10, ఏప్రిల్ 2018, మంగళవారం

రక్తపుపోటు

డా. గన్నవరపు నరసింహమూర్తి.
రక్తప్రసరణము వలన దేహములో వివిధ అవయవాలకు, కణజాలమునకు ప్రాణవాయువు, పోషకపదార్థములు అందింపబడి, వాని నుండి బొగ్గుపులుసువాయువు, మిగిలిన వ్యర్థపదార్థములు తొలగించ బడుతాయి. హృదయ సంకోచ వికాసముల వలన రక్తనాళముల ద్వారా రక్తప్రసరణము జరుగుతుంది.
హృదయములో ఎడమ జఠరిక ( Left Ventricle ) రక్తమును వివిధ అవయవములకు బృహద్ధమని ( Aorta ), దాని శాఖలు, ధమనుల ద్వారా చేర్చితే, వివిధ అవయవముల నుండి, తిరిగి ఆ రక్తము. ఉపసిరలు, ఊర్ధ్వ బృహత్సిర ( Superior Venacava ), అధో బృహత్సిర ( Inferior Venacava ) ల ద్వారా హృదయములో కుడి భాగమునకు, చేరుతుంది. కుడికర్ణిక నుంచి కుడి జఠరికకు , కుడి జఠరిక నుంచి పుపుస ధమని ( Pulmonary artery ) ద్వారా ఊపిరితిత్తులకు రక్తము చేరి, ఊపిరి తిత్తులలో వాయువుల మార్పిడి జరిగాక ( బొగ్గుపులుసు వాయువు తొలగి, ప్రాణవాయువు కూడి ) పుపుస సిరల ( Pulmonary Veins ) ద్వారా రక్తము గుండె ఎడమ భాగానికి చేరుతుంది.
రక్త ప్రసరణకు కొంత పీడనము అవసరము . హృదయములో జఠరికలు వికసించి నప్పుడు ( Diastole ) రక్తప్రవాహముతో అవి నిండుతాయి. అప్పుడు బృహద్ధమని, పుపుస ధమనులల మూలములలో నున్న కవాటములు మూసుకొని ఉంటాయి. అప్పుడు ధమనులలో ఉండే పీడనమును వికాసపీడనము ( Diastolic pressure ) అంటారు. జఠరికలు ముడుచుకున్నప్పుడు ( Systole ) రక్తప్రవాహము వలన ధమనులలో పీడనము పెరుగుతుంది. అప్పటి పీడనమును ముకుళిత పీడనము ( Systolic Pressure ) అంటారు. హృదయ సంకోచ, వికాసముల వలన రక్తనాళములలో రక్తము పరంపరలుగా ప్రవహిస్తుంది. రక్తపీడనమును పాదరస మట్టముతో కొలుస్తారు. ధమనులలో ఉండే రక్తపీడనము గురించి చర్చిస్తాను.
వయోజనులలో ముకుళిత పీడనము ( ఈ సంఖ్యను పైన సూచిస్తారు. )100 నుంచి 140 మిల్లీమీటర్ల పాదరస ప్రమాణములోను , వికాసపీడనము ( ఈ సంఖ్యను క్రింద సూచిస్తారు ) 60 నుంచి 100 మిల్లీమీటర్ల పాదరస ప్రమాణములోను ఉండుట సహజముగా పరిగణించ బడుతుంది.
రక్తపీడనము నిలకడగా 140/ 90 మి.మీ. దాటి ఉంటే దానిని వైద్యులు రక్తపు పోటుగా ( Hypertension ) పరిగణిస్తారు.ఏదో ఒక్కక్క సారి ఆందోళన, భయము వంటి కారణముల వలన రక్త పీడనము కొంచెము హెచ్చినంత మాత్రమున దానిని రక్తపు పోటుగా పరిగణించ రాదు. విశ్రాంతముగా కొద్ది సేపు కూర్చొన్నాక రెండు, మూడు పర్యాయములు, లేక దినములో పెక్కు సార్లు పరిపాటిగా దినదిన కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నపుడు తీసుకొనే రక్తపీడనపు విలువలు ( Ambulatory Pressures ) బట్టి రక్తపుపోటుని నిర్ణయించాలి.
రక్తపుపోటు అదుపులో లేక ఎక్కువ కాలము ఉండుట వలన గుండెపోటు, గుండె బలహీనత, హృదయ వైఫల్యము ( Congestive Heart failure ), మస్తిష్క విఘాతాలు ( Cerebro Vascular Accidents ), మూత్రపిండముల వైఫల్యము ( Renal failure ), దృష్టి లోపములు వంటి విషమ పరిణామములు కలుగుతాయి. అందువలన రక్తపు పోటును అదుపులో పెట్టవలసిన అవసరముంది.
అధిక సంఖ్యాకులలో అధికపీడనము ( 95 శాతమునకు మించి ) ప్రధాన రోగము ( Primary Hypertension ) . అంటే దానికి యితర కారణాలు ఉండవు. కొద్ది మందిలో ( సుమారు 5 శాతము మందిలో ) అది యితర వ్యాధుల వలన కలుగుతుంది. అప్పుడు దానిని అప్రధాన అధికపీడనముగా ( Secondary Hypertension ) పరిగణిస్తారు. థైరాయిడ్ హార్మోను ఎక్కువ అవడము, తక్కువ అవడము, అడ్రినల్ స్టీరాయిడ్ లు ఎక్కువ కావడము (. Cushing Syndrome ) ), ఆల్డోస్టీరోన్ ఎక్కువ కావడము ( Primary Hyperaldosteronism ) పారాథైరాయిడ్ హార్మోను ఎక్కువ అవడము వంటి వినాళ గ్రంధుల వ్యాధులు, ఫియోఖ్రోమోసైటోమా, మూత్రపిండముల వ్యాధులు, మూత్రపిండ ధమనుల ఇరకటము ( Renal artery stenosis ) వలన కలిగే రక్తపుపోటులు అప్రధానపు రక్తపు పోటులు. అప్పుడు రక్తపు పోటును అదుపులో పెట్టడముతో బాటు అసలు వ్యాధులకు చికిత్స చెయ్యాలి. శస్త్రచికిత్సలు కూడా అవసరము కావచ్చు.
ఇతర కారణాలు లేకుండా కలిగే ప్రధాన అధికపీడనము జన్యు సంబంధ మైనది కావచ్చును. ఎక్కువ ఉప్పు వాడకము, వ్యాయామ లోపము, సారాయి వినియోగము, మాదక ద్రవ్యాల వినియోగము, పొగ త్రాగడము, స్థూలకాయము రక్తపుపోటు కలుగడానికి తోడ్పడ వచ్చును.
రక్తపీడనము ఎలా కలుగుతుంది ?
రక్తప్రసరణకు రక్తనాళముల నుండి కలిగే ప్రతిఘటన వలన రక్తపీడనము కలుగుతుంది. దేహములో రెనిన్, ఏంజియోటెన్సిన్ల ఏర్పాటు, సహవేదన నాడీమండలము ( Sympathetic Nervous system ) రక్తనాళములలోని మృదుకండరాల ( Smooth muscles ) బిగుతును ( Constriction) నియంత్రిస్తాయి.
మూత్రపిండములలో రెనిన్ ఉత్పత్తి చెంది రక్తములోనికి విడుదల అవుతుంది. ఈ రెనిన్ కాలేయములో ఉత్పత్తి అయే ఏంజియోటెన్సినోజన్ ని ఏంజియోటెన్సిన్ -1 గా మారుస్తుంది.ఏంజియోటెన్సిన్ -1 దేహములో ఉండే ఏంజియోటెన్సిన్ కన్వెర్టింగ్ ఎంజైము వలన ఏంజియోటెన్సిన్ -2 గా మారుతుంది. ఏంజియోటెన్సిన్ -2 రక్తనాళ కండరాలను సంకోచింపజేసి, రక్తనాళముల బిగుతును పెంచుతుంది. ఏంజియోటెన్సిన్ -2 ఎడ్రినల్ గ్రంధుల నుంచి ఆల్డోస్టెరోన్ ని కూడా విడుదల కావిస్తుంది . ఆల్డోస్టెరోన్ శరీరములో సోడియం ని పెంచుతుంది.
సహవేదన నాడీమండలము, ఎడ్రినల్ గ్రంధుల నుంచి విడుదల అయే ఎడ్రినలిన్, నారడ్రినలిన్ హార్మోనులు ( Catecholamines ) కూడా రక్తనాళపు మృదుకండరాలను నియంత్రిస్తాయి. ఇవి గుండె వేగమును , గుండె సంకోచ ప్రక్రియను ఇనుమడింపజేస్తాయి.
పై ప్రక్రియల ప్రభావము ఎక్కువయి నప్పుడు రక్తపీడనము పెరిగి రక్తపుపోటు కలుగుతుంది.
రక్తపుపోటు లక్షణాలు :
చాలా మందిలో రక్తపుపోటు చాలాకాలము ఎట్టి లక్షణాలు , నలతలు చూపించదు. రక్తపీడనము కొలవడము వలనే ఈ రుగ్మతను కనిపెట్టగలము.
తలనొప్పి, కళ్ళు తిరగడము, వళ్ళు తూలిపోవడము వంటి లక్షణములు కొందఱిలో కలుగ వచ్చును. ఒట్లో బాగానే ఉందని రక్తపుపోటుని నిర్లక్ష్యము చేయకూడదు. మధ్య మధ్యలో కొలుచుకోకుండా రక్తపుపోటు అదుపులోనే ఉన్నదని భ్రమించకూడదు.
గుండె వ్యాధులు, మూత్రపిండ వైఫల్యము , మస్తిష్క విఘాతము, దూర రక్తప్రసరణ లోపములు ( Peripheral Vascular insfficiency ), అంధత్వము వంటి పరిణామముల వలనే రక్తపు పోటు కొంతమందిలో తొలిసారిగా కనుగొనబడ వచ్చును.
లక్షణాలు పొడచూపక పెక్కు అవయావాలపై చెడు ప్రభావము చూపిస్తుంది కాబట్టి మధ్య మధ్య రక్తపీడనము పరీక్షించుకోవలసిన అవసరమున్నది. ఎక్కువగా ఉంటే చికిత్స అవసరము.
పరీక్షలు;
రక్తపు పోటు ఉన్నదని నిర్ధారణ చేసాక కొన్ని పరీక్షలు అవసరము. రక్తకణ గణనలు ( Complete Blood Counts ) , రక్త రసాయన పరీక్షలు ( Blood Chemistry ) మూత్రపిండ వ్యాపార పరీక్షలు
( Renal functions ), మూత్రపరీక్షలు, అవసరమనిపిస్తే, హార్మోను పరీక్షలు, ఎలెక్ట్రో కార్డియోగ్రాము వంటి పరీక్షలు అవసరము. కంటి పరీక్షలు ( Fundoscopy ) కూడా అవసరమే .
సంకోచ పీడనము (Systolic Pressure ) 180 మి. మీ.మెర్క్యురీ పైన, వికాస పీడనము ( Diastolic Pressure ) 110 మి.మీ మెర్కురీ దాటితే దానిని అధిక రక్తపీడన సంక్షోభముగా ( Hypertensive Crisis ) పరిగణిస్తారు. హృదయము, మెదడు, మూత్రపిండములు, కళ్ళపై దీని ప్రభావము కనిపిస్తే ఈ పీడన సంక్షోభాన్ని అత్యవసర పరిస్థితిగా పరిగణించి చికిత్స చెయ్యాలి.సిరాంతర ఔషధాలు ( Intravenous drugs ) అవసర మవవచ్చును. ఎట్టి విపత్తులు లేకపోతే నోటి ద్వారా మందులిచ్చి చికిత్స చెయ్యవచ్చును.
చికిత్స :
రక్తపుపోటు ఉన్నదని నిర్ధారణ చేసాక , యితరవ్యాధి లక్షణాలు లేవని రూఢీ చేసి, తగిన పరీక్షలు చేస్తూ, వ్యాధికి చికిత్స చెయ్యాలి. అధిక పీడనము సరిహద్దు పరిమితులలో ఉన్నప్పుడు ఔషధుల అవసరము లేకుండా జీవనశైలి మార్పుల వలన దానిని అదుపులో పెట్ట గలిగే అవకాశ మున్నది.. కాని పక్షములోను, పీడన పరిమితు లధికముగా నున్నప్పుడును మందులు వాడక మవసరము.
జీవన శైలి మార్పులు ;
శరీరానికి తగినంత వ్యాయామము చాలా అవసరము. శ్రామికులు ఆరోగ్యవంతులుగాను దీర్ఘాయుష్కులుగా నుండుట , గమనిస్తుంటాము. ఈ వాహనయుగములో ప్రజలకు నడక వ్యాయామము తగ్గింది. తినుబండారములు కూడా పెరిగాయి. మనకు తగినంత వ్యాయామము అవసరము. ఉప్పు, క్రొవ్వుపదార్థాల వాడుక తగ్గించుట , మితముగా భుజించుట, స్థూలకాయములను తగ్గించుట, , పొగత్రాగుట మానుట, సారాయి వాడుకను పరిమితము చేయుట , మాదకద్రవ్యాలను వినియోగములు మానుట రక్తపుపోటును అదుపులో నుంచుటకు తోడ్పడుతాయి.
ఔషధాలు :
అధిక రక్తపీడనమును అదుపులో నుంచుటకు వివిధ తరగతుల ఔషధాలు ఉన్నాయి. ప్రప్రధముగా, తేలిక మూత్రకారులను (. Diuretics ) వినియోగిస్తాము. ఇవి లవణ నష్టమును, జలనష్టమును కలుగ జేసి, రక్త పరిమాణమును తగ్గించి రక్తనాళముల పీడనమును తగ్గిస్తాయి. కణాంతరములలో సోడియం తగ్గినప్పుడు రక్తనాళ కండరముల బిగుతు తగ్గుతుంది. థయజైడ్ మూత్రకారులను రక్తపుపోటునకు వాడుతారు
బీటా అడ్రినల్ రిసెప్టర్ బ్లాకరులు :
ఎడ్రినలిన్ నారడ్రినలిన్ వంటి హార్మోనుల ప్రభావమును బీటా అడ్రినల్ గ్రాహకములను అవరోధించి తగ్గిస్తాయి. అందువలన నాళాలలో బిగుతు తగ్గుతుంది. హృదయ వేగమును తగ్గించి, హృదయ వికాసమును పెంచి అధికపీడన నివారణకు తోడ్పడుతాయి.
ఏంజియోటెన్సిన్ కన్వెర్టింగ్ ఎంజైం ఇన్హిబిటర్లు ;
ఇవి ఏంజియోటెన్సిన్ 1 ను ఏంజియోటెన్సిన్ -2 గా మార్పు చెందకుండా అరికడుతాయి. రక్తపు పోటును తగ్గిస్తాయి.
ఏంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకరులు :
ఇవి ఏంజియొటెన్సిన్ 2 గ్రాహముకలను అడ్డడము వలన ఏంజియోటెన్సిన్ 2 నిర్వీర్యమయి ధమనికల బిగుతు తగ్గుతుంది. రక్తపుపోటు తగ్గుతుంది. ఆల్డోస్టెరోన్. ఉత్పత్తిని కూడా ఇవి తగ్గిస్తాయి.
ఆల్ఫా ఎడ్రినెర్జిక్ బ్లాకర్లు. ;
ఇవి ఆల్ఫా అడ్రినల్ గ్రాహకములను ( రిసెప్టారులను ) నిరోధించి రక్తనాళములపై అడ్రినల్ హార్మోనుల ప్రభావమును తగ్గిస్తాయి. ధమనికల బిగుతు తగ్గిస్తాయి.
ఇంకా పలు రకాల మందులు అధికపీడన నివారణకు ఉన్నాయి.
ఏ ఔషధమైనా అనుకూల ఫలితాలనే గాక ప్రతికూల ఫలితాలను కూడా కలిగించవచ్చును. కాబట్టి వైద్యులు వాటిని గమనిస్తూ ఉండాలి. మూత్రకారులను వాడి నప్పుడు, పొటాసియము విలువలను మధ్య మధ్య పరీక్షించాలి.
రక్తపుపోటును అదుపులో ఉంచుటకు కొందఱికి అనేక ఔషధాల అవసరము కలుగ వచ్చును.
రక్తపుపోటు ఎక్కువగా ఉన్నా ఎట్టి నలత చూపించక అవయవాలపై దీర్ఘకాలిక దుష్ఫలితాలను కలిగించవచ్చును. అధికపీడన సంక్షోభము సంభవిస్తే గుండెపోటు, మస్తిష్క విఘాతము , దృష్టిలోపము, మూత్రపిండాల వైఫల్యము, హృదయ వైఫల్యము వంటి విషమ సంఘటనలు కలుగవచ్చును.
అందువలన వీలు కలిగించుకొని, అప్పుడప్పుడు రక్తపీడనమును పరీక్షించుకోవాలి. వైద్యులను సంప్రదించి వారి సలహాల ననుసరించాలి. ఆరోగ్య విషయ పరిజ్ఞానము సమకూర్చుకొనుట చాలా మంచిది. కాని సంపూర్ణ పరిజ్ఞానము, అవగాహన, అనుభవము ఆ వృత్తిలో లేని వారికి కలుగదు కాబట్టి వైద్యుల సలహాలను పాటించుట అవసరము.

