23, మార్చి 2019, శనివారం

మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro Vascular Accidents )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )
డా. గన్నవరపు నరసింహమూర్తి
మెదడు నిర్మాణము ( Anatomy of Brain ) :
మన శరీరములో వివిధావయవాలు నాడీమండలపు ( nervous system ) ఆధీనములో ఉంటాయి. నాడీమండలములో కేంద్రనాడీమండలము( central nervous system ) , వికేంద్రనాడీమండలము ( Peripheral nervous system ) భాగములు. కేంద్రనాడీమండలములో పెద్దమెదడు ( cerebrum ) , చిన్నమెదడు ( cerebellum ) ,వారధి ( pons ) , మెడుల్లా ఆబ్లాంగేటా
( medulla oblongata ) , కపాలనాడులు ( cranial nerves ) వివిధభాగములు. వికేంద్రనాడీమండలములో వెన్నుపాము ( spinal cord ) , వెన్నునాడులు ( spinal nerves ), సహవేదన నాడీవ్యవస్థ ( sympathetic nervous system) , పరానుభూత నాడీ వ్యవస్థ
( ParaSympathetic nervous system ) భాగములు.
పెద్దమెదడు ఆలోచనలకు , విషయగ్రాహణమునకు , జ్ఞాపకశక్తికి , విచక్షణాజ్ఞానమునకు , విషయచర్చలకు , వివిధ భావములకు స్థానము. పంచేద్రియములు గ్రహించు వాసన , దృష్టి, వినికిడి , రుచి , స్పర్శాది సమాచారములు జ్ఞాననాడుల ( sensory nerves) ద్వారా ప్రసరించి పెద్దమెదడులో జ్ఞానముగా రూపొందుతాయి.
పెద్దమెదడులో రెండు అర్ధగోళములు ( hemispheres ) ఉంటాయి. రెండు అర్ధగోళములు corpus Callosum అనబడే శ్వేత తంతువుల బంధనముచే కలుపబడి ఉంటాయి. ప్రతి అర్ధగోళములోను లలాటభాగము ( frontal lobe ) , పార్శ్వభాగము ( parietal lobe ) , కర్ణభాగము ( temporal lobe ) , పృష్ఠభాగము ( occipital lobe ) ఉంటాయి.
లలాటభాగములు పెద్దమెదడుకు ముందు భాగములో ఉంటాయి. ఇవి పార్శ్వభాగముల నుంచి మధ్యగర్తములతోను ( central sulcus ) , కర్ణభాగముల నుంచి పక్క గర్తములతోను ( lateral sulcus ) వేఱుచేయబడి ఉంటాయి. స్వయంనియంత్రణ , విచక్షణ , ప్రణాళికా రచన , తర్కము వంటి క్రియలు లలాటభాగములపై ఆధారపడి ఉంటాయి. లలాటభాగములో మధ్య గర్తమునకు ముందున్న మెలికలో చలనవల్కలము ( motor cortex ) ఉంటుంది . చలనవల్కములోని నాడీకణములపై ( neurons ) శరీరములోని ఇచ్ఛాకండరముల ( voluntary muscles ) ఇచ్ఛాచలనములు ఆధారపడి ఉంటాయి. కుడి చలనవల్కలము శరీరపు ఎడమ భాగపు ఇచ్ఛాకండరములను , ఎడమ చలనవల్కలము శరీరములోని కుడిభాగపు ఇచ్ఛాకండరములను నియంత్రిస్తాయి.
చలనవల్కలములో ( motor cortex ) నాడీకణములను ఊర్ధ్వ చలన నాడీకణములు( upper motor neurons ) గా పరిగణిస్తారు. వీని నుంచి వెలువడు అక్షతంతులు ( axons ) మెదడులో క్రిందకు సాగుచు ఆంతర గుళిక ( internal capsule ) అను భాగములో గుమికూడి ఆపై మస్తిష్కమూలమునకు
( brain stem ) చేరుతాయి. ఈ అక్షతంతులు రెండవ ప్రక్కకు దాటుకొని కపాలనాడుల కేంద్రములలో నున్న అధో చలన నాడీకణములతోను ( lower motor neurons of cranial nerve nuclei ) , వెన్నుపాములోని అధో చలననాడీకణములతోను ( lower motor neurons of spinal cord ) సంధాన మవుతాయి.
కపాలనాడుల కేంద్రములలో చలననాడీకణములనుంచి వెలువడు అక్షతంతులు ( axons ) కపాలనాడుల ( cranial nerves ) ద్వారాను , వెన్నుపాములోని చలన నాడీకణముల అక్షతంతులు వెన్నునాడుల ( spinal nerves ) ద్వారాను పయనించి వివిధ కండరములకు చేరుకుంటాయి.
మధ్యగర్తమునకు ( central sulcus ) వెనుక పార్శ్వభాగములలో జ్ఞానవల్కలము ( sensory cortex ) ఉంటుంది . శరీరములో వివిధభాగములనుంచి జ్ఞాననాడులు సమీకరించే స్పర్శ, కంపనము ( vibration sense ) , నొప్పి, ఉష్ణోగ్రత జ్ఞాన సంజ్ఞలు మెదడులో థలమస్ ( thalamus ) లకు ఆపై జ్ఞానవల్కలములకు చేరుట వలన ఆయా జ్ఞానములు కలుగుతాయి. కుడి జ్ఞానవల్కలము వలన శరీరపు ఎడమభాగములో స్పర్శాది జ్ఞానములు , ఎడమ జ్ఞానవల్కలము వలన శరీరపు కుడి భాగములో స్పర్శాది జ్ఞానములను పొందుతాము.
మెదడు కర్ణభాగములలో ( temporal lobes ) శ్రవణవల్కలములు ( auditory cortices ) ఉంటాయి. వినికిడి , వినిన పదములను , భాషణములను అర్థము చేసుకొనుట ఈ శ్రవణవల్కలముల వలన కలుగుతుంది.
దృశ్య సంజ్ఞల బట్టి చూసిన వస్తువులను గుర్తుపట్టుట , దీర్ఘకాలపు జ్ఞాపకములు కూడ మస్తిష్కములోని కర్ణ భాగముల వలన కలుగుతాయి.
మెదడులో పృష్ఠభాగములలో ( occipital lobes ) దృష్టివల్కలములు ( visual cortices ) ఉంటాయి. కంటితెరలపై నుంచి వచ్చే సంజ్ఞలను బోధచేసుకొని దృష్టివల్కలములు దృష్టిజ్ఞానమును కలుగ జేస్తాయి.
వాక్కు మెదడులో వివిధ భాగములపైన ఆధారపడి ఉన్నా మెదడులో బ్రోకాప్రాంతముగా( Broca’s area ) పరిగణించబడే లలాటభాగపు వెనుక క్రిందిభాగము పలుకులు పలుకుటలో ప్రముఖపాత్ర నిర్వహిస్తుంది.
చిన్నమెదడు ( cerebellum ) చలన ప్రక్రియలను సమన్వయపరచుటకు ( coordination ) , శరీరమును సమస్థితిలో ( balance ) ఉంచుటకు తోడ్పడుతుంది.
మస్తిష్క రక్తప్రసరణ ( cerebral circulation ) :
మెదడునకు రక్తము ఆంతర కంఠధమనులు ( Internal carotid arteries ), వెన్నుధమనులు
( vertebral arteries ) ద్వారా ప్రసరిస్తుంది. రెండు పక్కలా కంఠధమనులు ( common carotid arteries ) కంఠములో బాహ్య కంఠధమనులు ( external carotid arteries ) ఆంతర కంఠధమనులుగా ( internal carotid arteries ) చీలుతాయి. ఆంతర కంఠధమనులు ( internal carotids ) కపాలము లోనికి ప్రవేశించి పురోమస్తిష్క ధమనులు ( anterior cerebral arteries ) అను శాఖలను ఇస్తాయి. పురోమస్తిష్క ధమనులు మెదడులో లలాటభాగముల ( frontal lobes ) ముందు భాగములకు రక్తప్రసరణ చేకూరుస్తాయి.
రెండు పురో మస్తిష్కధమనులు పురో సంధానధమనులు ( anterior communicating artery ) అను శాఖలతో ఒకదానితో వేఱొకటి కలుపబడుతాయి.
పురో మస్తిష్క ధమని శాఖలను ఇచ్చిన పిదప ఆంతర కంఠధమనులు మధ్య మస్తిష్కధమనులు
( middle cerebral arteries ) గా కొనసాగి లలాట భాగపు వెనుకభాగమునకు , పార్శ్వభాగములకు
( parietal lobes ) రక్తప్రసరణ చేకూరుస్తాయి.
వెన్నుధమనులు ( vertebral arteries ) కపాలము వెనుక నుంచి పయనించి కపాలములో మూలిక ( basilar artery ) ధమనిగా ఒకటవుతుంది. మూలికధమని మెడుల్లాకు , పాన్స్ కు చిన్న మెదడుకు శాఖలిచ్చి రెండు పృష్ఠ మస్తిష్కధమనులు ( posterior cerebral arteries ) గా చీలుతుంది. పృష్ష్ఠమస్తిష్కధమనులు మెదడు పృష్ఠభాగములకు ( occipital lobes ) కర్ణభాగములకు ( temporal lobes ) రక్తమును ప్రసరింపజేస్తాయి. ప్రతి పృష్ఠమస్తిష్క ధమని నుంచి పృష్ఠ సంధాన ధమని
( posterior communicating artery ) గా ఒక శాఖ వెలువడి ఆంతర కంఠధమని ( internal carotid artery ) తో కలుస్తాయి. సంధానధమనులతో కలుపబడి మస్తిష్కధమనులు మెదడు క్రిందభాగములో ధమనీచక్రము (arterial circle of Willis ) ను ఏర్పరుస్తాయి.
మెదడుని కప్పుతూ డ్యూరా ( Dura ) , ఎరఖ్నాయిడ్ ( Arachnoid ) , పయా ( pia ) అను మూడు పొరలు ఉంటాయి.
మస్తిష్క ( రక్తనాళ ) విఘాతములు
( Cerebro vascular accidents) :
మస్తిష్క ( రక్తనాళ ) విఘాతములు ( Cerebrovascular accidents ) పక్షవాతముగానో , అపస్మారకతతోనో పొడచూపుతాయి. ఇవి రక్తనాళములలో ధమనీకాఠిన్యత ( atherosclerosis ) వలన రక్తపు గడ్డలేర్పడి రక్తప్రసరణకు భంగము కల్పించుట వలన ( thrombosis ) గాని ,
రక్త ప్రవాహములో రక్తపుగడ్డలు , యితర అవరోధకములు ( emboli ) పయనించి సుదూర ప్రాంతములో సన్నని నాళములలో అడ్డుపడి ( embolism ) రక్తప్రసరణకు భంగము కలిగించుట వలన గాని , రక్తస్రావము వలన ( hemorrhage) గాని కలుగుతాయి.
మస్తిష్కవిఘాత లక్షణములు :
మస్తిష్కవిఘాత లక్షణములు మస్తిష్కవిఘాతము ( Cerebral stroke ) ఏర్పడిన తీరు , స్థానము, తీవ్రతలపై ఆధారపడతాయి.
రక్తప్రసరణ లోపము ( ischemia ) వలన కలిగినపుడు లక్షణములు ఆకస్మికముగా కలిగినా లక్షణములలో హెచ్చుతగ్గులు ( fluctuations ) సాధారణముగా కనిపిస్తాయి.
కంఠధమనిలో ( carotid artery ) దోషమున్నపుడు ఆవలి పక్కనున్న దేహములో పక్షవాతము
( paralysis ) కలిగి కండరములు శక్తిని పూర్తిగానో , కొంతో నష్టపోతాయి. స్పర్శజ్ఞానములో నష్టము కలుగవచ్చును. సగంచూపు ( hemianopsia ) , మాట పోవుట ( aphasia ) , పలుకులలో తొట్రుపాటు ( dysarthria) రావచ్చును. జ్ఞానేంద్రియాలు అందించిన సమాచారము మెదడు గ్రహించలేకపోతే , వస్తువులను , తెలిసిన మనుష్యులను, శబ్దములను , వాసనలను , రుచులను గుర్తుపట్టలేని స్థితి ( agnosia ) కలుగవచ్చును.
రక్తప్రసరణ దోషము వెన్నుధమని ( vertebral artery ) , మూలధమని ( basilar artery )శాఖలలో ఉంటే,దేహములో ఒకపక్క గాని లేక రెండు పక్కలా గాని చలన నష్టము ( loss of motor function ), స్పర్శనష్టము ( sensory loss ) కలుగుటయే కాక తలతిప్పుట , కళ్ళుతిరుగుట , దేహమునకు అస్థిరత ( ataxia ) , ద్విదృష్టి ( diplopia - ఒక వస్తువు రెండుగా కనిపించుట ) కలుగవచ్చును.
గుండెలయ ( rhythm ) లో మార్పులు , మర్మరశబ్దములు ( murmurs ) , కంఠధమనులలో హోరుశబ్దము ( bruits ) లకు వైద్యులు పరీక్ష చేస్తారు.
మెదడు కణజాలములో రక్తస్రావము ( hemorrhage ) జరిగినపుడు చలన నష్టము , స్పర్శ నష్టము వంటి నాడీమండల వ్యాపారపు లోపములతో బాటు తీవ్రమైన తలనొప్పి , వాంతులు , మాంద్యము
( lethargy ) , అపస్మారకతలు కూడా కలుగవచ్చును.
ఎరఖ్ నాయిడ్ పొర క్రింద రక్తస్రావము ( subarachnoid hemorrhage ) కలిగి నపుడు జీవితములో యెన్నడూ పొందనంత తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది. వాంతులు , మూర్ఛ , చేతులు కాళ్ళలో కంపనము ( seizures ) , జ్వరము , నడుమునొప్పి , మాంద్యము ( lethargy ) లేక అపస్మారకత కూడా కలుగవచ్చును.
సిరాపరిఖలలో రక్తపుగడ్డలు ( cerebral venous sinus thrombosis ) ఏర్పడినచో తలనొప్పి , మసకచూపు , కంటితెరలో వాపు ( papilloedema ) వంటి కపాలములో ఒత్తిడి పెరిగిన లక్షణములు కనిపిస్తాయి.
మస్తిష్కవిఘాతమును పోలెడు యితర వ్యాధులు :
పార్శ్వపు తలనొప్పి ( migraine headache ) కలిగినపుడు నాడీమండలపు లక్షణాలు పొడచూప వచ్చును. మూర్ఛరోగము ( seizure ) కలిగినపుడు తాత్కాలిక పక్షవాతలక్షణములు కలుగవచ్చును. రక్తములో గ్లూకోజు విలువలు బాగా తగ్గినపుడు అపస్మారకత , నీరసము కలిగి పక్షవాతమును అనుకరించవచ్చును.
పరీక్షలు :
మస్తిష్కవిఘాత లక్షణములు కనిపించిన వారికి ప్రాథమిక రక్తపరీక్షలు అవసరము . వివిధ రక్తకణముల గణనము ( complete blood counts ) , రక్తఫలకముల లెక్కింపు ( Platelet count ) , రక్తము గడ్డకట్టు సమయపు పరీక్షలు ( Protime / INR , Partial Thromboplastin Time ) , గ్లూకోజు , విద్యుద్వాహక లవణములు ( electrolytes ) పరీక్షలు చేయాలి.
విద్యుత్ హృల్లేఖ ( electrocardiograph ) వలన గుండెలయలో మార్పులు , యితర హృదయ విలక్షణములు తెలుస్తాయి.
మస్తిష్కవిఘాత లక్షణములు పొడచూపిన వారికి త్వరగా వ్యత్యాసపదార్థములు ( contrast materials ) ఇవ్వకుండ మెదడుకు గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము ( Computerized Axial Tomography with out contrast materials ) చెయ్యాలి. ఈ పరీక్షలో మెదడు కణజాలములో రక్తస్రావము ( intraparenchymal hemorrhage ) , ఎరఖ్ నాయిడ్ పొర క్రింద రక్తస్రావము
( subarachnoid hemorrhage) త్వరగానే కనిపిస్తాయి.
రక్తప్రసరణ లోపము వలన కలిగే మస్తిష్కవిఘాతములు కనిపించడానికి 48 నుంచి 72 గంటలు పైన పట్టవచ్చును.
గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణములో రక్తస్రావపు లక్షణములు కనిపించ నపుడు రక్తస్రావము జరుగలేదని నిర్ధారణ చేసి రక్తము గడ్డకట్టుటను ( thrombosis ) నివారించు చికిత్సలు మొదలుపెట్ట వచ్చును.
అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములో ( Magnetic Resonance Imaging ) మస్తిష్కవిఘాతములు త్వరగానే కనిపిస్తాయి. కాని రోగిని పరీక్షించినపుడు మస్తిష్కవిఘాత లక్షణములు స్పష్టముగా కనిపించినపుడు MRI Scan వలన ఎక్కువ ప్రయోజనము లేదు.
అయస్కాంత ప్రతిధ్వని రక్తనాళ చిత్రీకరణము ( Magnetic Resonance Angiogram) లతో మెదడులో రక్త నాళములను పరీక్షించ వచ్చును.
శ్రవణాతీత ధ్వని చిత్రీకరణముతో ( ultrasonography) కంఠధమనులను పరీక్షిస్తే కంఠధమని సంకుచితమును ( carotid artery stenosis ) పసిగట్టవచ్చును.
హృదయమునకు ప్రతిధ్వని చిత్రీకరణము ( echocardiogram) తో హృదయములో రక్తపు గడ్డలను , కవాటములపైన మొలకలను ( vegetations ; గుండె లోపొరను ఆక్రమించి సూక్ష్మజీవులు వృద్ధినొంది తాపమును (endocarditis ) కలుగ జేస్తే యీ మొలకలు కనిపిస్తాయి. ఇవి విచ్ఛిన్నమయి రక్తప్రవాహములో అవరోధక పదార్థములను ( emboli ) కలుగజేయ గలవు. ) , కవాటముల సంకోచమును ( valvular stenosis ) , కవాటములలో తిరోగమన ప్రవాహములను ( regurgitation ) , గుండె మధ్య కుడ్యములో రంధ్రములను ( septal defects ) కనుగొనవచ్చును.
మస్తిష్క ధమనీ చిత్రీకరణ ( cerebral angiogram ) : కంఠధమనిలోనికి వ్యత్యాసపదార్థములును
( contrast materials ) సూదిమందుగా ఎక్కించి మెదడులో ధమనులను ఎక్స్ రేలతో చిత్రీకరించవచ్చును. ధమని బుడగలను ( aneurysms) , ధమనులలోని వైకల్యములను ( arterial malformations ) యీ చిత్రములతో కనుగొనవచ్చును.
ఎరఖనాయిడ్ పొర క్రింద రక్తస్రావము ( subarachnoid hemorrhage ) కనుగొనుటకు వెన్నులో సూదిని దింపి నాడీద్రవమును ( cerebrospinal fluid ) గ్రహించి పరీక్షలు సలుప వచ్చును .
చికిత్స :
మస్తిష్కవిఘాత లక్షణములు కనిపించిన వారికి సత్వరముగా వైద్యశాలలలో తలకు గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణలు ( computerized ed axial tomography ) చేసి కారణమును నిర్ధారించాలి. ఈ చిత్రీకరణలో రక్తస్రావము కనుపించని యెడల రక్తప్రసరణ లోపము ( ischemia) గా ఎంచాలి.
రోగి రక్తపు పోటు , హృదయ వేగము, ఉష్ణోగ్రతలు, ప్రాణవాయువు సంతృప్తతలు ( oxygen saturation ) పరిశీలించాలి.
రక్తపుపోటు నియంత్రణ ;
మస్తిష్కవిఘాతములు కలిగిన వారిలో రక్తపుపోటు నియంత్రణలో చాలా జాగ్రత్త వహించాలి.
వీరిలో తొలుత రక్తపుపోటు హెచ్చుగా ఉన్నా , తరువాత దినములలో దానంతటే క్రమేపి తగ్గుతుంది. రక్తనాళములో అడ్డు ఉన్న పై భాగములో రక్తపుపోటు తగ్గి కణజాలమునకు ప్రసరణ సరిపోదు. . అందువలన మెదడు కణజాలానికి తగిన ప్రసరణ కొఱకు రక్తపుపోటు కొంత ఎక్కువ ఉండుట అవసరము.
రక్తపుపోటుని బాగా తగ్గిస్తే నాడీమండల స్థితి క్షీణించే అవకాశములు ఎక్కువవుతాయి. అందువలన రక్తపుపోటుని త్వరితముగా సామాన్యస్థితికి తగ్గించే ప్రయత్నములు చేయరాదు.
రక్తపుపోటు విషమస్థితికి చేరినా ( ముకుళితపు పోటు ( systolic pressure ) 220 మి. మీ. మెర్కురీ మించినా , వికాసపు పోటు ( diastolic pressure ) 120 మి.మీ. దాటినవారిలోను , హృదయవైఫల్యము ఉన్నవారిలోను , రక్తపుపోటును జాగరుకతతో నెమ్మదిగా తగ్గించే ప్రయత్నము చెయ్యాలి. దినమునకు 15 శాతమునకు మించి రక్తపుపోటును తగ్గించకూడదు.
సిరల ద్వారా తగినంత లవణజల ద్రవమును ( 0.9 % Normal saline ) ఎక్కించి రక్తప్రమాణము పెంచి మెదడునకు ప్రసరణ బాగుగా జరిగేటట్లు చూడాలి .
కపాలములో రక్తస్రావము ( intracranial hemorrhage ) జరిగితే రక్తపుపోటు హెచ్చుగా ఉంటే క్రమముగా ఔషధములతో తగ్గించాలి. తలభాగమును శరీరము కంటె 15 డిగ్రీల యెత్తులో ఉంచాలి.
ఎరఖ్ నాయిడ్ క్రింద రక్తస్రావము ( subarachnoid hemorrhage ) జరిగితే ఆ యా కారణములకు చికిత్స అవసరము. ధమని బుడగలకు ( aneurysms ) శస్త్రచికిత్స అవసరము.
విశ్రాంతి , అవసరమైతే నొప్పి తగ్గించు మందులు , నిద్రకు మందులు, విరేచన దోహదకారులు వాడి కపాలము లోపల ఒత్తిడి ( intracranial pressure ) పెరుగుటను అరికట్టాలి.
నెత్తురు గడ్డల విచ్ఛేదనము ( thrombolysis ) :
రక్తనాళములలో నెత్తురు గడ్డలేర్పడి ( thrombosis ) రక్తప్రసరణ లోపించుట వలన కలిగే మస్తిష్కవిఘాతములకు ( strokes ) నెత్తురుగడ్డల విచ్ఛేదనము ( thrombolytic therapy ) ప్రయోజనము చేకూర్చే అవకాశమున్నది. మస్తిష్కవిఘాత లక్షణములు పొడచూపిన మూడు గంటల సమయములోపల నెత్తురు గడ్డల విచ్ఛేదక ఔషధములు( Recombinant tissue plasminogen activator ) వాడిన వారిలో ఫలితములు మెరుగుగా ( పదిశాతము ) ఉంటాయి. మస్తిష్కవిఘాతపు లక్షణములు తీవ్రము కానప్పుడు , ఆ లక్షణముల నుంచి త్వరగా తేరుకొంటున్న వారిలోను , ఇటీవల కాలములో శస్త్రచికిత్సలు పొందిన వారిలోను , తలదెబ్బలు కలిగిన వారిలోను , జఠరమండలములోను , మూత్రావయవములలోను రక్తస్రావములున్న వారిలోను , రక్తపుపోటు హెచ్చుగా ఉన్నవారిలోను , నెత్తురు గడ్డకట్టుటను అవరోధించు మందులు ( anticoagulants ) వాడుతున్న వారిలోను , మెదడులో అదివఱకు రక్తస్రావము జరిగిన వారిలోను , రక్తఫలకములు ( platelets ) తక్కువ ఉన్నవారిలోను రక్తపుగడ్డలను విచ్ఛేదించు మందులు వాడకూడదు. ఈ మందుల వలన మెదడులో రక్తస్రావము కలిగే అవకాశము కలదు.
కృత్రిమనాళిక ( catheter ) ద్వారా ధమనులలో నెత్తురు గడ్డలను విచ్ఛేదించు చికిత్స కొన్ని చోట్ల లభ్యము.
ఏస్పిరిన్ దినమునకు 325 మి.గ్రా. మొదటి రెండు దినములు ఆపై దినమునకు 81 మి.గ్రా రక్తప్రసరణ లోపము వలన కలిగే విఘాతములకు ఉపయోగిస్తారు. రక్తఫలకములు ( platelets ) గుమికూడుటను ఏస్పిరిన్ అరికట్టి రక్తము గడ్డకట్టుటను మందగింపజేస్తుంది.
క్లొపిడోగ్రెల్ ( clopidogrel ) కూడా రక్తఫలకలు గుమికూడుటను అవరోధిస్తుంది . ఏస్పిరిన్ వలన అవలక్షణములు కలిగిన వారిలో క్లొపిడోగ్రెల్ ను వాడవచ్చును.
కర్ణికా ప్రకంపనము (atrial fibrillation ) , కృత్రిమ హృదయకవాటములు ( prosthetic valves ) ఉన్నవారిలో రక్తము గడ్డకట్టుట అరికట్టు ఔషధములు ( anticoagulants ) మస్తిష్కవిఘాతములను నివారించుటకు ఉపయోగపడుతాయి . Warfarin , Apixaban , Rivaroxaban , Dabigartan , కొన్ని ఉదహరణలు.
మస్తిష్కవిఘాతములు కలిగిన వారిలో మింగు కండరములలో ( muscles of deglutenation ) నీరసమున్న ఆహారము ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి ( aspiration ) వాటిలో తాపమును
( Pneumonia ) కలిగించవచ్చును. మింగుట యిబ్బంది ఉన్నవారికి నాసికా జఠర నాళముల
( nasogastric tubes ) ద్వారా ద్రవపదార్థములు ఆహారముగా యివ్వాలి.
శస్త్రచికిత్సలు : కంఠధమనిలో పలక ( plaque ) ఏర్పడి రక్తనాళము సంకోచించిన ( Carotid artery stenosis >60% ) వారిలో ఆ పలకను తొలగించే carotid endarterectomy శస్త్రచికిత్స మస్తిష్కవిఘాతములు కలిగే అవకాశములను తగ్గిస్తుంది. శస్త్రచికిత్స వలన 3-4% మందిలో ప్రమాదములు కలుగవచ్చును.
చిన్నమెదడులో విఘాతముల ( cerebellar strokes ) వలన వాపు కలిగి మెదడుమూలము
( brainstem ) పై ఒత్తిడి పెంచినా , నాడీద్రవప్రసరణకు భంగము కలిగించి జలశీర్షము
( hydrocephalus ) ను కలిగించినా అత్యవసర శస్త్రచికిత్సలు అవసరము.
వ్యాయామ చికిత్స ( phyysical therapy ), వాక్చికిత్స ( speech therapy ) , వృత్తి చికిత్స ( occupational therapy ) :
మస్తిష్కవిఘాతములు కలిగిన వారికి వ్యాయామ చికిత్స , వృత్తి చికిత్సలు కండరములలో శక్తిని పెంచుటకు , నడకతీరు సరిచేయుటకు, దైనందిన కార్యములు చేసుకొనుటకు తోడ్పడుతాయి. వాక్చికిత్సలో ముఖకండరములకు , నమలు కండరములకు ( muscles of mastication) , మ్రింగుకండరములకు( muscles of deglutenation ), జిహ్వ కండరములకు శిక్షణ ఇస్తారు.
నివారణ :
అరవై శాతపు మస్తిష్క విఘాతములు ధమనీకాఠిన్యము ( atherosclerosis ) వలన కలుగుతాయి . అందువలన రక్తపుపోటుని అదుపులో ఉంచుకోవాలి. మధుమేహవ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. కొలెష్టరాలు అధికముగా ఉన్న దానిని తగ్గించుకోవాలి. పోగ త్రాగకూడదు. ఊబకాయమును తగ్గించుకోవాలి. తగినంత వ్యాయామము చేస్తుండాలి. ఈ చర్యలు ధమనీకాఠిన్యత ప్రక్రియను మందగించుతాయి.
ఆహారములో ఆకుకూరలు , కూరగాయలు , పళ్ళు , అపరాలు, ఆలివ్ నూనె వాడుట మంచిది. మాంసాహారము తినేవారు చేపల వాడుక పెంచి మిగిలిన మాంసమును మితపరచుట మేలు. సారాయి వాడుకను మితపరచుకోవాలి.
కర్ణికా ప్రకంపన ( atrial fibrillation ) ఉన్నవారు , కృత్రిమహృదయకవాటములున్న వారు రక్తపుగడ్డలను నివారించు మందులు ( anticoagulants ) ను వాడుకోవాలి.
( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. తెలుగులో వైద్యవిషయములను నా శక్తి కొలది తెలియపఱచుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. )
ఫోటో వివరణ అందుబాటులో లేదు.

