10, ఏప్రిల్ 2018, మంగళవారం

పాండురోగము (రక్తహీనము : Anaemia )

పాండురోగము (రక్తహీనము : Anaemia )
- డా. గన్నవరపు నరసింహమూర్తి
జంతుజాలములోను , పక్షులలోను , జలచరములలోను జీవన వ్యాపారమునకు రక్తప్రసరణము మూలాధారము. రక్తప్రసరణము వలన వివిధ కణజాలమునకు ప్రాణవాయువు, పోషకపదార్థములు చేర్చబడుతాయి. కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువు, తదితర వ్యర్థపథార్థములు గ్రహింపబడి ఊపిరితిత్తులకు ( Lungs ) , కాలేయమునకు ( Liver ), మూత్రపిండములకు ( Kidneys ) విసర్జన కొఱకై చేర్చబడుతాయి. హృదయము వివిధ అరల సంకోచ వ్యాకోచముల వలన రక్తమును గ్రహించి, మరల వివిధావయావలకు రక్తమును సరఫరా చేస్తుంది. హృదయము ఒక తోడు యంత్రము. రక్తనాళముల ద్వారా రక్తప్రసరణము జరుగుతుంది. రక్తములో ఎఱ్ఱకణాలు( Red Blood Corpuscles) , తెల్లకణాలు ( White Blood Cells ), సూక్ష్మఫలకములు ( Platelets ) రక్తద్రవము ( Plasma) లో కలిసి ఉంటాయి. ఇతర పోషకపదార్థములు, మాంసకృత్తులు, చక్కెర, క్రొవ్వుపదార్థములు, వినాళగ్రంధుల రసములు ( Hormones ) యితర రసాయినకములు రక్తద్రవములో కరిగి ఉంటాయి. ఎఱ్ఱకణాలు ప్రాణవాయువుని కణజాలమునకు చేర్చుటకు, కణజాలము నుంచి బొగ్గుపులుసువాయువుని ఊపిరితిత్తులకు విసర్జనకు కొనిపోవుటకు, ఊపిరితిత్తులలో ప్రాణవాయువుని గ్రహించుటకు ఉపయోగపడుతాయి.
ప్రాణవాయువు వాహక సామర్థ్యత ( Oxygen carrying capacity ) ఎఱ్ఱకణాలు , ఆ కణాలలో నిమిడియున్న హీమోగ్లోబిన్ అనే వర్ణకము ( Pigment ) యొక్క పరిమాణములపై ఆధారపడి ఉంటుంది. సాధారణముగా ఒక క్యూబిక్ మిల్లీమీటరు రక్తములో స్త్రీలలో 4-5 మిల్లియన్లు, పురుషులలో 5-6 మిల్లియన్ల ఎఱ్ఱకణాలు ఉంటాయి. ఎఱ్ఱకణాలు కోలగా ద్విపుటాకారపు పళ్ళెముల వలె ఉంటాయి. ఒక్క ఎఱ్ఱకణపు పరిమాణము సుమారు 90 ఫెంటొ లీటర్లు ( fl )g( ఒక ఫెంటో femto అంటే 0. 000 000 000 000 001) కలిగి ఉంటుంది. రక్తకణాలు ఎముకల మజ్జలో ( Bone marrow ) ఉత్పత్తి అవుతాయి. ప్రారంభ దశలో ఎఱ్ఱకణాలలో న్యూక్లియస్లు ఉన్నా , పరిణామము చెందుతూ అవి న్యూక్లియస్ లను కోల్పోతాయి. అందువలన వాటిలో ఎక్కువగా హీమోగ్లోబిన్ నిక్షిప్తమయే అవకాశ ముంటుంది. పరిమాణము చెందుతున్న దశలో న్యూక్లియస్ తొలగినా ఎఱ్ఱకణాలలో రైబోసోమల్ ఆర్. ఎన్. ఎ జల్లెడ కలిగి ( Ribosomal RNA reticulum) , ఆ జాలిక కణాలు ( Reticulocytes ) క్రమేణా ఆ జాలికను కూడా కోల్పోతాయి. ప్రసరణములో ఉన్న ఎఱ్ఱ కణాలలో న్యూక్లియస్లు ఉండవు. కానీ ప్రసరణలో సుమారు ఒక శాతపు జాలిక కణాలు ఉంటాయి. రక్తనష్టము జరిగినప్పుడు ఎఱ్ఱకణాల ఉత్పత్తి అధికము , త్వరితము అయి పరిణతి చెందని కణాలు ప్రసరణములోనికి విడుదల అయి జాలిక కణాల శాతము పెరుగుతుంది . పరిణతి చెందిన కణాల పరిమాణము పరిణతి చెందని కణాల కంటె తక్కువగా ఉంటుంది.
ఎక్కువ పరిమాణము గల కణాలు ప్రసరణలో ఉంటే అధిక పరిమాణ కణత్వమని
( Macrocytosis ), తక్కువ పరిమాణము కలిగిన కణాలు ప్రసరణలో ఉంటే అల్పపరిమాణ కణత్వము ( Microcytosis ) అని అంటారు. సామాన్యపరిమాణపు కణాలు ప్రసరణలో ఉంటే సామాన్యకణత్వము ( Narmocytosis ) అని అంటారు.
ఎఱ్ఱరక్తకణాలలో ఉండే హీమోగ్లోబిన్ అనే వర్ణకము వలన వాటికి ఎఱుపు రంగు వస్తుంది. హీమోగ్లోబిన్ వలన ఎఱ్ఱ కణాలు ప్రాణవాయువును వహించగలుగుతాయి. హీమోగ్లోబిన్ సాధారణముగా డెసి లీటరు రక్తములో పురుషులలో 13- 14 గ్రాములు, స్త్రీలలో 12- 13 గ్రాములు ఉంటుంది. హీమోగ్లోబిన్ సాధారణ పరిమితి కంటె తక్కువయితే దానిని రక్తహీనముగా ( Anemia పాండురోగము ) పరిగణిస్తారు. రక్తమును ఒక పరీక్షనాళికలో ఉంచి వికేంద్రీయ యంత్రము
( Centrifuge ) లో వడిగా తిప్పుతే కణాలన్నీ క్రిందకు పేరుకొని రక్తద్రవము ( Plasma ) పైకి చేరుకుంటుంది. పేరుకొన్న కణ ఘనపరిమాణమును రక్త (కణ ) సాంద్రత ( Hematocrit) గా పరిగణిస్తారు. ఇది సాధారణముగా పురుషులలో 46 శాతము , స్త్రీలలో 42 శాతము ఉంటుంది. రక్తహీనమున్న వారిలో రక్త ( కణ ) సాంద్రత తక్కువగా ఉంటుంది.
రక్తకణములు ఎముకల మజ్జలో ఉత్పత్తి అవుతాయి. పిల్లలలో అన్ని ఎముకలలోను రక్తకణముల ఉత్పత్తి జరుగుతుంది. పెద్దలలో కపాలాస్థికలు, రొమ్ముటెముకలు, ప్రక్కటెముకలు, కటియెముకలు, దీర్ఘాస్థుల చివరి భాగములలోను రక్తకణముల ఉత్పత్తి జరుగుతుంది. మూత్రపిండములలో ఉత్పత్తి అయే ఎరిథ్రోపాయిటిన్ ( Erythropoietin ) అనే రసాయినకము ఎఱ్ఱకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మూత్రపిండపు వ్యాధి, వైఫల్యము ఉన్న వారిలో ఎరిథ్రోపాయిటిన్ ఉత్పత్తి తక్కువగుటచే వారిలో రక్తహీనత కలుగుతుంది.
ఎఱ్ఱ రక్తకణాలలో ఉండే హీమోగ్లోబిన్ లో- హీం అనే వర్ణకము, గ్లోబిన్ అనే మాంసకృత్తితో సంయో గమయి ఉంటుంది. హీం ఉత్పత్తికి అయము ( ఇనుము Iron ) అవసరము. ఎఱ్ఱకణాల ఉత్పత్తికి ఇనుము, ఫోలికామ్లము, విటమిన్ బి -12 లు అవసరము.