మధుమేహవ్యాధి ( Diabetes mellitus )

 డాక్టరు గన్నవరపు నరసింహమూర్తి
క్రీస్తు పూర్వము1500 సంవత్సర ప్రాంతములోనే " మధుమేహ వ్యాధిని " భారతీయ వైద్యులు వర్ణించారు. ఈ వ్యాధిగ్రస్తుల మూత్రము చుట్టూ చీమలు చేరడము గమనించి , వారి మూత్రము మధుకరమని గ్రహించారు. ఈజిప్టు దేశ వైద్యు లా వ్యాధిని అతిమూత్రవ్యాధిగా వర్ణించారు. శుష్రుతుడు, చరకుడు మధుమేహవ్యాధి రెండు విధములని, పిల్లలలో ఒకరకముగను, పెద్దలలో వేఱొక లక్షణములతో ఉంటుందని పసిగట్టారు. చిరకాలము క్రితమే కనుగోబడిన యీ వ్యాధి ప్రాబల్యము ఇరువది శతాబ్దములో బాగా హెచ్చినది. ఒకప్పుడు ధనిక వర్గాలలో ప్రాబల్యమైన యీ వ్యాధి యీ తరములో పేద, మధ్యతరగతి వారిలో విరివిగా పొడచూపు చున్నది.
శరీరమునకు అవసర మయ్యే శక్తి ఆహారము ద్వారా మనకు లభిస్తుంది. ఆహారపదార్ధాలలో పిండిపదార్థములు ( Carbohydrates ), క్రొవ్వులు ( Fats ) , మాంసకృత్తులు ( Proteins ) శక్తి నిస్తాయి. వాటి నుంచి లభ్యమయ్యే శక్తిని ( ఉష్ణమును ) కాలరీలు ( Calories ) గా కొలుస్తారు.
శరీర సాధారణ జీవప్రక్రియలకు కొన్ని కాలరీలు ఖర్చవుతాయి. మనము పడే శారీరక శ్రమ, వ్యాయామము, క్రీడలకు , బాల్య కౌమారకావస్థలలో పెరుగుదలకు అదనముగా శక్తి వెచ్చింప బడుతుంది. పెరుగుదల నిలిచాక మనకు ఆహారపు టవసరాలు త్రగ్గుతాయి. దైనందిక అవసరాలకు మించి తినే తిండి కాలేయము ( Liver ), కండరములలో మధుజని ( Glycogen ) అనే సంకీర్ణ శర్కర గాను, క్రొవ్వుగా చర్మము క్రింద పొరలోను ( Adipose tissue ), ఇన్సులిన్ సహకారముతో దేహమంతటా నిలువవుతుంది. రక్తములో, చక్కెర గ్లూకోజు ( Glucose ) రూపములో ప్రవహించి దేహములో కండరములకు, వివిధ అవయవాలకు , కణజాలమునకు యింధనముగా చేరుతుంది.
మధుజని ( Glycogen ) ఉత్పత్తిని Glycogenesis అని అంటారు.
శక్తి అవసరమయినప్పుడు , చక్కెర ( Glucose ) స్థాయి త్రగ్గినప్పుడు, కాలేయము, కండరములలో మధుజని ( Glycogen ) చక్కెరగా విచ్ఛిన్నమవుతుంది. క్రొవ్వు పొరల లోని క్రొవ్వు నుంచి శర్కరజనితము ( Gluconeogenesis ) అనే ప్రక్రియ వలన చక్కెర ( Glucose ) ఉత్పత్తి అవుతుంది. ఈ చక్కెర రక్తము ద్వారా కణజాలమునకు, చేరి వినియోగపడుతుంది.
సాధారణముగ రక్తపు చక్కెర విలువ ఉపవాస సమయములలో ( Fasting values ) 80 మి.గ్రా నుంచి 100 మి.గ్రాముల వఱకు ఉంటుంది. భోజనానంతరము రెండు గంటలప్పుడు పరీక్షిస్తే చక్కెర 140 మి.గ్రా. వఱకు ఉండవచ్చును. ఉపవాసపు విలువ 126 మి.గ్రా లైనా , రెండు గంటల భోజనానంతరపు విలువ 140 మి.గ్రా మించినా మధుమేహవ్యాధి ఉన్నదని నిర్ణయించవచ్చును. ఈ విలువలు పొలిమేరలలో ఉంటే శర్కర అసహనము ( Glucose Intolerance ) గాను , మధుమేహవ్యాధికి చేరువలో ( Borderline Diabetes ) ఉన్నట్లు గాను పరిగణించి వ్యాధి నివారణకు కృషి చెయ్యాలి.
మధుమేహవ్యాధికి కారణాలు :
జీర్ణాశయపు సమీపమున దిగువగా ఉన్న క్లోమగ్రంధి ( Pancreas ) క్లోమరసమును ఉత్పత్తి చేసి ఆహారము జీర్ణమవుటకు తోడ్పడుతుంది. ఆ క్లోమరసము క్లోమనాళము ద్వారా డుయోడినంకు ( Duodenum ; చిన్నప్రేవుల తొలిభాగము ) చేరుతుంది.
క్లోమగ్రంధిలో చిన్న చిన్న దీవులుగా ( Islets of Langerhans ) ఉండే బీటా కణములు ( beta cells ) " ఇన్సులిన్ " అనే హార్మోన్ ని ( వినాళ రసం ) స్రవించి రక్తము లోనికి విడుదల చేస్తాయి. ఈ దీవులలో ఉండే ఆల్ఫా కణములు ( alpha cells) గ్లూకగాన్ ( Glucagon ) అనే వినాళ రసము నుత్పత్తి చేస్తాయి. ఇన్సులిన్ , గ్లూకగాన్ లు ఒకదాని కింకొకటి వ్యతిరేకముగా పనిచేస్తాయి.
రక్తములో ఆహారము తిన్న తరువాత, చక్కెర విలువలు పెరిగినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తములో ఇన్సులిన్ విలువ పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ చక్కెరను కణాలలోనికి పంపుతుంది. కాలేయము, కండరాలలో అదనపు చక్కెరను మధుజని ( Glycogen ) గా మారుస్తుంది. క్రొవ్వుకణాలలోనికి చక్కెరను చేర్చి క్రొవ్వుగా మారుస్తుంది. కణములలో చక్కెర వినియోగపడి శక్తి విడుదల కావటానికి కూడా ఇన్సులిన్ దోహదకారి.
రక్తములో చక్కెర విలువలు బాగా పడిపోతే గ్లూకగాన్ స్రావము పెరుగుతుంది. గ్లూకగాన్ మధుజని విచ్ఛిన్నమును( Glycogenolysis , కాలేయము, కండరములలో ) , మద విచ్ఛిన్నమును ( Lypolysis , క్రొవ్వుపొరలలో ) ప్రేరేపించి చక్కెర ఉత్పత్తిని పెంచుతుంది. అందుచే చక్కెర విలువలు పెరుగుతాయి.. ఎడ్రినలిన్, ఎడ్రినల్ కార్టికోస్టీరాయిడ్ ల వంటి హార్మోనుల ప్రభావము కూడా చక్కెర విలువలపై ఉంటుంది.
ఇన్సులిన్ ఉత్పత్తి త్రగ్గినా, ఇన్సులిన్ కి అవరోధ మెక్కువయి ( Insulin Resistance ), ఉత్పత్తి అయిన ఇన్సులిన్ నిష్ఫలమైనా , చక్కెరపై అదుపు త్రగ్గుతుంది. చక్కెర కాలేయము, కండరాలలో మధుజనిగా మారదు. క్రొవ్వుపొరలలో క్రొవ్వుగా మార్పు చెందదు. కణజాలములోనికి తగినంతగా ప్రవేశించదు. చక్కెర ప్రాణవాయువుతో కలిసి బొగ్గుపులుసు వాయువు, ఉదకములుగా విచ్ఛిత్తి జరిగి ,శక్తి విడుదల కావటానికి కూడా ఇన్సులిన్ అవసరమే .
ఇన్సులిన్ లోపము, అసమర్థతల వలన రక్తములో చక్కెర విలువలు పెరిగి మధుమేహ వ్యాధిని కలుగ జేస్తాయి.
మధుమేహ వ్యాధి రెండురకాలు. (1) మొదటి రకము ( Type -1 or Insulin Dependent ) ఇన్సులిన్ ఉత్పత్తి లోపము వలన కలుగుతుంది. వ్యాధిగ్రస్థులలో ఇన్సులిన్ విలువలు తక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ తోనే వ్యాధిని నయము చేయగలము. ఈ మధుమేహము ఇన్సులిన్ అవలంబితము( Insulin Dependent ). తరుణప్రాయములోనే ఈ వ్యాధి ప్రస్ఫుట మవుతుంది. ఇన్సులిన్ తప్ప యితర మందులు ఈ వ్యాధికి నిష్ప్రయోజనము .
(2) రెండవ రకము ఇన్సులిన్ పై ఆధార పడనిది ( Type -2 or Non Insulin Dependent) . దీనిని వయోజనులలో చూస్తాము. స్థూలకాయులలో , ఇన్సులిన్ సమర్థత త్రగ్గుట వలన ఈ వ్యాధి కలుగుతుంది. అంత్యదశలలో తప్ప ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే ఉంటుంది. ఇన్సులిన్ కి అవరోధము
( Resistance ) పెరిగి, దాని ప్రయోజనము త్రగ్గి మధుమేహము కలుగుతుంది. జీవనశైలి, మార్పులు, నియమితాహారము, వ్యాయామములు వ్యాధి నివారణకు, వ్యాధిని అదుపులో ఉంచుటకు తోడ్పడుతాయి. మెట్ ఫార్మిన్, ఇన్సులిన్ స్రావకములు( Insulin Secretagogues ), ఇన్సులిన్లను అవసరము బట్టి వ్యాధిని అదుపులో ఉంచుటకు వాడుతారు.
కారణాలు :
(1) మొదటి రకపు మధుమేహపు వ్యాధి జన్యుసంబంధమైనది. శరీరరక్షణ వ్యవస్థ ఆత్మాక్రమణ వలన ( Autoimmune process ), క్లోమములోని బీటా కణములు నాశనమొందుట వలన ఇన్సులిన్ ఉత్పత్తి వీరిలో లోపిస్తుంది.
(2) రెండవరకపు వయోజన మధుమేహము కూడా వంశపారంపర్యముగా వచ్చే జన్యుసంబంధ మవ వచ్చును. కాని జీవనశైలి, వ్యాయామలోపము, అమితాహారము, శర్కర సహిత పానీయములు, మితిమీరిన క్రొవ్వుపదార్థ వాడుకలు ( Saturated fats ) ధూమపానము, స్థూలకాయములు ఈ మధుమేహము కలుగుటకు ఎక్కువగా తోడ్పడుతాయి. కణాలలో ఇన్సులిన్ గ్రాహకముల ( Receptors ) అవరోధము పెరుగుటచే ఇన్సులిన్ సమర్థత త్రగ్గుతుంది. రక్తములో ఇన్సులిన్ విలువలు ఎక్కువగా ఉన్నా దాని ఫలితము తక్కువే.
గర్భిణీ స్త్రీలలో పెక్కు వినాళగ్రంధస్రావకముల వలన ( Harmones) గర్భసంబంధ మధుమేహము ( Gestational Diabetes ) కలుగ వచ్చును.
ఇతర వినాళగ్రంధుల వ్యాధులు, క్లోమ వ్యాధులు, గ్లూకోకార్టికోస్టీరాయిడుల వంటి మందులు, శస్త్రచికిత్సతో క్లోమమును తీసివేయుట , మరికొన్ని యితర వ్యాధుల వలన మధుమేహము కలుగ వచ్చును.
వ్యాధి లక్షణాలు:
రక్తములో చక్కెర స్థాయి పెరిగి మూత్రములో చక్కెర నష్టము కలిగితే, చక్కెరతో బాటు జలనష్టము కూడా కలిగి అతిమూత్రము కలుగుతుంది. జలనష్టము వలన దాహము పెరుగుతుంది. చక్కెర నష్టము వలన బరువు త్రగ్గుతారు . ఆకలి పెరిగి వారు తిండి ఎక్కువగా తిన్నా బరువు త్రగ్గుతారు. కళ్ళ కటకములలో చక్కెర , నీరు చేరి కటకపు ఆకృతి మారడము వలన దృష్టిలోపాలు కలుగ వచ్చును. కొందఱిలో విశేషముగ లక్షణాలు పొడచూపక పోవచ్చును. కొందఱు క్లిష్టపరిస్థుతులతోనే వైద్యులను సంప్రదించ వచ్చును.
మధుమేహము వలన వచ్చే జటిలములు :
మధుమేహవ్యాధి వలన సూక్ష్మరక్తనాళములు కుచించుకుపోతాయి.రక్తనాళములు బిరుసెక్కుట వలన ( ధమనీకాఠిన్యం , Atherosclerosis ) కలిగి హృద్రోగములు, మస్థిష్కవిఘాతములు( Cerebrovascular accidents ) మూత్రపిండముల వైఫల్యము
( Renal failure ) దూర నాడుల ధ్వంసము ( Peripheral Neuritis ) వలన స్పర్శలోపము, దూరరక్తప్రసరణ లోపాలు ( Peripheral Vascular disease ) దృష్టిదోషాలు మధుమేహము వలన కలుగ వచ్చును.
ఇన్సులిన్ లోప మధికమైతే చక్కెర ఆమ్లజనీకరణ( Oxygenation ) అసంపూర్తి కావుటచే
కీటోనులు( Ketones ) పెరిగి రక్తము ఆమ్లీకరణ మవవచ్చును ( Diabetic Keto Acidosis ) దీని వలన అత్యవసర పరిస్థితి కలుగ వచ్చు. అపస్మారకత రావచ్చును. చక్కెర స్థాయి బాగా పెరిగి Hyperosmolar coma కలుగ వచ్చు.
వ్యాధి నిర్ణయము : రక్తములో చక్కెర విలువలు చూసి వ్యాధిని నిర్ణయించవచ్చును. Glycated Haemoglobin విలువలు కూడా తోడ్పడుతాయి.
చికిత్స:
తరుణ మధుమేహమునకు ఇన్సులిన్ వాడుక తప్పనిసరి.
వయోజన మధుమేహమునకు జీవనశైలి మార్పులు తప్పనిసరి. పరిమితాహారము, క్రొవ్వులు, చక్కెరల వినియోగమును నియంత్రించుట, వ్యాయామము, చక్కెరపానీయాలు మానుట, పొగత్రాగడము మానుట చాలా అవసరము.
మెట్ ఫార్మిన్, ఇన్సులిన్ స్రావకములు, క్రమరీతిలో వైద్యులు వాడుతారు. అవసరమయితే ఇన్సులిన్ వాడుక తప్పదు. రక్తపుపోటు నదుపులో పెట్టడము, స్టాటిన్స్ తో కొలెస్ట్రాల్ని తగ్గించుట, మూత్రపిండముల రక్షణకు ఏస్ ఇన్హిబిటర్లు ( ACE inhibitors) వాడడము, హృదయాఘాతకములను
( Heart attacks ) మస్తిష్క విఘాతకాలను నివారించుటకు ఎస్పిరిన్ వాడుకలు, కళ్ళపరీక్షలు, పాదరక్షణలు చికిత్సలో భాగమే. స్థూలకాయములను తగ్గించుట చాలా అవసరము.
తఱచు చక్కెర విలువలు పరీక్షించుట , చక్కెరలు అధికము , అల్పము కాకుండా చూసుకొనుట అవసరము. మందుల వలన విపరీతఫలితములు ఉండవచ్చును. మెట్ ఫార్మిన్ వలన
ఆమ్లరక్తత ( Metabolic Acidosis ) మూత్రపిండముల వైఫల్యములు కొందఱిలో కలుగవచ్చును. అందువలన అప్పుడప్పుడు రక్తపరీక్షలు అవసరమే. వ్యాధిగ్రస్థులకు క్రమశిక్షణ , వైద్యుల సలహాలను పాటించుట, తఱచు చక్కెరలను పరీక్షించుకోవడము, వాడే మందులపై సదవగాహము అవసరము. తగినంత వ్యాయామము చాలా అవసరమే . జటిలపరిస్థితుల లక్షణాలు కలిగితే సత్వర చికిత్సకు వైద్యులను సంప్రదించుట చాలా ముఖ్యము. ప్రపంచములో 400,000,000 మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్థులున్నారంటే వ్యాధి ప్రాబల్యము తెలుస్తుంది.
( ఉపయుక్త మనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొండి. )

