10, ఏప్రిల్ 2018, మంగళవారం

పొగాకు ; ధూమపానము

డా. గన్నవరపు నరసింహమూర్తి
పొగాకు అమెరికా ఖండములో చాలా శతాబ్దాల క్రితమే పుట్టినా పదిహైనవ శతాబ్దములో స్పైనుకు చేరి క్రమంగా యూరప్ , ఆసియా, ప్రపంచ మంతా వ్యాపించింది. చుట్టలు, సిగరెట్లు, బీడీలు, పైపులూ ద్వారా ధూమరూపములోను, నస్యరూపములోను పీల్చబడి, గూట్కా రూపములోను , నములుడు పొగాకుగాను మ్రింగబడి వినియోగించ బడుతుంది.
పొగాకు వినియోగము ఆరంభములో నాగరికత చిహ్నముగా పరిగణించబడినా పందొమ్మిదవ శతాబ్దములో దాని వలన కలిగే దుష్ఫలితాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ దుష్ఫలితాల తీవ్రత కారణంగా పొగాకు వినియోగము నొక వ్యాధిగా పరిగణించవలసిన పరిస్థితి ఏర్పడింది.
ధూమపానము వలన కలిగే దుష్ఫలితాలను నేను వైద్యవిద్యార్థిగా నేర్చుకొన్నా, వైద్యము నభ్యసిసిస్తున్న కొద్ది సంవత్సరముల లోనే ప్రత్యక్షముగా చూడడము వలన పొగాకు కలిగించే ప్రమాదాలు ప్రస్ఫుటముగా తెలిసాయి. పొగత్రాగే వారు సగటున పది సంవత్సరాల ఆయువుని కోల్పోతున్నట్లు గమనించాను. అదే విషయము వైజ్ఞానిక పత్రికలలో ప్రచురించ బడడము చూసాను. ధూమపానము ఊపిరితిత్తుల పుట్టకురుపులకు ( Cancers ) కారణమని తెలిసినా, అంతకంటే ఎక్కువగా ధూమపానము చేసే వారు నడివయస్సులోనే గుండెపోటులకు( Heart attacks ) , మస్తిష్క విఘాతములకు ( Cerebrovascular accidents ) గురికావడము , మరణించడము కూడా గమనించాను. శ్వాసకోశపు వ్యాధులు ( Pulmonary diseases) కూడా విపరీతముగా పొగ త్రాగే వారిలోనే చూస్తాము. దీర్ఘకాలపు శ్వాసప్రతిబంధక వ్యాధులు ( Chronic obstructive pulmonary diseases ) ఊపిరితిత్తుల వ్యాకోచ వ్యాధులు ( Emphysema ) కలిగి పొగత్రాగే వారు దగ్గు , ఆయాసాలతో బాధ పడి చాలా జీవితకాలమును కోల్పోవడము వైద్యులము నిత్యం చూస్తాము . పొగత్రాగే వారిలో కనీసము ఏభై శాతమునకు తగ్గకుండా అనారోగ్య దుష్ఫలితాలకు గురి అవుతారు. ధమనీ కాఠిన్యము ( Atherosclerosis) కలిగి రక్త ప్రసరణ లోపాలతో వివిధావయవాలు దెబ్బతినడము వలన, పెక్కు పుట్టకురుపులు కలిగించే రసాయినకముల ( Carcinogens) వలన ఊపిరితిత్తులు, మరియు యితర అవయవాలలో కర్కట వ్రణములు ( Cancers )పుట్టడము వలన ఆయుః క్షీణము , నడివయస్సు మరణాలు సంభవిస్తాయి. అందువలన , నా రోగులకే కాక , మిత్రులకు, బంధువులకు, పొగ త్రాగడము వలదని సలహాల నిస్తాను. పాఠకులలోను, మిత్రులలోను పొగత్రాగే వారుంటే ఒక నిర్ణీత ప్రణాళిక ప్రకారము త్వరగా అ అలవాటును మన్చుకోవలసిందిగా వినతి చేస్తున్నాను. ఆ అలవాటును దరికి చేరనీయ రాదని పిల్లలకు , పాపలకు చెప్పుకోవాలి. పొగాకు వినియోగము , ధూమపానాల వలన కలిగే వ్యాధులను ఇక్కడ ఒక జాబితాగా పొందుపరుస్తాను.