రక్తహీనము ఎఱ్ఱకణాల ఉత్పత్తి లోపము వలన, రక్తనష్టము ( Blood loss ) వలన, రక్తకణ విచ్ఛేదనము ( Hemolysis ) వలన సంభవిస్తుంది.
రక్తనష్టము :
తరుణ స్త్రీలలో ఋతుస్రావమధిక మయితే రక్తహీనము కలుగుతుంది. జీర్ణమండలము ( Alimentary tract ) ద్వారా రక్తనష్టము కలుగ వచ్చును. జీర్ణాశయము ( Stomach ), డుయోడినము
( Duodenum, ఆంత్రములలో తొలిభాగము ) లలో కురుపులు ( Peptic ulcers ), జీర్ణమండలములో వివిధ కర్కటవ్రణములు ( Cancers ) , అన్నవాహికలో ఉబ్బుసిరలు ( Esophageal varices - ఇవి సిర్రోసిస్ వ్యాధిగ్రస్తులలో కలుగుతాయి ) జఠరతాపము ( Gastritis : సారాయి వాడుక, కీళ్ళనొప్పులకు వాడే మందులు, ఏస్పిరిన్ , యితర ఔషధములు , హెలికోబాక్టర్ పైలొరై Helocobacter Pylori) అనే సూక్షజీవుల వలన జఠరతాపములు కలుగుతాయి ), పెద్దప్రేవులలో కలిగే ఆంత్ర బుద్బుదాలు
( Diverticulosis) , కంతులు ( Polyps ) , మూలవ్యాధి ( Haemerrhoids ) , ఆంత్రములలో చేరిన కొంకి పురుగులు ( Hookworms ) వంటి పరాన్నభుక్తుల ( Parasites ) వలన దీర్ఘకాలికముగాను, త్వరితగతి లోను రక్తనష్టము కలుగ వచ్చును. ప్రమాదాల వలన కలిగే తీవ్రమైన గాయాల వలన , శస్త్రచికిత్సలలోను రక్తనష్టము కలుగ వచ్చును.
అయన లోప రక్తహీనత ( Iron deficiency anaemia ) : పైన పేర్కొన్న కారణాల వలన శరీరములో అయనపు నిల్వలు తగ్గుటచే రక్తహీనత కలుగుతుంది. గర్భిణీ స్థ్రీలలో రక్తపు ఉత్పత్తి ఎక్కువవుతుంది. వారికి దైనందిక అయనపు అవసరాలు పెరుగుతాయి. వారికి అయనమును అదనముగా అందించకపోతే అయనలోపము కలిగి పాండురోగము పొడచూపుతుంది. శిశువులలో కూడా అయన లోపము కలుగవచ్చును. ఆంత్ర వ్యాధులు, క్లోమవ్యాధులు ( Pancreatic disorders) , జఠరఛేదన
( Gastric resection) , ఆంత్రఛేదన ( Gut resection ) చికిత్సల వలన అజీర్తి ( Malabsorption )
కలిగి అయనగ్రహణము జరుగకపోయినా అయన లోపము కలుగుతుంది.
అయనలోపపు రక్తహీనత కలిగిన వారికి రక్తహీనత తీవ్రత బట్టి నీరసము, అలసట, ఆయాసము , ఒంటిలో నలతభావము, పొడచూపుతాయి. రక్తలోపము తీవ్రమయితే ఒంటిపొంగులు కలుగవచ్చును. వీరికి వింత రుచులు కలిగి మట్టి , పిళ్ళు, మంచుగడ్డలపై రుచి కలుగుతుంది. రక్తహీనత వలన వీరు వివర్ణులయి తెల్లబడుతారు. అందువలనే పాండురోగమనే పేరు ప్రశస్తి చెందింది.
రక్తపరీక్షలలో వీరి ఎఱ్ఱకణజాలపు సంఖ్య తగ్గి ఉంటుంది. రక్తములో హీమోగ్లోబిన్,
రక్తకణ సాంద్రత తగ్గిఉంటాయి. ఎఱ్ఱరక్తకణాల పరిమాణము తగ్గుతుంది. వీరిలో అల్పపరిమాణకణత్వము ( Microcytosis ) ప్రస్ఫుటమవుతుంది. రక్తములో అయనపు విలువలు , ఫెరిటిన్ విలువలు తగ్గి ఉంటాయి. రోగుల చరిత్ర , భౌతిక పరీక్షలతో బాటు మలమును అగోచర రక్తమునకు ( Occult blood ), పరాన్నభుక్త అండములకు ( Ova and Parasites ) శోధించాలి. జఠరాంతరదర్శన, (Gastroscopy ) ఆంత్రాంతరదర్శన ( Colonoscopy ) పరీక్షల వలన వ్రణములు, కంతులు, కర్కటవ్రణములు ఆంత్రబుద్బుదములు కనుగొనబడతాయి. మూలకారణ చికిత్స వీరికి అవసరము. రక్తలోపము అతి తీవ్రమైనవారికి రక్తదానము అవసరము. ఇతరులకు అయనమును సరఫరా చెయ్యాలి. అయనముతో బాటు అధిక రక్తోత్పత్తికి అవసరమయిన ఫోలికామ్లమును కూడా వైద్యులు సరఫరా చేస్తారు.
అధికపరిమాణకణ రక్తహీనతలు ( Macrocytic anaemia ) ఫోలికామ్ల లోపము లేక విటమిన్
బి - 12 లోపము వలన కలుగుతాయి
ఫోలికామ్లపు లోపము ; గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పాలిచ్చే తల్లులకు ఫోలికామ్లపు అవసరాలు మూడింతలు పెరుగుతాయి. అందువలన వారికి అయముతో బాటు ఫోలికామ్లమును కూడా సరఫరా చెయ్యాలి. సారాయి వాడుక హెచ్చిన వారిలోను, వృద్ధులలోను, మానసికవ్యాధిగ్రస్థులలోను, బరువు తగ్గుటకై విపరీత మితాహారములో నున్నవారిలోను, అజీర్తి వ్యాధిగ్రస్థులలోను, ఫోలికామ్లపు లోపములు కనిపిస్తూంటాయి. కొన్ని ఔషధముల ( Methotrexate, Triamterene , Sulphasalazine, Barbiturates , Carbamazepine, Pyrimethamine, Metformin, ) వలన ఫోలికామ్లపు లోపము కలుగవచ్చును. రక్తశుద్ధి ( Hemodialysis ) చికిత్స పొందే వారికి ఫోలికామ్లమును సరఫరా చెయ్యాలి. రక్తవిచ్ఛేదన రక్తహీనపు వ్యాధిగ్రస్థులకు ఫోలికామ్లమును అందజేయాలి. ఫోలికామ్లము లోపించిన వారి రక్తకణాల పరిమాణము ఎక్కువగా ఉంటుంది. అలసట , నీరసము, ఎక్కువ చిరాకు , నిద్రలేమి , మానసిక కుంగుదల, మతిమఱపు కొన్ని ఫోలికామ్లలోపపు వ్యాధి లక్షణాలు. వీరి రక్తపరీక్షలలో ఫోలికామ్లపు విలువలు తక్కువగా ఉంటాయి. ఫోలికామ్లమును సరఫరా చేసి లోపమును సరిదిద్దవచ్చును. ఫోలికామ్లమును కనుగొన్న శాస్త్రజ్ఞులు శ్రీ యెల్లాప్రగడ సుబ్బారావు గారు తెలుగువారే అగుట మనకు గర్వకారణము.