పొగాకు ; ధూమపానము

డా. గన్నవరపు నరసింహమూర్తి
పొగాకు అమెరికా ఖండములో చాలా శతాబ్దాల క్రితమే పుట్టినా పదిహైనవ శతాబ్దములో స్పైనుకు చేరి క్రమంగా యూరప్ , ఆసియా, ప్రపంచ మంతా వ్యాపించింది. చుట్టలు, సిగరెట్లు, బీడీలు, పైపులూ ద్వారా ధూమరూపములోను, నస్యరూపములోను పీల్చబడి, గూట్కా రూపములోను , నములుడు పొగాకుగాను మ్రింగబడి వినియోగించ బడుతుంది.
పొగాకు వినియోగము ఆరంభములో నాగరికత చిహ్నముగా పరిగణించబడినా పందొమ్మిదవ శతాబ్దములో దాని వలన కలిగే దుష్ఫలితాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ దుష్ఫలితాల తీవ్రత కారణంగా పొగాకు వినియోగము నొక వ్యాధిగా పరిగణించవలసిన పరిస్థితి ఏర్పడింది.
ధూమపానము వలన కలిగే దుష్ఫలితాలను నేను వైద్యవిద్యార్థిగా నేర్చుకొన్నా, వైద్యము నభ్యసిసిస్తున్న కొద్ది సంవత్సరముల లోనే ప్రత్యక్షముగా చూడడము వలన పొగాకు కలిగించే ప్రమాదాలు ప్రస్ఫుటముగా తెలిసాయి. పొగత్రాగే వారు సగటున పది సంవత్సరాల ఆయువుని కోల్పోతున్నట్లు గమనించాను. అదే విషయము వైజ్ఞానిక పత్రికలలో ప్రచురించ బడడము చూసాను. ధూమపానము ఊపిరితిత్తుల పుట్టకురుపులకు ( Cancers ) కారణమని తెలిసినా, అంతకంటే ఎక్కువగా ధూమపానము చేసే వారు నడివయస్సులోనే గుండెపోటులకు( Heart attacks ) , మస్తిష్క విఘాతములకు ( Cerebrovascular accidents ) గురికావడము , మరణించడము కూడా గమనించాను. శ్వాసకోశపు వ్యాధులు ( Pulmonary diseases) కూడా విపరీతముగా పొగ త్రాగే వారిలోనే చూస్తాము. దీర్ఘకాలపు శ్వాసప్రతిబంధక వ్యాధులు ( Chronic obstructive pulmonary diseases ) ఊపిరితిత్తుల వ్యాకోచ వ్యాధులు ( Emphysema ) కలిగి పొగత్రాగే వారు దగ్గు , ఆయాసాలతో బాధ పడి చాలా జీవితకాలమును కోల్పోవడము వైద్యులము నిత్యం చూస్తాము . పొగత్రాగే వారిలో కనీసము ఏభై శాతమునకు తగ్గకుండా అనారోగ్య దుష్ఫలితాలకు గురి అవుతారు. ధమనీ కాఠిన్యము ( Atherosclerosis) కలిగి రక్త ప్రసరణ లోపాలతో వివిధావయవాలు దెబ్బతినడము వలన, పెక్కు పుట్టకురుపులు కలిగించే రసాయినకముల ( Carcinogens) వలన ఊపిరితిత్తులు, మరియు యితర అవయవాలలో కర్కట వ్రణములు ( Cancers )పుట్టడము వలన ఆయుః క్షీణము , నడివయస్సు మరణాలు సంభవిస్తాయి. అందువలన , నా రోగులకే కాక , మిత్రులకు, బంధువులకు, పొగ త్రాగడము వలదని సలహాల నిస్తాను. పాఠకులలోను, మిత్రులలోను పొగత్రాగే వారుంటే ఒక నిర్ణీత ప్రణాళిక ప్రకారము త్వరగా అ అలవాటును మన్చుకోవలసిందిగా వినతి చేస్తున్నాను. ఆ అలవాటును దరికి చేరనీయ రాదని పిల్లలకు , పాపలకు చెప్పుకోవాలి. పొగాకు వినియోగము , ధూమపానాల వలన కలిగే వ్యాధులను ఇక్కడ ఒక జాబితాగా పొందుపరుస్తాను.
కర్కటవ్రణములు : ( Cancers )
పుట్టకురుపులుగా ప్రచారములో ఉన్న యీ క్రొత్త పెరుగుదలలు జన్యువులలో మార్పులు ( Mutations ) కలిగి కణములు శిధిలము చెందక త్వరితముగా పెరిగి విభజనలు పొందడము వలన పుడతాయి. ఈ పెరుగుదలలు అవయవములలోనికి మూలములతో ఎండ్రకాయల కాళ్ళ వలె చొచ్చుకుపోవడము వలన వాటికి కర్కటవ్రణము లని (cancers ) పేరు కలిగింది. ఈ వ్రణముల కణములు అవయవములుగా పరిణితి చెందకుండా విభజనలతో పెరుదలలుగా వృద్ధి పొందుతాయి. కొన్ని కణములు రక్తనాళములలోనికి , లింఫు నాళములలోనికి ప్రవేశించి రక్తప్రసరణ ద్వారా వివిధ అవయవములకు , లింఫునాళముల ద్వారా లింఫు గ్రంధులకు వ్యాప్తి చెంది అచ్చట క్రొత్తవ్రణములను సృష్టిస్తాయి. ఇవి పోషకపదార్థాలను సంగ్రహిస్తాయి. ఈ వ్రణములు అవయవాల దైనందిక ప్రక్రియలకు అంతరాయము కలిగిస్తాయి. పోషకపదార్థాలు అవయవాలకు తగినంతగా చేరకపోవడము వలన , ఆకలి తగ్గడము వలన అరుచి కలుగుట వలన రోగులు చిక్కిపోతుంటారు. తగిన చికిత్స జరుగక పోయినా , చికిత్స కనుకూలించక పోయునా ఇవి మరణమునకు దారితీయ వచ్చును.
పొగాకు పొగలో ఉండే బెంజోపైరీన్ ( Benzopyrene ) వంటి పోలిసైక్లిక్ ఏరొమేటిక్ హైడ్రోకార్బనులు కణములలో డీ ఎన్ ఏ ( D .N.A ) కు అంటుకొని మార్పులు ( mutations ) ద్వారా వాటిని కాన్సరు కణములుగా మారుస్తాయి. పొగాకు పొగలో పెక్కు కర్కటవ్రణజను ( Carcinogens ) లున్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
పొగత్రాగని వారి కంటె పొగత్రాగేవారిలో ఊపిరితిత్తుల పుట్టకురుపులు యిరవై రెట్లధికముగా కలుగుతాయి. పొగత్రాగేవారిలోఊపిరితిత్తులతోబాటు,మూత్రపిండముల ( Kidneys ) లోను,స్వరపేటికలలోను ( Larynx) ,మూత్రాశయములలోను ( Urinary bladder), అన్నవాహికల( Esophagus)లోను , జీర్ణాశయములు( Gastric cancers ) , క్లోమముల ( Pancreas) లోను పుట్టకురుపులు కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇతర అవయవాలలో కర్కటవ్రణములు రావడానికి కూడా ధూమపానము సహకరిస్తుందని పరిశోధనలు నిరూపించాయి. ఊపిరితిత్తులలో వచ్చే కాన్సరులు ప్రస్ఫుటమయ్యే సరికి తొంబయి శాతము మందిలో శస్త్ర చికిత్స స్థాయిని దాటిపోతాయి. అందుచే చికిత్స ఫలప్రదమయ్యే అవకాశము చాలామందిలోతక్కువ. పొగత్రాగకుండా వాటిని నిరోధించుట చాలా మేలు.
శ్వాసకోశవ్యాధులు ( Pulmonary diseases) ;
శ్వాసనాళపు శాఖలలోను, వాటి చివరల ఉండే గాలిబుడగల( Alveoli) లోను సాగుదల ఉంటుంది. ఆ సాగుదల ( Elasticity) వలన ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు బాగా జరిగి గాలి కదలికలు సరిగ్గా జరుగుతాయి. పొగత్రాగే వారిలో సాగు కణజాలము ( Elastic tissue) చెడి ఆ సాగుదల దెబ్బతింటుంది. అందువలన గాలి కదలికలకు అవరోధము కలుగుతొంది. ఊపిరితిత్తులు , ఛాతి సాగుదల త్రగ్గుట వలన అవి వ్యాకోచము ( Emphysema) చెందుతాయి శ్వాసనాళపు పూతకణముల కుండే సిలియా కూడా పొగత్రాగే వారిలో పనిచెయ్యవు. అందుచే స్రావకములు ( mucous secretions) తొలగించబడవు. తఱచు సూక్ష్మజీవుల వలన వ్యాధులు కలుగుతాయి. వీరికి శ్వాస సరిగ ఆడక ఆయాసము , దగ్గు వస్తుంటాయి. వాయువుల మార్పిడి తగ్గడము వలన రక్తములో బొగ్గుపులుసువాయువు ( Carbon dioxide) పరిమాణము పెరగడము, ప్రాణవాయువు ( Oxygen) పరిమాణము తగ్గడము కూడా కలుగవచ్చును. శ్వాసావరోధవ్యాధిని ( Obstructive pulmonary disease) చాలా మంది ధూమపానీయులలో నిత్యము వైద్యులు చూస్తారు.
హృద్రోగములు. రక్తనాళపు వ్యాధులు :
రక్తనాళపు శాఖలల గోడల మధ్య వయస్సు పెరుగుతున్న కొలది కొలెష్ట్రాలు ( Cholesterol చేరి మార్పులు జరిగి ధమనీకాఠిన్యత ( Atherosclerosis) ఏర్పడుతుంది. పొగత్రాగే వారిలో చెడు కొలెష్ట్రాలు పెరుగుటయే కాక , ఆ కొలెష్ట్రాలు నాళములలో చేరి ధమనీకాఠిన్యతను వేగపరుస్తుంది. ధమనులు కాఠిన్యత పొందినప్పుడు నాళపరిమాణము తగ్గి రక్తప్రవాహమునకు అవరోధము కలుగవచ్చు. రక్తము గడ్డకట్టడానికి తోడ్పడే ఫైబ్రినోజెన్( Fibrinogen ) , ప్లేట్ లెట్లు ( Platelets ) కూడా పొగత్రాగేవారిలో విరివిగా ఉత్పత్తి చెందుతాయి.
హృదయ ధమనులలో( Coronary arteries ) కాఠిన్యత పెరిగి రక్తము గడ్డకడితే హృదయకండరములకు రక్తప్రసరణ లోపించి గుండెపోటులు రావచ్చు. అదే విధముగా మెదడు రక్తప్రసరణకు అవరోధము కలుగుతే మస్తిష్క విఘాతములు
( Cerebrovascular accidents ) కలిగి పక్షవాతములు సంభవిస్తాయి.
దూరరక్తప్రసరణలోపాలు ( Peripheral vascular diseases ) కలుగవచ్చును. రక్తప్రసరణలోపాల వలన కాళ్ళు కోల్పోయిన వారు తఱచు ధూమపానీయులే ! పొగత్రాగే వారిలో వారు పీల్చే కార్బను మోనాక్సైడు ( Carbon monoxide) ఎఱ్ఱకణాల హీమోగ్లోబిన్ ( Hemoglobin ) తో జతకూడడము వలన అవి పంపిణీ చేసే ప్రాణవాయువు తగ్గుతుంది.
ధమనీ కాఠిన్యత వలన పురుషులలో నపుంసకత్వము కూడా కలుగుతుంది. మూత్రపిండముల వ్యాపారము కూడా పొగత్రాగేవారిలో క్షీణిస్తుంది. వివిధావయవాల వ్యాపారము దెబ్బతినుట వలన అంతర్గతముగాను , బాహ్యముగాను పొగత్రాగేవారిలో వృద్ధాప్యపు లక్షణాలు త్వరిత గతిలో ప్రస్ఫుట మవుతాయి.
ఈ వ్యాసములో పేర్కొన్న విషయాలను వైద్యవృత్తిలో ఉండుట వలన ప్రత్యక్షముగా ప్రతిదినము చూస్తాను. ధూమపానము వీడుట వలన చాలా రోగములు నివారించగలుగుతాము. ఎనభై, తొంబై సంవత్సరాలకు వచ్చే రోగములు , మరణములు నలభై , ఏభై సంవత్సరాలలో కలుగకుండా నివారించడము ఎంతో మేలు కదా !
అందువలన పొగత్రాగే వారు మొండివాదనలు, సాకులు, నెపాలు మాని త్వరగా పొగత్రాగడము మానివేయుట ఉత్తమము . వైద్యులు, మందులు సహకరించినా, నా అనుభవములో ఆయా వ్యక్తుల పట్టుదల, లక్ష్యములే పొగత్రాగడము మానడానికి తోడ్పడుతాయి. పిల్లలకు చిన్నతనము నుంచే పొగత్రాగరాదని నూరిపొయ్యవలసిన అవసరము కూడా చాలా ఉన్నది.
( ఈ వ్యాసమును స్వేచ్ఛగా పంచుకొని , ప్రతులు తీసుకొని మీ , మీ బంధుమిత్రులు ధూమపానము , పొగాకు వాడుకలు మానుటకు సహకరించ ప్రార్థన )