17, ఫిబ్రవరి 2019, ఆదివారం

ముఖపక్షవాతము ( Facial Palsy

                                               ముఖ పక్షవాతము ( Facial Palsy )

                                             ( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )
                                                                                             
                                                                                             డా. గన్నవరపు నరసింహమూర్తి

      ముఖకండరముల ( Facial muscles ) చలనము వలన ముఖకవళికలు కలుగుతాయి. ముఖకండరముల చలనములు వామ , దక్షిణ ముఖనాడు ( Facial nerves ) ల సంజ్ఞలపై ఆధారపడుతాయి.

    శరీరములో నాడులను కపాల నాడులు ( Cranial nerves ), వెన్నునాడులు ( Spinal nerves ) గా విభజించవచ్చును. కపాలనాడులు మెదడు వివిధభాగములు , మస్తిష్కమూలముల నుంచి మొదలిడి కపాలములో వివిధ రంధ్రముల ద్వారా బహిర్గతమవుతాయి. వెన్నునాడులు వెన్నుపాము నుండి మొదలిడి వెన్నుపూసల మధ్య రంధ్రముల ద్వారా వెలువడుతాయి.

  మనుజులలో 12 జతల కపాల నాడులుంటాయి. ముఖనాడులు 7 వ కపాలనాడుల జత.

         ముఖనాడులు మస్తిష్కమూలము ( Brain stem ) లో వారధి  ( Pons ) రెండు భాగముల నుంచి  జనితమవుతాయి. అవి కపాలపు వెనుక భాగములో పయనించి అంతర శ్రవణరంధ్రము ( Internal auditory meatus ) ద్వారా  కర్ణాస్థి ( temporal bone ) లోనికి ప్రవేశించి  ముఖనాడి నాళిక ( facial canal ) ద్వారా పయనించి స్టైలాయిడ్ రంధ్రము ( styloid foramen ) నుంచి కపాలము బయటకు వచ్చి చెవి చెంతనున్న  శ్రవణమూల లాలాజలగ్రంథి ( parotid salivary gland ) లోనికి చొచ్చి వివిధశాఖలుగా చీలుతుంది. ఆ శాఖలు లాలాజల గ్రంథి  ముందు భాగము నుంచి బయల్వడి వివిధ ముఖకండరములకు నాడీప్రసరణ గావిస్తాయి. లాలాజలగ్రంథులకు , బాష్పగ్రంథులకు కూడా ముఖనాడులు నాడీప్రసరణ గావిస్తాయి. నాలుక ముందు రెండింట మూడు భాగములలో రుచి కూడా ముఖనాడులపై ఆధారపడి ఉంటుంది

     ముఖకండరములు ముఖకవళికలను కలుగ జేయుటే గాక కనురెప్పలతో కన్నులను పూర్తిగా ముడిచ ఉంచి కనులకు రక్షణ కలిగించుటకు , నోటి నుంచి చొంగ కారకుండా ఉండుటకు తోడ్పడుతాయి.

ముఖకండరములు ( Facial muscles ) :

    పృష్ఠశిర లలాట కండరములు ( Occipito frontalis muscles ) : ఈ కండరముల లలాట భాగములు కనుబొమలను పైకెత్తుటకు ,నుదుటిలో ముడుతలు ( wrinkles ) కలిగించుటకు ఉపయోగపడుతాయి.

     నేత్రమండలిక ( Orbicularis oculi ) కండరములు : కనుగుంటల చుట్టూ మండలాకారాములో ఉంటాయి. ఇవి  కనులు గట్టిగా మూసుకొనుటకు తోడ్పడుతాయి .

      భ్రుకుటి కండరములు ( corrugator supercilli ) : ఇవి కనుబొమల లోభాగము వద్ద ఉంటాయి. కనుబొమలు ముడిపడుటకు ( frowning ) తోడ్పడుతాయి.

      వక్త్రమండలిక కండరము ( Orbicularis oris ) : నోటి చుట్టూ వివిధ దిశలలో పోగులుండి  పెదవుల చుట్టూ ఉన్న యీకండరపు పోగులు నిజానికి వర్తులాకారములో నుండవు.  ఈ కండరము పెదవులను ముడుచుటకు , ఊళవేయుటకు , సన్నాయి , వేణువుల వాయిద్యములకు ఉపయోగపడుతుంది. చొంగ కారుట నరికడుతుంది.

      వక్త్రకోణ నిమ్నకండరములు ( Depressor anguli oris muscles ) : ఇవి కనుబొమలు ముడిచి నపుడు పెదవి కోణాలను క్రిందకు లాగుతాయి.

      అధరోద్ధరణ కండరములు ( Levator labii superioris ) : పై పెదవిని మీదకు చలింప జేస్తాయి.