విటమిన్ బి -12 లోపము : విటమిన్ బి -12 లోపించిన వారిలో కూడా ఆధికపరిమాణకణ రక్తహీనత కలుగుతుంది. ఇది ప్రమాదకర రక్తహీనత ( Pernicious anaemia ) గా పేరు గడించింది. విటమిన్
బి-12 ని బాహ్యాంశము ( Extrinsic factor ) గా పరిగణిస్తారు. జఠరములో బి -12 గ్రాహణమునకు అవసరమయే అంతరాంశము ( Intrinsic factor ) ఉత్పత్తి అవుతుంది. బాహ్యాంశమైన బి - 12. అంతరాంశముతో కలిసి, చిన్నప్రేవుల చివరి భాగము ( Ileum ) లో గ్రహించ బడుతుంది. ఆహారములో బి-12 విటమిన్ లోపించినా, జఠరఛేదన , ఆంత్రఛేదన చికిత్సలు జరిగిన వారిలోను, వృద్ధులలో జఠర క్షయము ( Gastric atrophy ) వలన ఆంతరాంశము ఉత్పత్తి జరుగక బి-12 గ్రాహణమునకు
అవరోధము కలుగవచ్చును. స్వయంప్రహరణ పరిరక్షణ వ్యాధి ( Autoimmune disorder ) వలన కూడా అంతరాంశము ఉత్పత్తి లోపము కలుగవచ్చును. Diphillobothrium latum వంటి పరాన్నభుక్తుల వలన కూడా బి- 12 లోపము వస్తుంది.
విటమిన్ బి - 12 లోపించిన వారిలో నాడీమండల వ్యాధులు సాధారణముగా రక్తహీనత కంటె ముందఱ కనిపిస్తాయి. చేతులు , పాదములలో తిమ్మిరులు , ప్రకంపన లోపము ( loss of vibratory sense ) , స్పర్శ లోపము ( loss of touch sensation ) , దూరనాడుల తాపములు.
( Peripheral neuritis) ,అస్థిరత్వము ( Instability) బి -12 లోపము వలన రక్తహీనతకు ముందుగానే ప్రస్ఫుటమవ వచ్చును.
రక్త పరీక్షతో బి -12 విలువలు తెలుసుకొని, లోపముంటే విటమిన్ బి -12 ని అధికమోతాదులలో బిళ్ళలుగా గాని, సూదిమందుగా గాని యిచ్చి లోపమును నివారించవచ్చును.
మౌలికపదార్థములు అయనము, ఫోలికామ్లము, విటమిన్ బి-12 లోపముల వలన, మూత్రపిండ వ్యాధిగ్రస్థులలో ఎరిథ్రోపాయిటిన్ లోపము వలన , ఎముకలమజ్జ వ్యాధుల వలన రక్తపు ఉత్పత్తి తగ్గగలదు. కర్కటవ్రణముల వలన , పరిరక్షణలోపములు ( Immune deficiency) ఉన్న వారిలోను , దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలోను రక్తోత్పత్తి తగ్గవచ్చును.థలసీమియా ( Thalassemia) జన్యుపరముగా సంక్రమించే వ్యాధి. ఈ వ్యాధిగ్రస్థులలో గ్లోబిన్ గొలుసుల ఉత్పత్తి లోపము వలన రక్తహీనత కలుగుతుంది.
రక్తవిచ్ఛేదన రక్తహీనపు వ్యాధులు ( Hemolytic anaemias ) : జన్యుపరముగా వచ్చే రక్తకణ విరూప వ్యాధులు ( లవిత్రకణ వ్యాధి ( Sickle cell anemia ) , వంశపారంపర్య గోళకార కణవ్యాధి
( Hereditary Spherocytosis ) అసాధారణపు హీమోగ్లోబినుల ( Hemoglobinopathies ) వలన రక్తకణముల ఆయువు తగ్గి అవి త్వరితముగా విచ్ఛేదించబడవచ్చును. శరీర రక్షణవ్యవస్థ
( Immunological system) కు స్వ ( Self ) , పర ( External ) విచక్షణాలోపము కలుగుతే స్వయంప్రహరణ వ్యాధులు ( Autoimmune diseases) కలిగి రక్తకణ విచ్ఛేదనము విశేషముగా జరుగవచ్చు. అందువలన రక్తహీనత కలుగుతుంది. కృత్రిమ హృదయకవాటములున్న వారిలో రక్తకణ విచ్ఛేదన కలుగవచ్చును. గ్లూకోజ్-6 ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ లోపమున్న వారిలో కొన్ని మందుల వలన , ఫావా చిక్కుళ్ళ వలన రక్తఛేదనము కలిగి రక్తహీనత సంభవించవచ్చును. రక్తవిచ్ఛేదనము విశేషముగా జరిగినపుడు రక్తహీనముతో బాటు బిలిరుబిన్ విలువలు పెరిగి పచ్చకామెరులు కలిగే అవకాశమున్నది.
ఇచ్చట పేర్కొన్న కారణాలే గాక అనేక యితర వ్యాధుల వలన కూడా రక్తహీనత కలుగవచ్చును. అయన లోపము వలన కలిగే రక్తహీనతను తఱచు చూస్తాము.
వివిధ శోధనపరీక్షలు , ఎముక మజ్జ కణపరీక్షలు ( Bone marrow biopsy) రక్తహీనత కలిగిన వారికి అవసరమవవచ్చును. కారణము కనుగొన్న పిదప వైద్యులు తగిన చికిత్సలు చేస్తారు.
ఆహారపదార్థాలు : సాధారణముగా మనకు వివిధ ఆహారపదార్థాల ద్వారా మన అవసరములకు కావలసిన అయము, ఫోలికామ్లములు , బి 12 విటమినులు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు అవసరాలు పెరుగుట వలన, అయము, ఫోలికామ్లములను మందుల రూపములో యివ్వడము మంచిది.
అయము తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుళ్ళు , పప్పులు, వేరుసెనగ, గుమ్మడి విత్తులు, ఫలములు, మాంసము, చేపలు, గ్రుడ్లు ద్వారా లభ్యమవుతుంది.
ఆకుకూరలు, కాబేజీ, బ్రాకెలీ, చికుళ్ళు, పప్పులు, నారింజ, అరటి , మిగిలిన ఫలముల ద్వారా ఫోలికామ్లము లభ్యమవుతుంది.
పాలు, పెరుగు,వెన్న, గ్రుడ్లు, మాంసము, చేపల ద్వారా విటమిను బి -12 లభ్యమవుతుంది. పాలు వంటి పాడిపదార్థములు కూడా భుజించని సంపూర్ణ శాకాహారులు విటమిన్ బి -12 మాత్రలు వినియోగించుట మంచిది.
( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి . )

జీర్ణ వ్రణములు ( Peptic ulcers )

జీర్ణ వ్రణములు ( Peptic ulcers )
డా. గన్నవరపు నరసింహమూర్తి
మనము భుజించే ఆహారము అన్ననాళము ( Esophagus ) ద్వారా జీర్ణాశయము లోనికి చేరుతుంది. జీర్ణాశయములో జీర్ణమయి చిక్కని ద్రవముగా ( Chyme ) మారిన ఆహారము జీర్ణాశయ నిర్గమము ( Pylorus ) ద్వారా చిన్నప్రేవులకు చేరుతుంది. చిన్నప్రేవులను ప్రథమాంత్రము (Duodenum ) , మధ్యాంత్రము (Jejunum ) , శేషాంత్రము ( Ileum ) అని మూడు భాగములుగా విభజించ వచ్చును. చిన్నప్రేవులలో జీర్ణప్రక్రియ పూర్తయి ఆహార పదార్థాల గ్రహణము పూర్తయి, శేషము, నీటితో సహా పెద్దప్రేవులకు చేరుతుంది. పెద్దప్రేవుల
( బృహదాంత్రము ) లో నీరు గ్రహించబడి మిగిలినది మలముగా విసర్జింప బడుతుంది. ఆహారపదార్థాల జీర్ణము జీర్ణమండలములో స్రవించబడే జీర్ణరసములు, వానిలోని జీవోత్ప్రేరకములపై ( Enzymes ) ఆధారపడుతుంది. నోటిలో స్రవించే లాలాజలములో టయాలిన్ ( ptyalin ) చక్కెర గ్రహణమునకు తోడ్పడుతుంది. జఠరములో జఠరరసము స్రవించబడి అందులో ఉన్న పెప్సిన్ మాంసకృత్తుల జీర్ణమునకు తోడ్పడుతుంది. క్లోమమములో ఉత్పత్తి అయే క్లోమరసములో ఎమిలేజ్ Amylase ) పిండిపదార్థాల జీర్ణమునకు, లైపేజ్ ( Lipase ) క్రొవ్వుల జీర్ణమునకు, ట్రిప్సినోజెన్ ( Trypsinogen ), ఖైమో ట్రిప్సినోజెన్
( Chymotrypsinogen ) లు ఆంత్రములలో ట్రిప్సిన్ ( Trypsin) ఖైమోట్రిప్సిన్( Chymotrypsin)లుగా మారి మాంసకృత్తులను జలవిచ్ఛేదన ( Hydrolysis) ప్రక్రియ ద్వారా పెప్టైడులు ( Peptides), ఎమినో ఆమ్లములుగా
( Amino acids ) విచ్ఛేదించి వాని గ్రహణమునకు తోడ్పడుతాయి. కాలేయములో ఉత్పత్తి అయే పైత్యరసములోని పైత్యము క్రొవ్వుపదార్థాల జీర్ణమునకు తోడ్పడుతుంది.