క్రొవ్వులు ; కొలెష్ట్రాలు

డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి
పాతదినాలలో తరచు వినేవారము కాదు గాని యీ తరములో చాలామంది అధిక కొలెష్ట్రాలు ( Cholesterol ) గురించి వినే ఉంటారు. గుండెపోటులు ( Heart attacks ), మస్థిష్క విఘాతములు ( Cerebro vascular accidents ) దూర రక్తప్రసరణ లోపాలకు ( Peripheral vascular diseases ) , ధమనీకాఠిన్యము ( Atherosclerosis ) కారణమని వైద్యశాస్త్రజ్ఞులు గ్రహించిన తరువాత , ధమనులు బిరుసెక్కడానికి క్రింది హేతువులను పరిశీలనల వలన , గణాంకముల వలన వైద్యులు గ్రహించారు.
1). రక్తపు పోటు ( Hypertension)
2) మధుమేహవ్యాధి ( Diabetes mellitus )
3) పొగత్రాగడము
4) అధిక కొలెష్ట్రాలు ( Hypercholesterolemia )
5) ఊబకాయము ( Obesity)
6) వ్యాయామలోపము
7) వంశానుగతము
8). వృద్ధాప్యముల
వలన ధమనులు బిరుసెక్కడము , సన్నబడడము, సంకీర్ణమొందుటలు జరిగి దుష్ఫలితాలు కలుగవచ్చును.
ధమనీ కాఠిన్యము ( Atherosclerosis ) :
వయస్సుతో బాటు పైన పేర్కొన్న కారణాల వలన ధమనుల లోపొర ( Intima ) క్రింద కొలెష్ట్రాలు , కొవ్వులు క్రమేణ పేరుకొంటాయి. రక్తములో ఉన్న కొవ్వులను భక్షణ కణములు ( macrophages ) మింగి ధమనుల లోపొర క్రింద చేరుకుంటాయి. కొవ్వులు, కొలెష్టరాలను మింగిన భక్షక కణాలు
ఫేనకణాలుగా ( Foam cells ) మారుతాయి. ఈ కణాలు విచ్ఛిన్నమయినపుడు ఆ కొవ్వులు బయటకు రావడము వాటిని మరల కబళించడానికి మరికొన్ని తెల్లకణాలు, భక్షక కణాలు చేరడము , ఆ ప్రాంతములో తాప ప్రక్రియ ( Inflammation) కలగడము జరుగుతాయి. కాల్షియం కూడా క్రమేణ చేరి ఫలకలు ( Plaques) ఏర్పడుతాయి. ఈ విధముగా ధమనులు బిరుసెక్కి నాళాల లోపలి పరిమాణము కుచించుకు పోతుంది. ఈ ఫలకములు పగుళ్ళు పెట్టినపుడు అచ్చట రక్తము గడ్డకడితే రక్తప్రసరణకు అంతరాయము కలుగుతుంది. హృదయ రక్తనాళాలలో ఈ ప్రక్రియ కలుగుతే గుండెపోటులు, మస్తిష్క నాళాలలో యీ ప్రమాదము జరిగినపుడు మస్తిష్కవిఘాతాలు ( Cerebro vascular accidents ). కలుగుతాయి.
ఈ ధమనీకాఠిన్యతను అదుపులో పెట్టాలంటే ఆ కారణాలను అదుపులో పెట్టాలి కదా ! రక్తపుపోటును అదుపులో ఉంచడము, మధుమేహవ్యాధిని నియంత్రించడము, ధూమపానము మాని వేయడము, తగినంత వ్యాయామమును చేయడము, శరీరభారమును అదుపులో ఉంచడము అవసరము. రక్తములో ఉన్న కొలెష్ట్రాలు, ట్రైగ్లిసరైడులు ( Triglycerides) అనే కొవ్వులు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నాలను చెయ్యాలి
కొలెష్ట్రాలు ( Cholesterol) ;
ఇది ఒక రకమైన కొవ్వు. పైత్యరసము( Bile ) లోను, పిత్తాశయము( Gallbladder) లో ఏర్పడే రాళ్ళలోను ఉన్న దీనిని తొలుత కనుగొన్న తరువాత కొలెష్ట్రాలు వివరాలను శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు . వృక్షములలో కొలెష్ట్రాలు చాలా చాలా అరుదు. కాని జంతుజాతులలో కాలేయము ( Liver )లో విరివిగాను, అన్ని కణాలలోను కొలెష్ట్రాలు ఉత్పత్తి జరుగుతుంటుంది. వృక్షజాతి కణాలకు కణకుడ్యాలు ( Cell Walls ) ఉన్నట్లు జంతుకణాలకు స్థిరమైన గోడ లుండవు. జంతుకణాలకు పైపొరలే ( Cell membranes ) ఉండడము వలన కణాల ఆకారము మారుటకు, చలనానికి , కావలసిన సారళ్యత, మృదుత్వము చేకూరుతుంది. జంతుకణముల పైపొరలు, కొలెష్ట్రాలు, ఫాస్ఫోలైపిడులు
( Phospholipids) , ఎపోప్రోటీనులు ( apoproteins) తో నిర్మితమవుతాయి. పైత్యరస ఉత్పత్తికి, ఎడ్రినల్ వినాళగ్రంధుల స్రావకాల ఉత్పత్తికి, స్త్రీ, పుంస్త్వ హార్మోనుల ( Estrogen and Testosterone ) ఉత్పత్తికి, కొలెష్ట్రాలు అవసరమే. కొంత కొలెష్ట్రాలు ఆహారము వలన సమకూడినా, కాలేయములోను, వివిధ కణములలోను ఉత్పత్తి జరిగి కొలెష్ట్రాలు రక్తములోనికి ప్రవేశిస్తుంది. పైత్యరసము ద్వారా కొంత కొలెష్ట్రాలు ప్రేవులలోనికి చేరినా, అందులో చాలా భాగము చిన్నప్రేవులద్వారా గ్రహించబడి తిరిగి కాలేయమునకు చేరుతుంది. రక్తములో కొలెష్ట్రా లెక్కువయితే అది ధమనీకాఠిన్యతకు దారితీస్తుంది.
ట్రైగ్లిసరైడులు ( Triglycerides ) ;
గ్లిసరాలు ( Glycerol) తో వసామ్లములు ( Fatty acids ) సంయోగము చెందుట వలన ట్రైగ్లిసరైడు లనే క్రొవ్వు పదార్థా లేర్పడుతాయి. మనము తినే కొవ్వుపదార్థాలలో యివి ఉంటాయి. శరీరములో కూడా ఉత్పత్తి అవుతాయి. శరీరమునకు శక్తి చేకూర్చడానికి ఇవి ఉపయోగపడుతాయి. అవసరానికి మించిన కొవ్వులు శరీరావయావలలోను, కొవ్వుపొరలలోను నిలువ ఉంటాయి. రక్తములో ట్రైగ్లిసరైడుల ప్రమాణము పెరుగుతే ధమనుల బిరుసుతనానికి, అవి తోడ్పడుతాయి.
లైపోప్రోటీనులు ( Lipoproteins ) :
కొవ్వుపదార్థములు నీటిలో కరుగవు. వాటికి జలవికర్షణ ( Hydrophobia ) ఉండుటచే రక్తములో ఎపోప్రోటీనులనే ( Apoproteins ) వాహక మాంసకృత్తులతో కలిసి అవయవాలకు కణజాలానికి కొనిపోబడుతాయి. ఆ మాంసకృత్తులు, కొవ్వుల సంయోగములను లైపోప్రోటీను లంటారు.
ఈ లైపోప్రోటీను నలుసులులో కొలెష్ట్రాలు, ట్రైగ్లిసరైడులు, యితర కొవ్వులు లోపల నిక్షేపమయి
ఉంటే, వాటిని ఆవరించి ఒక ఫాస్ఫోలైపిడు, కొలెష్త్రాలపొర ఎపోప్రోటీనులతో ఉంటుంది. ఈ ఫాస్ఫోలైపిడులకు జలాపేక్షక ( Hydrophilic ) ధృవములు వెలుపలి వైపును, జలవికర్షణ ( Hydrophobic) ధృవాలంతరముగాను ఉంటాయి. అందువలన లైపోప్రోటీనులు రక్తముతో కలిసి అవయావలకు చేరబడ గలుగుతాయి.
ఈ లైపోప్రోటీనులను సాంద్రత బట్టి ఐదు తరగతులుగా విభజిస్తారు.
1) ఖైలోమైక్రానులు, ( Chylomicrons ) వీనిలో 90 శాతము ట్రైగ్లిసరైడులు, కొలెష్ట్రాలు 3 శాతము ఉంటాయి )
2) అల్పతమ సాంద్ర లైపోప్రోటీనులు ( Very low density lipoproteins) : వీనిలో ట్రైగ్లిసరైడులు 55 % కొలెష్ట్రాలు 20 శాతము ఉంటాయి.
3) అల్పతర సాంద్ర లైపోప్రోటీనులు. ( Intermediate density lipoproteins): వీటిలో ట్రైగ్లిసరైడులు30% కొలెష్ట్రాలు 35 % ఉంటాయి.
4) అల్పసాంద్ర లైపోప్రోటీనులు ( Low density lipoproteins): వీటిలో ట్రైగ్లిసరైడులు 10 శాతము కొలెష్ట్రాలు 50 శాతముంటాయి.
5) అధిక సాంద్ర లైపోప్రోటీనులు ( High density lipoproteins) . వీటిలో ట్రైగ్లిసరైడులు 5 శాతము కొలెస్ట్రాలు 20 % ఉంటాయి.
ఇవి కాక Lp(a) అనే మరి ఒక లైపోప్రోటీనును కూడా వర్ణించారు. ఇది అల్పసాంద్ర ,అధికసంద్ర లైపోప్రోటీనుల మధ్య యిముడుతుంది
కాలేయములోను, అవయవాలలోను, కణజాలములోను లైపేసు ( Lipase ) అనే ఎంజైము వలన గ్లిసరాలు ( Glycerol), వసామ్లములు ( fatty acids ) తొలగించబడి అల్పతమ సాంద్ర లైపోప్రోటీనులు ( VLDLs ) అల్పసాంద్ర లైపోప్రోటీనులుగా ( LDL s ) మారుతాయి.
అల్పసాంద్ర లైపోప్రోటీనుల వలన ధమనీకాఠిన్యత కలుగుతుంది కాబట్టి వీటిని చెడు కొలెష్ట్రాలుగా పరిగణిస్తారు.
అధికసాంద్ర లైపోప్రోటీను లేశములు కణజాలము నుంచి క్రొవ్వులను తొలగించి కాలేయమునకు చేరుస్తాయి. ఇవి ధమనీకాఠిన్యత నివారించుటకు సహాయపడుతాయి కావున వీటిని మంచి కొలెష్ట్రాలుగా పరిగణిస్తారు.
పన్నెండు గంటల ఉపవాసానంతరము చేసిన రక్తపరీక్షలతో వివిధ లైపోప్రోటీనుల పరిమాణ విలువలు తెలుసుకోవచ్చును.
జన్యువులు, భోజన విధానాలు, వ్యాయామము, సారాయి వినియోగము, ధూమపానము యితర ఔషధులు ఈ పరిమాణ విలువలపై ప్రభావమును చూపిస్తాయి.
ధమనీ కాఠిన్యత కలిగించే యితర ప్రమాదహేతువుల ననుసరించి అల్పసాంద్ర లైపోప్రోటీనులు, టైగ్లిసరైడులు ఏ పరిమాణములలో ఉంటే ప్రమాదకరమో నిర్ణయించి వాటిని తగ్గించే ప్రక్రియలను, మందులను వాడుకోవాలి
గుండెపోటులకు గురియైన వారిలో 90 శాతము మందిలో అల్పసాంద్ర లైపోప్రోటీనులో ( LDL ), Lp(a)వో, ట్రైగ్లిసరైడులోఎక్కువవడమో , లేక అధికసాంద్ర లైపోప్రోటీనులు తక్కువవడమో కనిపిస్తుంది. ఈ వస వ్యాధులు ( Dyslipidemias ) పిన్నవయస్సులోనే రక్తనాళ వ్యాధులను కలుగజేస్తాయి. అందువలన రక్తపరీక్షలతో వీటిని కనిపెట్టి చికిత్సకు పూనుకొనాలి.
ఇరువది సంవత్సరాల వయస్సు తరువాత తొలిసారి రక్తపరీక్షలు జరుపాలని , ఎట్టి లోపాలు లేకపోతే ఆ తరువాత ప్రతి ఐదు సంవత్సరాల కొకసారి కొవ్వుపదార్థాల ఉపవాస రక్తపరీక్షలు చేయాలని హృదయ వైద్య నిపుణులు సూచన లిస్తారు.
కొవ్వులు, కొలెష్ట్రాలు ఎక్కువయితే జీవనశైలి మార్పులు, ఔషధాలు అవసరము.
జీవనశైలి మార్పులు:
ఆహారములో కొవ్వుపదార్థాలను తగ్గించడము, సంపూర్ణ వసామ్లములు ( Saturated fatty acids ) గల తైలములు తగ్గించి అసంపూర్ణ వసామ్లములు ( Unsaturated fatty acids ) గల తైలముల వాడుక పెంచుట, ఎక్కువ బరువుంటే బరువు తగ్గుట, తగినంతగా వ్యాయామము చేయుట, పొగత్రాగుట మానుట, సారాయి వాడుకను తగ్గించుట, రక్తపుపోటు మధుమేహవ్యాధులను అదుపులో పెట్టుట చాలా అవసరము.
హృద్ధమన వ్యాధి చరిత్ర ఉండి, పెక్కు ప్రమాద హేతువులుంటే అల్పసాంద్ర లైపోప్రోటీనుల ( LDL ) పరిమితి 70 మి .గ్రా / డె .లీ కంటె తక్కువకు తేవాలి.
రెండుకి మించి ప్రమాద హేతువులున్న వారిలో అల్పసాంద్ర లైపోప్రోటీనులను 100 మి.గ్రా. / డె.లీ కంటె తక్కువకు తీసుకు రావాలి.
ప్రమాదహేతువులు లేని వారిలో అల్పసాంద్ర లైపోప్రోటీనుల పరిమితి 160 మి.గ్రా. / డె.లీ కంటె తక్కువకు దించాలి.
ఈ పరిమితుల కంటె ఎక్కువగా చెడు కొలెష్ట్రా లుంటే మందులు అవసరము.
చెడు కొలెష్ట్రాలుని తగ్గించే మందులు ;
స్టాటినులుగా ప్రాచుర్యములో నున్న 3- హైడ్రాక్సీ, 3- మెథైల్ గ్లుటరిల్ కోఎంజైం -ఎ రిడక్టేజ్ ఎంజైం అవరోధకములను ( HMG-CoA reductase (3-hydroxy-3-methyl-glutaryl-coenzyme A reductase inhibitors ) విరివిగా యిప్పుడు వైద్యులు వాడుతారు. ఇవి ప్రమాదకర హృద్రోగముల సంఖ్యలను బాగా తగ్గించడము వైద్యులు గమనించారు. పెక్కు సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉన్న నేను యీ స్టాటినుల సత్ఫలితాలకు ప్రత్యక్ష సాక్షిని. నా వద్ద వైద్యము చేయించుకొనే రోగులలో సత్ఫలితాలను నిత్యము చూస్తున్నాను. ప్రావస్టాటిన్, సింవాస్టాటిన్, అటోర్వస్టాటిన్, రొసువాస్టాటిన్, లోవాస్టాటిన్ లు ఉదాహరణలు.
కండరాల నొప్పులు, కండరాల నీరసము, కీళ్ళనొప్పులు వంటి విపరీతపరిణామాలు వీటి వలన కలుగ వచ్చును. కండర కణ ఛేదనము ( Rhabdomyolysis ) జరిగి క్రియాటనిన్ కైనెజ్ ( creatinine kinase ) విలువలు పెరుగ వచ్చును. ఈ పరిణామాలు కలుగుతే ఆ మందుల నాపాలి. మరి ఒక స్టాటిన్ ని తక్కువ మొతాదులో ప్రయత్నించ వచ్చును.
ఈ స్టాటిన్ లను వాడేటప్పుడు కాలేయపు ఎంజైములను ( Liver enzymes ) రెండు మూడు నెలల కొకసారి ఒక ఆరు మాసములు ఆపై ప్రతి ఆరుమాసములకు పరీక్ష చేయాలని సూచిస్తారు. ఆవి రెండు మూడు రెట్లు పెరుగుతే స్టాటిన్లను మానవలసిన అవసరము కలుగ వచ్చును. ఈ స్టాటినుల వలన తీవ్ర కాలేయ వ్యాధులు చాలా , చాలా అరుదు. గుండెవ్యాధులు అరికట్టబడి ఆయుస్సు పెరిగే అవకాశమే చాలా ఎక్కువ .
స్టాటినులు cytochrome - P 450 ఎంజైముల ద్వారా ఛేదింపబడి విసర్జింపబడుతాయి కనుక
P 450 ఎంజైముల ద్వారా విసర్జింపబడే ఔషధాలను వాడవలసి వచ్చేటప్పుడు స్టాటిన్లను తాత్కాలికముగా ఆపాలి. ఎరిత్రోమైసిన్ సంబంధ ఔషధులు, జెమ్ ఫైబ్రొజిల్, కీటోకొనజాల్, ఇట్రాకొనజాల్, మందులు కొన్ని ఉదాహరణలు.
పైత్యరసామ్లములను వేఱ్పరచు మందులు ( Bile acid sequestrant resins ); కొలిస్టరమిన్, కొలిస్టిపొల్ వంటి మందులు పైత్యరసామ్లములతో కూడి, ఆంత్రములద్వారా కొలెష్ట్రాల్ మరల గ్రహించబడకుండా చూస్తాయి.
నయాసిన్ , ఎజెటిమైబ్ మందులు కూడా కొలెస్ట్రాల్ తగ్గించుట కుపయోగ బడుతాయి.
హైపర్ ట్రైగ్లిసిరిడీమియా ( Hypertriglyceridemia ) ; రక్తములో ట్రైగ్లిసెరైడులు 200 మి.గ్రాములు మించితే చికిత్స అవసరము. బరువు తగ్గుట, వ్యాయామము, సారాయి వినియోగమును మానుట, మితాహారము, మధుమేహవ్యాధిని అరికట్టుట, వంటి జీవనశైలి మార్పులు ట్రైగ్లిసెరైడులను తగ్గించుటకు తోడ్పడుతాయి.
నయాసిన్, ఫిబ్రేటులు, జెంఫైబ్రొజిల్ , ఒమెగా -3 ,వసామ్లములు , జీవనశైలి మార్పులతో తగ్గని ట్రైగ్లిసెరైడులను తగ్గించడానికి వాడుతారు.
( ఉపయుక్త మనుకుంటే నిరభ్యంతరంగా పంచుకొండి, ప్రతులు తీసుకొండి )

మానసిక స్థితి వైపరీత్యాలు ( Mood disors )