       కపోలిక , బుగ్గ కండరము ( Buccinators ) : బుగ్గలలో ఉండే కండరములు బుగ్గలను దంతములకు అదిమి ఉంచి ఆహారమును నములుటకు ఉపయోగపడుతాయి.

      చిబుక కండరము ( Mentalis ) : మూతి ముడుచుకొనుటకు , పెదవి విఱుచుటకు ఈ కండరములు ఉపయోగ పడుతాయి.

       కుడి  ముఖ కండరములకు కుడి ముఖనాడి,  ఎడమ ముఖకండరములకు ఎడమ ముఖనాడి
నాడీప్రసరణ  సమకూరుస్తాయి.

         మెదడు నుంచి సంజ్ఞలు   నాడులలో విద్యుత్తు ద్వారాను , నాడీతంతు నాడీకణ సంధానముల
 వద్దను,  నాడీతంతు కండర సంధానముల  ( neuromuscular junctions) వద్దను    నాడీరసాయినకముల ( neurotransmitters ) వలనను సంజ్ఞలు ప్రసరితమవుతాయి.
 నాడితంతువుల నుంచి కండరములకు సంజ్ఞలు చేరినపుడు కండరములు ముకుళించుకొంటాయి.

  ముఖపక్షవాతము ( Facial paralysis ) :

            ముఖనాడి( facial nerve ) లో వివిధ కారణముల వలన స్తంభన మేర్పడి నప్పుడు ఆ పక్క ముఖకండరములలో పక్షవాతము వస్తుంది. ఆ ముఖ కండరములు చలనరహిత మవుటే గాక ఆకండరములలో బిగువు తగ్గుతుంది.

కారణములు :

           ముఖనాడుల పక్షవాతమునకు సాధారణ కారణము బెల్స్ పక్షవాతము ( Bell’s Palsy ) . ముఖపక్షవాతము వివిధ సమాజములలో గమనించబడినా Sir,  Charles Bell  1826 లో దీనిని  ముగ్గురు రోగులలో గమనించి లక్షణములను వర్ణించుటచే దీనికి Bell’s Palsy పేరు స్థిరమైనది.
డెబ్బయి శాతపు ముఖపక్షవాతమునకు బెల్స్ పక్షవాతము కారణము.
 
       సుమారు ముప్పయి శాతము మందిలో మెదడుపై గల పొరలలో కలిగే తాపప్రక్రియ వలన
( meningitis),  ప్రమాదములలో కలిగే దెబ్బల ( trauma ) వలన , కొత్త పెరుగుదలల ( tumors )
 వలన , మస్తిష్కరక్తనాళ విఘాతముల వలన( Cerebrovascular accidents ) , మధుమేహవ్యాధి
( Diabetes mellitus ) , సార్కాయిడోసిస్ ( Sarcoidosis ), లైమ్స్ వ్యాధి ( Lyme’s disease) ల వలన ముఖపక్షవాతము కలుగ గలదు . కాని వీరిలో ఆ యా వ్యాధుల యితర లక్షణము లుంటాయి.  నాడీమండలములో యితర భాగములపై కూడా ఆ యా వ్యాధుల ప్రభావముండుట చేత యితర నాడీమండల  లక్షణములు కూడా పొడచూపుతాయి.
  ఇతర  నాడీమండల లక్షణములు లేకుండా , యితర వ్యాధి లక్షణములు లేనివారిలో కనిపించే ముఖపక్షవాతమును బెల్స్ పక్షవాతముగా పరిగణించ వచ్చును. ముఖనాడి కేంద్రము ( Facial nerve nucleus ) మస్తిష్కమూలములో వారధి ( Pons ) భాగములో ఉంటుంది. ఈ కేంద్రమునకు మెదడులో చలనవల్కలము ( motor cortex ) నుంచి నాడీ తంతువులు వచ్చి ఆ కేంద్రములో ఉన్న నాడీకణములతో సంధానము అవుతాయి. ముఖనాడీ కేంద్రము నుంచి ముఖనాడులు వెలువడుతాయి.
 నాడీకేంద్రము లోను , నాడీకేంద్రము పైన కలిగే ప్రక్రియల వలన కలిగే పక్షవాతమును ఊర్ధ్వచలననాడీ పక్షవాతము ( upper motor neuron paralysis) గాను, కేంద్రము దిగువ నాడిలో కలిగే ప్రక్రియల వలన కలిగే పక్షవాతమును అధోచలననాడీ పక్షవాతము ( Lower motor neuron paralysis) గాను పరిగణిస్తారు.

వ్యాధి ప్రక్రియ ( Pathogenesis ) :

      బెల్స్ పక్షవాతము అధో చలననాడీ పక్షవాతమును కలిగిస్తుంది. బెల్స్ పక్షవాతమునకు కారణము తెలియదు. పరిశోధనలలో కొంతమందిలో జ్వరపు పొక్కులు కలిగించే హెర్పీస్ సింప్లెక్స్ విషజీవాంశువులు ( Herpes Simplex viruses HSV1 ) , కొంతమందిలో ఆటాలమ్మ , మేఖలీ విసర్పణిక జీవాంశువులు ( herpes zoster viruses ) కనుగొనబడ్డాయి.

    వీరిలో సన్నని ముఖనాళికలో పయనించే ముఖనాడిలో తాపప్రక్రియ ( inflammation ), వాపు కలిగి అస్థినాళిక యిరుకయి ముఖనాడిపై కలగే ఒత్తిడి వలన , రక్తప్రసరణ భంగము వలన , తాపప్రక్రియ వలన కలిగే విధ్వంసము వలన , నాడిపై గల కొవ్వుపొరకు ( myelin sheath ) కలిగే విధ్వంసము వలన నాడీవ్యాపారమునకు భంగము ఏర్పడి  సంజ్ఞల ప్రసరణకు భంగ మేర్పడుతుంది. అందు వలన ముఖ కండరములలో శక్తిహీనత ( వాతము ) పొడచూపుతుంది. బెల్స్ పక్షవాతము చాలా మందిలో తాత్కాలిక ప్రక్రియ. చికిత్సతోను , చికిత్స లేకపోయినా క్రమేపి కొద్ది వారములలో వ్యాధి ఉపశమిస్తుంది. కొంతమందిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి  ఉపశమనము త్వరగా  కలుగుతుంది.

ముఖనాడి పక్షవాత ( facial palsy ) లక్షణములు  :

    ఈ లక్షణముల తీవ్రత వివిధస్థాయిలలో ఉంటుంది. సాధారణముగా ముఖములో ఒకపక్కే పక్షవాతము కనిపిస్తుంది. అసాధారణముగా రెండు ముఖనాడులు పక్షవాతమునకు గురి కావచ్చును. వ్యాధి లక్షణములు అకస్మాత్తుగా కలిగి రెండు మూడు దినములలో ఉధృతి నొందుతాయి.  జలుబు , తలనొప్పి, చెవి కింద చుట్టూ బాధ  , కింద దవడలో నొప్పి కలుగవచ్చు.   మిగిలిన శరీరభాగములలో పక్షవాతము ఉండదు. ముఖకండరములలో అదురు , నీరసము కలుగవచ్చును. పైకనురెప్ప వాలి ఉంటుంది. నుదుటిలో ముడుతలు వ్యాధికి గురైన భాగములో లోపిస్తాయి. ఆ వైపు కన్నుని పూర్తిగా మూయలేరు. కన్నీరు స్రవించుట తగ్గి కన్నులో ఆర్ద్రత తగ్గుతుంది.

   ఆ పక్క కంటివలయ కండరములో బిగుతు తగ్గుట వలన కన్నీళ్ళు బయటకు ఒలుకుతుంటాయి.  ఆ ప్రక్క నాసికాధర వళిక ( nasolabial fold ) రూపు తగ్గి ఉంటుంది. నోటి కోణము క్రిందకు ఒరిగి ఉంటుంది. ఆ ప్రక్క చొంగ కారవచ్చును. ఊళ సరిగా వేయలేరు. ఆ పక్క నాలుకలో ముందు భాగములో రుచి లోపిస్తుంది. లాలాజల స్రవము తగ్గి నోరు పొడిగా ఉండవచ్చును.  బుగ్గలలో గాలిని పట్టి ఉంచలేరు.
  మాటలాడుటలోను,   తిండి తినుటలోను , నీళ్ళు తాగుటలోను యిబ్బంది ఉంటుంది. చెవులలో
గింగురు శబ్దము , మాటలు,  శబ్దముల ధ్వని హెచ్చయి అసౌఖ్యము ఉండవచ్చును.

వ్యాధి నిర్ణయము :
                       ఇతర నాడీమండల వ్యాధి లక్షణములు , ఇతర వ్యాధుల లక్షణములు లేకుండా
ఒకపక్క ముఖపక్షవాత లక్షణములు ఒకటి రెండు దినములలో పొడచూపినపుడు వ్యాధిలక్షణముల బట్టే తాత్కాలిక ముఖపక్షవాతముగా (  Bell’s Palsy ) నిర్ధారణ చేయవచ్చును. వీరిలో యితర శరీరభాగములు పక్షవాతమునకు గురికావు.
 
     ఈ వ్యాధి ( Bell’s Palsy ) నిర్ధారణకు ప్రత్యేకమైన రక్తపరీక్షలు గాని యితర పరీక్షలు గాని లభ్యములో లేవు. ఈ వ్యాధి తాత్కాలికమైనది , వ్యాధిలక్షణములు కార్టికోష్టీరాయిడులతోను , ఏస్పిరిన్ తోను కొద్దివారములలో ఉపశమిస్తాయి కాబట్టి విస్తృతముగా ఖరీదైన పరీక్షలు చేయుట అనవసరము.
    విద్యుత్ కండరలేఖనము ( Electromyography ) పరీక్షతో ముఖనాడిలో హానిని,  హానితీవ్రతను పసిగట్టవచ్చును.
       మధుమేహవ్యాధి , Sarcoidosis , లైమ్స్ వ్యాధు  ( Lyme’s disease ) లను రక్తపరీక్షతో నిర్ధారణ చేయవచ్చును.
    లైమ్స్ వ్యాధి ( Lyme’s disease ) ఉత్తర భూగోళవాసులలో చూస్తాము. ఈ వ్యాధి బొర్రీలియా సూక్ష్మజీవుల వలన కలుగుతుంది. వీరిలో ప్రథమదశలో  ఎద్దుకన్ను ( Bull eye ) రూపములో చర్మముపై  ఎఱ్ఱని దద్దురు కనిపిస్తుంది. శరీరములో అనేక లక్షణాలు కలిగించే యీ వ్యాధి వలన ముఖనాడి పక్షవాతము కొందఱిలో కలుగుతుంది. లేడి పుర్వులు ( deer ticks )  కుట్టడము వలన యీ వ్యాధి సంక్రమిస్తుంది. వీరిలో కొందఱికి  రెండు పక్కలా ముఖపక్షవాతము కలుగవచ్చును.

     ఇతర కపాలనాడులలోను,  నాడీమండలములో యితర భాగములలోను రుగ్మతలక్షణములు ఉన్నపుడు , ముఖపక్షవాత చిహ్నములు మూడువారములలో ఉధృతమయినా , నాలుగు వారములలో తగ్గుదల చూపకపోయినా , యితరవ్యాధులను మినహాయించ వలసిన అవసరమున్నది.
        మస్తిష్కవిఘాతములను, కొత్త పెరుగుదలలను ( new growths ), సూక్ష్మాంగజీవ వ్యాధులను కనుగొనుటకు గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణములు ( Computerized Axial Tomography ) ,అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు ( Magnetic Resonance Imaging Scans ) అవసరము.

     మధ్యచెవిలో సూక్ష్మజీవుల వలన తాపప్రక్రియ ఉన్నవారిలో చెవినొప్పి , చెవినుంచి స్రావము కారుట , వంటి లక్షణములతో ముఖపక్షవాతము కలుగవచ్చును. వారికి చెవితాపమునకు చికిత్స , వారి మధ్యచెవిలో తాపప్రక్రియ వలన Cholesteotoma ఏర్పడితే  దానికి శస్త్రచికిత్స అవసరము.

    మస్తిష్కరక్తనాళ విఘాతముల ( Cerebro vascular accidents ) వలన కలిగే పక్షవాత లక్షణములు ( స్పర్శనష్టము, కండరములలో శక్తినష్టము ,  ) ముఖము లోనే గాక ఆ పక్క చేతులలోను , కాళ్ళలోను కూడా కనిపిస్తాయి. వీరిలో ముఖపు మీది భాగములో వాతలక్షణములు ( రెండవ పక్క ముఖనాడి తంతులు కొన్ని లలాటకండరమునకు ప్రసరణ చేయుట వలన ) తీవ్రముగా ఉండవు. నుదుటిలో ముడుతలు పూర్తిగా పోవు .

     ముఖపక్షవాతముతో బాటు  బయట చెవిపైన, చెవి ప్రాంతములోను  విస్ఫోటము ( Rash ) ఉన్నట్లయితే అది  ఆటాలమ్మ - మేఖలిక విసర్పిణి విషజీవాంశువుల  ( Varicella - Herpes Zoster వలన కలిగినదని నిర్ధారణ చేయవచ్చును. దానిని Ramsay Hunt Syndrome గా పరిగణిస్తారు.

చికిత్స :

    ఒక ముఖనాడికే పరిమితమయిన పక్షవాతము చాలా హెచ్చుశాతము మందిలో Bell’s Palsy గా పరిగణించవచ్చును. చాలా మందిలో దానంతట అది తగ్గినా , త్వరిత ఉపశమనము కొఱకు , అవశిష్ట లక్షణములను అరికట్టుటకు చికిత్సలు అవసరము.

     వీరికి ముఖనాడిలో తాపప్రక్రియను పరిమితము చేసి , లక్షణములు తొలగించుటకు తాపకనిరోధములైన కార్టికోష్టీరాయిడులను ( Corticosteroids, ముఖ్యముగా Prednisone ని ) వాడుతారు. వీని వలన హెచ్చుశాతపు మందిలో వ్యాధి లక్షణములు త్వరగా  తగ్గుతాయి .

  విషజీవాంశు నిరోధకము - ఎసైక్లొవీర్ ( acyclovir ) ని , కార్టికోష్టీరాయిడులతో బాటు వాడడము వలన అదనపు ప్రయోజనము చేకూరవచ్చును. పరిశోధనల ఫలితములు నిర్దిష్టముగా లేవు.

  నొప్పి తగ్గించుటకు ఏస్పిరిన్, ఎసిటెమైనొఫెన్ , ఐబుప్రొఫెన్ లను వాడవచ్చు.

కంటికి రక్షణ :

       కనురెప్ప పూర్తిగా ముడుచుకోక పోవుట వలన ,  బాష్పవారి స్రవము తగ్గుట వలన  కనుగుడ్డు ఆరిపోవుటకు , తాపప్రక్రియ బారికి లోనగుటకు  అవకాశము గలదు . కాబట్టి కంటికి రక్షణ చేకూర్చాలి. కృత్రిమ బాష్పకణములను వాడి ,  కనురెప్పను మూసి ( ప్రత్యేకముగా నిదురించునపుడు ) దానిపై
కనుకప్పు( eye patch ) నుంచి కంటికి రక్షణ చేకూర్చాలి.

వ్యాయామ , భౌతిక చికిత్సలు :

        ముఖకండరములకు వ్యాయమ చికిత్స కండరముల బిగువును కాపాడుటకు , శాశ్వత సంకోచముల నరికట్టుటకు ఉపయోగపడుతాయి.
        కాపడము వంటి ఉష్ణచికిత్సల వలన నొప్పి తగ్గే అవకాశమున్నది. విద్యుత్ప్రేరణ చికిత్సల
( electrical stimulation of nerve ) వలన పరిశోధనలలో సత్ఫలితములు కనిపించలేదు.
      ముఖనాడిపై ఒత్తిడి తగ్గించే శస్త్రచికిత్సల ( decompression ) వలన ప్రయోజనము తక్కువ.
చాలా నెలల పిమ్మట కూడా ముఖ కవళికలలో వికృతము పోని వారికి పునర్నిర్మాణ శస్త్రచికిత్సల
 ( Reconstructive surgeries ) వలన ప్రయోజనము చేకూరవచ్చును.

  ఇతర వ్యాధుల వలన ముఖపక్షవాతము కలిగిన వారిలో ఆయా వ్యాధులకు చికిత్సలు అవసరము.

   తాత్కాలిక ముఖపక్షవాతము ( Bell’s Palsy ) కలిగిన వారిలో రెండు మూడు వారములలో క్రమముగా వాతలక్షణములు తగ్గుముఖము పడుతాయి. చాలా మందిలో మూడు , ఆరు మాసములలో  లక్షణములు పూర్తిగా తగ్గిపోతాయి. చాలా తక్కువ శాతము మందిలో కండరముల శక్తి పూర్వస్థితికి రాక పోవచ్చును.