జఠరాశయమును నాలుగు భాగములుగా గుర్తిస్తారు. పైకప్పులా ఉండే జఠరమూలము ( Fundus ) కాయము ( Body ) , అంతిమకుహరము ( Antrum ) , నిర్గమములు ( Pylorus).
జఠరపు లో పొర ( శ్లేష్మపు పొర - Mucosa ) లో ఉన్న జఠరగ్రంధుల నుంచి శ్లేష్మము( Mucus ), ఉదజహరికామ్లము ( Hydrochloric acid ), పెప్సినోజెన్ , విటమిను బి 12 గ్రహణమునకు ఉపయోగపడే అంతరాంశము ( B12 Intrinsic factor ), గాస్ట్రిన్ ( Gastrin ) అనే వినాళ రసము , హిస్టమిన్ ( Histamine) లు ఉత్పత్తి అవుతాయి. ఇందులో శ్లేష్మము జఠరపు లోపొరకు రక్షణ చేకూరుస్తుంది. ఆహార చలనమునకు తోడ్పడుతుంది.
పెప్సినోజెన్ నుంచి విడుదల అయే పెప్సిన్ మాంసకృత్తుల జీర్ణమున కుపయోగపడుతుంది. పెప్సిన్ ఆమ్ల మధ్యములో బాగా పనిచేస్తుంది. పి హెచ్ ఎక్కువయిన క్షారద్రవములలో పనిచేయదు.
ఉదజహరికామ్లము సూక్ష్మాంగజీవులను హరించుటకు, పెప్సిన్ సలిపే జీర్ణక్రియకు దోహదకారిగాను ఉపయోగపడుతుంది.
అంతిమకుహరము ( Antrum ) ఆహారముతో ఉబ్బినపుడు, జఠరములో పి.హెచ్ పెరిగి ఆమ్లము తగ్గినపుడు జి కణములు ( G- cells ) గాస్ట్రిన్ ని ఉత్పాదించి రక్తములోనికి విడుదల చేస్తాయి. గాస్ట్రిన్ ఉదజహరికామ్లము, పెప్సిన్ ల విడుదలకు, జఠర కండరములను ప్రేరేపించి జఠరచలనము నినుమడించుటకు తోడ్పడుతుంది. ఆమ్లము ఎక్కువయి నప్పుడు గాస్ట్రిన్ విడుదల తగ్గిపోతుంది. గాస్ట్రిన్ ఎంటెరోక్రోమఫిన్
( Enterochromaffin cells ) కణములనుంచి హిస్టమిన్ ని విడుదల చేయిస్తుంది. హిస్టమిన్ జఠరకుడ్య కణములలో ( parietal cells ) ఉండే ప్రోటాను తోడుయంత్రముల ( Proton pumps - Hydrogen / Potassium Adenosine triphoshatase Enzyme System ) ద్వారా రక్తము లోనికి బైకార్బొనేట్ ను, జఠరకుహరములోనికి ఉదజనిని ( Hydrogen- ప్రోటాన్లు ) విడుదల చేయిస్తుంది. ఉదజనిని అనుసరించి క్లోరైడు పరమాణువులు కూడా జఠరకుహరములోనికి విడుదల అవుతాయి. మెదడు నుంచి వచ్చే వేగస్ కపాల నాడులు ( Vagal nerves ) కూడా ఆహారపు తలపు , వాసన , రుచులకు స్పందించి జఠరములో ఉదజహరికామ్లము, పెప్సినోజెన్ ల విడుదలను, గాష్ట్రిన్ విడుదలను కలిగిస్తాయి.
జీర్ణవ్రణములు ( Peptic ulcers ) :
జఠరరసము ఆహార జీర్ణము కొఱకు ఉత్పత్తి అవుతుంది. జఠర రసములో ఉండే పెప్సినోజెన్, ఉదజహరికామ్లముల ఫలితముగా జీర్ణమండలపు లోపొర ( శ్లేష్మపు పొర Mucosa ) జీర్ణమయి వ్రణములు కలిగే అవకాశ మున్నది. ఈ జీర్ణవ్రణములు జఠరాశయము ( Stomach ) లోను, ప్రథమాంత్రము( Duodenum) లోను, అన్నవాహిక ( Esophagus) లోను అంతిమాంత్రములో
( Ileum) అవశేషముగా మిగిలే మెకెల్ సంచిలో ( Meckel ‘s diverticulum ) కాని కలుగ వచ్చును. ఉదజహరికామ్లము చాలా ఎక్కువగా ఉత్పత్తి అయినా , లో , శ్లేష్మపు పొర నిరోధక శక్తి తగ్గినా యీ పుళ్ళు కలుగుతాయి. జఠరముతో సంధించబడిన ఆంత్రములోను యీ వ్రణములు ( సంధాన వ్రణములు Anastomotic ulcers ) కలుగ వచ్చును .
జీర్ణవ్రణములకు కారణములు ;
1). హెలికోబాక్టర్ పైలొరై ( Helicobacter pylori ) అనే సూక్ష్మాంగ జీవుల వలన ఏభై శాతపు జీర్ణ వ్రణములు కలుగుతాయి. మూడవ ప్రపంచదేశములలో యీ శాతము డెబ్భై వఱకు ఉండవచ్చును. హెలికోబాక్టర్ సూక్ష్మాంగ జీవులు జఠరములో ఉన్న వారిలో ఇరువది శాతపు ప్రజలలో యీ వ్రణములు కలుగుతాయి. హెలికోబాక్టర్ సూక్ష్మజీవులు కలుషితాహారము, జలముల ద్వారా జఠరమునకు చేరుతాయి. జఠరములో శ్లేష్మమును చొచ్చుకొని కణములకు దగ్గరయి ఆమ్లమునకు దూరమయి తమ చుట్టూ యూరియేజ్ అనే జీవోత్ప్రేరకముతో అమ్మోనియాను ఉత్పత్తి చేసుకొని జఠరామ్లము బారి నుంచి తప్పించుకుంటాయి.
2). కీళ్ళనొప్పులకు వాడే స్టీరాయిడేతర తాపహరములు ( Nonsteroidal anti inflammatory agents NSAIDS ) దీర్ఘకాలము వాడే వారిలో 15 నుంచి 25 శాతపు ప్రజలలో యీ కురుపులు రావచ్చును.
ఐబుప్రొఫెన్ ( Ibuprofen) , నేప్రొక్సిన్ ( Naproxen), డైక్లొఫెనెక్ ( ( Diclofenec ) ఇండోమిథసిన్
( Indomethacin ), మెలోక్సికమ్ ( Meloxicam ) , సేలిసిలేట్లు ( ( Salicylates ) NSAIDS కి ఉదహరణలు.