డా. గన్నవరపు నరసింహమూర్తి .rde
మనమంతా ఎవరికి వారు తాము ప్రత్యేక వ్యక్తులమని భావిస్తుంటాము. ప్రతి జీవి ఒక తల్లి, ఒక తండ్రి నుంచి ఉద్భవించి, తనచుట్టూ ఉన్న పరిసరముల నర్థము చేసుకొని, వాటికనుగుణముగా వర్తించి మనుగడ సాగించడానికి యత్నిస్తుంది. మరి జంతువులోను , మనుజులలోను అవయవపుంజము , జీవితము మస్తిష్కముతో ముడిపడి ఉంటాయి. మస్తిష్కము విభిన్న ఆలోచనలకు, భావోద్రేకములకు స్థానమయి ఉంటుంది. ఈ మస్తిష్క కణజాలములో ఉత్పత్తి, రవాణా, ధ్వంసమయే రసాయినక పదార్థములపై మనోప్రవృత్తులు, మానసికస్థితులు ఆధారపడి ఉంటాయి. మన అందఱి మానసిక స్థితులు కాల,పరిసర పరిస్థితుల కనుగుణ్యముగా మార్పులు చెందినా కొందఱిలో ఆ స్థితులు విపరీతమగుటయో , చాలా కాలము స్థిరముగా ఉండడమో జరిగినపుడు మనోస్థితి వైపరీత్యాలు, మానసిక రుగ్మతలు కలుగుతాయి. మానసిక రుగ్మతలకు జీవితకాలములో సుమారు 25 వ శాతము మంది కొద్దిగానో, హెచ్చుగానో గుఱి అవుతారు. అట్టి వారిలో కొంతమంది దిగులుతో ఆత్మహత్యలకు పాల్పడుతారు. కొందఱు భావోద్రేకములతో హింసాప్రవృత్తుల నలవరచుకొంటారు.మానసిక శాస్త్రము ఒక శాస్త్రముగాను, నవీన వైద్యములో ఒక భాగముగాను పరిణామము చెందినది.
మానసికపు దిగులు ( Depression):
మనందఱికీ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కారణాల వలన విచారము కలిగినా, ఆ కారణాలు తొలగిపోయినా, లేక కాలము మాన్పుట వలనో ఆ విచారము క్రమముగా మరుగవుతుంది. అది సహజసిద్ధమైన విచారమే కాని రుగ్మత కాదు. ఆ విచారపు సందర్భముల నెదుర్కొని, సంబాళించుకొని చాలామంది జీవితమును కొనసాగిస్తారు. అది సహజము. అట్లు కాక దిగులు జీవన వృత్తికి ప్రతిబంధకమవ వచ్చును. అప్పడా విషాదమును రుగ్మతగా పరిగణించవలసి ఉంటుంది.
పెనుదిగులు ( Major depression ) : ఈ మానసికపు దిగులునకు గుఱి అయిన వారిలో విచారము, అనాసక్తి, ఆందోళన, చిరాకు, ఎక్కువగా ఉంటాయి. వీరికి జీవితములో సుఖముల పైనా సంతోషకరమైన విషయాలపైనా ఆసక్తి ఉండదు. బంధుమిత్రులకు దూరమయి ఒంటరులవుతారు. నిరాశ, నిస్పృహ, నిరుత్సాహములకు లోనవుతారు. వీరి ఆత్మవిశ్వాసము సన్నగిల్లుతుంది. తాము నిరుపయోగులమనే భావన కలిగి ఉంటారు. ఏదో అపరాథభావనలచే పీడితులవుతారు. ఏవిషయము పైన నిమగ్నత చూపించలేరు. నిర్ణయాలు చెయ్యలేరు. మఱపు పెరుగుతుంది. విపరీతపు కుంగు ఉన్నవారిలో మతిభ్రంశము కూడా కలుగ వచ్చును. విపరీతమైన నీరసము , నిద్ర ఎక్కువవడమో, లేక నిద్రపట్టక పోవడము , ఆకలి తగ్గడమో,లేక హెచ్చవడము , బరువు తగ్గడమో,లేక పెఱుగుటయు కలుగుతాయి . రాత్రింబవళ్ళ తేడా జీవితములో తగ్గుతుంది. మరణపు టాలోచనలు తఱచు కలుగుతుంటాయి.
కొందఱు మాదకద్రవవ్యాలు , సారాయి దుర్వినియోగాలకు పాల్పడుతారు. కొందఱిలో దిగులు లక్షణాలు పొడచూపక, వేఱే బాధలతో వారు వైద్యులను సంప్రదిస్తారు. అలసట, నీరసము, తలనొప్పి, కడుపునొప్పి, నడుము నొప్పి ,ఆయాసము, గుండెదడ వంటి బాధలు చెబుతారు. కాని ఆ బాధ లొక వ్యాధిలక్షణాలలో యిమడవు. సాధారణ వ్యాధుల కిచ్చే ఔషధాలతో ఆ బాధలు నివృత్తి చెందవు. కొందఱు ఆందోళనతో వస్తారు. ప్రతి చిన్నవిషయానికి గాభరా, భయము, ఆందోళన పడతారు. వీరి ఆందోళన అవసరానికి మించి ఉంటుంది.
మంద చలనము, విచారవదనము, కళ్ళలో అశ్రువులు వీరి మానసిక ప్రవృత్తిని తెలుపుతాయి. విశేష మానసికపు క్రుంగు జీవితకాలములో 20 శాతపు స్త్రీలలోను 10 శాతపు పురుషులలోను పొడచూపుతుంది. ఈ రుగ్మత కలిగిన వారిలో సుమారు 10 శాతపు మంది జీవితకాలములో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ రుగ్మత 25 శాతము వారిలో ఏదైనా బలవంతమైన కారణముచే ప్రస్ఫుటమవుతుంది. చిన్నతనపు పెంపకములో అశ్రద్ధ, శారీరక క్షోభ, మానసికక్షోభ, లైంగిక వేధింపులకు గురి యగుట, నిత్యజీవితములో ఒత్తుళ్ళుకు గురి యగుట, నిరుద్యోగము , విద్యారంగములో వైఫల్యాలు, సహచరుల , కుటుంబసభ్యుల వేధింపులు యీ దిగులుకు దారితీయవచ్చును. మాదక ద్రవ్యాలు , కొన్ని మందులు అకస్మాత్తుగా మానివేసినా దిగులు కలుగవచ్చును. చాలా మందిలో పెద్ద కారణాలు ఉండక పోవచ్చును.
చిన్న కుంగు ( Minor Depression ) : కొందఱిలో ఆత్ములను , తల్లిదండ్రులను, జీవితభాగస్వాములను కోల్పోయినప్పుడు, ఉద్యోగము పోయినా, ఆరోగ్యము సడలినా కలిగే విచారము దీర్ఘకాలము నిలువవచ్చును. మానసికపు కుంగు లక్షణాలు పరిమితమయినా దీర్ఘకాలముంటాయి. వీరిలో సారాయి, మాదకద్రవ్యాల దుర్వినియోగము కూడా ఉండవచ్చును.
ప్రసవానంతర వ్యాకులము ( Postpartum Depression ) ; కానుపు పిమ్మట 10 - 15 శాతము మందిలో దిగులు వ్యాధి కనిపిస్తుంది. కానుపయిన రెండు వారముల నుంచి ఒక నెల లోపుల సాధారణముగా యీ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఆందోళన, ఆకలి నిద్రలలో మార్పులు, చిరాకు, కన్నీళ్ళు, నిస్సత్తువ వీరికి కలుగుతాయి . బంధుమిత్రుల తోడ్పాటు, సహకారము, స్మృతివర్తన చికిత్సలు
( Cognitive Behavioral Therapy), అవసరమైనపుడు ఔషధములతో యీ దిగులును నివారించ వచ్చును.
కాల ( ఋతు ) విషాదము ( Seasonal Depression) : కొంత మందిలో కొన్ని కాలములలో విచారము పొడచూపుతుంది. అమెరికాలో ప్రత్యేకముగా శీతాకాలములో చాలామంది విచారగ్రస్థులవుతామని చెబుతారు. వసంతకాలము రాగానే ఆ విషాదము తగ్గిపోతుంది.
ద్విధ్రువ వ్యాధి ( Bipolar disorder ):
కొందఱిలో విపరీతమైన పొంగు ( Mania ), అప్పుడప్పుడు విపరీతమైన కుంగు కూడా
( Depression) కలుగుతుంటాయి. నిమ్నోన్నతాలు కలిగే యీ వ్యాధిని ద్విధ్రువ వ్యాధిగా పరిగణిస్తారు. సుమారు 1 శాతము మంది ప్రజ యీ మానసిక వ్యాధికి గుఱి అవుతారు. ఈ వ్యాధి పురుషులు, స్త్రీలలో సమాన నిష్పత్తిలో కలుగుతుంది. పొంగు ఎక్కువయి నప్పుడు వీరికి ఆత్మవిశ్వాస మెక్కువగా ఉంటుంది. భావములు పరంపరలుగా కలుగుతాయి. ఒక ఆలోచన నుంచి మరియొక ఆలోచనకు మస్తిష్కము ఉఱుకలు పెడుతుంది. ఎక్కడలేని శక్తి వీరికి వస్తుంది. నిద్ర అవసరము తగ్గుతుంది. ఆకలి తగ్గుతుంది. ఉద్రేక మెక్కువగా ఉంటుంది. గట్టిగా మాట్లాడడము, అనవసరపు వాదనలకు, కయ్యాలకు దిగడము చేస్తారు. ఇతరులు తమకు హాని చేస్తుంటారనే ఆలోచనలతో (Paranoid behaviour ) నిత్యము ఉంటారు. వీరికి శ్రవణ , దృష్టి భ్రమలు ( Auditory and Visual hallucinations) మతిభ్రాంతి కూడా కలుగవచ్చును. వీరిలో మాదకద్రవ్యాల , సారాయిల వినియోగ మెక్కువగా ఉంటుంది. వీరికి వారి పోట్లాట తత్వము వలన న్యాయవ్యవస్థతో గొడవ లెక్కువగా ఉంటాయి. వీరు మధ్య మధ్యలో మానసికముగా కుంగిపోతుంటారు. అప్పుడు వీరి ప్రవృత్తి పూర్తిగా మారిపోతుంది. దిగులు లక్షణాలు అప్పుడు ప్రస్ఫుటమవుతాయి. ఈ ద్విధ్రువ వ్యాధి వంశ పరముగా రావచ్చును. ఈ ద్విధ్రువ వ్యాధిగ్రస్థులలో కుంగుదల కలిగినప్పుడు ఆత్మహత్యల అవకాశము పెరుగుతుంది. ఇరువది సంవత్సరాల కాలములోసుమారు ఆరు శాతపు వ్యాధిగ్రస్థులు ఆత్మహత్యకు పాల్పడుతారు.
పిచ్చి : (Schizophrenia ) వ్యాధి గలవారి మానసికస్థితి వాస్తవవైరుధ్యముగా ఉంటుంది. దృశ్యభ్రాంతులు ( లేనివిషయాలు గోచరించడము ; Visual hallucinations ), శ్రవణభ్రాంతులు ( లేనివి వినిపించడము ; Auditory hallucinations ) కలగడము వలన వీరు నిజ ప్రపంచములో కాక వేఱే లోకములో ఉంటారు. జీవితకాలములో వెయ్యిమందిలో మూడు నుంచి ఏడుగురు వ్యక్తులలో యీ రుగ్మత వేఱు వేఱు స్థాయిలులో కనిపించవచ్చు. వీరిలో కూడా కుంగుదల కలిగే అవకాశాలు మెండు. ఆత్మహత్యలకు వీరు కూడా పాల్పడవచ్చును.
మానసిక వ్యాధులు యితర వ్యాధుల వలన కూడా కలుగవచ్చును. మెదడు, ఊపిరితిత్తులు, క్లోమపు పుట్టకురుపులు ( Cancers ) వలన మానసిక విభ్రాంతి కలుగవచ్చును.
సూక్ష్మాంగజీవులు కలిగించే, న్యుమోనియా, టైఫాయిడ్ జ్వరము, సిఫిలిస్, మెదడువాపు
( Encephalitis ) , హెపటైటిస్, వలన
గర్భనిరోధపు మందులు ( Oral contraceptives ), రిసెర్పిన్ ( రక్తపుపోటుకు వాడే వారు. ఈ దినములలో దీని వాడకము లేదు ) బీటా బ్లాకరులు, కార్టికోస్టీరాయిడులు, మూర్ఛమందులు, మైగ్రేను తలనొప్పి మందులు, మానసిక వ్యాధుల మందులు, హార్మోనుల వంటి ఔషధములు, దిగులు కలిగించవచ్చు.
థైరాయిడు హెచ్చు, తగ్గులు, పేరాథైరాయిడు ఎక్కువగుట, ఎడ్రినల్ కార్టికోస్టీరాయిడు లెక్కువయి కుషింగ్ సిండ్రోము వంటి వినాళగ్రంధి వ్యాధులు
విటమిన్ బి 3 ( నయాసిన్ ) లోపము వలన వచ్చే పెల్లాగ్ర అనే వ్యాధి వలన , మానసిక ప్రవృత్తులలో మార్పులు కలుగ వచ్చును..
చికిత్సలు :
మానసిక వ్యాధులను తేలికగా తీసుకొని , నిర్లక్ష్యము చేయుట మంచి విషయము కాదు. ముందుగానే వ్యాధిగ్రస్థులపైగాని, వ్యాధులపై కాని , చికిత్సలపై గాని సరియైన అవగాహన లేక స్థిరాభిప్రాయముల నేర్పఱచుకొనుట తగదు. మానసిక శాస్త్రము, మానసిక వ్యాధుల శాస్త్రము దినదినము పరిణితి చెందుతునే ఉన్నాయి. పూర్తిగా నివారించ లేకపోయినా యీ వ్యాధులను అదుపులో ఉంచవచ్చును.
విషాదవర్తన కలిగిన వారికి కుటుంబసభ్యుల, మిత్రుల , సహచరుల అవగాహన, ఆదరణ, ఆలంబనము, భరోసా చాలా అవసరము. దిగులు స్వల్పకాలము, పరిమితముగా ఉన్నప్పుడు చికిత్స లవసరము కాకపోవచ్చును. దిగులు అధికమైనా , ఆత్మహత్య లక్షణాలు ఏ మాత్రము కనిపించినా అత్యవసర చికిత్స లవసరము. దీర్ఘకాలిక విషాదమునకు, దీర్ఘకాలిక ఆందోళనకు, పెనుదిగులుకు, ద్విధ్రువవ్యాధులకు చికిత్సలవసరము. పిచ్చి ( Schizophrenia) గలవారికి చికిత్స తప్పనిసరి.
మనస్తత్వవేత్తలు ( Psychologists )మనోవ్యాధి వైద్యులు ( Psychiatrists ) యీ వ్యాధులకు సాధారణముగా చికిత్సలు చేస్తారు. స్మృతివర్తన చికిత్సల ( Cognitive Behavioral Therapy) వంటి చికిత్సలతో వారి ఆలోచనలను , బాహ్యప్రేరణలను ఏ విధముగా ఎదుర్కొని స్పందించాలో శిక్షణ గఱపుతారు. వ్యాయామము, యోగాభ్యాసములు , కొంత తోడ్పడవచ్చును.
మందులు ;
అవసరమైనపుడు దిగులు చికిత్సకు ఔషధములను వాడుతారు. సెలెక్టివ్ సీరోటోనిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్లు ( Selective Seotonin Reuptake Inhibitors), సీరోటోనిన్ నారెపినెఫ్రిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్లు, ( SNRIs), ట్రైసైక్లిక్ ఏంటి డిప్రెసెంట్లు ( Tricyclic antidepressants ) మొనోఎమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్లు ( Monoamine Oxydase Inhibitors ), టెట్రాసైక్లిక్ ఏంటిడిప్రస్సెంట్లు ( Tetracyclic Antidepressants ) , నారెడ్రిజెనిక్ స్పెసిఫిక్ సీరోటెనెర్జిక్ ఏంటి డిప్రెస్సెంట్లు ( Noradrenergic Specific Serotenergic Antidepressants ), సాధారణంగా వాడే మందులు.
వాడే మందుల మోతాదులను సవరించడము , దుష్ఫలితములను గమనించడము ,వ్యాధిగ్రస్థులను అవసరము బట్టి గమనించడము వైద్యుల బాధ్యత. సామాన్యవైద్యులు ( General Doctors ) చికిత్సకులైతే అవసరమైనపుడు నిపుణులను సంప్రదించాలి.
ద్విధృవ వ్యాధికి ( Bipolar disorder) దిగులు మందులు కుదరవు. మానసికవేత్తల సలహా చికిత్సకు తోడుగా , మనోస్థితిని కుదుటపరచే ( Mood Stabilisers ) లిథియమ్( Lithium) ; వేల్ప్రోయిక్ ఏసిడ్ ( Valproic acid ) , లామిక్టాల్ ( Lamictal ) టెగ్రటాల్ ( Tegretol ) , వంటి మూర్ఛ మందులు; ఒలాంజపిన్ ( Olanzapine ), రిస్పెరిడోన్ ( Risperidone ) వంటి అసాధారణ మానసికౌషధములు ( Atypical antipsychotics) ద్విధృవవ్యాధికి వాడుతారు. ఆందోళన ఎక్కువైన వారికి ఆందోళన తగ్గించే మందులు వాడుతారు. మానసిక వ్యాధులకు కొత్తమందులు లభ్యమవుట చక్కని పరిణామము.
ఈ భూమిపై జన్మించిన వారందఱూ అదృష్టవంతులు కారు. మనోవ్యాధికి గుఱైనవారు బంధు, మిత్ర , సహచరులలో నుంటే వారి వ్యాధుల నర్థము చేసుకొని వారికి బాసటగా నిలిచి , వారి చికిత్సకు తోడ్పడాలి. సమాజము , ప్రభుత్వము కూడా చికిత్స బాధ్యత తీసుకోవాలి.
( ఉపయుక్తమనుకుంటే యీ వ్యాసమును నిస్సంకోచముగా పంచుకొండి )

కర్కట వ్రణములు ( Cancers )