    కొంతమందిలో వ్యాధిచే  ధ్వంసము చెందిన ముఖనాడి తంతువులు పునర్జనితము చెందినపుడు వాని  గమ్యస్థాన గతులు తప్పుతాయి. నేత్రకండరపు నాడీతంతులు వక్త్రకండరములకు చేరుకుంటే కన్ను మూసినపుడు వక్త్రకోణము పైకి లేస్తుంది .  ఊర్ధ్వలాలాజలకేంద్రము ( Superior salivary nucleus ) నుంచి వెలువడు నాడీతంతులు బాష్పగ్రంథులకు ( lacrimal glands ) చేరుకుంటే తినుబండారముల వాసన తగిలినప్పుడు,  భోజన సమయములందు  కన్నీళ్ళు కారవచ్చును. వీటిని మొసలి కన్నీళ్ళుగా వర్ణిస్తారు.

( వైద్యవిజ్ఞానిక విషయములను తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్తులు తమ వైద్యులను తప్పక సంప్రదించాలి.

ఉపయుక్తమనుకుంటే నా వ్యాసములను నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )

18, జనవరి 2019, శుక్రవారం

హృదయ వైఫల్యము (Congestive Heart Failure)


(తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో)
- డా. గన్నవరపు నరసింహమూర్తి
హృదయ వైఫల్యమంటే గుండె నిర్మాణములో లోపాలు గాని, హృదయవ్యాపార ప్రక్రియలో లోపముల వలన కాని గుండె వివిధ అవయవాలకు అవసరమయిన రక్తము నందించలేక పోవుట.
అకస్మాత్తుగా గుండె ఆగిపోవుట, లేక గుండెపోటు అని కాని అపార్థము చేసుకోకూడదు. హృదయవైఫల్యము సాధారణముగా క్రమేపి ముదిరే దీర్ఘకాలిక వ్యాధి. గుండెపోటు వంటి కారణముల వలన హృదయవైఫల్యము త్వరితముగా పొడచూప వచ్చును.
హృదయవైఫల్యమునకు గురి అయిన వారు ప్రపంచములో సుమారు నాలుగుకోట్లమంది ఉంటారు. అరవై యైదు సంవత్సరాలకు పై బడిన వారిలో ఐదు నుంచి పది శాతము మంది దీనికి గురి అవుతారు.
కారణాలు :
హృదయరక్తనాళముల కాఠిన్యత, హృదయరక్తప్రసరణ లోపము, రక్తపుపోటు, మధుమేహవ్యాధి, రుమేటిక్ గుండెజబ్బు వలన కలిగే హృదయకవాటవ్యాధులు, సారాయి, కొకైన్, మిథాంఫిటమిన్ వంటి మాదకద్రవ్యములు, విషపదార్థములు, కొన్ని ఔషధములు, విషజీవాంశువులు, సూక్ష్మాంగజీవులు, స్వయంప్రహరణవ్యాధుల (autoimmune diseases) వలన హృదయకండరములో కలిగే బలహీనత, తాపములు, హృదయకండరములలో యితర పదార్థములు పేరుకొనుట వలన కలిగే బలహీనత హృదయవైఫల్యమును కలిగించగలవు.
గళగ్రంథి ఆధిక్యత (hyperthyroidism),, ధమనులు సిరల మధ్య సంధీకరణముల
(arteriovenous fistulas), బెరిబెరి, పేజెట్స్ వ్యాధి (Paget ‘ disease) వంటి అధికప్రసరణవ్యాధులు (high output failure) హృత్కోశ ఆకుంచనము (pericardial constriction), కర్ణికాప్రకంపనము
(atrial fibrillation) హృదయవైఫల్యమును కలగిస్తాయి .
హృదయరక్తప్రసరణ లోపాలు, రక్తపు పోటు, హృదయకవాట వ్యాధులు వీనిలో ముఖ్యమైనవి. ఇవి అధికశాతపు మందిలో హృదయవైఫల్యమును కలిగిస్తాయి.
వ్యాధిప్రక్రియ (pathophysiology) :
హృదయము రక్తప్రసరణమునకు సహాయపడే ముఖ్యమైన తోడు యంత్రము. శరీరములో యితరకండరములు సిరల నుంచి రక్తమును గుండెకు చేర్చుటకు కొంత తోడ్పడుతాయి. హృదయకండరముల ముకుళిత (systole) వికాసముల (diastole) వలన రక్తప్రసరణ జరుగుతుంది. హృదయములో నాలుగు అరలుంటాయి. పై గదులు కుడి ఎడమ కర్ణికలు (atria). క్రింది అరలు కుడి ఎడమ జఠరికలు (ventricles) . కుడి కర్ణికకు దేహము నుంచి రక్తము బృహత్ సిరల ద్వారా చేరుతుంది. కుడి కర్ణిక నుంచి రక్తము త్రిపత్ర కవాటము (tricuspid valve) ద్వారా కుడి జఠరికకు చేరుతుంది. కుడి కర్ణిక నుంచి పుపుస కవాటము (pulmonary valve), పుపుస ధమనుల (pulmonary artery) ద్వారా ఊపిరితిత్తులకు చేరి అచట ప్రాణవాయువుని గ్రహించుకొని బొగ్గుపులుసు వాయువుని విసర్జించుకొని పుపుస సిరల (pulmonary veins) ద్వారా రక్తము ఎడమ కర్ణికకు చేరుతుంది. ఎడమ కర్ణిక నుంచి ద్విపత్ర కవాటము (bicuspid valve) ద్వారా ఎడమ జఠరికకు, ఎడమ జఠరిక ముకుళించుకొన్నపుడు బృహద్ధమని కవాటము (aortic valve) ద్వారా బృహద్ధమనికి (aorta), దాని ద్వారా వివిధావయవాలకు రక్తము చేరి కణజాలమునకు ప్రాణవాయువును పోషకపదార్థములను చేర్చి కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువును వ్యర్థపదార్థములను గ్రహిస్తుంది. వ్యర్థపదార్థములను విచ్ఛిన్నము చేయుటకు విసర్జించుటకు కాలేయము, మూత్రపిండములు తోడ్పడుతాయి.
కర్ణికలు ముకుళించుకొన్నపుడు జఠరికలు వికసించుకొని రక్తమును గ్రహించుకుంటాయి. జఠరికలు ముకుళించుకొన్నపుడు కర్ణిక జఠరికల మధ్య కవాటములు మూసుకొని రక్త తిరోగమనమును నిరోధిస్తాయి. రక్తము అపుడు పుపుస ధమని బృహద్ధమనులకు నెట్టబడుతుంది.
హృదయకండరములు బలహీనమయినా, హృదయముపై అధికప్రసరణ భారము కలిగినా దేహమునకు తగినంత రక్తమును హృదయము ప్రసరించలేనవ్పుడు హృదయ వైఫల్యము కలుగుతుంది. అప్పుడు దానిని అధిగమించుటకు శరీరములో ఇతర పరిణామములు కలుగుతాయి. హృదయనిర్మాణములో అవాంఛిత పరిణామములు జరుగుతాయి. హృదయకండరములో ఉబ్బుదల
(cardiac hypertrophy) హృదయపరిమాణములో పెరుగుదల (cardiac dilatation) కలిగి హృదయము స్తూపాకారతను పొందుతుంది. స్తూపాకారత వలన జఠరికల సంకోచముల సార్థకత తగ్గుతుంది .
రెనిన్ ఏంజియోటెన్సిన్ ఆల్డోష్టిరోన్ వ్యవస్థ (renin angiotensin aldosterone system), మూత్రపు ఉత్పత్తి తగ్గించే వాసోప్రెస్సిన్ (Vasopressin - Anti diuretic hormone ADH) ఉత్తేజింపబడి దేహములో సుదూర రక్తనాళముల సంకోచము, లవణము, నీరుల నిలువ పెరిగి శరీరములో రక్తపు ఘనపరిమాణము కూడా పెరుగుతుంది. అందువలన గుండెపై ఒత్తిడి కూడా పెరుగుతుంది.
సహవేదన నాడీమండల ప్రకోపనము వలన రక్తములో ఎడ్రినలిన్, నారెడ్రినలిన్ వంటి కాటిఖాలమైనులు (catecholamines) పెరిగి గుండె వేగమును, హృదయకండరములు ముకుళించుకొనుటను (contractility) పెంచుతాయి. అందువలన హృదయానికి ప్రాణవాయుపు అవసరము కూడా పెరుగుతుంది.
నాడీ రసాయినకముల (neurotransmitters) ప్రభావము వలన గుండెలో కణ విధ్వంసము, తంతీకరణము (fibrosis), గుండె లయలో మార్పులు (cardiac arrhythmias) గుండె బలహీనత గుండె వైఫల్యము కలుగుతాయి. శరీరములో లవణ పరిమాణము, ఉదకపరిమాణము పెరిగి సిరలలో సాంద్రత (congestion), పెరుగుతుంది. అవయవములకు రక్తప్రసరణ తగ్గుట వలన అవయవముల క్రియాశక్తి కూడా తగ్గే అవకాశమున్నది.
హృదయ వైఫల్య లక్షణములు :
హృదయ వైఫల్యము గల వారిలో ఆయాసము తొలుత శరీరపు శ్రమతో మొదలిడినా, తీవ్రతరమయినపుడు విశ్రాంతి సమయాలలో కూడా కలుగుతుంది, నీరసము, త్వరితముగా అలసట, వ్యాయామ శారీరక శ్రమలను భరించ లేక పోవుట, రాత్రులలో ఆకస్మికముగా ఆయాసము కలుగుట, బల్లపరపుగా పడుకున్నపుడు ఊపిరి ఆడకపోవుట (orthopnea) కలుగుతాయి.
సిరలలో రక్తపు సాంద్రత ఎక్కువై శరీర క్రింది భాగములలో నీరు పట్టి, కాళ్ళు, చేతులు పొంగుట, పుపుస సిరలలో రక్తపు సాంద్రత పెరుగుట వలన గాలిబుడగలలో (alveoli) మధ్య నీరు పట్టి దగ్గు, ఆయాసము, ఊపిరితో పిల్లికూతలు (wheezing) కలుగుతాయి.
గుండెదడ, కళ్ళుతిరుగుట, నిలుచున్నపుడు తాత్కాలిక అపస్మారము రావచ్చును. గుండెనొప్పి కూడా కలుగవచ్చును .
గుండెలో అసాధారణ లయలు (arrhythmias) కలుగుతే వాటి లక్షణములు (గుండెదడ, అపస్మారకత, ఆకస్మికముగా గుండె ఆగిపోవుట) కలుగ వచ్చును.
హృదయ వైఫల్యము తీవ్రతరమైనపుడు, మూత్రపిండముల వ్యాపారము మందగించి వ్యర్థపదార్థముల విసర్జన, మూత్రపరిమాణము తగ్గుట కలుగవచ్చు. అపుడు శరీరములో లవణము, నీటి నిలువలు పెరిగి శరీరములో పొంగులు(edema), ఊపిరితిత్తులలో నీటి ఉబ్బు (pulmonary edema) అధికమవుతాయి.
కాలేయములో నీటిఉబ్బు (hepatic congestion) కలిగితే కాలేయ వ్యాపారము మందగించవచ్చును. కాలేయ జీవోత్ప్రేరకముల (liver enzymes) విలువలు పెరుగ వచ్చును. పచ్చకామెర్లు కూడా కలుగ వచ్చును. ఉదరకుహరములో నీరు పట్టి జలోదరమును (ascites) కలిగించవచ్చును.
వైద్యుల పరీక్షలో పాదములలోను, చీలమండ వద్ద నీటిపొంగును గుర్తించగలరు. వేలితో నొక్కిఉంచుతే లొత్త పడుతుంది. (నీటిపొంగుకి ఇతర కారణములు కూడా ఉండవచ్చును.)
వినికిడి గొట్టముతో విన్నపుడు సామాన్యముగా వినిపించే మొదటి రెండవ గుండెశబ్దములతో బాటు మూడు లేక నాల్గవ శబ్దములు కూడా వినిపించవచ్చును. గుఱ్ఱపు దాట్ల వలె గుండె శబ్దములు
(galloping) ఉండవచ్చును. త్రిపత్ర ద్విపత్ర కవాటముల పరిమాణము పెరిగి తిరోగమన రక్తప్రవాహము
(regurgitation) కలిగితే మర్మర శబ్దములు (murmurs) కూడా వినిపించ వచ్చును. ఛాతిపై విన్నపుడు క్రిందిభాగములలో చిటపట శబ్దములు వినిపించవచ్చును. కంఠసిరలలో ఉబ్బుదల కనిపెట్టగలరు. పుపుసవేష్టనములో (pleural effusion) నీరుపట్టవచ్చును.సాధారణము కాదు గాని హృదయకోశములో కూడా నీరు పట్టవచ్చును (pericardial effusion) . కాలేయములో నీటి పొంగు వలన కాలేయపు పరిమాణము పెరగవచ్చును. నెమ్మదిగా కాలేయభాగములో చేతిని అదిమిపట్టితే కంఠసిరలలో ఉబ్బుదల పెరగడము గమనించగలరు (hepato jugular reflux)
రక్తపరీక్షలు :
హృదయవైఫల్య లక్షణము లున్నవారికి రక్తకణపరీక్షలు, హీమోగ్లోబిన్, రక్తములో ఎఱ్ఱరక్తకణముల ఘనపరిమాణ శాతమును (hematocrit) సాధారణముగా పరీక్షించి రక్తహీనత లేదని నిర్ధారణ చేసు కోవాలి. రక్తములో సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు, బైకార్బొనేట్ల విలువలను మూత్రపిండముల వ్యాపారమును తెలిపే యూరియా నైట్రొజెన్, క్రియటినిన్ విలువలను తెలుసుకొనుట అవసరము. చికిత్స పొందుతున్న వారిలో యీ పరీక్షలను మధ్య మధ్యలో పరిశీలించుట కూడా చాలా అవసరము.
కాలేయ వ్యాపారపరీక్షలు (liver function tests), గళగ్రంథి స్రావక పరీక్షలు (thyroid hormones), రక్తములో చక్కెర విలువలు, కొలెష్ట్రాలు యితర కొవ్వుపదార్థాల పరీక్షలు కూడా అవసరమే.
బి- నేట్రియురెటిక్ పెప్టైడ్ (B type Natriuretic Peptide) :
హృదయవైఫల్యము కల వారిలో రక్తఘనపరిమాణము పెరిగి హృదయపు అరల సాగుదల వాని ఘనపరిమాణములో హెచ్చుదల కలిగినప్పుడు హృదయ కండరకణములు బి- నేట్ర్రియురెటిక్ పెప్టైడ్ అనే రసాయనమును అధికముగా ఉత్పత్తి చేస్తాయి. హృదయవైఫల్యము గల వారిలో బి నేట్రియురెటిక్ పెప్టైడు విలువలు 400 మించి ఉంటాయి. ఆ విలువ 100 కంటె తక్కువైతే హృదయవైఫల్యము లేదని నిర్ధారించవచ్చును. మూత్రపిండముల వ్యాపార లోపమున్న వారిలో యీ విలువలు ఎక్కువగా ఉండవచ్చును.
ఛాతి ఎక్స్ రే అవసరము. ఊపిరితిత్తులలో నీటి ఉబ్బును (Pulmonary edema) కనుగొనుటకు ఆయాసము కలిగించే ఊపిరితిత్తుల తాపము (Pneumonia) వాయుపూరిత పుపుసవేష్టనము
(Pneumothorax) వంటి ఊపితిత్తుల వ్యాధులను, పుపుసవేష్టనములో నీటి చేరికను (Pleural effusion) కనుగొనుటకు ఎక్స్ రే చిత్రములు ఉపయోగపడుతాయి.
హృదయవిద్యుల్లేఖ (Electrocardiogram) :
హృదయ ధమనుల వ్యాధిని (Coronary artery disease) సూచించవచ్చు. హృదయ లయలో భేదములను (arrhythmias) హృదయములో విద్యుత్ప్రవాహ మాంద్యమును (conduction delays) కనుగొనుటకు తోడ్పడుతుంది.
అతిధ్వని శ్రవణసాధనముతో హృదయ చిత్రీకరణ (echocardiogram) చేసి హృదయ నిర్మాణమును, హృదయములో రక్తచలనమును, కవాటముల వ్యాపారమును తెలుసుకొన వచ్చును. ఎడమ జఠరిక సంపూర్ణవికాసము నొందినపుడు రక్తపరిమాణమును(end diastolic volume) సంపూర్ణముగా ముకుళించినపుడు రక్తపరిమాణమును (end systolic volume) గణించి ఎడమ జఠరిక నుంచి బృహద్ధమనికి ప్రసరించు రక్తశాతమును (ejection fraction) కనుగొన వచ్చును. సాధారణముగా వయోజనులలో ప్రసరణ శాతము 55 % నుంచి 65 % శాతము ఉంటుంది.
హృదయ కండర వికాస లోపము వలన హృదయవైఫల్యము (diastolic failure) కలిగిన వారిలో జఠరిక నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించు రక్తశాతపు విలువలు సాధారణ పరిమితులలో (50 % శాతముకంటె ఎక్కువగా) ఉంటుంది.
కండరనష్టము, లేక కండర వ్యాపార లోపము ఉన్నవారిలో ఎడమ జఠరిక ముకుళించుకొనుటలో లోపము కలిగి బృహద్ధమనికి ప్రసరించు రక్తశాతము (ejection fraction) తగ్గుతుంది .
ఈ విలువ హృదయవైఫల్యము ముకుళిత లోపము (Systolic heart failure) వలనా లేక వికాస లోపము వలన (Diastolic heart failure) కలిగిందో నిశ్చయించుటకు తోడ్పడుతుంది.
హృదయ ధమనుల వ్యాధి లక్షణములు ఉన్నవారికి ధమనీ చిత్రీకరణ (Angiogram) అవసరము.
హృదయమునకు అయస్కాంత అనునాద చిత్రీకరణముతో (Magnetic Resonance Imaging Scan) హృదయ నిర్మాణ వ్యాపారాలను, వ్యాధులను కనుగొన వచ్చును.
హృదయవైఫల్యపు అంతస్థులు :
1 వ శ్రేణి : వీరికి హెచ్చయిన శరీరపు శ్రమతో ఆయాసము కలుగుతుంది.
2వ శ్రేణి : వీరికి మధ్య తరహా శ్రమతో ఆయాసము కలుగుతుంది
3వ శ్రేణి : వీరికి కొద్దిపాటి శ్రమకే ఆయాసము కలుగుతుంది.
4 వ శ్రేణి : వీరికి విశ్రాంతి సమయములో కూడా ఆయాసము ఉంటుంది.
చికిత్స :
హృదయవైఫల్యము వలన శరీరములో కలిగే అవాంఛిత పరణామాలను అవరోధించుట చికిత్సలో ముఖ్యభాగము. సహవేదన నాడీమండలము ఉత్తేజము నొందుట వలన విడుదలయే