3). గుండెపోటులు మస్థిష్కవిఘాతాలను అరికట్టుటకు ఏస్పిరిన్ వాడే వారిలో యీ వ్రణములు కలుగ వచ్చును.
4). స్టీరాయిడ్ ఔషధములు దీర్ఘకాలముగా వాడే వారిలో యీ కురుపులు రావచ్చును.
5). క్లోమములో కాని యితర ప్రదేశములలో కాని కలిగే గాస్ట్రినోమా ( Gastrinoma ) అనే పెరుగుదలల వలన రక్తములో గాస్ట్రిన్ ఎక్కువయి తన్మూలముగా ఉదజహరికామ్లము , పెప్సిన్ ఉత్పత్తి అధికమయి వారిలో యీ వ్రణములు కలుగుతాయి. సుమారు ఒక శాతపు జీర్ణవ్రణములకు గాస్ట్రినోమాలు కారణము.
6). తీవ్రతరమైన యితర అనారోగ్యము లున్నవారిలోను, కృత్రిమశ్వాస యంత్రములపై ఉన్నవారిలోను యీ వ్రణములు రావచ్చును.
7). కొందఱిలో ఎఱుకబడని కారణాల ( Idiopathic ) వలన జీర్ణవ్రణములు కలుగుతాయి.
8). జీర్ణాశయములో కలిగే కర్కటవ్రణములు ( Gastric cancers ) , లింఫోమాలు వ్రణములుగా ప్రస్ఫుటమవ వచ్చును.
9). పొగాకు వినియోగించే వారిలో జీర్ణవ్రణములు ఎక్కువగా కలుగతాయి.
కారము, మసాలాలు తినుటవలన , జీవితములో కలిగే మనోక్లేశము వలన, తొందఱ వలన యీ జీర్ణ వ్రణములు కలుగవు. అట్టి ఆరోపణలు నిజము కాదు.
జీర్ణవ్రణ లక్షణములు : కడుపులో పుళ్ళున్న వారిలో చాలా మందికి కడుపునొప్పి ఉంటుంది. అన్నవాహికలో పుళ్ళున్న వారిలో భోజనము మ్రింగుతున్నపుడు, జఠరములో పుళ్ళున్నవారిలో తిన్న వెంటనే , ప్రథమాంత్రములో వ్రణములున్నవారిలో భోజనము చేసిన గంట, గంటన్నర పిదప యీ నొప్పి సాధారణముగా కలుగుతుంది. జఠరవ్రణము లున్నవారిలో కుక్షి పై భాగములో నొప్పి సాధారణముగా కలుగుతుంది. ప్రథమాంత్రములో పుండున్న వారికి ఏమైనా తిన్న వెంటనే కొంత ఉపశమనము తాత్కాలికముగా కలుగుతుంది. ఈ వ్రణము లున్నవారిలో కుక్షి పై భాగములో తాకుతే నొప్పి కలుగవచ్చును. మృదుక్షారములు ( Antacids ) ఆమ్లమును బలహీనపఱచి తాత్కాలిక ఉపశమనమును కలిగిస్తాయి.
కడుపు నొప్పి ఉన్న వారందరిలో యీ వ్రణము లున్నాయని చెప్పలేము. వారి నొప్పికి యితర కారణాలు ఉండవచ్చును. వ్రణములున్న అందరిలో నొప్పి ఉండకపోవచ్చును.
కొందఱిలో జీర్ణవ్రణముల వలన కలిగే ఉపద్రవముల లక్షణములే తొలిసారిగా పొడచూపవచ్చును. రక్తస్రావము
( bleeding) , జఠరనిర్గమ బంధము ( Pyloric stenosis ) , ఆంత్రములో రంధ్రమేర్పడుట ( ఆంత్రచ్ఛేదనము - perforation ) , జీర్ణవ్రణముల వలన కలిగే ప్రమాదాలు.
రక్తస్రావము కలిగే వారిలో వాంతిలో రక్తము ఉండవచ్చును. వాంతి కాఫీగుండ వర్ణములో ఉండవచ్చును. వారి విరేచనములో రక్తము కాని , తారు వలె నల్లటి విరేచనములు కలుగుట కాని సంభవించ వచ్చును. నెమ్మదిగా రక్తస్రావము జరిగిన వారిలో పాండురోగము పొడసూపవచ్చును.
జఠర నిర్గమ బంధము ( pyloric stenosis ) కలుగుతే తక్కువ తినగానే కడుపు నిండుట, కడుపులో భారమనిపించుట, పుల్లతేనుపులు, వాంతులు, వాంతులలో ముందు దినాలు తిన్న పదార్థములుండడము , శరీరము చిక్కి బరువు క్షీణించుట కలుగుతాయి.
ప్రథమాంత్రములో చిల్లు పడిన వారిలో ( Duodenal perforation ) ఆకస్మికముగా విపరీతమయిన కడుపునొప్పి సాధారణముగా కలుగుతుంది. వీరికి అత్యవసర శస్త్రచికిత్స అవసరము. అత్యవసర శస్త్రచికిత్స చేయని వారికి ప్రాణాపాయము కలిగే అవకాశము చాలా ఎక్కువ.
రోగనిర్ణయ పరీక్షలు :
రక్తహీనము( Anemia) , రక్తస్రావము , తక్కువ తిండితో ఆకలి తీరుట, బరువు తగ్గుట, ఎడతెఱపి లేకుండా వాంతులు , ఎగువ కడుపులో పెరుగుదల ( growth ) , ఆమ్లము తగ్గించే మందులతో ఉపశమనము లేకపోవుట వంటి అపాయ సూచన లున్నవారికి అన్ననాళ జఠరాంత్రదర్శన పరీక్ష
( Esophagogastroduodenoscopy ) సత్వరమే చేయాలి. జీర్ణవ్రణములను కనిపెట్టడమే కాక చిన్న శకలమును కణపరీక్షకు, హెలికోబాక్టరు పైలొరై పరీక్షకు గ్రహించ వచ్చును. కర్కట వ్రణములను కనిపెట్టవచ్చును.
జఠరాంత్రదర్శన పరీక్షలో అన్నవాహికను, జీర్ణాశయమును , ప్రథమాంత్రమును శోధించి కడుపులో పుళ్ళను నిర్ధారించవచ్చును. ఈ పరీక్షలు ప్రామాణికమైన పరీక్షలు.
బేరియం ద్రవమును త్రాగించి ఎక్స్ - రే ల ద్వారా జీర్ణవ్రణములను కనుగొనవచ్చును. కాని చిన్న చిన్న వ్రణములు, జఠరతాపము ( Gastritis), ఒరిపిడులు( gastric erosions ) కనుగొనుట సాధ్యము కాదు. కణపరీక్షల కవకాశముండదు. బేరియం పరీక్షల ప్రాముఖ్యత అంతర్దర్శన పరీక్షలు లభ్యమయ్యాక చాలా తగ్గిపోయింది.
హెలికోబాక్టర్ పైలొరై పరీక్షలు:
రక్తమును హెలికోబాక్టర్ పైలొరై ప్రతిరక్షకములకు ( antibodies ) పరీక్షించ వచ్చును. కాని సూక్షాంగ జీవులను నిర్మూలించిన 18 మాసముల వఱకు ఈ ప్రతిరక్షకములు రక్తములో ఉండవచ్చును. ప్రస్తుత సమయములో హెలికోబాక్టర్ పైలొరై సూక్ష్మాంగ జీవులు సజీవముగా జఠరములో ఉన్నట్లు యీ పరీక్షతో నిర్ధారించజాలము.
రేడియో ధార్మిక కార్బను గల యూరియా శ్వాస పరీక్షతో ( Carbon labeled urea breath test ) హెచ్. పైలొరైని నిర్ధారించవచ్చును.
మలములో హెలికోబాక్టర్ సంబంధ మాంసకృత్తులను ( antigens) ని కనుగొని హెచ్. పైలొరై వ్యాధిగ్రస్థులను నిర్ధారించవచ్చును.