కర్కటవ్రణములు : ( Cancers )
పుట్టకురుపులుగా ప్రచారములో ఉన్న యీ క్రొత్త పెరుగుదలలు జన్యువులలో మార్పులు ( Mutations ) కలిగి కణములు శిధిలము చెందక త్వరితముగా పెరిగి విభజనలు పొందడము వలన పుడతాయి. ఈ పెరుగుదలలు అవయవములలోనికి మూలములతో ఎండ్రకాయల కాళ్ళ వలె చొచ్చుకుపోవడము వలన వాటికి కర్కటవ్రణము లని (cancers ) పేరు కలిగింది. ఈ వ్రణముల కణములు అవయవములుగా పరిణితి చెందకుండా విభజనలతో పెరుదలలుగా వృద్ధి పొందుతాయి. కొన్ని కణములు రక్తనాళములలోనికి , లింఫు నాళములలోనికి ప్రవేశించి రక్తప్రసరణ ద్వారా వివిధ అవయవములకు , లింఫునాళముల ద్వారా లింఫు గ్రంధులకు వ్యాప్తి చెంది అచ్చట క్రొత్తవ్రణములను సృష్టిస్తాయి. ఇవి పోషకపదార్థాలను సంగ్రహిస్తాయి. ఈ వ్రణములు అవయవాల దైనందిక ప్రక్రియలకు అంతరాయము కలిగిస్తాయి. పోషకపదార్థాలు అవయవాలకు తగినంతగా చేరకపోవడము వలన , ఆకలి తగ్గడము వలన అరుచి కలుగుట వలన రోగులు చిక్కిపోతుంటారు. తగిన చికిత్స జరుగక పోయినా , చికిత్స కనుకూలించక పోయునా ఇవి మరణమునకు దారితీయ వచ్చును.
పొగాకు పొగలో ఉండే బెంజోపైరీన్ ( Benzopyrene ) వంటి పోలిసైక్లిక్ ఏరొమేటిక్ హైడ్రోకార్బనులు కణములలో డీ ఎన్ ఏ ( D .N.A ) కు అంటుకొని మార్పులు ( mutations ) ద్వారా వాటిని కాన్సరు కణములుగా మారుస్తాయి. పొగాకు పొగలో పెక్కు కర్కటవ్రణజను ( Carcinogens ) లున్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
పొగత్రాగని వారి కంటె పొగత్రాగేవారిలో ఊపిరితిత్తుల పుట్టకురుపులు యిరవై రెట్లధికముగా కలుగుతాయి. పొగత్రాగేవారిలోఊపిరితిత్తులతోబాటు,మూత్రపిండముల ( Kidneys ) లోను,స్వరపేటికలలోను ( Larynx) ,మూత్రాశయములలోను ( Urinary bladder), అన్నవాహికల( Esophagus)లోను , జీర్ణాశయములు( Gastric cancers ) , క్లోమముల ( Pancreas) లోను పుట్టకురుపులు కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇతర అవయవాలలో కర్కటవ్రణములు రావడానికి కూడా ధూమపానము సహకరిస్తుందని పరిశోధనలు నిరూపించాయి. ఊపిరితిత్తులలో వచ్చే కాన్సరులు ప్రస్ఫుటమయ్యే సరికి తొంబయి శాతము మందిలో శస్త్ర చికిత్స స్థాయిని దాటిపోతాయి. అందుచే చికిత్స ఫలప్రదమయ్యే అవకాశము చాలామందిలోతక్కువ. పొగత్రాగకుండా వాటిని నిరోధించుట చాలా మేలు.
శ్వాసకోశవ్యాధులు ( Pulmonary diseases) ;
శ్వాసనాళపు శాఖలలోను, వాటి చివరల ఉండే గాలిబుడగల( Alveoli) లోను సాగుదల ఉంటుంది. ఆ సాగుదల ( Elasticity) వలన ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు బాగా జరిగి గాలి కదలికలు సరిగ్గా జరుగుతాయి. పొగత్రాగే వారిలో సాగు కణజాలము ( Elastic tissue) చెడి ఆ సాగుదల దెబ్బతింటుంది. అందువలన గాలి కదలికలకు అవరోధము కలుగుతొంది. ఊపిరితిత్తులు , ఛాతి సాగుదల త్రగ్గుట వలన అవి వ్యాకోచము ( Emphysema) చెందుతాయి శ్వాసనాళపు పూతకణముల కుండే సిలియా కూడా పొగత్రాగే వారిలో పనిచెయ్యవు. అందుచే స్రావకములు ( mucous secretions) తొలగించబడవు. తఱచు సూక్ష్మజీవుల వలన వ్యాధులు కలుగుతాయి. వీరికి శ్వాస సరిగ ఆడక ఆయాసము , దగ్గు వస్తుంటాయి. వాయువుల మార్పిడి తగ్గడము వలన రక్తములో బొగ్గుపులుసువాయువు ( Carbon dioxide) పరిమాణము పెరగడము, ప్రాణవాయువు ( Oxygen) పరిమాణము తగ్గడము కూడా కలుగవచ్చును. శ్వాసావరోధవ్యాధిని ( Obstructive pulmonary disease) చాలా మంది ధూమపానీయులలో నిత్యము వైద్యులు చూస్తారు.