కాటిఖాలైమన్లను (catecholamines) అవరోధించుటకు బీటా గ్రాహక అవరోధకములను (beta adrenergic blockers) రెనిన్ ఏంజియోటెన్సిన్ ఆల్డోష్టిరోన్ వ్యవస్థతో విడుదల అయే ఆల్డోష్టిరోన్ ఫలితములను అరికట్టుటకు ఏంజియోటెన్సిన్ ని మార్చెడి జీవోత్ప్రేరక నిరోధకములను (Angiotensin Converting Enzyme inhibitors) ఆల్డోష్టిరోన్ గ్రాహక అవరోధకములను (aldosterone receptor blockers), రక్తనాళములను వ్యాకోచింపజేసి హృదయపు శ్రమను తగ్గించే ఔషధములు (vasodilators), శరీరములో లవణపు, నీరు ఎక్కువయి కాళ్ళు పాదములలో పొంగులు, ఊపిరితిత్తులలో నీటి ఉబ్బు కలిగినపుడు మూత్రకారకములను (diuretics) వైద్యులు ఉపయోగిస్తారు.
బీటాగ్రాహక అవరోధకములు (beta receptor blockers) :
హృదయవైఫల్యములో సత్ఫలితాల నిచ్చేవి కార్వెడిలాల్ (carvedilol) మెటోప్రొలాల్ (metoprolol), బిసోప్రొలాల్ (besoprolol) . ఇవి గుండెపై ఒత్తిడిని గుండె వేగమును తగ్గిస్తాయి. రక్తనాళములలో పోటుని తగ్గించి హృదయపు శ్రమను తగ్గిస్తాయి. బృహద్ధమని లోనికి ప్రసరించే రక్తశాతమును (ejection fraction), జఠరిక వ్యాపార నైపుణ్యమును పెంచి వ్యాయామ సహనమును పెంచుతాయి. లయ భేదములను అదుపులో ఉంచి జీవితకాలమును పెంచుతాయి. తక్కువ మోతాదులలో మొదలుపెట్టి రక్తపుపోటు, గుండె వేగము, రోగలక్షణములను గమనిస్తూ అవాంఛిత ఫలితములు రానంత మేరకు మోతాదులను క్రమముగా పెంచుతాము.
ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైము ఇన్హిబిటర్స్ (Angiotensin Converting Enzyme Inhibitors) :
కాలేయములో ఏంజియోటెన్సినోజెన్ (angiotensinogen)ఉత్పత్తి అయి మూత్రపిండములలో ఉత్పత్తి అయే రెనిన్ (Renin) వలన ఏంజియోటెన్సిన్ -1 గా మారుతుంది. ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏంజియోటెన్సిన్ -1 ని ఏంజియోటెన్సిన్ -2 గా మారుస్తుంది . ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్లు ఆ జీవోత్ప్రేరకమును నిరోధించి ఏంజియోటెన్సిన్ -2 ఉత్పత్తిని తగ్గిస్తాయి. అందువలన రక్తనాళముల సంకోచము తగ్గి రక్తపీడనము తగ్గుతుంది. ప్రధాన అవయవములకు రక్తప్రసరణ పెరుగుతుంది. రెనిన్ ఏంజియోటెన్సిన్ వ్యవస్థ వలన సమకూడే లవణపు నిలువలు నీటి నిలువలు తగ్గి రక్తఘనపరిమాణము తగ్గుతుంది. హృదయముపై భారము, హృదయపు శ్రమ తగ్గుతాయి. ఈ ఔషధముల వలన హృదయవైఫల్య లక్షణములు తగ్గి, రోగుల ఆయుఃప్రమాణము పెరుగుతుంది.
హృదయవైఫల్య లక్షణములు పొడచూపకపోయినా ఎడమజఠరిక వ్యాపారము మందగించిన వారిలోను (జఠరిక నుంచి బృహద్ధమనికి ప్రసరించు రక్తశాతము (ejection fraction) తగ్గిన వారిలో) హృదయధమనుల వ్యాధి (Coronary artery disease) కలవారిలోను, అధిక రక్తపీడనము, మధుమేహవ్యాధి కలవారిలోను ACE Inhibitors హృదయవైఫల్యమును అరికట్టుటకు ఉపయోగపడుతాయి.
తక్కువ మోతాదులలో మొదలుపెట్టి క్రమముగా రక్తపీడనమును, మూత్రపిండవ్యాపార పరీక్షలను, సీరమ్ పొటాసియపు విలువలను రక్తకణ గణనలను గమనిస్తూ మోతాదులను సర్దుబాటు చెయ్యాలి.
కొందఱిలో వీని వలన దగ్గు కలగవచ్చును. సీరమ్ లో పొటాసియమ్ విలువలు అధికమవ వచ్చును. నాలుక, పెదవులు, కనురెప్పలలో పొంగు (Angio edema) కలుగుతే ఈ మందుల వాడుకను వెంటనే మానివేయాలి.
ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములు (Angiotensin Receptor Blockers) :
ఇవి ఏంజియోటెన్సిన్ గ్రాహకములను అవరోధిస్తాయి. ACE Inhibitors ని దగ్గు మొదలైన కారణాల వలన సహించలేని వారికి ఇవి తోడ్పడుతాయి. మూత్రపిండ వ్యాపారమును, పొటాసియమ్ విలువలను ఈ మందులు వాడే వారిలో గమనిస్తూ ఉండాలి.
రక్తనాళ వ్యాకోచకములు (vasodilators) :
హైడ్రాలజిన్ (Hydralazine) : హైడ్రలజిన్ ధమనులను వ్యాకోచింపజేసి వానిలో పీడనమును తగ్గిస్తుంది. అందువలన హృదయపు శ్రమ తగ్గుతుంది.
నైట్రేట్లు (nitrates) : ఇవి సిరలను వ్యాకోచింపజేసి వానిలో రక్తసాంద్రతను (venous congestion) తగ్గిస్తాయి. పుపుస సిరలలో రక్తసాంద్రతను (pulmonary congestion) తగ్గిస్తాయి. జఠరికలలో రక్తప్రవాహ పీడనమును (ventricular filling pressure) తగ్గించి హృద్ధమనులను వ్యాకోచింపజేసి హృదయానికి రక్తప్రసరణను పెంచుతాయి. వీనివలన అల్పరక్తపీడనము (hypotension) కలిగే అవకాశమున్నది. అందువలన మోతాదులను సవరించ వలసిన అవసరము కలుగవచ్చును.
డిజోక్సిన్ (Digoxin) :
డిజిటాలిస్ ఆల్కలాయిడ్స్ హృదయ ముకుళితమును (contractility) పెంపొందజేస్తాయి. హృదయవేగమును తగ్గిస్తాయి. హృదయవైఫల్యమునకు ఒకప్పుడు తప్పనిసరిగా వాడే డిజాక్సిన్ మెరుగైన మందులు రావడము వలన, అవాంఛిత ఫలితముల వలన ఈ దినములలో ఎక్కువగా వాడబడుట లేదు. కర్ణికాప్రకంపనలు (atrial fibrillation) కల వారిలో జఠరికల వేగమును అదుపులో పెట్టుటకు వారిలో హృదయవైఫల్యపు చికిత్సలో డిజాక్సిన్ కి స్థానముంది. రక్తములో దీని విలువలను తఱచు పరీక్షించాలి. విలువలు అధికమైతే వికారము, వాంతులు, హృదయవేగము మందగించుట, లయ తప్పుట వంటి అవాంఛిత ఫలితములు కలుగుతాయి.
మూత్రకారకములు (Diuretics) :
హృదయవైఫల్యము వలన లవణము, నీరు శరీరములో అధికమయి, నీటిపొంగులు, ఊపిరితిత్తులలో నీటిపొంగు, సాంద్రత ఎక్కువయి ఆయాసము వంటి బాధలు కలిగిన వారిలో ఆ లక్షణములను నివారించుటకు మూత్రకారకములను ఉపయోగించవలసి ఉంటుంది. ఇవి మూత్రోత్పత్తిని పెంచి శరీరములో నీటిని, లవణమును తగ్గిస్తాయి. వీనిని ఉపయోగించినపుడు రక్తములో ఎలొక్ట్రలైటు
(electrolytes - విద్యుద్వాహక లవణములు) విలువలను, యూరియా నైట్రొజెన్ . క్రియటినిన్ విలువలను రక్తపీడనమును తఱచు గమనించాలి.
రక్తపరిమాణము విపరీతముగా తగ్గకుండా జాగ్రత్త పడాలి. రక్తప్రమాణము తగ్గినపుడు నిలుచున్నపుడు రక్తపీడనము తగ్గి కళ్ళుతిరుగుట, సొమ్మసిల్లుట వంటి లక్షణములు కలుగవచ్చును. శరీరపు బరువును గమనించి, పాదములు, కాళ్ళలో పొంగులను గమనిస్తూ, రోగులను తఱచు పరీక్షిస్తూ తగిన రక్తపరీక్షలు చేస్తూ వైద్యులు మూత్రకారకముల మోతాదును సరిచేస్తుంటారు.
థయజైడు మూత్రకారకములు (thiazide diuretics) ;
హైడ్రోక్లోర్ థయజైడ్ (Hydrochlorthiazide), క్లోర్థాలిడోన్ (Chlorthalidone) సాధుమూత్రకారకములు. మితముగా నీటిపొంగులు, నీటినిలువలు పెరిగిన వారికి మూత్రపిండముల వ్యాపార ప్రక్రియ బాగున్నవారిలో ఉపయోగపడుతాయి.
మెటోలజోన్ (metolazone) : థయజైడ్ మూత్రకారకమే గాని నెఫ్రాన్ నాళికల ప్రథమ, అంతిమ భాగాలపై పనిచేసి, లూప్ మూత్రకారకములతో బాటు వాడినపుడు మూత్రపిండవ్యాపారము మందగించిన వారిలో ఉపయోగపడుతుంది.
మెలిక మూత్రకారకములు (Loop diuretics) :
ఫ్యురొసిమైడ్ (furosemide), టోర్సిమైడ్ (torsemide) బ్యుమటిడిన్ (bumetanide) ఎథాక్రినిక్ ఏసిడ్ (ethacrynic acid) : వీనిని లూప్ డైయూరెటిక్స్ అని అంటారు. మూత్రపిండములలో వ్యాపార విభాగములైన నెఫ్రానుల నాళికల మెలికలపై పనిచేసి మూత్రము నధికము చేస్తాయి. వీనిని వాడే వారిలో పొటాసియమ్ కూడ వ్యర్థమవుతుంది కాబట్టి పొటాసియము లవణమును లేక పొటాసియమును పొదుపు చేసే మూత్రకారకములను కూడా సాధారణముగా వీటితో బాటు వాడవలసి ఉంటుంది.
మూత్రపిండముల వ్యాపారము తగ్గినవారిలో కూడా ఇవి పనిచేస్తాయి.
పొటాసియమును పొదుపు పఱచే మూత్రకారకములు (potassium sparing diuretics):
ఇవి ఆల్డోష్టిరోన్ గ్రాహకములను నిరోధించి మూత్రము నధికము చేస్తాయి. పొటాసియమును పొదుపుచేస్తాయి.
ఇవి సాధుమూత్ర కారకములు . అందువలన సాధారణముగా లూప్ మూత్రకారకములతో బాటు వాడుతారు.
స్పైరనోలేక్టోన్ (spironolactone), ఎప్లిరినోన్ (eplirenone) వాడుకలో ఉన్నవి. వీని వాడుక వలన పొటాసియము పెరిగే అవకాశమున్నది. మూత్రపిండముల వ్యాపారము బాగా మందగించినపుడు, ఏంజియోటెన్సిన్ ఎంజైమ్ నిరోధకములను వాడినపుడు, నాన్ ష్టీరాయిడల్ తాపకహరులను (non steroidal anti inflammatory agents) వాడే వారిలోను పొటాసియము అధికమయే అవకాశము ఎక్కువ. పొటాసియమ్ విలువలను తఱచు పరిశీలించాలి. హృదయవైఫల్యము తీవ్రమయిన వారిలో యివి రోగలక్షణములు నివారించుటకు, ఆయువును పెంచుటకు ఉపయోగపడుతాయి.
జఠరికల ముకుళింపును పెంపెందించే డోపమిన్ (dopamine), డోబ్యుటమిన్ (dobutamine) మిల్రినోన్ (milrinone) హృదయవైఫల్యము తీవ్రతరమైన వారిలో ఉపయోగపడుతాయి. వీనిని సిరల ద్వారా రోగులను నిత్యము గమనిస్తూ వైద్యశాలలలో వాడుతారు.
సాక్యుబిట్రిల్ / వాల్సార్టన్ (Sacubitril / Valsartan) లో వాల్సార్టన్ ఏంజియోటెన్సిన్ గ్రాహక నిరోధకము.(angiotensin receptor blocker) . సాక్యుబిట్రిల్ హృదయకండర కణములు ఉత్పత్తి చేసే నేట్రియురెటిక్ పెప్టైడు విధ్వంసమును అడ్డుకుంటొంది. ఆ రెండు రసాయనములు రక్తపీడనమును తగ్గిస్తాయి. మూత్రపు ఉత్పత్తిని పెంచి రక్తపరిమాణమును తగ్గిస్తాయి. ఈ ఔషధ మిశ్రమమును ప్రసరణ శాతము (ejection fraction) తగ్గిన వారికి ఉపయోగపడుతుంది.
రక్తహీనము (anemia), గళగ్రంథి ఆధిక్యత, గళగ్రంథిలోపము, బెరిబెరి వంటి వ్యాధులున్న వారికి
ఆ యా వ్యాధుల చికిత్సలు అవసరము.
జీవనశైలి మార్పులు :
హృదయవైఫల్యము ఉన్నవారు ఉప్పును మితముగా వాడాలి. త్రాగే నీటిని కూడా దినమునకు ఒకటిన్నర, రెండు లీటర్లకు మితపరచుకోవాలి. మూత్రకారకములను వాడుతూ నీటి నీటినెక్కువగా త్రాగే వారిలో సోడియమ్ విలువలు బాగా తగ్గే అవకాశమున్నది.
పొగత్రాగరాదు. విపరీత లక్షణములు లేని వారు తగినంత వ్యాయామమును చెయ్యాలి. ఊబకాయమున్నవారు బరువు తగ్గుటకు కృషిచెయ్యాలి. కొలెష్టరాలును అదుపులో ఉంచుకోవాలి. మధుమేహవ్యాధిని అదుపులో పెట్దటుకోవాలి. హృదయముపై వ్యతిరేకముగా పనిచేసే ఔషధాల వాడుకను నియంత్రించాలి.
ప్రాణవాయువు :
కేశనాళిక ప్రాణవాయు పరిమాణము (capillary oxygen saturation) తగ్గిన వారికి ఆయాసమున్న వారికి ప్రాణవాయువును కృత్రిమముగా అందించాలి.
ఊపిరితిత్తులలో నీటిపొంగు ఔషధములకు త్వరగా తగ్గక రక్తపు ప్రాణవాయువు విలువలు బాగా తగ్గినపుడు, బొగ్గపులుసు వాయువు ప్రమాణములు బాగా పెరిగినపుడు, కృత్రిమశ్వాసపరికరములను ఉపయోగించవలసి ఉంటుంది.
రక్తశుద్ధి (Dialysis) :
హృదయవైఫల్యముతో బాటు మూత్రపిండముల వైఫల్యము చివరి దశలో ఉన్నవారికి రక్తశుద్ధి చేస్తూ వ్యర్థపదార్థములను, అధికమైన జలలవణములను కూడా తొలగించాలి. అందఱిలో యీ రక్తశుద్ధి సాధ్యము కాదు.
శస్త్రచికిత్సలు :
హృద్ధమనుల వ్యాధి ఉన్నవారికి ధమనుల వ్యాకోచప్రక్రియ (angioplasty with stent placement), లేక ప్రత్యామ్నాయ ప్రసరణ శస్త్రచికిత్సలు (Arterial bypass surgery) చేసి హృదయపు రక్తప్రసరణను పునరుద్ధింపజేయాలి.
హృదయపు విద్యుత్ప్రేరణ ఉత్పత్తి లోను (generation of electrical impulse), విద్యుత్ప్రేరణ ప్రసరణలలో (conduction of electrical impulse) భంగమేర్పడి కర్ణికలు, జఠరికల వేగము మందగించిన వారికి కృత్రిమ హృదయ విద్యత్ప్రేరణ పరికరము (cardiac pacemaker) అమర్చాలి.
హృదయకవాట పరిమాణములు బాగా తగ్గిన వారికి (valvular stenosis), పరిమాణములు పెరిగి రక్త తిరోగమనము (valvular regurgitation) విపరీతముగా నున్నవారికి కొత్త కవాటములను అమర్చాలి.
హృదయకోశములో నీరుపట్టిన వారికి (pericardial effusion) ఆ నీటిని తొలగించాలి. హృదయకోశపు తాపప్రక్రియ (pericarditis) వలన హృదయ ముకుళిత వికాసములకు భంగ మేర్పడిన వారికి శస్త్రచికిత్సతో హృదయకోశమును తొలగించాలి (pericardiectomy) .
ఎడమ జఠరిక నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించు రక్తశాతము - ప్రసరణశాతము (ejection fraction) 35 % కంటె తక్కువైతే ఔషధములతో చికిత్స చేసి తగిన ప్రగతి కనిపించకపోతే వారికి
ప్రకంపన నిరోధిని (defibrillator) అమర్చి ఆకస్మిక హృదయమరణములను తగ్గించవచ్చును.
హృదయ ముకుళిత సహాయ పరికరములు (ventricular assist devices) తాత్కాలిక ప్రయోజనమునకు లభ్యము. ఇతర అవయవ వ్యాపారములు బాగుండి, వయోవృద్ధులు కాని వారికి హృదయమార్పిడి చికిత్సను (cardiac transplantation) పరిశీలించాలి.
హృదయవైఫల్యమును వైద్యులు నిత్యము చూస్తారు. కొందఱికి అత్యవసర చికిత్స అవసరము.
చికిత్సలో రక్తపరీక్షలు, బాధితులను తఱచు పరీక్షించుట, చాలా అవసరము. ఇదివరలో లక్షణములకే చికిత్సలు ఉండేవి. ఇప్పుడు హృదయవ్యాపారమును మెరుగు పఱచే చికిత్సలు లభ్యమయి హృదయవైఫల్యము గలవారి ఆయుః ప్రమాణములలో పెరుగుదల, లక్షణములకు ఉపశమనము పెరుగుట గమనిస్తున్నాము.
(నా వ్యాసముల లక్ష్యము వైద్యవిషయాలను తెలుగులో చెప్పడము, తగిన సమాచారమును చేకూర్చుట, వైద్యవిషయములపై అవగాహన నా శక్తిమేరకు చేకూర్చడము మాత్రమే. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి.
(ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి)
-----------------------------------------------------