చికిత్స :
జఠరామ్లమును అణచివేయుట చికిత్సలో మూలభాగము. ప్రోటాను తోడుయంత్రపు అవరోధకములు( proton pump inhibitors) విరివిగా ప్రాచుర్యములో ఉన్నాయి. ఇవి ఉదజని స్రావమును అణచివేస్తాయి. ఆమ్లము అంటే ఉదజనే.
ఒమిప్రజోల్ ( Omeprazole ) లాన్సప్రజోల్ ( Lansoprazole ) , పాన్టొప్రజోల్ ( Pantoprazole ) ప్రోటాను పంపు అవరోధములకు ఉదహరణములు.
హిస్టమిన్ - 2 గ్రాహక నిరోధకములు ( Histamine -2 receptor blockers) జఠరకణములపై హిస్టమిన్ ప్రభావము నరికట్టి ఉదజహరికామ్ల స్రావమును అణచివేస్తాయి.
సైమెటిడిన్ ( Cimetidine) , రెనెటిడిన్ ( Ranatidine ) ఫెమొటిడిన్ ( Famotidine ), నైజటిడిన్ ( Nizatidine ) హిస్టమిన్ -2 అవరోధకములకు ఉదహరణలు.
ఆమ్ల హరములు ( Antacids ) ; మృదుక్షారములు ఉపశమునకు ఉపయోగపడుతాయి. కాని వ్రణముల చికిత్సకు ప్రోటాను పంపు నిరోధకములు కాని , హిస్టమిన్ -2 గ్రాహకనిరోధకములను గాని వాడాలి.
హెలికోబాక్టర్ నిర్మూలనకు ప్రోటాను పంపు అవరోధకములతో బాటు సూక్ష్మజీవి విపక్షౌషధములు
( Antibiotics ) రెండైనా కలిపి వాడాలి. ఎమాక్సిసిలిన్, మెట్రానిడజాల్, క్లెరిథ్రోమైసిన్, పెప్టోబిస్మాల్, టెట్రాసైక్లిన్ లతో వివిధ మేళనములు లభ్యము.
సుక్రాల్ఫేట్ ( Sucralfate ) వ్రణములపై పూతగా ఏర్పడి వ్రణములపై జఠరికామ్లపు ప్రభావమును తొలగిస్తుంది. జీర్ణవ్రణముల మానుదలకు యీ ఔషధము ఉపయోగకారే.
స్టీరాయిడేతర తాపహరముల వాడకము మానివేయాలి ( NSAIDS ). ఏస్పిరిన్ వాడుకను కూడా అవకాశ ముంటే మానుట , వ్రణముల మానుదలకు దోహదకారి. కార్టికోస్టీరాయిడుల వాడుక కూడా వీలయితే మానుట మంచిది. కార్టికోస్టీరాయిడులను క్రమేణా తగ్గించాలి.
ధూమపానము చేసే వారిలో జీర్ణవ్రణముల మానుదల మందగిస్తుంది. పొగత్రాగే వారిలో కడుపులో పుండ్లు ఎక్కువగా కలుగుతాయి. అందువలన పొగత్రాగుట మానివేయుట ఉత్తమము.
శస్త్రచికిత్సలు :
మొదటి హిస్టమిన్ -2 నిరోధకము సైమెటిడిన్ కనుగొనక ముందు ఆమ్లహరములకు లొంగని జీర్ణవ్రణములకు శస్త్రచికిత్సలు విరివిగా చేయబడ్డాయి. ఆమ్లపు ఉత్పత్తిని తగ్గించుటకు జఠరాంత్ర సంధానముతో వేగస్ కపాల నాడుల విచ్ఛేదన ( Vagotomy + Gastrojejunostomy ) పాక్షిక జఠరవిచ్ఛేదన ,( Partial gastrectomy ) వంటి శస్త్రచికిత్సలే వ్యాధిగ్రస్థులకు శరణ్యమయేవి. ఈ దినములలో జటిలతరమైన వ్రణములకు, రక్తస్రావము నరికట్టబడని సందర్భములలోనే అఱుదుగా శస్త్రచికిత్సలు జరుగుతాయి.
వ్రణముల నుంచి రక్తస్రావము జరిగితే అంతర్దర్శిని ద్వారా విద్యుద్దహనీకరణము ( electric cauterization), ఎపినెఫ్రిన్ సూచిక చికిత్స ( injection therapy using epinephrine ) వంటి ప్రక్రియలతో రక్తస్రావము నరికట్టే అవకాశము లున్నవి. రక్తదానము కూడా అవసరమవ వచ్చును. ఈ ప్రక్రియలకు లొంగకపోతే శస్త్రచికిత్స అవసరము.
జఠరనిర్గమ బంధనము ( Pyloric stenosis ) : అంతర్దర్శిని ద్వారా బుడగతో ఆంత్రముఖమును
( pylorus )విస్తరింపజేయ వచ్చును.
జీర్ణవ్రణముల నివారణ ; హెలికోబాక్టర్ పైలొరై ని నిర్మూలించుట, స్టీరాయిడేతర తాపనిరోధకముల వాడుక తగ్గించుకొనుట , వాటి వాడుక తప్పని సరి అయిన పరిస్థితులలో ప్రోటాను పంప్ అవరోధకములను, హెచ్-2 అవరోధకములను వాడుట, ధూమపానము మానుట జీర్ణ వ్రణముల నరికట్టుటకు సహాయపడతాయి.
( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

17, నవంబర్ 2017, శుక్రవారం

కర్కట వ్రణములు ( Cancers )

( తెలుగుతల్లి కెనడా లో ప్రచురించబడిన వ్యాసము )

డా. గన్నవరపు నరసింహమూర్తి

శరీరానికి కలిగే రుగ్మతలలో కొత్త పెరుగుదలలకు ( Growths ) ప్రాముఖ్యత ఉన్నది. ఈ పెరుగుదలలు నెమ్మదిగా పెరిగే నిరపాయకరమైనవి( Benign tumors ) కావచ్చును. త్వరితముగా పెరిగి పరిసర కణజాలములోనికి మూలములతో ఎండ్రకాయల వలె చొచ్చుకుపోయే ప్రమాదకరమైన కర్కటవ్రణములు ( Malignant tumors ) కావచ్చును. ఇవి కాన్సరులుగా అందుకే ప్రాచుర్యములో ఉన్నాయి. ఈ పెరుగుదలలు పుట్టల వలె పెరుగుట వలన వీటిని పుట్టకురుపులని కూడా అంటారు.
కణముల జన్యువులలో మార్పు జరుగుటవలన (Genetic Mutations ) ఆ కణములు అతిత్వరగా పెరుగుతూ, అతిత్వరగా విభజన చెందుట వలన ఈ పెరుగుదలలు పొడచూపుతాయి. కర్కటవ్రణములలో కణములు పూర్తిగా ఆయా అవయవ కణజాలములలోని కణముల వలె పరిపక్వత నొందవు. అందుచే అవి ఆ అవయవాల కణములను పోలి ఉండవు. ఈ కణాలలో న్యూక్లియస్ పరిమాణము హెచ్చుగా ఉండి, సైటోప్లాజము పరిమాణము తక్కువగా ఉంటుంది. ఈ కణాల మధ్య సంధానము కూడా తక్కువగా ఉంటుంది. పరిపక్వత పొందకపోవుటచే ఈ కణాలు ఆ యా అవయవ ధర్మాలను నిర్వర్తించవు.