డా. గన్నవరపు నరసింహమూర్తి
శరీరానికి కలిగే రుగ్మతలలో కొత్త పెరుగుదలలకు ( Growths ) ప్రాముఖ్యత ఉన్నది. ఈ పెరుగుదలలు నెమ్మదిగా పెరిగే నిరపాయకరమైనవి( Benign tumors ) కావచ్చును. త్వరితముగా పెరిగి పరిసర కణజాలములోనికి మూలములతో ఎండ్రకాయల వలె చొచ్చుకుపోయే ప్రమాదకరమైన కర్కటవ్రణములు ( Malignant tumors ) కావచ్చును. ఇవి కాన్సరులుగా అందుకే ప్రాచుర్యములో ఉన్నాయి. ఈ పెరుగుదలలు పుట్టల వలె పెరుగుట వలన వీటిని పుట్టకురుపులని కూడా అంటారు.
కణముల జన్యువులలో మార్పు జరుగుటవలన (Genetic Mutations ) ఆ కణములు అతిత్వరగా పెరుగుతూ, అతిత్వరగా విభజన చెందుట వలన ఈ పెరుగుదలలు పొడచూపుతాయి. కర్కటవ్రణములలో కణములు పూర్తిగా ఆయా అవయవ కణజాలములలోని కణముల వలె పరిపక్వత నొందవు. అందుచే అవి ఆ అవయవాల కణములను పోలి ఉండవు. ఈ కణాలలో న్యూక్లియస్ పరిమాణము హెచ్చుగా ఉండి, సైటోప్లాజము పరిమాణము తక్కువగా ఉంటుంది. ఈ కణాల మధ్య సంధానము కూడా తక్కువగా ఉంటుంది. పరిపక్వత పొందకపోవుటచే ఈ కణాలు ఆ యా అవయవ ధర్మాలను నిర్వర్తించవు.
ఈ కణ బీజములు లింఫు నాళముల ద్వారా లింఫు గ్రంధులకు , రక్తనాళముల ద్వారా యితర అవయవములకు వ్యాప్తి చెందగలవు. ఈ కర్కటవ్రణాలు త్వరగా పెరుగుతూ పోషక పదార్థాలను విరివిగా సంగ్రహించుట వలన , ఈ వ్రణములనుంచి విడుదల అయ్యే రసాయినక పదార్థముల వలన ఆకలి క్షీణించుట చేత బరువు తగ్గి దేహక్షీణత కలుగుతుంది. ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది ఆ అవయవ ధర్మాలకు ప్రతిబంధకము కూడా కలుగ జేస్తాయి. ఈ పుట్టకురుపులు చివరి దశలలో ఉన్నప్పుడు శరీరపు వ్యాధి నిరోధక శక్తి తగ్గి సూక్ష్మాంగజీవుల వలన వివిధ రోగములు కూడా కలుగ వచ్చును
కర్కట వ్రణములు కలుగడానికి కారణము కణముల జన్యువులలో మార్పు రావటమే కదా! ఈ జన్యువ్యత్యాసము తొంబయి శాతము , కణముల పరిసరముల ప్రభావము వలన జరిగితే ఒక పదిశాతము వరకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యువుల వలన కలుగుతాయి.
వృద్ధాప్యములో శరీరపు వ్యాధినిరోధక శక్తి తగ్గి అసాధారణ కణములు తొలగింపబడకపోవుట వలన
ఆ కణాలు పెరుగుట వలన ఆ పెరుగుదలలు పొడచూపుతాయి.
పొగత్రాగుట, యితర విధాల పొగాకు వినియోగము, ఊబకాయము, వ్యాయామ లోపము, సూక్ష్మజీవులు కలిగించే వ్యాధులు, ఆహారపుటలవాట్లు, వాతవరణకాలుష్యము ,రేడియోధార్మిక కిరణాల వంటి భౌతిక కారణాలు అవయవాల కణములను ప్రభావితము చేస్తాయి.
పొగత్రాగడము, పొగాకు వినియోగములు 25 శాతపు పుట్టకురుపులకు కారణము. తొంబై శాతపు శ్వాసకోశ కర్కటవ్రణములు ( Lung Cancers ) పొగత్రాగే వారిలోనే సంభవిస్తాయి. మూత్రాశయపు కాన్సరులు ( Urinary bladder cancers ), మూత్రపిండముల కర్కటవ్రణములు ( Kidney cancers), స్వరపేటికలో వచ్చే కర్కటవ్రణములు ( Laryngeal cancers ) అధికశాతములో పొగత్రాగే వారిలోనే కలుగుతాయి. జీర్ణాశయము ( Stomach ), క్లోమము ( Pancreas ), కంఠము, అన్ననాళములలో పుట్టే పుట్టకురుపులు పొగత్రాగే వారిలోనే ఎక్కువ. పొగాకులలో నైట్రోసమైన్లు ( Nitrosamines ), పోలీసైక్లిక్ హైడ్రోకార్బనులు ( Polycyclic Hydrocarbons) అనే కర్కటవ్రణజనకములు ( Carcinogens) ఉంటాయి. పొగాకు నమిలే వారిలోను, పోకచెక్కలు విరివిగా నమిలే వారిలోను నోటిలో కాన్సరులు ఎక్కువగా వస్తాయి. కాలుతున్న అంచు నోటిలో పెట్టి చుట్టలు కాల్చే వారిలో ( విశాఖ, శ్రీకాకోళపు ప్రాంతాలలో యీ అడ్డపొగ అలవాటు ఉన్నది. ) అంగుట్లో కర్కటవ్రణములు రావచ్చును. జపాను దేశములో జీర్ణాశయపు పుట్టకురుపులు ఎక్కువయితే అమెరికాలో పెద్దప్రేవుల పుట్టకురుపులు ఎక్కువ. నా ఆత్మీయులలోను, నెయ్యులలోను పెద్దప్రేవుల కర్కటవ్రణములు చూసాక భారతీయులలో అంతా అనుకునే కంటె ఎక్కువ మందికే బృహదంత్ర కర్కటవ్రణములు Colon Cancers ) కలుగ వచ్చునేమో ననే సందిగ్ధము నాకు కలుగుతున్నది.
అతినీలలోహిత కిరణాల ( Ultraviolet rays ) వలన చర్మపు పుట్టకురుపులు, మెలనోమాలు ( Melanomas)కలుగుతాయి. రేడియో ధార్మిక కిరణాలకు ( Radio active rays ) లోనైతే పుట్టకురుపులు రావచ్చు.
ఱాతినార ( Asbestos )వాడే పరిశ్రమల్లో పనిచేసే వారికి శ్వాసకోశపుపొరలో ( Pleura ) మీసోథీలియోమా ( Mesothelioma) అనే కాన్సరు కలిగే అవకాశ మెక్కువ.
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ( Human Papilloma Virus ) వలన గర్భాశయ ముఖములలో పుట్టకురుపులు ( Uterine Cervical Cancers ) కలుగుతాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వలన కాలేయపు పుట్టకురుపులు కలుగవచ్చును. హెలికోబాక్టర్ పైలొరై ( Heliocobacter pylori )అనే సూక్ష్మజీవుల వలన జీర్ణాశయపు ( Gastric) కాన్సరులు కలుగుతాయి.
వంశపారంపర్యము వలన మూడు నుంచి పది శాతపు కర్కటవ్రణములు సంభవిస్తాయి. జన్యువైపరీత్యములతో బి ఆర్ సి ఎ 1 , 2 ( BRCA 1 BRCA 2 ) జన్యువులు వంశానుగతముగా వస్తే రొమ్ము కాన్సరులు వచ్చే అవకాశములు ఎక్కువ.
కర్కటవ్రణములు ప్రమాదకరమైన వ్యాధులు. వాటిని కనుగొన్న సమయానికి అవి సుదూరవ్యాప్తి పొందకపోతే అవి చికిత్సకు లొంగే అవకాశాలు ఉంటాయి. వివిధావయవాలకు వ్యాప్తి చెందిన పుట్టకురుపులను పూర్తిగా నయము చేయుట కుదరక పోవచ్చును. ఆ స్థితులలో వైద్యులు ఉపశమన చికిత్సలే చేయగలుగుతారు. శస్త్రచికిత్స, రేడియోధార్మిక కిరణ ప్రసరణ చికిత్సలు ( Radiation therapy ) రసాయినకౌషధ చికిత్సలు ( Chemotherapy ) , ప్రతిరక్షణ చికిత్స ( Immunotherapy)లను వ్యాధి నివారణకు, ఉపశమన చికిత్సలకు వాడుతారు.
కాన్సరు వ్యాధిని సంపూర్ణముగా నయము చెయ్యాలంటే తొలిదశలలోనే వ్యాధిని పసిగట్టాలి. అంతే కాక కర్కటవ్రణములు రాకుండా జాగ్రత్తపడాలి.
కాన్సరు వ్యాధి నివారణ :
పొగ త్రాగడము, పొగాకు నములుట, హెచ్చుగా పోక చెక్కలు నమలుట జర్దాకిళ్ళీ వంటి వాడుకలు లేకుండా చూసుకోవాలి. సారాయి వినియోగమును చాలా అదుపులో ఉంచుకోవాలి. హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరస్ వ్యాధులు రాకుండా పిన్నవయస్సులోనే H.P.V టీకాలు (Vaccine) వేయించాలి. మితాహారము, శరీరపు బరువును అదుపులో ఉంచడము, శారీరకవ్యాయామము, కాయగూరలు, పళ్ళు , పూర్ణధాన్యముల వినియోగము పుట్టకురుపులను నివారించుటకు తోడ్పడుతాయి. హెపటైటిస్ బి సోకకుండా టీకాలు వేయించుకొనుట, హెపటైటిస్ సి రాకుండా తగిన జాగ్రత్తలలో ఉండుట రేడియోధార్మిక కిరణాలకు గురి కాకుండా వీలయినంత చూసుకొనుట కర్కటవ్రణములను నివారించుటకు తోడ్పడుతాయి.
పుట్టకురుపులు త్వరితముగా కనుగొని వాటికి సత్వర చికిత్స చేయడము వలన వాటిని నయము చేసే అవకాశ మున్నది. ఎవరికి వారు వారి శరీరమును శోధన చేసుకునుట వలన కొన్ని కాన్సరులను త్వరగా గుర్తించ వచ్చును. దేహమును , చర్మమును పరీక్షించుకొంటే చర్మముపై కలిగే వ్రణములు కనిపిస్తాయి. అసాధారణపు పుట్టుమచ్చలు కలిగినా , ఉన్న పుట్టుమచ్చలు పెరిగినా, లేక వాటి వర్ణములో మార్పులు జరిగినా , లేక వాటి వలన దురద, నొప్పి వంటి లక్షణములు పొడచూపినా, లేక వాటి చుట్టూ వలయములు ఏర్పడినా, మరే మార్పులు కలిగినా వైద్యులను సంప్రదించి, వాటిని శస్త్రచికిత్సచే తొలగించుకొని వాటికి కణపరీక్ష ( Biopsy ) చేయించుకోవాలి. స్త్రీలు కనీసము నెలకొకసారైనా వారి రొమ్ములను పరీక్షించుకోవాలి. అనుమానాస్పదమైన పెరుగుదలలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. స్తనచిత్రీకరణలు ( Mammograms) రొమ్ము కాన్సరులను సత్వరముగ కనుగొనుటకు తోడ్పడుతాయి. నలభై నుంచి డెబ్భై సంవత్సరములలో ఉన్న స్త్రీలకీ పరీక్షలు ప్రతి రెండు లేక మూడు సంవత్సరములకొక పర్యాయము వైద్యులు సూచిస్తారు.
గర్భాశయముఖ కర్కటవ్రణములు కొన్ని హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరసుల ( Human papilloma viruses) వలన కలుగుతాయి. హెచ్.పి.వి ( HPV Vaccine ) టీకాలను పిల్లలకు వేసి ఈ పుట్టకురుపులను నివారించ గలము. ఇరవై సంవత్సరాల నుంచి అరవైఐదు సంవత్సరముల లోని స్త్రీలలో గర్భాశయ ముఖము నుంచి పాప్ స్మియర్ వలన గ్రహించిన కణపరీక్షలను ( Pap Smears ) వైద్యులు సిఫారసు చేస్తారు. ఈ పరీక్షలు కర్కటవ్రణములను తొలిదశలలో కనుగొందుకు ఉపయోగపడుతాయి.
ఉత్తర అమెరికా ఖండములో వైద్యులు ఏభై సంవత్సరములు నిండిన వారికి బృహదంత్ర అంతర్దర్శన పరీక్షలను ( Colonoscopies) ప్రతి ఐదు పది సంవత్సరములకు ఒకసారి సూచిస్తారు. ఈ పరీక్షలు చేసినప్పుడు పాలిప్స్ ( Polyps) అనే అంగుష్టాకారపు కంతులు కనిపిస్తే వాటిని సమూలముగా విద్యుద్దహనప్రక్రియచే ( Electro cauterization ) తొలగించి కణపరీక్షకు పంపిస్తారు. ఈ కంతులు తొలిదశలలో నిరపాయకరమైనా తరువాత అపాయకరమైన కాన్సరులుగా పరిణామము చెందవచ్చు. ఈ నిరపాయకరమైన ఆంత్రపు పెరుగుదలలను తొలగించుటచే వైద్యులు అపాయకరమైన కర్కటవ్రణములను నివారించ గలుగుతారు. తొలిదశలలో కనుక్కో బడిన బృహదాంత్ర కర్కటవ్రణములు ( Colon cancers ) చికిత్సలకు సాధారణముగా లొంగుతాయి. భారతదేశములో యీ కొలొనోస్కోపులు శోధన పరీక్షలుగా ప్రాచుర్యము పొందినట్లు లేదు. దీర్ఘకాలిక పరిశోధనలు చేస్తే వీటి ఉపయుక్తత తెలిసే అవకాశము ఉంది.
పొగత్రాగే వారిలో తరచు శ్వాసకోశపు చిత్రాలు తీస్తే శ్వాసకోశపు కర్కటవ్రణములను తొలిదశలలో కనుక్కొనే అవకాశము కొంత ఉండవచ్చును. సంవత్సరానికో సారి కాట్ స్కాన్ ( Low dose Computerized Axial Tomography Scan ) చేస్తే యీ కాన్సరులను త్వరగా కనుక్కొనే అవకాశము పెరుగుతుంది. కాని చాలా మందిలో శ్వాసకోశపు కర్కటవ్రణాలు ( Lung Cancers) బయటపడేటప్పటికే అవి వ్యాప్తి చెంది ఉంటాయి. ఒక పదిహైను శాతము మందిలో శస్త్రచికిత్సకు అవకాశము ఉండవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తొలిదశలలో కనుక్కోబడక పోవుటచే నయమయే శ్వాసకోశపు కాన్సరులు చాలా తక్కువ ఉంటాయి.
రక్తములో ఉన్న ప్రాష్టేట్ స్పెసిఫిక్ ఏంటిజెన్ ( Prostate Specific Antigen ) పరీక్ష ప్రతి రెండు సంవత్సరములకు 55 - 69 సంవత్సరముల వయస్సులో ఉన్న పురుషులలో చేస్తే ప్రాష్టేట్ కర్కటవ్రణములను ( Prostatic Cancers) సకాలములో గుర్తించ వచ్చును.చాలా మందిలో ప్రాష్ట్రేట్ కాన్సరులు నెమ్మదిగా పెరుగుటచే పెక్కుశాతము మంది చికిత్స లేకపోయినా ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశమున్నది. P.S.A పరీక్షలతో సత్వరముగా కనుక్కొని చికిత్స చేస్తే మరింత ప్రయోజనము చేకూర వచ్చును.
కర్కట వ్రణములు ఆరంభదశలో ఉన్నపుడు యే బాధా కలిగించక పోవచ్చును. అవి పెరుగుతున్న గొలది వివిధ లక్షణాలు పొడచూపుతాయి. సాధారణముగా అవి ఏ అవయవాలలో ఉంటాయో ఆ అవయవాలకు సంబంధించిన లక్షణాలు కలుగుతాయి. ఆకలి తగ్గుట , బరువు తగ్గుట , కర్కటవ్రణ లక్షణాలు. ఏ అవయవ సంబంధమైన వ్యాధి లక్షణాలు కనిపించినా తగిన శోధన పరీక్షలు చేయుట వలన అవి ప్రస్ఫుట మవ వచ్చును. రక్త పరీక్షలు, ఎక్స్ రేలు, కాట్ స్కానులు, అల్ట్రాసోనోగ్రాములు, ఎం.ఆర్.ఐ స్కానులు, పెట్స్కానులు, కొలొనోస్కోపి , గాస్ట్రోస్కోపి, బ్రాంఖోస్కొపీలు , కర్కటవ్రణములను కనుగొనుటకు ఉపయోగ పడుతాయి.
వ్రణములు, కనుక్కొన్నాక వాటినుంచి కణపరీక్షలు ( Biopsies) చేసి వ్యాధిని నిర్ణయిస్తారు. వివిధ పరీక్షలతో ఈ కర్కట వ్రణములు యితర అవయవములకు వ్యాపించాయో లేదో నిర్ణయించి తగిన చికిత్సలు చేస్తారు.
మిగిలిన వైజ్ఞానిక శాస్త్రాల ఆలంబనముగా వైద్యశాస్త్రము అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ మంతటా వైజ్ఞానిక పరిశోధకులు విజ్ఞానశాస్త్రపు టభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. ఆరంభదశలో కనుగొనబడిన కాన్సరులు చికిత్సకు లొంగే అవకాశమున్నది. అంత్యదశలలో కనుగొన్న కర్కటవ్రణములకు సంపూర్ణచికిత్సలు సాధ్యము కావు. అటువంటి పరిస్థితులలో ఉపశమన చికిత్సలకే అవకాశ ముంటుంది.

( ఉపయుక్త మనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

పచ్చకామెరలు (Jaundice )