హృద్రోగములు. రక్తనాళపు వ్యాధులు :
రక్తనాళపు శాఖలల గోడల మధ్య వయస్సు పెరుగుతున్న కొలది కొలెష్ట్రాలు ( Cholesterol చేరి మార్పులు జరిగి ధమనీకాఠిన్యత ( Atherosclerosis) ఏర్పడుతుంది. పొగత్రాగే వారిలో చెడు కొలెష్ట్రాలు పెరుగుటయే కాక , ఆ కొలెష్ట్రాలు నాళములలో చేరి ధమనీకాఠిన్యతను వేగపరుస్తుంది. ధమనులు కాఠిన్యత పొందినప్పుడు నాళపరిమాణము తగ్గి రక్తప్రవాహమునకు అవరోధము కలుగవచ్చు. రక్తము గడ్డకట్టడానికి తోడ్పడే ఫైబ్రినోజెన్( Fibrinogen ) , ప్లేట్ లెట్లు ( Platelets ) కూడా పొగత్రాగేవారిలో విరివిగా ఉత్పత్తి చెందుతాయి.
హృదయ ధమనులలో( Coronary arteries ) కాఠిన్యత పెరిగి రక్తము గడ్డకడితే హృదయకండరములకు రక్తప్రసరణ లోపించి గుండెపోటులు రావచ్చు. అదే విధముగా మెదడు రక్తప్రసరణకు అవరోధము కలుగుతే మస్తిష్క విఘాతములు
( Cerebrovascular accidents ) కలిగి పక్షవాతములు సంభవిస్తాయి.
దూరరక్తప్రసరణలోపాలు ( Peripheral vascular diseases ) కలుగవచ్చును. రక్తప్రసరణలోపాల వలన కాళ్ళు కోల్పోయిన వారు తఱచు ధూమపానీయులే ! పొగత్రాగే వారిలో వారు పీల్చే కార్బను మోనాక్సైడు ( Carbon monoxide) ఎఱ్ఱకణాల హీమోగ్లోబిన్ ( Hemoglobin ) తో జతకూడడము వలన అవి పంపిణీ చేసే ప్రాణవాయువు తగ్గుతుంది.
ధమనీ కాఠిన్యత వలన పురుషులలో నపుంసకత్వము కూడా కలుగుతుంది. మూత్రపిండముల వ్యాపారము కూడా పొగత్రాగేవారిలో క్షీణిస్తుంది. వివిధావయవాల వ్యాపారము దెబ్బతినుట వలన అంతర్గతముగాను , బాహ్యముగాను పొగత్రాగేవారిలో వృద్ధాప్యపు లక్షణాలు త్వరిత గతిలో ప్రస్ఫుట మవుతాయి.
ఈ వ్యాసములో పేర్కొన్న విషయాలను వైద్యవృత్తిలో ఉండుట వలన ప్రత్యక్షముగా ప్రతిదినము చూస్తాను. ధూమపానము వీడుట వలన చాలా రోగములు నివారించగలుగుతాము. ఎనభై, తొంబై సంవత్సరాలకు వచ్చే రోగములు , మరణములు నలభై , ఏభై సంవత్సరాలలో కలుగకుండా నివారించడము ఎంతో మేలు కదా !
అందువలన పొగత్రాగే వారు మొండివాదనలు, సాకులు, నెపాలు మాని త్వరగా పొగత్రాగడము మానివేయుట ఉత్తమము . వైద్యులు, మందులు సహకరించినా, నా అనుభవములో ఆయా వ్యక్తుల పట్టుదల, లక్ష్యములే పొగత్రాగడము మానడానికి తోడ్పడుతాయి. పిల్లలకు చిన్నతనము నుంచే పొగత్రాగరాదని నూరిపొయ్యవలసిన అవసరము కూడా చాలా ఉన్నది.
( ఈ వ్యాసమును స్వేచ్ఛగా పంచుకొని , ప్రతులు తీసుకొని మీ , మీ బంధుమిత్రులు ధూమపానము , పొగాకు వాడుకలు మానుటకు సహకరించ ప్రార్థన )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro Vascular Accidents )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) డా. గన్నవరపు నరసింహమూర్తి మెదడు నిర్మాణము ( Anatomy of Brain ) : మన శరీరములో వివిధావయవాలు న...