ఈ కణ బీజములు లింఫు నాళముల ద్వారా లింఫు గ్రంధులకు , రక్తనాళముల ద్వారా యితర అవయవములకు వ్యాప్తి చెందగలవు. ఈ కర్కటవ్రణాలు త్వరగా పెరుగుతూ పోషక పదార్థాలను విరివిగా సంగ్రహించుట వలన , ఈ వ్రణములనుంచి విడుదల అయ్యే రసాయినక పదార్థముల వలన ఆకలి క్షీణించుట చేత బరువు తగ్గి దేహక్షీణత కలుగుతుంది. ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది ఆ అవయవ ధర్మాలకు ప్రతిబంధకము కూడా కలుగ జేస్తాయి. ఈ పుట్టకురుపులు చివరి దశలలో ఉన్నప్పుడు శరీరపు వ్యాధి నిరోధక శక్తి తగ్గి సూక్ష్మాంగజీవుల వలన వివిధ రోగములు కూడా కలుగ వచ్చును
కర్కట వ్రణములు కలుగడానికి కారణము కణముల జన్యువులలో మార్పు రావటమే కదా! ఈ జన్యువ్యత్యాసము తొంబయి శాతము , కణముల పరిసరముల ప్రభావము వలన జరిగితే ఒక పదిశాతము వరకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యువుల వలన కలుగుతాయి.
వృద్ధాప్యములో శరీరపు వ్యాధినిరోధక శక్తి తగ్గి అసాధారణ కణములు తొలగింపబడకపోవుట వలన
ఆ కణాలు పెరుగుట వలన ఆ పెరుగుదలలు పొడచూపుతాయి.
పొగత్రాగుట, యితర విధాల పొగాకు వినియోగము, ఊబకాయము, వ్యాయామ లోపము, సూక్ష్మజీవులు కలిగించే వ్యాధులు, ఆహారపుటలవాట్లు, వాతవరణకాలుష్యము ,రేడియోధార్మిక కిరణాల వంటి భౌతిక కారణాలు అవయవాల కణములను ప్రభావితము చేస్తాయి.
పొగత్రాగడము, పొగాకు వినియోగములు 25 శాతపు పుట్టకురుపులకు కారణము. తొంబై శాతపు శ్వాసకోశ కర్కటవ్రణములు పొగత్రాగే వారిలోనే సంభవిస్తాయి. మూత్రాశయపు కాన్సరులు ( Urinary bladder cancers ), మూత్రపిండముల కర్కటవ్రణములు ( Kidney cancers), స్వరపేటికలో వచ్చే కర్కటవ్రణములు ( Laryngeal cancers ) అధికశాతములో పొగత్రాగే వారిలోనే కలుగుతాయి. జీర్ణాశయము ( Stomach ), క్లోమము ( Pancreas ), కంఠము, అన్ననాళములలో పుట్టే పుట్టకురుపులు పొగత్రాగే వారిలోనే ఎక్కువ. పొగాకులలో నైట్రోసమైన్లు ( Nitrosamines ), పోలీసైక్లిక్ హైడ్రోకార్బనులు ( Polycyclic Hydrocarbons) అనే కర్కటవ్రణజనకములు ( Carcinogens) ఉంటాయి. పొగాకు నమిలే వారిలోను, పోకచెక్కలు విరివిగా నమిలే వారిలోను నోటిలో కాన్సరులు ఎక్కువగా వస్తాయి. కాలుతున్న అంచు నోటిలో పెట్టి చుట్టలు కాల్చే వారిలో ( విశాఖ, శ్రీకాకోళపు ప్రాంతాలలో యీ అడ్డపొగ అలవాటు ఉన్నది. ) అంగుట్లో కర్కటవ్రణములు రావచ్చును. జపాను దేశములో జీర్ణాశయపు పుట్టకురుపులు ఎక్కువయితే అమెరికాలో పెద్దప్రేవుల పుట్టకురుపులు ఎక్కువ. నా ఆత్మీయులలోను, నెయ్యులలోను పెద్దప్రేవుల కర్కటవ్రణములు చూసాక భారతీయులలో అంతా అనుకునే కంటె ఎక్కువ మందికే బృహదంత్ర కర్కటవ్రణములు Colon Cancers ) కలుగ వచ్చునేమో ననే సందిగ్ధము నాకు కలుగుతున్నది.
అతినీలలోహిత కిరణాల ( Ultraviolet rays ) వలన చర్మపు పుట్టకురుపులు, మెలనోమాలు ( Melanomas)కలుగుతాయి. రేడియో ధార్మిక కిరణాలకు ( Radio active rays ) లోనైతే పుట్టకురుపులు రావచ్చు.
ఱాతినార ( Asbestos )వాడే పరిశ్రమల్లో పనిచేసే వారికి శ్వాసకోశపుపొరలో ( Pleura ) మీసోథీలియోమా ( Mesothelioma) అనే కాన్సరు కలిగే అవకాశ మెక్కువ.
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ( Human Papilloma Virus ) వలన గర్భాశయ ముఖములలో పుట్టకురుపులు ( Uterine Cervical Cancers ) కలుగుతాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వలన కాలేయపు పుట్టకురుపులు కలుగవచ్చును. హెలికోబాక్టర్ పైలొరై ( Heliocobacter pylori )అనే సూక్ష్మజీవుల వలన జీర్ణాశయపు ( Gastric) కాన్సరులు కలుగుతాయి.
వంశపారంపర్యము వలన మూడు నుంచి పది శాతపు కర్కటవ్రణములు సంభవిస్తాయి. జన్యువైపరీత్యములతో బి ఆర్ సి ఎ 1 , 2 ( BRCA 1 BRCA 2 ) జన్యువులు వంశానుగతముగా వస్తే రొమ్ము కాన్సరులు వచ్చే అవకాశములు ఎక్కువ.
కర్కటవ్రణములు ప్రమాదకరమైన వ్యాధులు. వాటిని కనుగొన్న సమయానికి అవి సుదూరవ్యాప్తి పొందకపోతే అవి చికిత్సకు లొంగే అవకాశాలు ఉంటాయి. వివిధావయవాలకు వ్యాప్తి చెందిన పుట్టకురుపులను పూర్తిగా నయము చేయుట కుదరక పోవచ్చును. ఆ స్థితులలో వైద్యులు ఉపశమన చికిత్సలే చేయగలుగుతారు. శస్త్రచికిత్స, రేడియోధార్మిక కిరణ ప్రసరణ చికిత్సలు ( Radiation therapy ) రసాయినకౌషధ చికిత్సలు ( Chemotherapy ) , ప్రతిరక్షణ చికిత్స ( Immunotherapy)లను వ్యాధి నివారణకు, ఉపశమన చికిత్సలకు వాడుతారు.
కాన్సరు వ్యాధిని సంపూర్ణముగా నయము చెయ్యాలంటే తొలిదశలలోనే వ్యాధిని పసిగట్టాలి. అంతే కాక కర్కటవ్రణములు రాకుండా జాగ్రత్తపడాలి.
కాన్సరు వ్యాధి నివారణ :
పొగ త్రాగడము, పొగాకు నములుట, హెచ్చుగా పోక చెక్కలు నమలుట జర్దాకిళ్ళీ వంటి వాడుకలు లేకుండా చూసుకోవాలి. సారాయి వినియోగమును చాలా అదుపులో ఉంచుకోవాలి. హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరస్ వ్యాధులు రాకుండా పిన్నవయస్సులోనే H.P.V టీకాలు (Vaccine) వేయించాలి. మితాహారము, శరీరపు బరువును అదుపులో ఉంచడము, శారీరకవ్యాయామము, కాయగూరలు, పళ్ళు , పూర్ణధాన్యముల వినియోగము పుట్టకురుపులను నివారించుటకు తోడ్పడుతాయి. హెపటైటిస్ బి సోకకుండా టీకాలు వేయించుకొనుట, హెపటైటిస్ సి రాకుండా తగిన జాగ్రత్తలలో ఉండుట రేడియోధార్మిక కిరణాలకు గురి కాకుండా వీలయినంత చూసుకొనుట కర్కటవ్రణములను నివారించుటకు తోడ్పడుతాయి.