డా. గన్నవరపు నరసింహమూర్తి.
పచ్చకామెర్లు , కామెర్లు ( Jaundice) అనే మాట చాలా మంది వినే ఉంటారు. ఒంటికి పచ్చరంగు రావడాన్ని పచ్చకామెర్లు కలగడమంటారు. ఈ పసుపురంగు కామెర్లున్నవారి కళ్ళ తెల్లగుడ్డు ( శ్వేతపటలము ) పై బాగా కనిపిస్తుంది. ఈ పసుపువర్ణమునకు కారణము రోగుల రక్తములో బిలిరుబిన్ ( Bilirubin) అనే వర్ణకము ( Pigment ) పెరిగి చర్మము , కంటి తెల్లగుడ్డుపైన చేరడము వలన ఆ వర్ణము కలుగుతుంది. రక్తములో ఏ ఏ కారణాల వలన బిలిరుబిన్ పెరుగుతుందో చర్చించే ముందు ఆ బిలిరుబిన్ ఎలా వస్తుందో వివరిస్తాను.
రక్తములో ఎఱ్ఱకణాలవలన రక్తమునకు ఎఱ్ఱరంగు కలుగుతుంది. ఎఱ్ఱ రక్తకణాలు ప్రాణవాయువును ( Oxygen) ఊపిరితిత్తుల నుంచి గ్రహించి శరీరములో వివిధ కణజాలమునకు చేర్చి వివిధావయవాల కణజాలమునుంచి బొగ్గుపులుసువాయువుని ( Carbon dioxide) గైకొని ఊపిరితిత్తులకు విసర్జనకై చేర్చుటకు తోడ్పడుతాయి. ఎఱ్ఱరక్తకణాలలో హీమోగ్లోబిన్ అనే వర్ణక ద్రవ్యము ( Pigment ) ఉంటుంది. ఈ వర్ణకము వాయు సంవాహనమునకు తోడ్పడుతుంది.
హీమ్ ( Heme ) అనే రసాయినక ద్రవ్యము గ్లోబిన్ అనే మాంసకృత్తితో సంయోగము చెందుట వలన హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. హీమ్ లో పార్ఫిరిన్ అనే రసాయినక పదార్థము , ఇనుప
అయనము ( Ion ) కలిసి ఉంటాయి. ఇనుప అయన ప్రభావముతో హీమోగ్లోబిన్ ప్రాణవాయువు, బొగ్గుపులుసువాయువు, యితర వాయువులను సంధించుకొని ఆ వాయువులకు వాహకముగా పనిచేస్తుంది. ఎఱ్ఱ రక్తకణాలు శరీరములో ఎముకల మజ్జలో ( Bone marrow ) ఉత్పత్తి అవుతాయి. రక్త ప్రవాహములో సుమారు మూడునెలల కాలము మని , వృద్ధకణములు ప్లీహము ( Spleen) లోను కాలేయము ( Liver ) లోను భక్షక కణములచే ( Phagocytes) విచ్ఛేదనము నొందుతాయి. విచ్ఛేదించబడిన ఎఱ్ఱ రక్తకణముల నుంచి విడుదలయే హీమోగ్లోబిన్ హీమ్ గాను , గ్లోబిన్ గాను ఛేదింపబడుతుంది.
హీమ్ లో ఉన్న ఇనుము అయము తొలగించబడి శరీరములో నిక్షేపమయి మరల ఉపయోగపడుతుంది. ఇనుము పోగా మిగిలిన పార్ఫిరిన్ చక్ర ఛేదనము వలన బిలిరుబిన్ ఏర్పడుతుంది. ఈ విధముగా ఏర్పడిన బిలిరుబిన్ బంగారు పసిడి ఛాయలో ఉంటుంది.
ఈ బిలిరుబిన్ కాలేయపు కణములలో గ్లూకొరోనికామ్లముతో ( Glucoronic acid ) సంయోగించబడి కాలేయము నుంచి పైత్యరసము( Bile ) ద్వారా పైత్యనాళములకు ( Bile ducts ), పిత్తాశయమునకు ఆపై చిన్నప్రేవులకు విసర్జింపబడుతుంది. పెద్దప్రేవులలో, సూక్షాంగజీవులు గ్లూకొరోనికామ్లమును తొలగించి బిలిరుబిన్ ని యూరోబిలినోజన్ ( Urobilinogen )గా మారుస్తాయి. యూరోబిలినోజెన్ కొంత రక్తములోనికి గ్రహించబడి ఆక్సీకరణమై యూరోబిలిన్ ( Urobilin ) గా మార్పుచెంది మూత్రముద్వారా విసర్జితమవుతుంది. యూరోబిలిన్ వలన మూత్రమునకు ఎండుగడ్డి రంగు కలుగుతుంది. యూరోబిలినోజెన్ లో చాలాభాగము స్టెర్కోబిలిన్ Stercobilin ) గా మార్చబడుతుంది. స్టెర్కోబిలిన్ మలమునకు గోధుమరంగు కలిగిస్తుంది.
గ్లూకరానికామ్లముతో కాలేయకణములలో సంయోగమైన బిలిరుబిన్ ( Conjugated Bilirubin )ని
పత్యక్ష బిలిరుబిన్ ( Direct Bilirubin) గా వ్యవహరిస్తారు. సంయోగముకాని బిలిరుబిన్ పరోక్ష బిలిరుబిన్ (Indirect Bilirubin). పరోక్ష బిలిరుబిన్ కి జలద్రావణీయత ( Water solubility) ఉండదు.అది పైత్యరసములోనికి రాదు. ప్రేవులకు చేరదు. సంయోగ బిలిరుబిన్ కి జలద్రావణీయత ఉండుటచే ప్రేవులకు పిత్తరసము ద్వారా చేరుతుంది. రక్తములో బిలిరుబిన్ 2 మి.గ్రా / డె.లీ పైన పెరుగుతే పచ్చ కామెరలు పొడచూపుతుంది.
పచ్చకామెర్లకు కారణాలు.
రక్తకణవిచ్ఛేదనపు / కాలేయపూర్వపు కామెరలు ( Hemolytic /Prehepatic jaundice) :
ఎఱ్ఱ రక్తకణాలు సుమారు 90 దినాల ఆయువు కలిగి ఉంటాయి. అవి త్వరితముగా అధిక ప్రమాణములో విచ్ఛేదనమయితే వాని నుంచి అధిక మోతాదులలో హీమోగ్లోబిన్ > హీమ్ > బిలిరుబిన్ విడుదల అవుతాయి. అధికప్రమాణములో విడుదల అయే బిలిరుబిన్ ను కాలేయము త్వరితముగా గ్లూకరానికామ్లముతో సంయోగపఱచ జాలకపోవుటచే రక్తములో అసంయోగపు బిలిరుబిన్ ( Indirect bilirubin) ప్రమాణము 2 మి.గ్రా. కంటె ఎక్కువైతే పసరికలు పొడచూపుతాయి.
జన్యుపరముగా వచ్చే రక్తకణ విరూప వ్యాధులు ( లవిత్రకణ వ్యాధి ( Sickle cell anemia ) , వంశపారంపర్య గోళకార కణవ్యాధి ( Hereditary Spherocytosis )
అసాధారణపు హీమోగ్లోబినుల ( Hemoglobinopathies ) వలన రక్తకణముల ఆయువు తగ్గి అవి త్వరితముగా విచ్ఛేదించబడవచ్చును.
శరీర రక్షణవ్యవస్థ ( Immunological system) కు స్వ ( Self ) , పర ( External ) విచక్షణాలోపము కలుగుతే స్వయంప్రహరణ వ్యాధులు ( Autoimmune diseases) కలిగి రక్తకణ విచ్ఛేదనము విశేషముగా జరుగవచ్చు. అందువలన రక్తక్షీణత (Autoimmune hemolytic Anemia ) కామెరలు కూడా కలుగుతాయి. అసంయోగపు బిలిరుబిన్ రక్తములో పెరిగినా దానికి జలద్రావణీయత ( నీటిలో కరుగుట ) లేకపోవుటచే మూత్రములో బిలిరుబిన్ ఉండదు. కాని కాలేయపు ప్రక్రియ వలన ప్రేవులకు సంయోగపు బిలిరుబిన్ ఎక్కువగా చేరి యూరోబిలినోజెన్ ఎక్కువగా ఉత్పత్తి అయి మూత్రములో విశేషముగా యూరోబిలినోజెన్ ఉంటుంది.
కాలేయపు కామెరలు ( Hepatic / Hepatocellular jaundice ) :
కాలేయపు కణాలలో బిలిరుబిన్ గ్లూకొరోనికామ్లముతో సంయోగమయి ( Conjugate) జలద్రావణీయత పొంది పైత్యరసములో ( Bile ) స్రవించబడి పైత్యనాళముల ( Bile ducts) ద్వారా చిన్న ప్రేవుల మొదటిభాగమైన డుయోడినమునకు ( Duodenum) చేరుతుంది. కాలేయపు వ్యాధులున్న వారిలో బిలిరుబిన్ గ్లూకొరోనికామ్లముల సంయోగమునకు , సంయోగమైన బిలిరుబిన్ యొక్క స్రావమునకు,అంతరాయము కలుగుట వలన , రక్తములో బిలిరుబిన్ ప్రమాణాలు పెరుగుతాయి. వైరస్ ల వలన , సూక్షాంగజీవులు వలన , పరాన్నభుక్తులు వలన వచ్చే కాలేయపు వాపులు, సారాయి, విషపదార్థములు, కొన్ని ఔషధములు వలన కలిగే కాలేయపు వ్యాధులు, సిర్రోసిస్, కాలేయపు కర్కటవ్రణములు పచ్చకామెర్లు కలిగిస్తాయి.
అవరోధపు కామెరలు : కాలేయానంతరపు కామెరలు ( Obstructive jaundice : Post hepatic Jaundice ):
కాలేయములో గ్లూకొరోనికామ్లముతో సంయోగమయిన బిలిరుబిన్ పైత్యరసములో స్రవించబడి పైత్యనాళముల ద్వారా డుయోడినమునకు చేరుతుంది. పైత్యప్రవాహానికి అవరోధము కలిగితే
సంయోగపు బిలిరుబిన్ ( Conjugated bilirubin) తిరోగమనమయి రక్తములో ప్రసరించబడుతుంది. చర్మము, శ్వేతపటలములలో చేరి కామెరలు కలిగిస్తుంది. మూత్రములో విసర్జింపబడి మూత్రమునకు పచ్చరంగు కలిగిస్తుంది. చెమటలో స్రవించబడి దుస్తులకు పచ్చరంగు చేకూరుస్తుంది. మూత్రములో యూరోబిలినోజెన్ ఉండదు. ప్రేవులుకి బిలిరుబిన్ చేరకపోవుటచే మలము సుద్దరంగులో ఉంటుంది. పైత్యనాళపు శిలలు( Biliary stones ), పైత్యనాళములలో పెరుగుదలలు ( Growths ) , క్లోమములోని కర్కటవ్రణములు ( Pancreatic cancers) యితర నాళబంధనములు, యీ అవరోధకపు పచ్చకామెర్లు కలుగచేస్తాయి.
వైద్య పరీక్షలతో బాటు ,రక్త పరీక్షలు, శ్రవణాతీతశబ్దగ్రాహిణులు ( అల్ట్రాసౌండ్ ) కాట్ స్కానులు, ఎమ్. ఆర్. ఐ స్కానులు, హెపటైటిస్ పరీక్షలు, కణపరీక్షలు ( Biopsies),
అంతర్దర్శన పరీక్షలు ( Endoscopic examinations), రోగనిర్ణయానికి తోడ్పడుతాయి.
కాలేయపు వాపు ( Hepatitis) :
కాలేయపు వాపు వైరసులు వలన , సూక్షాంగజీవుల వలన ,పరాన్నభుక్తుల వలన , సారాయి వలన , కొన్ని ఔషధాల వలన, కలుగవచ్చును. కాలేయపు కణములు కొన్ని విచ్ఛిన్న మవుటచే రక్తములో కాలేయపు ఎంజైముల ( Liver enzymes ) పరిమాణములు పెరుగుతాయి. కామెరలు కూడా కలుగ వచ్చు.
అతి సూక్షాంగములు ( Viruses) వలన వచ్చే కాలేయపు వాపులు :
హెపటైటిస్ ఎ ( Hepatitis A ) వైరస్ కలుషిత జలము, ఆహారములు తీసుకొనుట వలన
( పురీష వదన మార్గము fecal-oral route ద్వారా ) శరీరములోనికి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారు వ్యాధి లక్షణాలు కనిపించుటకు కొద్ది వారముల ముందుగాను, వ్యాధి కలిగిన కొద్దివారములు తరువాత కూడా వైరస్ ని మలములో విసర్జిస్తారు. అట్టి మలములతో కలుషితమైన నీరు, ఆహారములను గ్రహించుట వలన వ్యాధి సోకుతుంది. పచ్చకామెర్లు ప్రధాన లక్షణము. కొంత మందిలో ఏ లక్షణాలు పొడచూపవు. ఈ వ్యాధి 99 శాతము మందిలో ఒకటి, రెండుమాసములలో సంపూర్ణముగా దానికదే నయమవుతుంది. వీరికి ఏ మందులు అవసరముండవు. చక్కని ఆహారము సమకూర్చి శుష్కించకుండా చూస్తే చాలు. ఒక శాతపు మందిలో ప్రమాదకరపు కాలేయవైఫల్యము
( Fulminant hepatic failure) కలుగవచ్చును. అట్టివారికి కాలేయ దానము అవసరము పడవచ్చు . దీనిని అరికట్టుటకు టీకాలు లభ్యము. అందఱికీ ఆ టీకాలు వెయ్యాలి.
హెపటైటిస్ బి ( Hepatitis B )ఈ వైరస్ ఆంత్రేతర మార్గముల ( Parenteral routes ) ద్వారా శరీరములోనికి ప్రవేశిస్తుంది. వ్యాధిగ్రస్తపు రక్తగ్రహణము ( Blood transfusions) వలన, వైరసుతో ఉన్న సూదులను వాడుట వలన, వ్యాధిగ్రస్తులతో సంభోగము వలన, ఈ వ్యాధి కలుగుతుంది.ఈ వ్యాధిగ్రస్తులలో 95 నుంచి 99 శాతము మందికి వ్యాధి దానంతటదే రెండు నుంచి నాలుగు మాసములలో తగ్గిపోతుంది. ఆలంబన చికిత్స ( Supportive treatment ) , సరియైన ఆహారము, ద్రవములు అందేటట్లు చూడడము, సారాయి , కాలేయానికి ఘాతము కలిగించే ఔషధములు వినియోగించకపోవడము అవసరము. తీవ్రముగా వ్యాధి ఉంటే వైరస్ ప్రతికూల మందులను వాడాలి. ఆరు మాసముల పైన వ్యాధి తగ్గకపోతే దానిని దీర్ఘకాలిక వ్యాధిగా ( Chronic Hepatitis ) పరిగణించాలి. హెపటైటిస్ బి దీర్ఘకాలిక వ్యాధిగా 2-5 శాతము మందిలో పరిణామము చెందుతుంది. వీరికి వైరస్ ప్రతికూల ఔషధములను వాడుతారు. దీర్ఘకాలిక కాలేయపు వాపు కలిగిన వారికి కాలేయపు సిర్రోసిస్ , కాన్సరులు రావచ్చు.
ఈ వ్యాధి రాకుండా టీకాలున్నాయి. అందఱికీ ఆ టీకాలవసరము. వ్యాధిగ్రస్తులైన తల్లులకు పుట్టిన పిల్లలకు పుట్టిన 12 గంటలలో టీకాతో బాటు ఇమ్యునో గ్లాబ్యులిన్ ని కూడా వ్యాధి నివారణకై యివ్వాలి.
హెపటైటిస్ సి ( Hepatitis C ) :
హెపటైటిస్ సి వైరస్ వ్యాధిగ్రస్తమైన రక్తము , రక్తాంశములు, శరీర ద్రవములు - రక్త గ్రహణము ద్వారా గాని సూదులద్వారా గాని సంభోగము వలన గాని , శరీరములోనికి ప్రవేశించి కాలేయపు వ్యాధిని, కలిగిస్తుంది. కాలేయపు కణముల నుంచి కాలేయపు ఎంజైములు విడుదల అయి రక్తములో వాటి పరిమాణము పెరుగుతాయి. హెపటైటిస్ సి వలన కాలేయపు వ్యాధి కలిగిన వారందఱిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. కామెరలు కూడా కలుగక పోవచ్చును. వైరస్ ప్రతిరక్షకాలను
( Antibodies) రక్తపరీక్షలో కనుక్కోవడము వలన వ్యాధి నిర్ణయము చేయవచ్చు. వైరస్ ని కూడా రక్తపరీక్షలతో కనుక్కోవచ్చును. వైరస్ రక్తములో పొడచూపిన వారికి మందులతో నయము చేసే అవకాశాలు ఎక్కువే. దీర్ఘకాలిక వ్యాధి సిర్రోసిస్, కాలేయకర్కటవ్రణములకు ( Liver Cancers) దారి తీయవచ్చును. హెపటైటిస్ సి కి టీకాలు లభ్యములో లేవు. వ్యాధిగ్రస్తులను మందులతో నయము చెయ్యడము వలన , వారి సంఖ్యను తగ్గించవచ్చు. రక్తదానము చేసే వారికి హెపటైటిస్ బి, సి, వ్యాధులు లేవని నిర్ధారించుట వలన , సురక్షిత రక్తము, రక్తాంశములనే వాడుటవలన , సూదులతో మాదకద్రవ్యాల వినియోగము నరికట్టుట వలన , సురక్షితమైన సూదులు, క్షురికలను వాడుట వలన , సురక్షిత సంభోగము వలన హెపటైటిస్ బి, సి వ్యాధులను నివారించ వచ్చును.
హెపటైటిస్ డి Hepatitis D ని కలిగించే నలుసులు వైరస్ ల కంటె చిన్నవి. హెపటైటిస్ బి ఉన్నవారికే ఈ వ్యాధి కూడా కలుగుతుంది. రక్తము , రక్తాంశములు శారీరక ద్రవముల ద్వారా ఈ నలుసులు శరీరములోనికి ప్రవేశిస్తాయి. చాలా మందిలో ఈ వ్యాధి దానంతటదే తగ్గిపోతుంది. దీనికి టీకాలు లభ్యములో లేవు.
హెపటైటిస్ ఇ ( Hepatitis E ) .
ఆసియాఖండములో ఈ వ్యాధి ఉన్నది. ఢిల్లీ, కాశ్మీరు , మయినమారులలో ఈ వ్యాధి అలలుగా కొన్ని పర్యాయములు పెచ్చుమీరింది. ఈ వైరస్ కలుషితాహార పానీయముల ద్వారా శరీరములోనికి చేరుతుంది. దీర్ఘకాలిక వ్యాధికి దారి తీయక పోయినా, గర్భిణీ స్త్రీలలో ఈ వ్యాధి తీవ్రమయి 20 శాతము మందిలో మృత్యువునకు దారితీస్తుంది. చైనా లో ఈ వ్యాధికి టీకా లభ్యము. పందులలో ఈ వ్యాధి ప్రబలముగా ఉండుట వలన హెచ్చు ఉష్ణోగ్రతలలో ఉడికించని పందిమాంసపు వినియోగము వలన ఈ వ్యాధి రావచ్చును.
సూక్షాంగజీవులు, పరాన్నభుక్తులు ( మలేరియా, అమీబా, ట్రిపనోజోమా, లీష్మానియా , ఎఖినోకోకస్ గ్రాన్యులోసస్ , కాలేయపు క్రిమి ఫాషియోలా హెపాటికా లు ) కాలేయవ్యాధులు కలిగిస్తాయి.
కలుషితాహార పానీయాల వలన కాలేయపు వ్యాధులే గాక అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి కాబట్టి ప్రజలందఱికీ పాశ్చాత్యదేశపు మరుగుదొడ్లను సమకూర్చి మలములను కలుషరహితము చెయ్యాలి. అందఱికీ సురక్షిత జలము లభ్యమయినట్లు చూడాలి. ఇది అన్ని ప్రభుత్వాల, అన్ని నాగరిక సమాజాల బాధ్యత.
( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

అధిక భారము ; స్థూలకాయము ( Overweight; Obesity )

