గళగండ స్రావకాధిక్యత ఎక్కువగా పొడచూపుతాయి.

  గ్రేవ్స్ సమగళగండ స్రావకోద్రేకత (  Grave’s disease ) కలిగిన వారిలో గళగండస్రావకాధిక్యతతో
 ( Hyperthyroidism) బాటు వెలిగుడ్లు (Exophthalmos ) , నేత్ర వైకల్యము ( opthalmopathy ) , జంఘికాస్థుల ముందు ఉబ్బుదలలు ( pretibial myxedema ) కూడా కలుగుతాయి.

పరీక్షలు : 

 గళగ్రంథి ఆధిక్యత ఉన్నవారిలో గళగ్రంథి ప్రేరేపకస్రావపు ( TSH ) విలువలు రక్తములో తక్కువగా ఉంటాయి. గళగ్రంథి స్రావకపు విలువలు ( T-4, T-3 ) ఎక్కువగా ఉంటాయి. Grave’s disease ఉన్నవారిలో గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములకు ప్రతిరక్షకములను ( Antibodies to TSH receptors ) రక్తపరీక్షలతో కనుగొన వచ్చును. రేడియోధార్మిక అయొడిన్  I-131 లేక,  I -123 నియమిత మోతాదులో యిచ్చి గళగ్రంథిలో వాటి గ్రాహకమును ( Uptake ) కొలిచి గళగ్రంథి చైతన్యమును నిర్ధారించవచ్చును. గామా ఛాయాగ్రాహకములతో గళగ్రంథి చిత్రములను  తీసుకొని గళగ్రంథిలో చైతన్యకేంద్రములను పసిగట్టవచ్చును. 

గళగ్రంథి ఆధిక్యత కలిగిన వారిలో రక్తములో చక్కెర విలువలు అధికమవవచ్చును. వీరిలో కొలెష్టరాలు విలువలు తక్కువగా ఉండవచ్చును.

చికిత్స : 

  గళగ్రంథి స్రావక ప్రభావము వలన వచ్చే లక్షణముల నదుపులో పెట్టుటకు, నిర్దిష్ట చికిత్స జరిగే వఱకు తాత్కాలిక ఉపశమనము కొఱకు బీటా ఎడ్రినెర్జిక్ రిసెప్టార్ బ్లాకరులను  ( ప్రొప్రనలాల్ , మెటాప్రొలోల్, లేక, ఎటినలాల్  ) వాడుతారు. ఇవి సహవేదన నాడీమండల ఉధృతి వలన వచ్చే గుండెదడ, ఆందోళన, హస్తకంపనములు, రక్తపుపోటు వంటి ఫలితములను అదుపులో ఉంచుటకు తోడ్పడుతాయి. 

   తాత్కాలికముగా గళగ్రంథి ఉధృతి హెచ్చినపుడు కూడా బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహకావరోధములు ఉపయోగపడుతాయి.

బీటా ఎడ్రినెర్జిక్ రిసెప్టర్ బ్లాకరులను ఉపయోగించ లేని పరిస్థితులలో ( ఉబ్బసవ్యాధి వంటి వ్యాధులున్నవారిలో ) , వెరాపమిల్ ( Verapamil ) వంటి కాల్సియమ్ ఛానెల్ బ్లాకరులను ఉపయోగించ వచ్చును .

నిర్దిష్ట చికిత్సకు మూడుమార్గములున్నాయి.

రేడియోధార్మిక అయొడిన్ ( Radioactive Iodine) :

      దేహము గ్రహించే అయొడిన్ లో హెచ్చు భాగము గళగ్రంథిలో చైతన్యకేంద్రాలకు చేరుతుంది. రేడియోధార్మిక అయొడిన్ చికిత్సకు వాడినపుడది గళగ్రంథిలో సాంద్రమయి గళగ్రంథి విధ్వంసమునకు దారితీస్తుంది. గ్రేవ్స్ వ్యాధి ఉన్నవారికి రేడియో ధార్మిక అయోడిన్ చికిత్స  ఉత్తమము. 
   బహుళకిణ గళగండము ( Multinodular goiter), గళగండ పెరుగుదలలు ( Adenomas ) లో   గళగ్రంథి స్రావకము లుధృతమైనపుడు కూడ రేడియో ధార్మిక అయొడిన్ ని ఉపయోగిస్తారు. గర్భిణీ స్త్రీలలో రేడియోధార్మిక అయొడిన్ వాడకూడదు.