పుట్టకురుపులు త్వరితముగా కనుగొని వాటికి సత్వర చికిత్స చేయడము వలన వాటిని నయము చేసే అవకాశ మున్నది. ఎవరికి వారు వారి శరీరమును శోధన చేసుకునుట వలన కొన్ని కాన్సరులను త్వరగా గుర్తించ వచ్చును. దేహమును , చర్మమును పరీక్షించుకొంటే చర్మముపై కలిగే వ్రణములు కనిపిస్తాయి. అసాధారణపు పుట్టుమచ్చలు కలిగినా , ఉన్న పుట్టుమచ్చలు పెరిగినా, లేక వాటి వర్ణములో మార్పులు జరిగినా , లేక వాటి వలన దురద, నొప్పి వంటి లక్షణములు పొడచూపినా, లేక వాటి చుట్టూ వలయములు ఏర్పడినా, మరే మార్పులు కలిగినా వైద్యులను సంప్రదించి, వాటిని శస్త్రచికిత్సచే తొలగించుకొని వాటికి కణపరీక్ష ( Biopsy ) చేయించుకోవాలి. స్త్రీలు కనీసము నెలకొకసారైనా వారి రొమ్ములను పరీక్షించుకోవాలి. అనుమానాస్పదమైన పెరుగుదలలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. స్తనచిత్రీకరణలు ( Mammograms) రొమ్ము కాన్సరులను సత్వరముగ కనుగొనుటకు తోడ్పడుతాయి. నలభై నుంచి డెబ్భై సంవత్సరములలో ఉన్న స్త్రీలకీ పరీక్షలు ప్రతి రెండు లేక మూడు సంవత్సరములకొక పర్యాయము వైద్యులు సూచిస్తారు.
గర్భాశయముఖ కర్కటవ్రణములు కొన్ని హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరసుల ( Human papilloma viruses) వలన కలుగుతాయి. హెచ్.పి.వి ( HPV Vaccine ) టీకాలను పిల్లలకు వేసి ఈ పుట్టకురుపులను నివారించ గలము. ఇరవై సంవత్సరాల నుంచి అరవైఐదు సంవత్సరముల లోని స్త్రీలలో గర్భాశయ ముఖము నుంచి పాప్ స్మియర్ వలన గ్రహించిన కణపరీక్షలను ( Pap Smears ) వైద్యులు సిఫారసు చేస్తారు. ఈ పరీక్షలు కర్కటవ్రణములను తొలిదశలలో కనుగొందుకు ఉపయోగపడుతాయి.
ఉత్తర అమెరికా ఖండములో వైద్యులు ఏభై సంవత్సరములు నిండిన వారికి బృహదంత్ర అంతర్దర్శన పరీక్షలను ( Colonoscopies) ప్రతి ఐదు పది సంవత్సరములకు ఒకసారి సూచిస్తారు. ఈ పరీక్షలు చేసినప్పుడు పాలిప్స్ ( Polyps) అనే అంగుష్టాకారపు కంతులు కనిపిస్తే వాటిని సమూలముగా విద్యుద్దహనప్రక్రియచే ( Electro cauterization ) తొలగించి కణపరీక్షకు పంపిస్తారు. ఈ కంతులు తొలిదశలలో నిరపాయకరమైనా తరువాత అపాయకరమైన కాన్సరులుగా పరిణామము చెందవచ్చు. ఈ నిరపాయకరమైన ఆంత్రపు పెరుగుదలలను తొలగించుటచే వైద్యులు అపాయకరమైన కర్కటవ్రణములను నివారించ గలుగుతారు. తొలిదశలలో కనుక్కో బడిన బృహదాంత్ర కర్కటవ్రణములు ( Colon cancers ) చికిత్సలకు సాధారణముగా లొంగుతాయి. భారతదేశములో యీ కొలొనోస్కోపులు శోధన పరీక్షలుగా ప్రాచుర్యము పొందినట్లు లేదు. దీర్ఘకాలిక పరిశోధనలు చేస్తే వీటి ఉపయుక్తత తెలిసే అవకాశము ఉంది.
పొగత్రాగే వారిలో తరచు శ్వాసకోశపు చిత్రాలు తీస్తే శ్వాసకోశపు కర్కటవ్రణములను తొలిదశలలో కనుక్కొనే అవకాశము కొంత ఉండవచ్చును. సంవత్సరానికో సారి కాట్ స్కాన్ ( Low dose Computerized Axial Tomography Scan ) చేస్తే యీ కాన్సరులను త్వరగా కనుక్కొనే అవకాశము పెరుగుతుంది. కాని చాలా మందిలో శ్వాసకోశపు కర్కటవ్రణాలు ( Lung Cancers) బయటపడేటప్పటికే అవి వ్యాప్తి చెంది ఉంటాయి. ఒక పదిహైను శాతము మందిలో శస్త్రచికిత్సకు అవకాశము ఉండవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తొలిదశలలో కనుక్కోబడక పోవుటచే నయమయే శ్వాసకోశపు కాన్సరులు చాలా తక్కువ ఉంటాయి.
రక్తములో ఉన్న ప్రాష్టేట్ స్పెసిఫిక్ ఏంటిజెన్ ( Prostate Specific Antigen ) పరీక్ష ప్రతి రెండు సంవత్సరములకు 55 - 69 సంవత్సరముల వయస్సులో ఉన్న పురుషులలో చేస్తే ప్రాష్టేట్ కర్కటవ్రణములను ( Prostatic Cancers) సకాలములో గుర్తించ వచ్చును.చాలా మందిలో ప్రాష్ట్రేట్ కాన్సరులు నెమ్మదిగా పెరుగుటచే పెక్కుశాతము మంది చికిత్స లేకపోయినా ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశమున్నది. P.S.A పరీక్షలతో సత్వరముగా కనుక్కొని చికిత్స చేస్తే మరింత ప్రయోజనము చేకూర వచ్చును.
కర్కట వ్రణములు ఆరంభదశలో ఉన్నపుడు యే బాధా కలిగించక పోవచ్చును. అవి పెరుగుతున్న గొలది వివిధ లక్షణాలు పొడచూపుతాయి. సాధారణముగా అవి ఏ అవయవాలలో ఉంటాయో ఆ అవయవాలకు సంబంధించిన లక్షణాలు కలుగుతాయి. ఆకలి తగ్గుట , బరువు తగ్గుట , కర్కటవ్రణ లక్షణాలు. ఏ అవయవ సంబంధమైన వ్యాధి లక్షణాలు కనిపించినా తగిన శోధన పరీక్షలు చేయుట వలన అవి ప్రస్ఫుట మవ వచ్చును. రక్త పరీక్షలు, ఎక్స్ రేలు, కాట్ స్కానులు, అల్ట్రాసోనోగ్రాములు, ఎం.ఆర్.ఐ స్కానులు, పెట్స్కానులు, కొలొనోస్కోపి , గాస్ట్రోస్కోపి, బ్రాంఖోస్కొపీలు , కర్కటవ్రణములను కనుగొనుటకు ఉపయోగ పడుతాయి.
వ్రణములు, కనుక్కొన్నాక వాటినుంచి కణపరీక్షలు ( Biopsies) చేసి వ్యాధిని నిర్ణయిస్తారు. వివిధ పరీక్షలతో ఈ కర్కట వ్రణములు యితర అవయవములకు వ్యాపించాయో లేదో నిర్ణయించి తగిన చికిత్సలు చేస్తారు.
మిగిలిన వైజ్ఞానిక శాస్త్రాల ఆలంబనముగా వైద్యశాస్త్రము అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ మంతటా వైజ్ఞానిక పరిశోధకులు విజ్ఞానశాస్త్రపు టభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. ఆరంభదశలో కనుగొనబడిన కాన్సరులు చికిత్సకు లొంగే అవకాశమున్నది. అంత్యదశలలో కనుగొన్న కర్కటవ్రణములకు సంపూర్ణచికిత్సలు సాధ్యము కావు. అటువంటి పరిస్థితులలో ఉపశమన చికిత్సలకే అవకాశ ముంటుంది.

( ఉపయుక్త మనుకుంటే పంచుకొనండి )

మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro Vascular Accidents )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) డా. గన్నవరపు నరసింహమూర్తి మెదడు నిర్మాణము ( Anatomy of Brain ) : మన శరీరములో వివిధావయవాలు న...