29, అక్టోబర్ 2018, సోమవారం

వ్యాపకజ్వరము ( Influenza )

డా. గన్నవరపు నరసింహమూర్తి .
( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో )
ఫ్లూ ( వ్యాపక ) జ్వరాలు ప్రతి సంవత్సరము చాలా దేశాలలో పొడచూపుతాయి. ఫ్లూ బహుళవ్యాపక వ్యాధిగా ( epidemic ) చాలామందికి కలుగవచ్చును . చాలా మందిలో దానంతట అది తగ్గిపోయినా , ఈ జ్వరాలు ప్రపంచ మంతటా వ్యాపకమయి చాలా మృత్యువులకు కారణమయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ ఫ్లూ పూర్తిపేరు ఆంగ్లములో Influenza . దీని ప్రాభవము అనేక జనులపై ఉండుట వలన దానికా పేరు కలిగింది.
సాధారణముగా ఈ వ్యాపకజ్వరాలు పశ్చిమ దేశాలలో ఆకురాల్చు కాలములోను , శీతాకాలములోను పొడచూపుతాయి.
వ్యాపక జ్వరములు ఇన్ఫ్లుయెంజా A , B, C, D అనే విషజీవాంశువులు ( Viruses ) వలన కలుగుతాయి.
విషజీవాంశువులు ( viruses ) అతిసూక్ష్మమైనవి. వీటికి కణనిర్మాణముండదు. వాటంతట అవి మనజాలవు. వాటంతట అవి ప్రత్యుత్పత్తి చెందజాలవు. వీటిలో జీవరాశులలో వలె జీవవ్యాపారక్రియలు జరగవు. ఈ విషజీవాంశువులు యితర జీవకణాలలో ప్రత్యుత్పత్తి అవుతాయి. ఇవి న్యూక్లియకామ్లములతో ( Nucleic acids ) నిర్మితమవుతాయి. వీనిలో పొందుపఱచబడిన న్యూక్లియకామ్లము బట్టి డీఆక్సీరైబోజ్ న్యూక్లియకామ్ల విషజీవాంశువులు ( DNA Viruses ) , రైబోజ్ న్యూక్లియకామ్ల విషజీవాంశువులు ( RNA Viruses) గాను వీనిని విభజించవచ్చు.
వ్యాపక జ్వరాలు ( Influenza ) కలిగించే విషజీవాంశువులు రైబోజ్ న్యూక్లియకామ్ల విషజీవాంశువులు RNA Viruses) . ఇవి Orthomyxoviridae సముదాయమునకు చెందుతాయి.
Influenza - A మనుజులకే కాక యితర క్షీరదములకు , పక్షులకు కూడా వ్యాధిని కలిగించగలవు. వీటి వలనే విశ్వవ్యాపక వ్యాధులు ( Pandemics ) , తీవ్రవ్యాధులు కలుగుతాయి. ఈ జీవాంశువుల ఉపరితలముపై హీమెగ్లూటినిన్ hemagglutinin ( HA ) న్యూరెమినిడేజ్ neuramidinase (NA) అనే ప్రతిరక్షకజనకము ( antigens ) లుంటాయి. ఆ ప్రతిరక్షకజనకములలో విభాగముల బట్టి ఈ విషజీవాంశువులను విభజిస్తారు. వీనిలో జన్యుపదార్థము ఎనిమిది ఒంటి పోగుల RNA తునుకలుగా ఉంటుంది. అందువలన కొత్త విషాంశువుల ప్రత్యుత్పత్తి జరిగినపుడు జన్యుపదార్థపు మార్పులు
( mutations ) కలిగే అవకాశములు మెండు.
Influenza -B మనుజులలోనే చూస్తాము . సీలుచేపలకు, ఫెరెట్ పిల్లులకు ఈ వ్యాధి కలుగవచ్చు.
ఈ విషజీవాంశువులలో మార్పులు ( mutations) తఱచు జరగవు. అందువలన చాలా మందికి ఒకసారి సోకగానే వ్యాధినెదుర్కొనే శక్తి కలుగుతుంది. విశ్వవ్యాపకవ్యాధులు దీని వలన కలగవు.
Influenza - C మనుజులకే కాక పందులకు , కుక్కలుకు కూడా సోకగలదు. ఈ వ్యాధి అసాధారణమైనా తీవ్రముగా ఒక్కొక్క ప్రాంతములో వ్యాప్తి జెందగలదు.
Influenza - D వ్యాధి పశువులకు పందులకు సోకుతుంది. మనుజులకు సోకగలిగినా యింతవఱకు మనుజులలో యీ వ్యాధి కలిగిన సూచనలు లేవు.
వ్యాపకజ్వరాలు వ్యాప్తి :
వ్యాపకజ్వరము సోకిన వారు దగ్గు తుమ్ముల ద్వారా విషజీవాంశు రేణువులను గాలిలోనికి వెదజల్లుతారు. దగ్గఱలో ఉన్నవారు ఆ నలుసులను పీల్చినా , లేక ఆ నలుసులు పడిన వస్తువులను తాకి ఆ చేతితో ముక్కు , నోరు , కళ్ళను తాకినా, ఆ విషజీవాంశువులు శరీరములోనికి ప్రవేశిస్తాయి. వ్యాధి గలవారిని స్పర్శించుట వలన , వారితో కరచాలనములు చేయుట వలన ఆ విషాంశువులను అంటించుకొనే అవకాశము ఉన్నది.
ఈ విషాంశువులు వస్తువుల ఉపరితలములపైన 24 నుంచి 48 గంటల వఱకు మనగలవు. తుమ్ములు , దగ్గుల వలన గాలిలో వెదజల్లబడినా అవి త్వరగానే బరువు వలన క్రిందకు చేరుకుంటాయి. గాలిలో ఎక్కువ కాలము ఉండవు. తేమ ఎక్కువగా ఉన్నా , సూర్యకాంతిలో అతినీలలోహిత కిరణాల వలన ( ultraviolet rays ) ఈ విషాంశువులు త్వరగా ధ్వంసమవుతాయి , సబ్బు , బట్టలసోడా , ఆల్కహాలు ఈ విషాంశువులను నశింప చేస్తాయి.
విషాంశువులు ముక్కు , గొంతుక , ఊపిరితిత్తుల కణముల పొరలకు హీమెగ్లూటినిన్ ల ద్వారా అంటుకొని పిదప కణముల లోనికి చొచ్చుకుంటాయి. ఆ కణములలో వాటి ప్రత్యుత్పత్తి జరిగి అనేక విషజీవాంశువులు కణముల నుంచి విడుదలవుతాయి. ఆక్రమించబడిన కణములు విధ్వంసము పొందుతాయి.
వ్యాపకజ్వర లక్షణములు :
స్వల్ప తీవ్రత గల వారిలో ఏ లక్షణములు కనిపించకపోవచ్చును. వ్యాధి సోకిన వారిలో ఒంటినొప్పులు కండరముల పీకు, శరీరమంతా నలత , గొంతునొప్పి , ముక్కుకారుట, జ్వరము , వణుకు , తలనొప్పి , దగ్గు , కలుగుతాయి. ఈ లక్షణములు రెండు దినముల నుంచి వారము వఱకు ఉండి క్రమేణ రోగులు కోలుకుంటారు. పిల్లలలో వాంతులు , విరేచనములు కలుగవచ్చు. ముక్కు కారుట కొంత ఉన్నా సాధారణ జలుబులో వలె ఎక్కువగా ఉండదు. సాధారణ జలుబు చేసిన వారిలో జ్వరము ఎక్కువగా ఉండదు. ఫ్లూ కలిగిన వారిలో ఒంటినొప్పులు , జ్వరము ఎక్కువగా ఉంటాయి.
వ్యాధినిరోధకశక్తి తక్కువయిన వారిలోను , వ్యాధితీవ్రముగా నున్నవారిలోను వ్యాపకజ్వరములో ఊపిరితిత్తుల తాపము ( Pneumonitis ) విషజీవాంశువుల వలన కాని , ఆ పిమ్మట దాడి సలిపే సూక్ష్మాంగజీవుల ( bacteria ) వలన , లేక రెండిటి వలన కాని కలుగ వచ్చును. విషజీవాంశువుల వలన కలిగే ప్రాథమిక పుపుసతాపములో ( Primary pneumonia) రోగులు త్వరగా కోలుకోక జ్వరము కొనసాగి, పొడి దగ్గు , లేక తక్కువ కఫముతో దగ్గు , ఆయాసము కలుగుతాయి.
సూక్ష్మజీవుల వలన ఊపిరితిత్తుల తాపము కలిగిన వారిలో ( Secondary bacterial pneumonia ) ముందు జ్వరము తగ్గినా మళ్ళీ జ్వరము , దగ్గు పుంజుకుంటాయి. వీరిలో కఫము ఎక్కువగా ఉంటుంది. ఆయాసము కూడా కలుగవచ్చును. స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా ( Streptococcus Pneumoniae ), స్టాఫిలోకోకస్ ఆరియస్ ( Staphylococcus Aureus ) , హీమోఫిలస్ ఇన్ ఫ్లుయెంజా ( Haemophilus Influenzae ) సూక్షాంగజీవుల వలన తఱచు ఈ ఊపిరితిత్తుల తాపము ఉపద్రవముగా సంక్రమిస్తుంది . ఊపిరితిత్తుల తాపము ఎక్స్ రే చిత్రములలో ప్రస్ఫుటముగా కనిపిస్తుంది.
ఊపిరితిత్తుల తాపము తీవ్రతరమయితే శ్వాసవైఫల్యము ( respiratory failure) కూడా కలిగే ప్రమాదము గలదు.
వ్యాధిగ్రస్థులలో క్రొత్త విషజీవంశువుల ప్రత్యుత్పత్తి కలిగినపుడు వాటి జన్యుపదార్థము
( genome ) లో మార్పులు ( mutations) స్వల్పముగానో ( viral drift ) , ఎక్కువగానో జరిగినపుడు
( viral shift ) వ్యాపకజ్వరముల తీవ్రత అధికము కావచ్చును, వాటి ఉగ్రత అధికమయి వ్యాధి అధికసంఖ్యాకులకు సోకి త్వరగా వ్యాపించవచ్చును.
వ్యాధి నిర్ణయము :
వ్యాపకజ్వరములు ప్రబలముగా నున్నపుడు వ్యాధి లక్షణముల బట్టి వ్యాధిని నిర్ణయించవచ్చును. జ్వరము , దగ్గు ఎక్కువగా ఉండి ముక్కు కారుట తక్కువగా ఉంటే వ్యాపకజ్వరము ( influenza ) అయే అవకాశములు హెచ్చు. ముక్కు , గొంతుకల నుంచి పత్తిపుల్లతో సేకరించిన శ్లేష్మమును ప్రతిరక్షకజనకములకు ( antigens ) పరీక్షించి వ్యాధిని నిర్ణయించవచ్చును. polymerase Chain Reaction తో ప్రతిరక్షకజనకము లుత్పత్తి చేసి జన్యుపదార్థములను కనుగొనవచ్చును. ప్రతిరక్షకములను direct fluorescent antibody test తో కనుగొనవచ్చును. శ్లేష్మములోని విషజీవాంశువులను వృద్ధిచేసి
( culture ) వ్యాధిని నిర్ణయించ వచ్చును.
వ్యాధి చికిత్స :
వ్యాపక జ్వరాలు ఉన్నవారిలో చాలామందికి ఉపశమన చికిత్సలు సరిపోవచ్చును. ఎసిటెమైనోఫిన్ , పారాసిటమాల్ జ్వరమునకు తలనొప్పికి వాడవచ్చును. పిల్లలలో ఏస్పిరిన్ రేయీస్సిండ్రోమ్ ( Reye’s Syndrome) కలిగించవచ్చు, కాబట్టి ఏస్పిరిన్ వాడరాదు. తగినంతగా ద్రవపదార్థములు , ఆహారము విశ్రాంతి సమకూర్చాలి. వీరు మద్యము సేవించరాదు. పొగత్రాగుట మంచిది కాదు. వ్యాధి తీవ్రత వీటి వలన పెరుగుతుంది.
మందులు :
న్యూరమిడినేజ్ నిరోధకములు ( Neuramidinase inhibitors ) : ఇవి విషజీవాంశువుల పొరపై గల న్యురమిడినేజ్ అనే జీవోత్ప్రేరకమునకు ( enzyme ) అవరోధము కలగించి విషజీవాంశువుల విడుదలను నిరోధిస్తాయి. ఓసెల్టమివీర్ ( Oseltamivir -( Tamiflu ) వయోజనులలో 75 మి.గ్రాలు దినమునకు రెండు పర్యాయములు , జెనమివీర్ ( Zanamivir ( Relenza ) వయోజనులలో 10 మి.గ్రా లు పీల్పువుగా దినమునకు రెండు సారులు 5 దినములు వ్యాధి చికిత్సకు , నివారణకు కూడా వాడవచ్చు.
ఎమాంటడిన్ ( Amantadine ) ఇన్ ఫ్లుయెంజా ఏ కి వాడవచ్చు. ఈ ఔషధములను వ్యాధి కలిగిన 24 - 48 గంటలలో మొదలుపెడితే ప్రయోజనము ఎక్కువ.
సూక్ష్మాంగజీవుల విపక్షక ఔషధములు ( antibiotics) ఫ్లూ జ్వరము తర్వాత సూక్షాంగజీవులు ( bacteria) వలన కలిగే ఊపిరితిత్తుల తాపము ( Pneumonia) నకు , శ్వాసనాళిక పుపుసనాళికల తాపమునకు ( Bronchitis) ఉపయోగిస్తారు. విషాంశువులపై వాటి ప్రభావము శూన్యము.
వ్యాధితీవ్రముగా నున్నవారికి వైద్యాలయములలో చికిత్స లందించాలి.
వ్యాపక జ్వరముల నివారణ :
ఇన్ఫ్లుయెంజా నివారణకు టీకాలు లభ్యము. 6 మాసములు నుంచి 18 సంవత్సరముల వారు , 50 సంవత్సరములు నిండిన వారు, ఫ్లూ కాలములో గర్భిణీస్త్రీలు , ఫ్లూ కాలములో గర్భము దాల్చబోయే స్త్రీలు , ఉబ్బస , మధుమేహము , శ్వాసకోశపు వ్యాధులు , హృద్రోగములు వంటి ఇతర వ్యాధులున్న వారు , ఆరోగ్యవిధులలో పనిచేసేవారు టీకాలు వేసుకొనుట మేలు.
వ్యాపక జ్వరాలున్నవారికి దూరముగా ఉండుట , స్పర్శ , కరచాలనాదులను వీలయినంతగా పాటించక పోవుట వలన , నోరు ముక్కులపై కప్పులను ( masks ) ధరించుట వలన , చేతులను తఱచు కడుక్కొనుట వలన, శుభ్రము చేసుకొనుట వలన , నోరు , ముక్కు ,కనులు , ముఖములపై చేతులను చేర్చకపోవుట వలన వ్యాపక జ్వరములను కొంతవఱకు నివారించ గలుగుతాము.
దగ్గు , తుమ్ములున్న వారు మోచేతిని గాని జేబురుమాలుని కాని నోటికి , ముక్కుకి అడ్డుపెట్టుకొని దగ్గుట, తుమ్ముట చేస్తే తుంపరలను వ్యాప్తి చేయరు.
( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును )

25, సెప్టెంబర్ 2018, మంగళవారం

దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ( Chronic Obstructive Pulmonary Disease )

                                    దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ( Chronic Obstructive Pulmonary Disease )



( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ).                               డా. గన్నవరపు నరసింహమూర్తి 

                                                     
                                                           ఇంటికి సెగనుం  బెట్టరు
                                                       కంటికిఁ బొగబెట్టిరేని కారును జలముల్
                                                       పెంటా యూపిరితిత్తులు ? ?
                                                       మంటలఁ దెగఁ బాలుసేయ , మానక పొగలన్ ! !


శరీర కణజాలపు జీవ ప్రక్రియలో ప్రాణవాయువు ( Oxygen) గ్రహించబడి బొగ్గుపులుసు వాయువు ( Carbon dioxide ) విడుదల అవుతుంది. వివిధ అవయవముల కణజాలమునకు రక్తము ద్వారా ప్రాణవాయువు అందించబడుతుంది. ఆయా కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువు రక్తములోనికి చేరుతుంది. ఊపిరితిత్తులు ప్రాణవాయువుని రక్తమున కందించి రక్తమునుంచి బొగ్గుపొలుసు వాయువుని గ్రహించి బయటకు విసర్జిస్తాయి. నిరంతరము ప్రాణవాయవుని రక్తమునకు చేర్చుటకు , బొగ్గుపులుసు వాయువుని విసర్జించుటకు ఊపిరితిత్తులలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో గాలి ప్రసరణ , ఊపిరితిత్తులకు రక్తప్రసరణ అవసరము.
వాతావరణములో నున్న గాలి ముక్కు , గొంతుక , స్వరపేటిక ల ద్వారా శ్వాసనాళము( Trachea) నకు చేరుతుంది. శ్వాసనాళము రెండు పుపుసనాళములుగా ( Bronchi ) చీలి రెండు ఊపిరితిత్తుల వాయుప్రసరణకు సహాయపడుతుంది. ప్రతి ఊపిరితిత్తిలో పుపుసనాళము ప్రథమ, ద్వితీయ, తృతీయ , అంతిమ పుపుసనాళికలుగా ( Primary, secondary tertiary and terminal bronchioles ) శాఖలై పిదప శ్వాసనాళికలు ( Respiratory bronchioles) , వాయుగోళనాళికలుగా
( Alveolar ducts ) చీలి చిట్టచివర వాయుగోళములను ( Alveoli ) ధరిస్తాయి. ఈ వాయుగోళములు , వాని దరిని ఉండు సూక్ష్మరక్తనాళికల ( Capillaries ) మధ్య వాయువుల మార్పిడి జరుగుతుంది. ఊపిరితిత్తులకు పుపుసధమని ( Pulmonary Artery ) ద్వారా రక్తము చేరి పువుససిరల
( Pulmonary veins) ద్వారా రక్తము హృదయమునకు తిరిగి చేరుకుంటుంది.
ఊపిరితిత్తులలో దీర్ఘకాలము పదేపదే తాపప్రక్రియ ( irritation and inflammation ) జరుగుట వలన కలిగే విధ్వంసముచే వాయుప్రసరణకు ( ముఖ్యముగా నిశ్వాసమునకు ) అవరోధము కలిగి దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ( Chronic Obstructive Pulmonary Disease - COPD ) కలుగుతుంది. దీని వలన దగ్గు , కఫము, ఆయాసము కలుగుతాయి.
ఈ వ్యాధిలో ఊపిరితిత్తుల ఉబ్బుదల ( Emphysema) , దీర్ఘకాలిక పుపుస, శ్వాసనాళికల తాపము ( Chronic Bronchitis) రెండు ప్రక్రియలను గమనిస్తాము. తాపప్రక్రియ వలన వాయుగోళముల , సాగుకణజాలపు విధ్వంసము జరిగి శ్వాసవృక్షపు చివరలో గాలి ఎక్కువై ఉబ్బుదల కనిపిస్తుంది. కఫముతో కూడిన దగ్గు సంవత్సరములో మూడు నెలలు చాలా దినములు , వరుసగా రెండు సంవత్సరాలుంటే దానిని దీర్ఘకాలిక పుపుస శ్వాసనాళికల తాపము ( Chronic Bronchitis) గా నిర్ణయించవచ్చును. ఈ వ్యాధి క్రమ క్రమముగా తీవ్రమవుతుంది. ఊపిరతిత్తులలో వాయుగోళములు పుపుస శ్వాసనాళికల విధ్వంసము, నష్టము శాశ్వతమవుట వలన ఊపిరితిత్తుల వ్యాపారము సామన్య స్థితికి తిరిగి రాదు. ఉబ్బసకు దీనికి అదే తేడా.
వ్యాధికి కారణములు :
పుపుస నాళికలలో పరంపరలుగా తాపప్రక్రియ జరుగుటకు ప్రధాన కారణము ధూమపానము. ధూమపానము సలిపే వారిలో 20 నుంచి 50 శాతమపు మందిలో దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి జీవిత కాలములో పొడచూపుతుంది. వయస్సు పెరిగిన కొలది వ్యాధిలక్షణములు హెచ్చవుతాయి.
హానికరమైన యితర గాలులు , గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్ళలో వంట పొయ్యిల నుంచి వచ్చే పొగ వలన , బొగ్గుగనులు , బంగారు గనులలో ధూళి, పొగలు , రసాయినకములు , హానికర యితర వాయువులు పీల్చుట వలన పనిచేసే కార్మికులకీ వ్యాధి కలుగ వచ్చును. పట్టణాలలో వాతావరణ కాలుష్యము ఈ వ్యాధికి దోహదకారి అవుతుంది.
జన్యు పరముగా వచ్చే ఆల్ఫా- 1 ఏంటిట్రిప్సిన్ లోపము ( alpha-1 Antitripsin deficiency ) వలన దీర్ఘకాలిక శ్వాసావరోధక వ్యాధి పిన్నవయస్సులో రావచ్చును. ఈ వ్యాధి ఉన్నవారిలో ఆల్ఫా -1 ఏంటిట్రిప్సిన్ లోపమున్నవారు 2 శాతము వఱకు ఉండవచ్చును. ఇతర కుటుంబసభ్యుల కీ వ్యాధి ఉన్నా ,45 సంవత్సరముల వయస్సు లోపల ఈ వ్యాధి కనిపించినా, ఊపిరితిత్తుల క్రింద భాగములలో ఉబ్బుదల ఎక్కువగా ఉన్నా ఆల్ఫా- 1 ఏంటిట్రిప్సిన్ కు తప్పకుండా పరీక్ష చెయ్యాలి.
వ్యాధిగతి ;
దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ఊపిరితిత్తులలో పరంపరలుగా కలిగే తాపము ( Inflammation) , మాంసకృత్తు విచ్ఛేదనములు ( Proteinases ),మాంసకృత్తుల అవిచ్ఛేదనముల (Antiproteinases ) మధ్య తారతమ్యములు , ఆమ్లజనీకరణము ( Oxidation) , కణజాలపు సహజమృతి ( Apoptosis ) వలన పురోగమిస్తుంది.
పుపుసనాళికలు వాయుగోళములలో తాపము వలన వాపు , అధికముగా శ్లేష్మపు ఉత్పత్తి , వాయుగోళముల విధ్వంసము , తంతీకరణము ( fibrosis) , సాగుకణజాలపు ( elastic tissue) విధ్వంసము జరిగి ఊపిరితిత్తుల ఉబ్బుదల ( emphysema) కలుగ జేస్తాయి. పుపుసరక్తనాళములపై కూడా ఈ తాప ప్రభావము ఉంటుంది.
పై మార్పులు ఊపిరిపైన ఫలితము చూపిస్తాయి. నిశ్వాసము మందగిస్తుంది. ఊపిరి వదలడము శ్రమభరితమవుతుంది. నిశ్వాస వాయుప్రసరణము తగ్గుతుంది. వాయుగోళములలో గాలి ఎక్కువగా చేరుకొని ఊపిరితిత్తులు ఉబ్బుతాయి. వాయు ప్రసరణ తగ్గుట వలన , తాపము వలన , వాయుగోళముల విధ్వంసము వలన వాయుగోళములు సూక్ష్మరక్తనాళముల మధ్య ప్రాణవాయువు బొగ్గుపులుసు వాయువుల మార్పిడి మందగిస్తుంది. పుపుసధమనులలో రక్తపుపోటు కూడా హెచ్చవుతుంది ( Pulmonary hypertension ). అందువలన వ్యాధి బాగా ముదిరిన వారిలో హృదయపు కుడి జఠరికపై ( Right ventricle) పనిభార మధికమై హదయవైఫల్యమునకు ( congestive heart failure ) దారితీస్తుంది.
వ్యాధి ప్రకోపించి చివరి దశలలో రక్తములో ప్రాణవాయువు పరిమాణము తగ్గి, బొగ్గుపులుసు వాయువు పరిమాణము పెరిగి , శ్వాసవైఫల్యము ( Respiratory failure) , రక్తపు ఆమ్లీకరణలకు
( Respiratory acidosis) దారితీస్తాయి
శ్వాసావరోధవ్యాధి కలవారిలో గుండెజబ్బులు, ఎముకల బలము తగ్గుట ( Osteoporosis ) కండరముల నీరసము ఎక్కువగా కలుగుతాయి.
వ్యాధి లక్షణములు :
ఊపిరితిత్తుల వ్యాపారము బాగా దెబ్బతినే వఱకు ( FEV1 50 శాతమునకు మించి క్షీణించే వఱకు ) ఏ లక్షణములు పొడచూపవు.
దీర్ఘకాలిక శ్వాసావరోధవ్యాధి తీవ్రమయిన వారికి తఱచు దగ్గు, కఫము, ఆయాసము, ఊపిరి వదిలేటప్పుడు పిల్లికూతలు కలుగుతాయి. ప్రారంభ దశలో ఆయాసము పనిచేస్తున్నపుడు , శారీరక శ్రమ సమయములలో కలిగినా వ్యాధి ముదిరాక విశ్రాంతసమయములలో కూడా కలుగవచ్చును. సూక్ష్మజీవులు, విషజీవాంశువులు( viruses ) , హానికర వాయువులు , వలన ఊపితిత్తులలో తాపము కలిగినపుడు , వ్యాధి లక్షణములు హెచ్చుగా కన్పిస్తాయి. ఆయాసము పెరిగినపుడు ఆందోళన కూడా కలుగుతుంది. కఫమునకు సాధారణస్థితులలో రంగు ఉండదు. సూక్ష్మజీవుల వలన తాపము కలిగినప్పుడు కఫము చీము రంగులోను, పచ్చరంగులోను ఉంటుంది. రక్తములో బొగ్గుపులుసుగాలి పెరిగితే అతినిద్ర , అపస్మారక స్థితి కలుగవచ్చును.
వీరిలో ఊపితిత్తుల ఉబ్బుదల వలన ఛాతి పీపా ఆకారములో ఉంటుంది. ఛాతి ముందు నుంచి వెనుక ప్రమాణము ఎక్కువవుతుంది. ఆయాసము ఉన్నవారిలో ఊపిరి కొఱకు కంఠకండరముల వంటి అదనపు కండరములు కూడా శ్రమించుట గమనిస్తాము. వినికిడి గొట్టముతో విన్నపుడు ఛాతిలో ఊపిరి శబ్దములు మందకొడిగా ఉంటాయి. నిశ్వాస శబ్దముల నిడివి పెరుగుతుంది. పిల్లికూతలు ( Wheezing) వినిపిస్తాయి. ఛాతిపై వేళ్ళుపెట్టి వానిని రెండవచేతి మధ్యవేలుతో కొడితే ప్రతిధ్వని మోత ఎక్కువగా ( hyper resonance ) ఉంటుంది.
వ్యాధి నిర్ణయము :
దీర్ఘకాలము పొగ త్రాగిన వారిలోను , వృత్తిపరముగా హానికర వాయువులను, దుమ్ములను పీల్చే వారిలోను, గనులలో పనిచేసేవారిలోను దగ్గు, కఫము, ఆయాసము కలుగుతే శ్వాసవ్యాపార పరీక్షలు
( Pulmonary function tests ) , ఛాతికి ఎక్స్ - రేలు చేయుట వలన వ్యాధిని నిర్ణయించవచ్చును. చాలా సంవత్సరాలు పొగ త్రాగిన వారిలోను , తాపజనక వాయువులను పీల్చిన వారిలోను వ్యాధి పొడచూపక మునుపే శ్వాస వ్యాపారపరీక్షలు చేసి వ్యాధిని త్వరగా కనిపెట్టుట మంచిది.
శ్వాసవ్యాపార పరీక్షలు :
శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary function tests ) శ్వాసకు అవరోధమును కనుగొనుటకు సహాయపడతాయి. శ్వాసమాపకము ( Spirometer ) అనే పరికరమును శ్వాసవ్యాపార పరీక్షలకై ఉపయోగిస్తారు.
సుదీర్ఘ సంపూర్ణ ఉచ్ఛ్వాసము ( forced inspiration ) , తదుపరి సత్వర సుదీర్ఘ నిశ్వాసములను
( forced expiration) ఈ పరికరముతో కొలుస్తారు. బలమైన దీర్ఘ ఉచ్ఛ్వాసము తర్వాత బలమైన దీర్ఘ నిశ్వాసముతో వదిలే గాలి ఘనపరిమాణమును సంపూర్ణశ్వాస ప్రమాణము (Forced Vital Capacity FVC ) గా పరిగణిస్తారు.
బల ఉచ్ఛ్వాసముతో గాలి పీల్చిన పిదప బల నిశ్వాసముతో మొదటి సెకండులో వదిలే గాలి పరిమాణము ( Forced Expiratory Volume/ first second FEV1 ) ను , మొదటి సెకండులో నిశ్వాసముతో వదల గలిగే గాలి / సంపూర్ణశ్వాస ప్రమాణము FEV1 / FVC ) నిష్పత్తిని ఉపయోగించి అవరోధక పుపుస వ్యాధులను ( Obstructive lung diseases ), నిర్బంధ పుపుస వ్యాధులను
( Restrictive lung diseases ) వేఱుపఱచ వచ్చును.
అవరోధక శ్వాసవ్యాధులు ( ఉబ్బసము, దీర్ఖకాలిక శ్వాసావరోధము, ఊపిరితిత్తుల ఉబ్బుదల ) ఉన్న వారిలో సంపూర్ణశ్వాస ప్రమాణము ( FVC ) తగ్గినా , బలనిశ్వాస వాయుపరిమాణము -1 ( మొదటి సెకండులో బలముగా వదల గలిగే గాలి పరిమాణము FEV1 ) విశేషముగా ( 70 శాతము కంటె
తక్కువగా ) తగ్గుతుంది .
శ్వాసనాళిక వ్యాకోచ చికిత్సానంతరము ( Post bronchodilator treatment ) దీర్ఘకాలిక శ్వాసావరోధము గల వారిలో శ్వాస వ్యాపార పరీక్షలు కొద్దిగా మాత్రము మెఱుగవుతాయి. ఉబ్బసవ్యాధిగ్రస్థులలో శ్వాసనాళ వ్యాకోచ చికిత్సతో శ్వాసవ్యాపారము చాలా మెఱుగవుతుంది. మొదటి సెకండు నిశ్వాస వాయు పరిమాణము విశేషముగా వృద్ధి చెందుతుంది.