     రేడియోధార్మిక అయొడిన్ చికిత్సకు ముందు  థయోనమైడులు ( Thionamides ), అయొడిన్ ల వాడుక ఆపివేయాలి. రేడియో ధార్మిక అయొడిన్ గ్రాహక ( Radioactive Iodine uptake) పరీక్షతో అవసరమైన మోతాదును నిశ్చయించి యిస్తారు. నెలకొక సారి  రక్తములో గళగ్రంథిస్రావకము 
T-4 ( థైరాక్సిన్ ) , TSH ల పరీక్షలు చేస్తూ గళగ్రంథి హీనత ( Hypothyroidism ) కలిగిన యెడల 
కృత్రిమ గళగ్రంథి స్రావక ( Levothyroxine ) చికిత్స మొదలు పెట్టాలి.

 రేడియోధార్మిక అయొడిన్ చికిత్స వలన చాలా మందిలో గళగ్రంథి పూర్తిగా విధ్వంసమయి గళగ్రంథి హీనత కలుగుతుంది. 

         రేడియోధార్మిక అయొడిన్ చికిత్స వలన కొందఱిలో గళగ్రంథిలో నిక్షేపమయిన స్రావకములు విడుదలయి తాత్కాలికముగా రెండువారములు పాటు వాటి ఉద్రిక్తత హెచ్చుకావచ్చును.  హృద్రోగమున్న వారికి  ఆ ఉద్రిక్తతను తగ్గించుటకు. తాత్కాలికముగా ధయోనమైడులతో చికిత్స అవసరమవవచ్చును.

     రేడియోధార్మిక అయొడిన్ చికిత్స వలన కర్కటవ్రణములు ( Malignancy) కలుగవు. చికిత్స తదనంతరము గర్భము దాల్చిన స్త్రీల శిశువులకు చికిత్స వలన జన్మతః వ్యాధులు ( Congenital diseases ) సంక్రమించవు.

థయోనమైడులు ( Thionamides ):

    థయోనమైడులు గళగ్రంథిలో  థైరోగ్లాబ్యులిన్ తో  అయొడిన్ సంధానమును నిరోధించి గళగ్రంథి స్రావకముల ఉత్పత్తిని ఆటంకపరుస్తాయి . ప్రొపైల్ థయోయురసిల్  థైరాక్సిన్( Thyroxine ) ట్రైఅయిడో థైరొనిన్ ( T-3 ) గా మారుటను కూడా నిరోధిస్తుంది . గర్భిణీ స్త్రీలలోను, గళగ్రంథి తాపము, అయొడిన్ వినియోగమెక్కువయి, ఎమయోడరోన్ వంటి మందుల వలన గళగ్రంథి స్రావకాధిక్యత కలిగి నప్పుడు, రేడయోధార్మిక అయొడిన్ వాడుక కిష్టపడని వారిలోను , థయోనమైడుల నుపయోగిస్తారు. కార్బిమజాల్
( Carbimazole ) , మిథైమజాల్ ( Methimazole ), ప్రొపైల్ థయోయురసిల్ ( Propylthiouracil ) థయోనమైడుల కుదహరణములు. వీటి ప్రభావము కనిపించుటకు కొద్ది వారములు పడుతుంది. ముందు హెచ్చు మోతాదులలో వాడినా తరువాత వీటి మోతాదును రక్తపరీక్షల బట్టి తగ్గించాలి. 
దద్దురులు, చర్మతాపము ( Dermatitis) , కీళ్ళనొప్పులు,జ్వరము , కాలేయతాపము ( Hepatitis), తెల్లకణముల ఉత్పత్తి తగ్గుట వంటి అనిచ్ఛా ఫలితములను జాగ్రత్తగా గమనించాలి. పచ్చకామెరలు, గొంతునొప్పి , చలి జ్వరము కలుగుతే వెంటనే థయోనమైడుల నాపివేసి రక్తపరీక్షలు చెయ్యాలి. ఈ మందుల వాడుక నాపివేస్తే అనిచ్ఛా ఫలితములు  సాధారణముగా ఉపశమిస్తాయి. అనిచ్ఛా ఫలితముల గురించి రోగులకు అవగాహన సమకూర్చాలి.