అధిక భారము ; స్థూలకాయము
( Overweight; Obesity )
డా. గన్నవరపు నరసింహమూర్తి
గత నాలుగు దశాబ్దములుగా ప్రపంచ మంతటా ప్రజలలో అధిక భారము , స్థూలకాయములు బాహుళ్యముగా వ్యాప్తి చెందుతున్నాయి. ఆహారపదార్థములు విరివిగా లభ్యమవుట, వ్యాయామము తగ్గుట, వాహనాల వాడుక హెచ్చి నడకలు తగ్గుట, దానికి కారణములు. అధిక భారము , స్థూలకాయములు అనారోగ్యమునకు దారితీస్తాయి.
ఒక వ్యక్తి బరువు ఎక్కువో , కాదో , స్థూలకాయమున్నదో , లేదో తెలుసుకొనుటకు భారసూచిక ( Body Mass Index BMI ) తోడ్పడుతుంది. ఒక వ్యక్తి కిలోగ్రాముల భారమును ఆ వ్యక్తి యొక్క మీటర్ల ఎత్తు వర్గముతో భాగిస్తే ( Weight in kilograms/ Square of height in meters. kg/m2 ) ఆ వ్యక్తి భార సూచిక తెలుస్తుంది.
భారసూచిక 18.5 కంటె తక్కువ ఉంటే భారహీనతగా ( Under weight ) పరిగణిస్తారు.
18.5 నుంచి 25 లోపల ఉంటే అది సామాన్య భారము
25 నుంచి 30 లోపల ఉంటే అది అధిక భారము ( Over weight)
భారసూచిక 30 పైన ఉంటే స్థూలకాయముగా పరిగణిస్తారు. ( Obesity)
స్థూలకాయులను మరల మూడు తరగతులుగా విభజించ వచ్చును
భారసూచిక 30- 35 వరకు ఉంటే ప్రథమవర్గము గాను
35 నుంచి 40 వరకు ద్వితీయ వర్గము గాను
40 పైన ఉంటే తృతీయ వర్గములోను చేరుస్తారు.
భారసూచిక శరీరపు కొవ్వుని సూచించదు కాని శరీరములో ఉన్న కొవ్వుతో అన్యోన్య సంబంధము కలిగి ఉంటుంది. హెచ్చు భారసూచిక అనారోగ్యమును తెలుపదు కాని అనారోగ్యములకు దారి తీస్తుంది. శరీరపు బరువును కోశాగారములో ధనముతో పోలుస్తే అర్థము చేసుకొనుట తేలిక అవుతుంది. కోశాగారములో ఎంత ధనమును చేరుస్తే ధనమంతగా పెరుగుతుంది. ఎంత ఖర్చు పెడితే అంత క్షీణిస్తుంది. ఎక్కువ డబ్బు చేర్చి తక్కువ ఖర్చు పెడితే ధనము పెరుగుతుంది. ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ చేరుస్తే ధనము తగ్గుతుంది. తిని , త్రాగే కాలరీలు ( కాలరీ వివరణ క్రింద తెలియజేయబడింది ) , ఖర్చయే కాలరీల కంటె హెచ్చయితే బరువు పెరుగుతారు . దేహము గ్రహించే కాలరీలు తగ్గి ఖర్చు చేసే కాలరీలు పెరుగుతే బరువు తగ్గుతారు. అధిక భారము కలవారిలో జీవవ్యాపారము ( Metabolism) మందముగా ఉంటుంది, వారు తక్కువ తిన్నా బరువు పెరుగుతారన్నది వాస్తవము కాదు. శరీరపు బరువెక్కువగా ఉండుట వలన నిజానికి వారి నిత్య జీవవ్యాపారమునకు ఎక్కువ కాలరీలే ఖర్చవుతాయి. హృదయము , ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండముల వంటి ముఖ్యావయాలపై పనిభారము వీరిలో హెచ్చు .
ఆహారపదార్థాలను అవి యివ్వగలిగే శక్తిని బట్టి కాలరీలలో కొలుస్తారు. ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను వాతావరణ పీడనము వద్ద ఒక సెంటీగ్రేడు డిగ్రీ పెంచుటకు కావలసిన శక్తిని ఒక కాలరీగా పరిగణిస్తారు. ఆహారపదార్థాల విషయములో శక్తిని కిలో కాలరీలలో ( 1 కిలో కాలరీ = 1000 కాలరీలు ) వ్యక్త పరుస్తారు. వాడుకలో కాలరీలన్నా వాస్తవానికి అవి కిలోకాలరీలుగా అర్థము చేసుకోవాలి.
ఓక గ్రాము కొవ్వుపదార్థాలలో సుమారు 9 కాలరీల ( కిలో కాలరీలు ) శక్తి నిగూఢమై ఉంటుంది. ఓక గ్రాము పిండిపదార్థాలు , మాంసకృత్తులలో సుమారు 4( కిలో ) కాలరీలు ఉంటాయి. దైనందిక అవసరాలకు మించి తీసుకొన్న ఆహారపదార్థాలు శరీరపు పెరుగుదలకు , బరువు పెరుగుటకు తోడ్పడుతాయి. ఆహార వినియోగము పెరిగి చేసే వ్యాయామము తగ్గుతే బరువు హెచ్చుతాము. ఆహార వినియోగము , జీవన వ్యాపారము + వ్యాయామపు అవసరాల కంటె తక్కువయితే బరువు తగ్గుతాము. అవసరాలకు ఆహారము సరి అయితే బరువు స్థిరముగా ఉంటుంది.
అధికభారము స్థూలకాయములకు కారణాలు :
పాతదినములలో ధనవంతులయిన కొద్ది మందిలో అధికభారము కనిపించేది. నవీన కాలములో ఆహార విప్లవము వలన ఆహారపదార్థాల ఉత్పత్తి పెరిగి అవి విరివిగా లభ్య మవుతున్నాయి. చిల్లర తిళ్ళ దుకాణాలు ఎక్కువయ్యాయి. చక్కెర సహిత శీతల పానీయాలు, చక్కెర సహిత ఫలరసాల వాడుక పెరిగింది. వేడుకలు పెరిగి శక్తిసాంద్రవంతమైన ( Energy rich foods ) తీపి వస్తువులు, పానీయాలు, సారాయి, మిగిలిన చిరుతిళ్ళ వినియోగము అన్ని సమాజాలలోను పెరిగింది. భోజనము హెచ్చయితే జీర్ణాశయము సాగుతూ పరిమాణము పెరిగి వారిలో ఆకలి కూడా పెరుగుతుంది. చక్కెర సహిత పానీయాలు, పదార్థాలు సేవిస్తే వారిలో ఇన్సులిన్ విడుదలయి దాని ప్రభావము వలన రక్తములో చక్కెర తగ్గగానే వారికి నీరసము ఆకలి పెరుగుతాయి. ఈ విషచక్రము అలా కొనసాగుతుంది.
సమాజములలో మార్పుల వలన వాహనాలు పెరిగి పిల్లలు పాఠశాలలకు నడిచి వెళ్ళరు. పెద్దలు ఉద్యోగాలకు నడిచి వెళ్ళరు. దూరదర్శినులు, గణన యంత్రాలు, చరవాణుల వాడుక హెచ్చి పిల్లలు , పెద్దలు క్రీడలకు, వ్యాయామములకు వెచ్చించే కాలము తగ్గిపోయింది.పాఠశాలలలో క్రీడలకు, వ్యాయామములకు ప్రోత్సాహము తగ్గింది.
జన్యు కారణాలు :
పరిసరాలు, జీవనశైలులలో మార్పులకు వేఱు వేఱు వ్యక్తులు వేఱు వేఱుగా స్పందిస్తారు. జడత్వము, వ్యాయామపు కొఱత , అధికాహార వినియోగములు కొందఱిలో ఎక్కువగా ఉంటాయి . వాటికి జన్యువులు కారణము కావచ్చును.
కేవలము జన్యు కారణముల వలనే సంక్రమించే స్థూలకాయములు చాలా అరుదు. చాలామందిలో స్థూలకాయములకు వివిధ కారణాలు, పెక్కు జన్యువులు కారణ మవుతాయి. కొన్ని కుటుంబాలలో ఎక్కువ బరువు , స్థూలకాయములు సంభవించినా దానికి వారి జీవనశైలి, పరిసరాల ప్రాబల్యమే ప్రధాన కారణము. జీవనశైలులలో మార్పుల వలన వారు స్థూలకాయములను నిరోధించ వచ్చును.
రుగ్మతలు :
కుషింగ్ సిండ్రోము( Cushing Syndrome) , పాలీ సిస్టిక్ ఓవరీలు( Polycystic Ovaries) , మానసిక వ్యాధులు అధిక భారమును కలిగిస్తాయి
ఔషధములు :
కుంగువ్యాధులు, యితర మానసికవ్యాధులకు వాడే( Atypical antipsychotics ) మందులు, ఎడ్రినల్ కార్టికో ష్టీరాయిడులు ( Adrenal Corticosteroids) , మధుమేహవ్యాధి మందులు, గర్భనిరోధక ఔషధములు, కొన్ని మూర్ఛ మందులు బరువు పెరుగుటకు తోడ్పడ వచ్చును. ఆకలి ఎక్కువయి ఎక్కువగా భుజించుట దానికి కారణము.
స్థూలకాయము వలన పరిణామములు :
అధిక భారము, స్థూలకాయము కొన్ని రుగ్మతలకు దారి తీస్తాయి. ఎక్కువ బరువున్న వారిలో అధిక రక్తపీడనము కలిగే అవకాశా లెక్కువ. మధుమేహవ్యాధి , అల్పసాంద్రపు కొలెష్టరా లెక్కువగుట
( Low density lipoproteins ), అధికసాంద్రపు కొలెష్టరాలు ( High density lipoproteins) తక్కువగుట, ట్రైగ్లిసెరైడులు ఎక్కువ అవుట ఎక్కువగా సంభవిస్తాయి. హృద్రోగములు , హృద్ధమనుల వ్యాధులు( Coronary artery disease), మస్థిష్కవిఘాతములు ( Cerebro vascular accidents), పిత్తాశయవ్యాధులు ( Gall bladder diseases) , కీళ్ళవాతములు ( ముఖ్యముగా మోకాళ్ళ నొప్పులు, తుంటిసంధుల నొప్పులు ), ఒళ్ళునొప్పులు ఎక్కువగా సంభవిస్తాయి. కాలేయములో కొవ్వు చేరి కాలేయపు కొవ్వు వ్యాధి ( Fatty Liver disease) సంభవిస్తుంది. స్థూలకాయులలో ఆమ్ల తిరోగమనము ( Acid Reflux ) ఎక్కువ. మూత్రపిండ వైఫల్యములు, కుంగుదల వంటి మానసికవ్యాధులు వీరిలో ఎక్కువ. జడత్వము, నిశ్చలత్వము, మందకోడితనము ఎక్కువయి జీవన రీతు లసంపూర్ణముగా ఉంటాయి. కొన్ని కర్కట వ్రణములు ( Cancers )( పెద్దప్రేవులు, కాలేయపు , పిత్తాశయపు, మూత్రపిండాల కర్కట వ్రణములు, స్త్రీలలో రొమ్ము, బిడ్డసంచీ కర్కటవ్రణములు ) కూడా స్థూలకాయులలో ఎక్కువగా కలుగుతాయి. వీరిలో నిద్రావరోధిత శ్వాసభంగములు ( Obstructive Sleep Apnea ) ఎక్కువగా కలుగుతాయి.
తామర ( Intertrigo ), సూక్ష్మాంగజీవులు కలిగించే వాపులు, పుళ్ళు ( Boils) వంటి చర్మవ్యాధులు కూడా అధిక భారగ్రస్తులలో ఎక్కువ.
ఫైన పేర్కొన్న వివిధ కారణాల వలన అధికభారగ్రస్తులు , స్థూలకాయులలో ఆయుః ప్రమాణము తగ్గుతుంది.
స్థూలకాయము , అధికభారములకు నివారణ మార్గములు:
తక్కువ ఆహారము తక్కువ కాలరీలను గ్రహించుట వలన, వ్యాయామముతో ఎక్కువ కాలరీలను ఖర్చు పెట్టుట వలన బరువు తగ్గుతారు. కాలరీలు భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య , పానీయాల ద్వారా దేహానికి చేరుతాయి. చక్కెరతో కూడిన శీతల పానీయాలు, చక్కెర, వెన్న, నేతులతో కూడిన చిల్లర తిళ్ళు వలన , తఱచు వివిధ రకాల తిళ్ళు తినడము వలన , అధిక మోతాదులలో భోజనాలు భుజించుట వలన కాలరీలు ఎక్కువగా గ్రహించడము జరుగుతుంది. దేహము ఖర్చు పెట్టని కాలరీలు ఏ రూపములో వెళ్ళినా చివరకు కొవ్వుగా దేహములో నిలువ ఉంటాయి.
అందువలన ఊబకాయము తగ్గాలంటే చక్కెర సహిత శీతలపానీయాలు మాని మంచినీటి వాడుకను పెంచుకోవాలి. కొవ్వులు, చక్కెర , పిండిపదార్థాలతో సహా తీసుకొనే కాలరీలు మితపరచుకోవాలి. ఆరోగ్యానికి తోడ్పడే ఫలాలు. ఆకుకూరలు, కూరగాయలు, పీచుపదార్థములు, చిక్కుళ్ళు, పప్పులు పూర్ణధాన్యములు ( Whole grains ) వినియోగించుకొని సంస్కరణధాన్యాల వినియోగము తగ్గించుకోవాలి. కొవ్వుతో కూడిన మాంసము బదులు చిక్కినమాంసాలను ( Lean meats ) వినియోగించుకోవాలి. తిని, త్రాగే మొత్తపు కాలరీలను పరిమితము చేసుకోవాలి. సారాయి వాడుకను మితపరచుకోవాలి.
జీవనశైలిని మార్చుకొని నడక, వ్యాయామము, యోగా, క్రీడలద్వారా శరీరములో నిలువ యున్న కాలరీలను కరిగించి ఖర్చు చెయ్యాలి. వీలయినంతగా వాహనముల వాడుకను తగ్గించుకోవాలి. బయట నడచుట కవకాశము లేనియెడల వ్యాయామ సాధనములను యింట్లోనే వినియోగించుకోవాలి. దండీలు, బస్కీలు, యోగా, మొదలైన ప్రక్రియలతో స్వంత కండరముల కెదురుగా కసరత్తులు చేసుకొనవచ్చును. ఒంటరిగా వ్యాయామము చేసుకోలేనివారు సమూహములుగా చేసుకోవాలి. దీర్ఘకాలిక ప్రణాలికలతో , క్రమశిక్షణతో బరువు తగ్గగలరు.
ఔషధములు :
ఆకలిని తగ్గించుటకు బరువు తగ్గుటకు కొన్ని మందులున్నాయి . వాడుకలో ఉన్న మందులు ఆర్లిస్టాట్ ( Orlistat ) , లార్కసెరిన్ ( Lorcaserin ) లిరగ్లూటైడ్ ( Liraglutide ) ఫెంటెరమిన్ / టోపిరమేట్, ( Phentermine/ Topiramate నల్ ట్రెక్సోన్ / బూప్రోపియన్ ( Naltrexone / Bupropion) లు . ఆర్లిస్టాట్ కొవ్వుపదార్థాల జీర్ణము నరికడుతుంది. కొవ్వుపదార్థాలు భుజించినపుడు అవి జీర్ణము కాక విసర్జింపబడుతాయి. ఔషధాల వలన విపరీతఫలితాలు కలిగే అవకాశమున్నది. ఈ మందుల వలన దీర్ఘకాలిక ప్రయోజనము , దీర్ఘకాలము వాడుట వలన కలిగే నష్టముల వివరాలు పూర్తిగా తెలియవు.
శస్త్రచికిత్సలు ;
బరువు విపరీతమైనప్పుడు ఎక్కువ బరువు వలన హృద్రోగములు, మధుమేహము యితర రుగ్మత లున్నప్పుడు బరువు తగ్గించుటకు శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
జఠర బంధన చికిత్స ( Laparoscopic Gastric Banding) :
భారసూచిక 40 దాటిన వారికి, లేక 35- 40 లో ఉండి హృద్రోగము, అదుపు కాని మధుమేహవ్యాధి ఉన్నవారికి మితాహార వ్యాయామ చికిత్సలు విఫలమైనప్పుడు జఠరబంధన చికిత్స లవసరము పడవచ్చును. ఉదరాంతరదర్శనము ద్వారా( Laparoscopy ) జీర్ణాశయము (Stomach) చుట్టూ వ్యాకోచింపగల పట్టీ నమర్చి జీర్ణాశయమును రెండు తిత్తులుగా విభజించుట వలన పై భాగపు తిత్తి కొద్ది ఆహారముతోనే నిండి ఆకలి తీరుతుంది. జఠరము, ఆంత్రములు ఉండుట వలన విటమినులు ఖనిజలవణముల గ్రహణమునకు అంతరాయము కలుగదు. జఠరబంధనపు పరిమాణమును మార్చుతూ జీర్ణాశయపు తిత్తుల పరిమాణములు మార్చవచ్చును.
జఠర ఛేదన ( Gastric Resection) శస్త్రచికిత్సలో, జీర్ణాశయములో చాలా భాగమును తొలగిస్తారు. జఠరములో చిన్న తిత్తినే ఉంచి దానిని ఆంత్రములకు జతపరుస్తారు. ( Partial Gastrectomy with Gastro jejunal anastomoses). లేక నిలువుగా చాలా భాగమును తొలగించి ( Vertical Gastric resection) నాళ పరిమాణములో కొంత భాగమునే అట్టేబెట్ట వచ్చును. ఈ చికిత్సలు పొందిన వారికి విటమినులు, ఖనిజలవణములను సమకూర్చాలి. ఆంత్రములలో కొంత భాగమును తొలగించే శస్త్ర చికిత్సలు అరుదయిపోయాయి.
కడుపు బుడగ ( Gastric Balloon ) ; తాత్కాలికముగా జీర్ణాశయములో వ్యాకోచింపగలిగే బుడగను అంతర్దర్శిని ( Endoscope ) ద్వారా నిలిపి ఆరు మాసములలో తొలగించి ఆకలి తగ్గించి బరువును తగ్గింప వచ్చును.
అధికభారపు లక్షణాలు పిన్నవయస్సులోనే పొడచూపుతాయి కనుక తల్లిదండ్రులు పూనుకొని పిల్లలను ఆరోగ్యకరమైన మితాహారములో ఉంచి, వారికి తగిన వ్యాయామము, క్రీడలు సమకూర్చి శ్రద్ధ వహిస్తే చాలా వఱకు అధికభారములను, స్థూలకాయములను నివారింపగలుగుతాము.
ఉపయుక్త మనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి.

మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro Vascular Accidents )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) డా. గన్నవరపు నరసింహమూర్తి మెదడు నిర్మాణము ( Anatomy of Brain ) : మన శరీరములో వివిధావయవాలు న...