నిర్బంధవ్యాధులు : ఊపిరితిత్తులలో తంతీకరణము ( Pulmonary Fibrosis ), పుపుసపరివేష్టనపు వ్యాధులు ( Diseases of Pleura ) వలన ఉచ్ఛ్వాసమునకు అడ్డంకి కలిగిన వారిలో సంపూర్ణ శ్వాసప్రమాణము ( FVC ) , మొదటి సెకండులో నిశ్వాసప్రమాణము ( FEV1 ) సమాంతరముగా తగ్గుతాయి.
ఈ వ్యాధులు లేనివారలలో శ్వాసవ్యాపార పరీక్షలు సాధారణ పరిమితిలో ఉంటాయి.
బలనిశ్వాస వాయు ప్రమాణము-1 ( FEV1 ) వయస్సు, ఎత్తు , బరువు , లింగముల బట్టి ఉండవలసిన విలువను అంచనా వేసి ఆ విలువ కంటె తగ్గుదల బట్టి దీర్ఘకాలిక శ్వాసావరోధపు తీవ్రతను నిర్ణయిస్తారు.
FEV -1 అంచనాలో 80 % కంటె ఎక్కువగా ఉంటే మితము
FEV -1. అంచనాలో 50 - 79 % లో ఉంటె తీవ్రము
FEV-1 అంచనాలో 30- 49 % లో ఉంటే తీవ్రతరము
FEV-1 అంచనాలో 30 % కంటె తక్కువయితే తీవ్రతమము అని వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తారు.
ఊపిరితిత్తులలో కార్బన్ మోనాక్సైడు ప్రసరణ సామర్థ్యత ( Diffusing capacity of the Lungs for carbon monoxide DLCO ఈ వ్యాధి ఉన్నవారిలో తగ్గుతుంది. ఈ పరీక్ష రక్తపు ప్రాణవాయువు సంగ్రహణ శక్తిని సూచిస్తుంది.
వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో రక్తములో బైకార్బొనేట్ ( bicarbonate) విలువ పెరుగుతుంది. ఊపిరితిత్తులచే తగినంతగా విసర్జింపబడని బొగ్గపులుసు వాయువు ( carbon dioxide) రక్తములో బైకార్బొనేట్ గా నిలువవుతుంది. మూత్రపిండములు యీ బైకార్బొనేట్ ను విసర్జించుటకు కృషి చేసినా ఆ కృషి చాలకపోవచ్చును.
శ్వాసావరోధ వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో ధమని రక్తవాయువుల ( Arterial Blood Gases ) పరీక్ష అవసరము. ధమనిరక్తములో ప్రాణవాయువు పీడనమును ( PaO2 ), బొగ్గుపులుసు వాయువు పీడనము ( PaCO2 ) రక్తపు ph లను కొలిచి శ్వాసవైఫల్యమును ( Respiratory failure ) పసిగట్టవచ్చును.
ఈ వ్యాధి ఉన్నవారిలో ఎఱ్ఱ రక్తకణముల సంఖ్య పెరగవచ్చును. రక్తములో దీర్ఘకాలము ప్రాణవాయువు ప్రమాణము తగ్గుట వలన శరీరము ఎఱ్ఱకణముల ఉత్పత్తిని పెంచుట దీనికి కారణము.
ఛాతి ఎక్స్ రే చిత్రములలో ఊపిరితిత్తుల ఉబ్బుదల వలన ఉదరవితానపు వంకలు తగ్గి సమతలత కలుగవచ్చును . ఛాతి ముందు , వెనుకల పరిమాణము పెరుగుతుంది. ఊపిరితిత్తులలో గాలిఎక్కువగుట వలన పారదర్శకత పెరిగి , రక్కనాళముల గుర్తులు తగ్గుతాయి. గాలి బుడగలు
( bullae ) కనిపించవచ్చును. ఊపిరితిత్తుల తాపము ( Pneumonitis ), పుసవేష్టనములో వాయువు
( Pneumothorax ) , హృదయవైఫల్యము వలన ఊపిరితిత్తులలో నీరు పట్టుట ( Pulmonary edema ) కర్కటవ్రణములు ( Cancers ) వంటి ఇతర వ్యాధులను కనుగొనుటకు ఎక్స్ రేలు ఉపయోగపడుతాయి.
ఛాతి కేట్ స్కానులు ఊపిరితిత్తులలో విపరీతముగా ఉబ్బిన భాగము తొలగించే శస్త్రచికిత్సలకు ( Lung Volume Reduction Surgery ) ముందు , ఊపిరితిత్తుల మార్పు శస్త్రచికిత్సలకు ( Lung Transplantation ) ముందు , కర్కటవ్రణములను ( Cancers )కనుగొనుటకు వాడుతారు.
వ్యాధి చికిత్స :
దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధిలో ఊపిరితిత్తులలో కణజాల విధ్వంసము, నష్టము కలుగుట వలన వ్యాధికి ఉపశమనము చేకూర్చుట తప్ప వ్యాధిని సంపూర్ణముగా నయము చేయుట కుదరదు.
పొగత్రాగడము మానివేయుట , హానికర వాయువులు , దుమ్ము , ధూళిలకు దూరముగా ఉండుట, ఊపిరితిత్తులను విషజీవాంశువులు , సూక్ష్మజీవుల బారి నుంచి కాపాడుట వలన వ్యాధి పురోగమనమును మందగింప చేయవచ్చును. మధ్య మధ్యలో కలిగే వ్యాధి ఉద్రేకతలను అరికట్టవచ్చును.
శ్వాసవ్యాధులు కలవారు ప్రతి ఐదు సంవత్సరములకు ఒకసారి ఊపిరితిత్తుల తాపము అరికట్టు టీకాను ( Pneumonia vaccine ) ప్రతిసంవత్సరము ఫ్లూ రాకుండా ఇన్ఫ్లుయెంజా టీకాను
( Influenza vaccine ) వేసుకోవాలి.
ఔషధములు ;
ఈ వ్యాధిలో శ్వాసకు అవరోధమును తగ్గించుటకై పుపుస శ్వాసనాళికలలో ఉన్న మృదుకండరముల బిగుతును తగ్గించి ఆ నాళికలను వ్యాకోచింపజేసే మందులను పీల్పువుల ( Inhalers ) ద్వారా గాని, తుంపరులుగా శీకరయంత్రములతో ( nebulizers ) గాని వాడుకోవాలి.
వ్యాధి ఉద్రేకించినపుడు తక్షణ ఉపశమనమునకు సత్వరముగ పనిచేసే బీటా 2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములను ( Short acting Beta2- adrenergic agonists SABA s ) పీల్పువుల ( Inhaler ) ద్వారా వాడాలి.
ఎక్కువ వాడకములో ఉండే ఓషధము ఆల్బుటెరాల్ ( Albuterol ) పీల్పువు . దీనిని రెండు పీల్పులు ప్రతి 4 - 6 గంటలకు లేక శీకరయంత్రము ద్వారా 2.5 మి. గ్రా.లు ప్రతి 6-8 గంటలకు తుంపరులుగా వాడ వచ్చును.
లీవాల్బుటెరాల్ ( Levalbuterol ) మరో మందు. దీనిని రెండు పీల్పులు ప్రతి 4-6 గంటలకు లేక శీకరయంత్రము ద్వారా 0.63 - 1.25 మి. గ్రా.లు ప్రతి 6-8 గంటలకు వాడవచ్చు . ఇవి పుపుస,శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తాయి. అందు వలన గాలి బాగా ప్రసరిస్తుంది.
పిర్ బ్యుటెరాల్ ( Pirbuterol ) మరో మందు , రెండు పీల్పులు ప్రతి 4-6 గంటలకు వాడుకొనవచ్చును.
ఎసిటైల్ ఖొలీన్ అవరోధకములు( Anticholenergics - Muscarine Antagonists ) :
ఇప్రట్రోపియమ్ బ్రోమైడు ( Ipratropium bromide ) ను పీల్పువు ద్వారా గాని, శీకరయంత్రము ద్వారా గాని ఆల్బుటరాల్ తోను, లేక లీవాల్బుటరాల్ తోను కలిపి, లేక ఒంటరిగాను అందించవచ్చును. ఇది పుపుస, శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తుంది. ఇప్రట్రోపియమ్ మోతాదులు కొద్ది గంటలే పనిచేస్తాయి ( Short acting Muscarine Antagonist SAMA ) కాబట్టి దీనిని దినమునకు 2 పీల్పులు ప్రతి 4-6 గంటలకు లేక 0.5 మి.గ్రా.లు ప్రతి 6-8 గంటలకు శీకరయంత్రము ద్వారా గాని వాడాలి.
సాల్మెటరాల్ ( Salmeterol ), ఫార్మెటరాల్ ( Formoterol ) , దీర్ఘకాలిక బీటా ఉత్తేజకములను
( Long Acting Beta Agonists LABAs ) విడిగాగాని , కార్టీకోస్టీరాయిడులతో ( Fluticasone or Mometasone ) కలిపి గాని పీల్పువులుగా ఉపయోగించ వచ్చును.
ఒలొడటెరాల్ ( Olodaterol ) రోజుకు రెండు పీల్పులుగా వాడాలి.
టియోట్రోపియమ్ ( Tiotropium ) దీర్ఘకాలిక ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము ( Long acting Muscarine Antagonist LAMA ) . దీనిని దినమునకు రెండు పీల్పులగా వాడాలి. దీర్ఘకాలిక బీటా ఉత్తేజకము ఓలొడటెరాల్ ( Olodaterol ) తో కలిపి పీల్పువుగా కూడా టియోట్రోపియమ్ లభ్యము.
యుమిక్లిడినియమ్ ( Umeclidinium ) దీర్ఘకాలము పనిచేసే ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము ( Long Acting Muscarine Antagonist LAMA ). దినమునకు ఒక మోతాదుని పీల్పువు ద్వారా వాడుకోవాలి.
కార్టికోస్టీరాయిడ్ పీల్పువులు ( Inhaled corticosteroids. ) పుపుస శ్వాసనాళికలలో తాపమును తగ్గించి ఊపిరికి అడ్డంకిని తగ్గిస్తాయి. వ్యాధి తీవ్రతమమయినపుడు , వ్యాధి ఉద్రేకించినపుడు వీని ప్రయోజనము కలదు . కాని ఇవి వ్యాధినిరోధకశక్తిని తగ్గించడము వలన ఊపితిత్తులు సూక్ష్మజీవుల బారికి గురిఅయే అవకాశములు పెరుగుతాయి. ఈ పీల్పువులను వాడిన పిమ్మట నోటిపూతలు కలుగకుండా ఉండుటకు నోటిని నీళ్ళతో పుక్కిలించాలి.
థియాఫిలిన్ ( Theophylline) కు పుపుస శ్వాసనాళికలను వ్యాకోచింపజేసే గుణము కలదు. వ్యాధి లక్షణములు మిగిలిన మందులతో లొంగని వారికి థియోఫిలిన్ ను నెమ్మదిగా విడుదలయే బిళ్ళల రూపములో వాడవచ్చును. ఆందోళన , వణకు , గుండెదడ , కడుపులో వికారము, వాంతులు, మూర్ఛ దీని వలన కలిగే అవాంఛిత ఫలితములు. థియాఫిలిన్ వాడే వారిలో మధ్యమధ్యలో రక్తప్రమాణములను పరీక్షించాలి.
నోటి ద్వారా గాని సిరల ద్వారా గాని కార్టికోస్టీరాయిడులను వ్యాధి ఉద్రేకించినపుడు , తీవ్రతమమయినపుడు తాత్కాలికముగాను వీలయినంత తక్కువ మోతాదులలోను వాడుతారు.
Alpha - 1 Antitrypsin లోపించిన వారిలో దానిని వారమునకు ఒకసారి సిరల ద్వారా యిస్తే ప్రయోజనము చేకూరుతుంది.
ధమని రక్తపు ప్రాణవాయువు సంపృక్తత ( oxygen saturation ) 88 శాతము కంటె తక్కువయిన వారికి ప్రాణవాయువును ముక్కు గొట్టము ద్వారా అందించాలి.
రక్తములో బొగ్గుపులుసు వాయువు ప్రమాణము పెరిగిన వారికి , శ్వాసవైఫల్యము ప్రారంభదశలో ఉన్నవారికి నిరంతర పీడనముతో ( Continual Positive airway pressure CPAP ) గాని ఉచ్ఛ్వాస నిశ్వాసములలో పీడనము మార్చి ( Bilevel positive airway pressure BiPAP ) గాని ముక్కుపై మూతతో ( mask ) ప్రాణవాయువును నిద్రలో ఉన్నపుడు , అవసరమయితే పగలు కొన్ని గంటలు అందించవచ్చును.
ఊపిరితిత్తుల పరిమాణము తగ్గించే శస్త్రచికిత్స Lung Volume Reduction Surgery :
వాయువుల మార్పిడికి దోహదపడకుండా పనిచేసే భాగముల మీద పీడనము పెట్టి ఊపిరికి అంతరాయము కలిగించే ఉబ్బుదల భాగములను తొలగించే శస్త్రచికిత్స కొందఱికి ఉపయోగపడవచ్చును.
ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స ( Lung Transplantation surgery ) FEV1 20 శాతము కంటె తక్కువగా ఉండి వ్యాధి తీవ్రతమమయినపుడు కొందఱికి అనుకూలము కావచ్చును.
వ్యాధి ఉద్రేకత ( Acute exacerbations of COPD ) :
దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి లక్షణములు అధికమయి ఆయాసము , దగ్గు అధికమయినపుడు వైద్యాలయములలో చేరిక అవసరమవవచ్చును. సూక్ష్మాంగజీవులు( bacteria ), విషజీవాంశువులు
( viruses ), తాపకజనకములు , వాతావరణ కల్మషముల వలన వ్యాధి ఉద్రేకించవచ్చును. అట్టి పరిస్థితులలో తఱచు పుపుస శ్వాసనాళిక వ్యాకోచకములను ( bronchodilators ) అందించుటతో పాటు , Antibiotics, కార్టికోస్టీరాయిడులు , ప్రాణవాయువులతో కూడా చికిత్స చేస్తారు.
వ్యాధి తీవ్రతరమయితే ధమని రక్తమును వాయువులకు పరీక్షించి శ్వాసవైఫల్యము నిర్ధారణయితే కృత్రిమశ్వాసను అందించాలి.
వ్యాధి నివారణ :
పొగత్రాగుట దీర్ఘకాలిక శ్వాసావరోధము అధిక శాతములో కలుగుటకు ప్రధాన కారణము. కావున వ్యాధిని నివారించాలన్నా అదుపులో ఉంచాలన్నా పొగత్రాగడము మానివేయుట చాలా ముఖ్యము. ఒక యత్నములో చాలా మంది పొగత్రాగుట మానలేరు. అందువలన పదే పదే పొగత్రాగడము మానుటకు యత్నించాలి. సలహా సహాయములను తీసుకోవాలి. అవసరమనుకుంటే పొగమానుటకు మందులను ఉపయోగించవచ్చును.
బొగ్గుగనులు , యితరగనులలో గాలి ప్రసరణ పెంచుట వలన , గాలిలో కల్మషములను ధూళిని తొలగించుట వలన , కార్మికులకు పరిశుభ్రమైన గాలిని ముక్కు , నోటిపై అమరు మూతల ( masks ) ద్వారా అందించుట వలన నల్ల ఊపిరితిత్తుల వ్యాధిని ( Black lung disease ) అరికట్టే ప్రయత్నాలు చెయ్యాలి.
( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro Vascular Accidents )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) డా. గన్నవరపు నరసింహమూర్తి మెదడు నిర్మాణము ( Anatomy of Brain ) : మన శరీరములో వివిధావయవాలు న...