 గళగ్రంథి విచ్ఛేదన  (Thyroidectomy ):

  గళగ్రంథి కర్ణికలలో హెచ్చు భాగములను శస్త్రచికిత్సతో తొలగించుటచే ( Subtotal thyroidectomy ) గళగ్రంథి ఆధిక్యతను అరికట్టవచ్చును. ఈ దినములలో శస్త్రచికిత్సను అరుదుగా చేస్తారు. రేడియోధార్మిక అయొడిన్ చికిత్స కిష్టపడనివారికి, థయోనమైడుల వలన గళగ్రంథి స్రావకోధృతి అదుపు కాని వారికి, థయోనమైడుల వలన అనిచ్ఛా ఫలితములు కలిగిన వారికి శస్త్రచికిత్స అవసరమవుతుంది. శస్త్రచికిత్సకు ముందు థయోనమైడులతో గళగ్రంథి స్రావకాధిక్యతను తగ్గించాలి. వీరికి శస్త్రచికిత్సకు ముందు రెండువారములు అయొడిన్ చికిత్స అవసరము. బీటా ఎడ్రినెర్జిక్ రిసెప్టార్ బ్లాకరుల చికిత్స కూడా అవసరము. శస్త్రచికిత్స తదుపరి కొద్ది వారములు యీ చికిత్సలు కొన సాగించాలి. 

      శస్త్రచికిత్సలో సహగళగ్రంథులు ( Parathyroid glands ) తొలగించబడుతే సహగళగ్రంథిహీనత
 ( Hypoparathyroidism ) కలిగే అవకాశమున్నది.  స్వరతంత్రి నాడులకు ( Recurrent laryngeal nerves ) హాని కలుగుతే స్వరతంత్రుల వాతము ( Vocal chord paralysis) సంభవించ వచ్చును. అందువలన బొంగురు గొంతు , రెండు ప్రక్కల నాడులకు హాని కలుగతే శ్వాస కిబ్బంది కలుగుతాయి.  శస్త్రచికిత్స పిమ్మట గళగ్రంథిహీనత కలుగుతే కృత్రిమ స్రావకములతో  ( Levothyroxine ) చికిత్స అవసరము. 

    బహుళకిణ గళగండములు  ( Multinodular goiters ) ఉన్నవారిలో గళగ్రంథి స్రావకముల పరిమాణము సాధారణ పరిమితులలో ఉన్నపుడు , ఏ యితర యిబ్బందులు లేనప్పుడు శస్త్రచికిత్సలు విపరీత పరిశోధనలు అనవసరము. ఒకే ఒక కిణము ( Solitary nodule ) పొడచూపినప్పుడు సూది , పిచికారులతో  కణములను పీల్చి  కర్కటవ్రణములకై కణపరీక్షలు సలుపవచ్చును. కణపరీక్షలు సక్రమముగా ఉంటే యితర చికిత్సలు అనవసరము.

వద్ద జూన్ 18, 2018 కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

11, జూన్ 2018, సోమవారం

గళగ్రంథిహీనత ( Hypothyroidism )

తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో:
గళగ్రంథిహీనత ( Hypothyroidism )
డా. గన్నవరపు నరసింహమూర్తి.
నిత్యజీవన ప్రక్రియకు గళగ్రంథి స్రావములు ( Thyroid hormones ) ఎంతగానో అవసరము. ఈ కంఠగ్రంథి ( Thyroid gland ) కంఠము ముందర స్వరపేటిక శ్వాసనాళముల నానుకొని సీతాకోకచిలుక ఆకారములో ఉంటుంది. ఈ గ్రంథికి కర్ణికలు ( Lobes ) రెండుప్రక్కలా ఉండి ఆ రెండు కర్ణికలను కలుపుతూ నడిమిన సంధానము. ( Isthmus) ఉంటుంది. వయోజనులలో యీ గళగ్రంథికర్ణిక పరిమాణము 5 సె.మీ ఎత్తు, 3 సె.మీ ,వెడల్పు 2 సె.మీ మందము గలిగి ఉంటుంది. గళగ్రంథి స్రావములు థైరాక్సిన్ ( Thyroxin T-4 ), ట్రై అయిడో థైరొనిన్ ( Triiodothyronine, T-3 ) , కణజాలములలో జీవవ్యాపార క్రియకు ( Body metabolism ) దోహదకారిగా ఉంటాయి. శిశువుల వృద్ధికి, మనోవికాసమునకు కూడా థైరాక్సిన్ తోడ్పడుతుంది. జంతుజాలములో విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము ( Basal metabolic rate ) గళగ్రంథి స్రావకములపై ఆధారపడి ఉంటుంది.
గళగ్రంథినుంచి అధికముగా థైరాక్సిన్ ( సుమారు 80 శాతము ) ఉత్పత్తి జరుగుతుంది.
ట్రై అయిడో థైరొనిన్ సుమారు 20 శాతము ఉత్పత్తి జరుగుతుంది. కాని కణజాలములో ట్రైఅయిడోథైరొనిన్ కు మాత్రమే చైతన్యము ఉంటుంది. అధికముగ థైరాక్సిన్ ఉత్పత్తి అయినా కాలేయములో ఒక అయొడిన్ అయము తొలగించబడి థైరాక్సిన్ ( T4 ) టైఅయిడో థైరొనిన్( T3 )
గా మార్పుజెందుతుంది.
గళగ్రంథి స్రావకములు, థైరాక్సిన్ ( T4 ) అణువులో నాలుగు అయొడిన్ పరమాణువులు, ట్రైఅయిడో థైరొనిన్ ( T3 )లో మూడు అయొడిన్ పరమాణువులు ఉంటాయి.
గళగ్రంథి స్రావకముల ఉత్పత్తిని, రక్తములో వాటి విడుదలను పీనస గ్రంధి ( Pituitary gland ) నుంచి విడుదల అయే గళగ్రంథి ప్రేరేపకము ( Thyroid stimulating hormone ; Thyrotropin ) నియంత్రిస్తుంది.
గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విడుదలను మెదడు క్రింది భాగములో ఉండే హైపోథలమస్
( Hypothalamus) గళగ్రంథి ప్రేరేపక విమోచిని ( Thyrotropin releasing hormone) ద్వారా నియంత్రిస్తుంది.
రక్తములో గళగ్రంథి స్రావకముల ( Thyroid hormones) ప్రమాణము పెరిగినప్పుడు, పీనసగ్రంథి
( Pituitary gland ) నుంచి గళగ్రంథిప్రేరేపకపు ( TSH ) విడుదల తగ్గుతుంది.
గళగ్రంథి స్రావకముల ( T3, T4 ) ప్రమాణము తగ్గినపుడు గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విడుదల హెచ్చవుతుంది.
ఆ విధముగా గళగ్రంథి ప్రేరేపకపు విడుదల రక్త ప్రసరణములో ఉండే గళగ్రంథి స్రావకముల ప్రతివర్తమానము ( Feed back) పై ఆధారపడి ఉంటుంది.
రక్తములో గళగ్రంథి ప్రేరేపకపు ( TSH )విలువ హెచ్చుగా ఉంటే అది గళగ్రంథి హీనతను
( Hypothyroidism ) సూచిస్తుంది. గళగ్రంథి చైతన్యము హెచ్చయి ( Hyperthyroidism) గళగ్రంథి స్రావకముల రక్తప్రమాణాలు హెచ్చయితే గళగ్రంథి ప్రేరేపకపు ( TSH )విలువలు తక్కువగా ఉంటాయి.
శరీరపు పెరుగుదల ఎక్కువగా ఉన్నపుడు శరీరావసరాలకు తగినట్లు పీనసగ్రంథి నుంచి గళగ్రంథి ప్రేరేపకపు విడుదల అధికమవుతుంది.
గళగ్రంథి స్రావములు థైరాక్సిన్ ( T4 ) , ట్రైఅయిడో థైరొనిన్( T3 ) లు రక్తములో థైరాక్సిన్ బైండింగ్ గ్లాబ్యులిన్ ( TBG ) అనే మాంసకృత్తుకి అంటుకొని రవాణా చేయబడుతాయి. కొంత భాగము మాత్రము స్వేచ్ఛగా ఉంటాయి.
గళగ్రంథిలో నాలుగణువులు అయొడిన్ గల థైరాక్సిన్ ( T4 ) నుంచి ఒక అణువు అయోడిన్ తొలగించబడి మూడణువుల ట్రైఅయుడో థైరొనిన్ ( T3 ) కొంత విడుదల అయినా 80 శాతపు థైరాక్సిన్ గళగ్రంథి నుంచి విడుదల అవుతుంది. కాలేయములో ( Liver ) యీ థైరాక్సిన్ మరల ట్రైఅయుడో థైరొనిన్ గా మార్పు జెందుతుంటుంది. కణజాలములో ట్రైఅయుడో థైరొనిన్ ( T3 ) కే చైతన్యత ఉంటుంది.
కణజాలములో జరిగే జీవప్రక్రియ ( Metabolism ) లన్నిటికీ గళగ్రంథి స్రావకము లవసరము. విశ్రాంత జీవప్రక్రియ ప్రమాణము ( Basal metabolic rate ) శరీరములో నున్న గళగ్రంథి ప్రభావమును సూచిస్తుంది. కణజాలముల వృద్ధికి, పరిపక్వతకు, పెరుగుదలకు గళగ్రంథి స్రవము లవసరము. వివిధ మాంసకృత్తుల సంకలనమునకు , పిండిపదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తుల జీవన ప్రక్రియలకు, శరీరములో ఉష్ణజనితమునకు గళగ్రంథి స్రవము లవసరము.
గళగ్రంథి హీనత ( Hypothyroidism :
గళగ్రంథి శరీర అవసరాలకు తగినంత స్రవముల నందించ లేనప్పుడు గళగ్రంథి హీనత
( Hypothyroidism) సంభవిస్తుంది. హెచ్చుశాతము మందిలో యీ లోపము గళగ్రంథుల లోపమే. గళగ్రంథి తగినంతగా నిర్నాళ రసములను ( Hormones) ఉత్పత్తి చేయక పోవుట వలన యీ లోపము కలుగుతుంది. గళగ్రంథుల లోపమే ప్రాథమిక కారణమయితే దానిని ప్రాథమిక గళగ్రంథి హీనతగా
( Primary Hypothyroidism) పరిగణిస్తారు. శరీరములో అయొడిన్ లోపము వలన ప్రపంచములో హెచ్చుమందికీ గళగ్రంథి హీనత కలుగుతుంది. పాశ్చాత్య దేశాలలో ఉప్పునకు అయొడిన్ ను సంధానపఱచుట వలన ప్రజలలో అయొడిన్ లోపము అఱుదు.
హషిమోటో గళగ్రంథి తాపము ( Hashimoto ‘s thyroiditis ):
గళగ్రంథి స్వయం ప్రహరణ వ్యాధి ( Autoimmune thyroiditis ) వలన గళగ్రంథి ధ్వంసము చెంది గళగ్రంథి హీనత కలుగవచ్చు. ఈ వ్యాథిలో టి లింఫుకణములు ( T Lymphocytes ; ఇవి శరీర రక్షక వ్యవస్థలో ఒక భాగము. ) గ్రంథుల నాక్రమిస్తాయి. థైరోగ్లాబ్యులిన్ ( గళగ్రంథులలో ఉండే మాంసకృత్తి. దీని నుంచి గళగ్రంథి స్రావకములు ఉత్పత్తి అవుతాయి ) , థైరాయిడ్ పెరాక్సిడేజ్ ( Thyroid peroxidase ), గళగ్రంథిప్రేరేపక గ్రాహములకు ( TSH receptors ) ప్రతిరక్షకములు ( Antibodies) ఏర్పడి గ్రంథుల ధ్వంసమునకు దారితీస్తాయి. ఈ తాపక్రియ ( Inflammation) మందకోడిగా జరిగి క్రమేణా గళగ్రంథి హీనతను ( Hypothyroidism ) కలుగజేస్తుంది.
ప్రసవానంతరము కొంత మంది స్త్రీలలో తాత్కాలికముగా గళగ్రంథి హీనత పొడసూపవచ్చును. కొద్దిమందిలో యీ లోపము శాశ్వతము కావచ్చును.
చికిత్సా జనితము ( Iatrogenic ) : గళగ్రంథిని శస్త్రచికిత్సతో సంపూర్ణముగా గాని, పాక్షికముగా గాని తొలగించినా , రేడియోధార్మిక అయొడిన్ తో ధ్వంసము చేసినా గళగ్రంథిహీనత కలుగుతుంది.
అయొడిన్ సహితౌషధములు, లిథియం, ఆల్ఫా ఇంటెర్ఫెరాన్, ఇంటెర్లూకెన్ -2 , ఎమియోడరోన్ థాలిడోమైడు వంటి మందుల వలన గళగ్రంథి హీనత కలుగవచ్చును.
ద్వితీయ గళగ్రంథిహీనత ( Secondary Hypothyroidism) :
పీనస గ్రంథి వ్యాధి ( Pituitary disorders) , లేక ఘాతముల వలన గళగ్రంథి ప్రేరేపకపు ( TSH) ఉత్పత్తి జరుగక , ప్రేరేపక లోపము ( TSH deficiency) వలన , గళగ్రంథి స్రవముల ( T3,T4) ఉత్పత్తి తగ్గుతే గళగ్రంథి హీనత కలుగుతుంది.
తృతీయ గళగ్రంథి హీనత ( Tertiary hypothyroidism) :
మెదడులో హైపోథలమస్ ( Hypothalamus) గళగ్రంథి ప్రేరేపక విమోచిని ని
( Thyrotropin releasing hormone) విడుదల చేయజాలని స్థితులలో తృతీయ గళగ్రంథి హీనత కలుగుతుంది.
ద్వితీయ, తృతీయ గళగ్రంథి హీనములు అసాధారణము. వారిలో మెదడు, పీనస వ్యాధుల లక్షణాలు ప్రస్ఫుటముగా కనిపిస్తాయి.
గళగ్రంథి హీనత లక్షణములు ;
గళగ్రంథి హీనత ప్రస్ఫుటముగా నున్న వారిలో, అలసట, అతినిద్ర, శక్తిహీనత, చలికి తట్టుకోలేకపోవుట, మలబద్ధకము, జ్ఞాపకశక్తి క్షీణించుట, బొంగురుగొంతు, కండరాల సలుపు, కేశనష్టము, స్త్రీలలో రక్తప్రదరము పొడచూప వచ్చును. ఈ లక్షణములు క్రమేణా కలుగుతాయి. కొందఱిలో ఏ బాధలు ఉండవు.
వీరిలో పొడిచర్మము, ముఖములోను, కళ్ళచుట్టూ వాపు, హృదయ మందత ( Bradycardia) , స్నాయువుల ప్రతిక్రియలు మందగించుట ( Decreased tendon reflexes ) , గుంతపడని పొంగులు, కఱకు చర్మము, కనిపించ వచ్చును. కొంత బరువు హెచ్చుట జరిగినా విశేష స్థూలకాయమును గళగ్రంథి లోపము కలుగజేయదు. వీరిలో ఆకలి కొంత మందగించ వచ్చును. అయొడిన్ లోపించిన వారిలో గలగండము ( Goitre) కనిపిస్తుంది.
గుండెపై పొరలో నీరుపట్టుట( Pericardial effusion) , పుపుసవేష్టనములో నీరుచేరుట ( Pleural effusion) , మణికట్టు వాపు ( Carpal tunnel syndrome) వినికిడి తగ్గుట, అఱుదుగా కనిపించ వచ్చును. ఊపిరి మందగించుట వ్యాధితీవ్ర మయిన వారిలో పొడచూపవచ్చును. దీర్ఘకాలముగాను, తీవ్రముగా గళగ్రంథి హీనమున్న వారిలో మ్యూకోపాలీసాకరైడులు ( Mucopolysaccharides) చర్మము దిగువ చేరుకొని పొంగులు, వాపులు కనిపించవచ్చును. ఈ పొంగులున్న వారికి వేలుతో నొక్కితే గుంతలు పడవు. చర్మము దళసరిగా ఉన్న వీరి వ్యాధిని మిక్సిడీమా ( Myxedema) అని అంటారు.
వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో శరీరము చల్లబడి, గుండెవేగము బాగా తగ్గి, గందరగోళము, బుద్ధిమాంద్యత, అపస్మారకత ( Myxedema coma ), శ్వాసమందము కలిగి ప్రాణాపాయస్థితి
కూడా కలుగ వచ్చును. ఇది అసాధారణము.
పుట్టిన పసికందులలో గళగ్రంథి హీనత ఉంటే అది క్రెటినిజం ( Cretinism) గా వర్ణిస్తారు. వారికి కండరముల బిగుతు సన్నగిల్లుట, పుఱ్ఱె వెనుక భాగము పూడుకొనక మెత్తదనము చాలా మాసము లుండవచ్చును., ( సాధారణముగా యీ మెత్తదనము రెండు , మూడు మాసములలో పూడుకుంటుంది.. ముందుభాగములో మెత్తదనము 18 మాసములలో పూడుకుంటుంది. ) బొంగురు గొంతుకతో ఏడవడము, శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండుట, నాభిగోళకము ( Umbilical hernia ) , దళసరి నాలిక యీ శిశువులలో కలుగుతాయి. వ్యాధిని నిర్ణయించి, గళగ్రంథి రసాయనములతో వైద్యము సమకూర్చకపోతే పెరుగుదల మందగించుటే కాక బుద్ధివికాసము లోపించి వీరికి బుద్ధిమాంద్యత కలుగుతుంది.
వ్యాధి నిర్ణయము:
గళగ్రంథి హీనత ఉన్నవారిలో వ్యాధి లక్షణాలు క్రమేణా పోడచూపుతాయి. పరిమితముగా లోపమున్న వారిలో యే లక్షణములు కనిపించక పోవచ్చును. రక్త పరీక్షలు విరివిగా లభ్యమవుతున్న
ఈ దినములలో ప్రస్ఫుటమైన మిక్సిడీమా, లక్షణ సహితమైన గళగ్రంథి హీనతలను అఱుదుగా చూస్తాము.
రక్త పరీక్షలు :
గళగ్రంథి హీనము ఉన్నవారిలో కొలెస్టరాలు, ట్రైగ్లిసరైడులు, క్రెయటినిన్ కైనేజ్ ల పరిమాణము లెక్కువ ఉండవచ్చును. వీరిలో సోడియం ప్రమాణములు తక్కువ అవవచ్చును.రక్తములో గళగ్రంథి ప్రేరేపకపు విలువ ( TSH ) లెక్కువగా ఉంటాయి. గళగ్రంథి ప్రేరేపకపు విలువలు సాధారణ ప్రమాణములో ఉండి, థైరాక్సిన్ ( T4 )విలువలు తక్కువగా ఉండని పక్షములో గళగ్రంథి హీనత లేదని నిర్ధారణ చెయ్యవచ్చును.
గళగ్రంథిప్రేరేపకపు ( TSH ) విలువ 20 మైక్రోయూనిట్లు/ మి.లీ. రుకి మించి ఉంటే వ్యాధి లక్షణాలు లేక పోయినా గళగ్రంథి హీనము ఉన్నదని నిర్ధారణ చెయ్య వచ్చును.
గళగ్రంథి హీనము లేక యితర వ్యాధులున్నవారిలో గళగ్రంథిప్రేరేపకపు విలువలు సాధారణ పరిమితి నతిక్రమిమించినా 20 మైక్రో యూనిట్ల లోనే ఉంటుంది.
గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విలువ ఎక్కువయినా 20 మైక్రో యూనిట్ల లోనే ఉండి థైరాక్సిన్ విలువ తక్కువగా ఉంటే దానిని విదిత గళగ్రంథి హీనతగా ( Overt hypothyroidism) పరిగణించి వారికి తగు పరిమాణములో లీవోథైరాక్సిన్ సమకూర్చాలి
గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విలువలు 5- 10 ( కొందరు వైద్యులు 5 దాటినప్పుడు, కొందరు 10 దాటినప్పుడు ) ప్లాస్మా థైరాక్సిన్ ( T4 ) విలువలు సాధారణ పరిమితులలో ఉన్నప్పుడు దానిని అగోచర గళగ్రంథి హీనతగా ( Subclinical hypothyroidism) పరిగణిస్తారు. వీరికి వైద్యము అవసరము లేదు, కాని సంవత్సరమున కొక పర్యాయము రక్తపరీక్షలు చేసి గమనిస్తూ థైరాక్సిన్
( T4 )విలువలు తగ్గినా గళగ్రంథి ప్రేరేపకపు విలువలు పెరిగినా లీవోథైరాక్సిన్ వైద్యము సమకూర్చవచ్చును. అగోచర గళగ్రంథిహీనత ఉన్నవారిలో సంవత్సరమునకు 2.5% మందిలో
యీ హీనత ప్రస్ఫుటమవుతుంటుంది.
గర్భిణీస్త్రీలలో గళగ్రంథి ప్రేరేపకపు విలువలు 10 మైక్రోయూనిట్లు దాటితే అది విదిత గళగ్రంథి హీనముగా పరిగణించి వైద్యమును చెయ్యాలి. ఆ విధముగా శిశువులలో వ్యాధి నరికట్టవచ్చును.
అప్రథాన గళగ్రంథి ( Secondary hypothyroidism) హీనమున్న వారిలో గళగ్రంథి ప్రేరేపకపు
( TSH ) విలువలు హెచ్చవవు . కావున వీరిలో గళగ్రంథి స్రవముల విలువలు ( థైరాక్సిన్. T4 ) స్వేచ్ఛాపు థైరాక్సిన్ ( Free T4 ) విలువలు తక్కువగా ఉంటే గళగ్రంథి హీనతను ధ్రువీకరించ వచ్చును.
గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములకు ( TSH Receptors ), థైరోగ్లాబ్యులిన్ కు, థైరాయిడ్ పెరాక్సిడేజు కు ప్రతిరక్షముల ( Antibodies) పరీక్షతో స్వయంప్రహరణ గళగ్రంథ తాపములను ( Autoimmune thyroiditis ) ధ్రువీకరించ వచ్చును. కాని చికిత్సాపరముగా యీ పరీక్షల వలన చేకూరే ప్రయోజనము తక్కువ.
గళగ్రంథిలో గడ్డలు, పెరుగుదలలు ఉంటే శ్రవణాతీతధ్వని చిత్రీకరణము ( Ultrasonography) పరీక్షలు , కణపరీక్షలు అవసరమవ వచ్చును. పెరుగుదలలు లేకపోతే ఆ పరీక్షలు అనవసరము.
పీనస గ్రంథి, హైపోథలముస్, మెదడు వ్యాధుల లక్షణాలున్న యెడల అయస్కాంత ప్రతినాద చిత్రీకరణలు ( Magnetic resonance imaging ) తోడ్పడుతాయి.
చికిత్స :
లీవోథైరాక్సిన్ ( Levothyroxine ) కృత్రిమముగా సంధింపబడుతున్నది. తక్కువ ధరకు అందుబాటులో కూడా ఉన్నది. గళగ్రంథి హీనత ఏ కారణము వలన కలిగినా లీవోథైరాక్సినే చికిత్సకు వాడుతారు. తగిన మోతాదును వైద్యులు నిర్ణయిస్తారు. యవ్వన వయస్కులకు తగిన మోతాదు నొక్కసారే మొదలపెట్ట వచ్చును. వృద్ధులలోను, హృద్రోగులలోను. తక్కువ మోతాదుతో ( దినమునకు 25 మైక్రోగ్రాములతో ) మొదలుపెట్టి ప్రతి మూడు, నాలుగు వారములకు మోతాదును క్రమేణా పెంచుతు అవసరమైన మోతాదుకు చేర్చాలి.
లీవోథైరాక్సిన్ని దినమున కొక్కసారి యిస్తే సరిపోతుంది. ఖాళీ కడుపుతో యీ మందును సేవించి మరి యే యితర మందులు మరొక రెండు గంటల వరకు తీసుకొన రాదు. అయనము, కాల్సియం, అల్యూమినియపు మృదుక్షారకములు, సుక్రాల్ఫేట్, కొలిస్టెరమిన్ వంటి మందులు లీవోథైరాక్సిన్ గ్రహణమునకు అంతరాయము కలిగిస్తాయి.
గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) పరీక్షను ఆరు వారముల కొకసారి చేస్తూ మందు మోతాదును సరిదిద్ద వచ్చును. లీవోథైరాక్సిన్ మోతాదు స్థిర పడ్డాక, సంవత్సరమున కొకసారి పరీక్ష సలుపుతే చాలు.
( ఉపయుక్త మనుకుంటే స్వేచ్ఛగా పంచుకొనండి )
వద్ద జూన్ 11, 2018 కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom)

మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro Vascular Accidents )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) డా. గన్నవరపు నరసింహమూర్తి మెదడు నిర్మాణము ( Anatomy of Brain ) : మన శరీరములో వివిధావయవాలు న...

  • మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro Vascular Accidents )
    ( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) డా. గన్నవరపు నరసింహమూర్తి మెదడు నిర్మాణము ( Anatomy of Brain ) : మన శరీరములో వివిధావయవాలు న...
  • ముఖపక్షవాతము ( Facial Palsy
                                                   ముఖ పక్షవాతము ( Facial Palsy )                                              ( తెలుగుతల్లి ...
  • వ్యాపకజ్వరము ( Influenza )
    డా. గన్నవరపు నరసింహమూర్తి . ( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో ) ఫ్లూ ( వ్యాపక ) జ్వరాలు ప్రతి సంవత్సరము చాలా దేశాలలో పొడచూపుతాయి. ఫ...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

  • హోమ్

నా గురించి

వైద్య
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయండి

లేబుళ్లు

  • వైద్యం
  • general knowledge
  • Info
  • Medical
  • Telugu. ఆరోగ్యం

బ్లాగు ఆర్కైవ్

  • మార్చి 2019 (1)
  • ఫిబ్రవరి 2019 (1)
  • జనవరి 2019 (1)
  • అక్టోబర్ 2018 (1)
  • సెప్టెంబర్ 2018 (1)
  • ఆగస్టు 2018 (1)
  • జులై 2018 (1)
  • జూన్ 2018 (2)
  • ఏప్రిల్ 2018 (10)
  • నవంబర్ 2017 (1)
సాధారణ థీమ్. Blogger ఆధారితం.